పసుపు రైతుల ఆశాకిరణం ‘పీతాంబర్’!

8 Nov, 2016 00:27 IST|Sakshi
పసుపు రైతుల ఆశాకిరణం ‘పీతాంబర్’!

- సరికొత్త పసుపు వంగడం సీఐఎం - పీతాంబర్ విడుదల
- హెక్టారుకు 60-65 క్వింటాళ్ల పచ్చి పసుపు దిగుబడినిచ్చే.. సాధారణ వంగడాలకన్నా
- ఇది 50% అధికం..పసుపులో కుర్కుమిన్ శాతం 12.5.. సాధారణ వంగడాలకన్నా ఇది కనీసం 50% అధికం..
 
 అంతర్జాతీయ మార్కెట్లో ఆదరణ కోల్పోతున్న దేశవాళీ పసుపు సాగు చేసే రైతులకు కేంద్రీయ ఔషధ, సుగంధ మొక్కల సంస్థ (సి.ఐ.ఎం.ఎ.పి.- సీమాప్) రూపొందించిన ‘సీఐఎం-పీతాంబర్’ రకం పసుపు విత్తనం భవిష్యత్‌పై ఆశలను రేకెత్తిస్తోంది. గత నెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ కొత్త పసుపు వంగడాన్ని ఆవిష్కరించారు.  లక్నో (ఉత్తరప్రదేశ్)లోని ‘సీమాప్’ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ కే గుప్త ఈ కొత్త వంగడాన్ని రూపొందించారు. వచ్చే ఖరీఫ్ నుంచి ఈ వంగడం రైతులకు అందుబాటులోకి రానుంది. పూర్తిగా రైతులందరికీ అందుబాటులోకి రావడానికి ఐదేళ్లు పట్టొచ్చని భావిస్తున్నారు.

 ఇప్పుడు సాగులో ఉన్న వంగడాల దిగుబడి ఎకరానికి 40-45 క్వింటాళ్ల పచ్చి పసుపు దిగుబడి వస్తుండగా.. ‘సీఐఎం-పీతాంబర్’ రకం హెక్టారుకు పచ్చి పసుపు 60-65 క్వింటాళ్ల దిగుబడినిస్తుందని ‘సీమాప్’ హైదరాబాద్ ఇన్‌చార్జి శాస్త్రవేత్త డాక్టర్ జొన్నల కోటేశ్‌కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. ఇప్పుడు సాగులో ఉన్న వంగడాల్లో కుర్కుమిన్ 3% నుంచి అత్యధికంగా ఉంది. 7-8% వరకు ఉంది. ‘సీఐఎం-పీతాంబర్’ రకంలో కుర్కుమిన్ 12.5 శాతం వరకు ఉంటుందన్నారు. 180-190 రోజుల్లోనే పంట చేతికొస్తుంది. పసుపు ఆకుమచ్చ తెగులును ఈ వంగడం సమర్థవంతంగా తట్టుకుంటుందని, రైతుకు రెండింతలు లాభాలను అందిస్తుందని డాక్టర్ కోటేశ్‌కుమార్ చెప్పారు.

 పసుపు ఉత్పత్తిలో భారత్‌దే అగ్రస్థానం. ప్రపంచ పసుపు ఉత్పత్తిలో 80 శాతం మన దేశంలోనే జరుగుతోంది. దేశం మొత్తం ఉత్పత్తిలో 60 శాతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే పండుతోంది. తెలుగు రాష్ట్రాల తర్వాత స్థానాల్లో తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, పశ్చిమబెంగాల్, గుజరాత్, కేరళ ఉన్నాయి. అయితే, తెలుగు రాష్ట్రాల్లో పసుపు సాగు విస్తీర్ణం కొద్ది సంవత్సరాలుగా తగ్గిపోతోంది. అందుబాటులో ఉన్న వంగడాలతో నాణ్యమైన పసుపు పండించలేకపోవడం, అధిక దిగుబడులు సాధ్యం కాకపోవడం, ధరలు అస్తుబిస్తుగానే ఉండటం పసుపు రైతులకు శాపంగా మారింది. ‘ఫ్యూచర్స్ ట్రేడింగ్’లో గిరికీలు కొడుతున్న పసుపు ధరలు ఆకాశానికి ఎగసినపుడు సాగు విస్తీర్ణం పెరుగుతూ, ధరలు పడిపోయినపుడు తగ్గుతూ వస్తోంది.

 ఈ నేపధ్యంలో లక్నోలోని సీమాప్ శాస్త్రవేత్త ఎనిమిదేళ్లు కృషి చేసి ‘సీఐఎం-పీతాంబర్’ పసుపు వంగడాన్ని రూపొందించారు. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన 130 రకాల పసుపు వంగడాలపై విస్తృత పరిశోధనలు చేశారు. అధిక కురుకుమినాయిడ్స్ (కుర్కుమిన్) కలిగి, అధికోత్పత్తినిచ్చే అత్యుత్తమమైన క్లోన్‌ను గుర్తించి, సీఐఎం-పీతాంబర్‌గా నామకరణం చేశారు. ఈ అద్భుత వంగడం ద్వారా భవిష్యత్తులో అత్యంత నాణ్యమైన పసుపు ఉత్పత్తి కానుంది. కాబట్టి విదేశాలకు ఎగుమతులు పెరుగుతాయని, దేశీయంగానూ డిమాండ్ ఏర్పడి పసుపు రైతుల నికరాదాయం పెరుగుతుందన్న భరోసా కలుగుతోంది.  
 - బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి, గుంటూరు జిల్లా
 
 వచ్చే ఖరీఫ్ నుంచి విత్తనోత్పత్తి ప్రారంభం!
 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని నేలలు పీతాంబర్ పసుపు వంగడం సాగుకు అనుకూలమే. ఈ పసుపు విత్తనాన్ని లక్నోలోని సీమాప్ కేంద్ర కార్యాలయంలో అభివృద్ధి చేశారు. విత్తనోత్పత్తి కూడా అక్కడే చేపట్టారు. 2017 ఖరీఫ్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో విత్తనోత్పత్తి ప్రారంభమవుతుంది. తొలుత కొద్దిమంది రైతులకు కిలో, రెండు కిలోల చొప్పున అందించే అవకాశం ఉంది. 2018-2019లో మరింత మంది రైతులకు ఈ వంగడం అందుబాటులోకి వస్తుంది. ప్రభుత్వపరంగా టిష్యూకల్చర్ ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ మంది రైతులకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.
 - డా. జొన్నల కోటేశ్‌కుమార్ (94934 08227),ఇన్‌చార్జ్ సైంటిస్ట్, కేంద్రీయ ఔషధ, సుగంధ మొక్కల సంస్థ (సీమాప్), బోడుప్పల్, హైదరాబాద్

మరిన్ని వార్తలు