రకాలు వేరైనా దిగుబడి సమానమే

24 Sep, 2014 00:06 IST|Sakshi

న్యాల్‌కల్: బీటీ పత్తి విత్తనాలు ఏవైనా ఒకే రకం దిగుబడులను ఇస్తాయని ఆత్మకమిటీ జిల్లా ఇన్‌చార్జ్ డీపీడీ కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఆత్మ ఆధ్వర్యంలో మండల పరిధిలోని మిర్జాపూర్(ఎన్)లో మంగళవారం బీటీ పత్తి రకాల వ్యత్యాసాలపై ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీటీ రకాలు వేరైనప్పటికీ దిగుబడులు మాత్రం ఒకే రకంగా వస్తాయని చెప్పారు.

దీనిపై రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో అధిక ధరలకు విత్తనాలు కొని నష్టపోతున్నారని తెలిపారు. వీరికి అవగాహన కల్పించేందుకు స్థానిక రైతు వామన్‌రావుకు చెందిన నాలుగు ఎకరాల పొలంలో ప్రయోగాత్మకంగా మల్లికగోల్డ్, భాస్కర్, వర్మ, జాదు అనే నాలుగు రకాల బీటీ పత్తి విత్తనాలను ఎకరం చొప్పన నాలుగు ఎకరాల్లో సాగు చేశామని చెప్పారు. అన్ని రకాల పంటలకు సమాన పరిమాణంలో ఎరువులు, నీరు అందిస్తున్నామన్నారు. మొక్కల ఎదుగుదలలో మార్పు అన్నింటిలోనూ ఒకే రకంగా ఉందని తెలిపారు. దిగుబడులు కూడా ఒకే రకంగా వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

లేత కాండంపై బొట్టు పెట్టే కార్యక్రమం పలుమార్లు నిర్వహించామన్నారు.  దీంతో రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చని తెలిపారు. అంతే కాకుండా పొలంలో అక్కడక్కడ జిగురుతో ఉండే పసుపు రంగు ప్లేట్లను పెట్టాలన్నారు. పంటకు నష్టం చేసే పురుగులు దీనికి అతుక్కుని చనిపోతాయని వివరించారు. ఈ విధానం ద్వారా రైతులకు అధిక దిగుబడులు రావడమే కాకుండా 50 శాతం మేర ఖర్చు తగ్గుతుందని చెప్పారు. రసాయన మందులను అధికంగా వాడొద్దని సూచించారు. కార్యక్రమంలో జహీరాబాద్ వ్యవసాయ శాఖ ఏడీ వినోద్‌కుమార్, మండల వ్యవసాయ శాఖ అధికారి లావణ్య రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు