పంట దిగుబడిని శాసించే జింక్

24 Sep, 2014 02:58 IST|Sakshi

పంటలో జింక్ లోపం ఉంటే నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను మొక్కలు సమర్థవంతంగా ఉపయోగించుకోలేవు. దీనివల్ల ఎరువుల ఖర్చు భారంగా మారుతుందే తప్ప దిగుబడి పెరగదు. మొక్క పెరుగుదలలో జింక్ వివిధ క్రియలను నిర్వర్తిస్తుంది. మొక్కల పెరుగుదల కోసం వివిధ రసాయనిక క్రియల్లో అవసరమయ్యే ఎంజైముల చురుకుదనాన్ని పెంచడానికి, ఉత్తేజపరచడానికి, రసాయనిక క్రియల్లో కావాల్సిన హార్మోన్ల ఉత్పత్తికి అవసరమైన రసాయన పదార్థాల తయారీకి జింక్ ఉపయోగపడుతుంది.

 పంటపై జింక్ లోపం కనిపిస్తే..
 జింక్ లోప లక్షణాలు పంటపై కనిపిస్తే.. 10 లీటర్ల నీటికి 20 గ్రాముల జింక్‌ను కలిపి పిచికారీ చేయాలి. ఎకరానికి  200 లీటర్ల ద్రావణం సరిపోతుంది. ఇలా వారం రోజుల వ్యవధిలో రెండు లేదా మూడు సార్లు పిచికారీ చేస్తే ఫలితం ఉంటుంది. రెండు క్వింటాళ్ల పశువుల ఎరువు, కంపోస్టు, కోళ్ల వ్యర్థాలు, ఫిల్టర్ మడ్డి లాంటి సేంద్రియ ఎరువులతో 15 కిలోల జింక్‌ను కలిపి ఒక నెల మగ్గబెట్టాలి. ఈ మిశ్రమాన్ని పైరు వేసే ముందు దుక్కిలో చల్లితే అధిక దిగుబడిలో మార్పు కనిపిస్తుంది.

 వరిలో జింక్ లోపం
 జింక్ లోపం వరి పైరుకు ఇబ్బందిగా మారింది. నారుమడిలోనూ.. నారు నాటిన తర్వాత కూడా జింక్ లోపం కనిపిస్తోంది. సాధారణంగా నాట్లు వేసిన తర్వాత రెండు నుంచి నాలుగు వారాల మధ్య, నాలుగు నుంచి ఆరో వారం వరకు జింక్ లోపం లక్షణాలు బయటపడతాయి.

 గుర్తించడం ఇలా..
 జింక్ లోపం ఉన్నప్పుడు ప్రధాన పోషకాలు తగినంత వేసినా పంట సరిగా పెరగదు. పిలకలు పెట్టదు. పంట గుంపులు గుంపులుగా చనిపోయి ఖాళీగా కనిపిస్తుంది. పొలమంతా పసుపు పచ్చగా కనిపిస్తుంది. దగ్గరగా చూస్తే మొక్కల్లో పైనుంచి మూడు లేదా నాలుగు ఆకుల మధ్య ఈనె మొదలు భాగం ఆకుపచ్చ రంగు కోల్పోయి పసుపు లేక పసుపుతో కూడిన తెలుపు రంగులోకి మారుతుంది. ఆకులోని మిగతా భాగమంతా ఆకుపచ్చగానే ఉంటుంది. ఇటుక రంగు మచ్చలు కనిపిస్తాయి.
 
 నివారణ చర్యలు
 పంట వేసే ముందు మట్టి పరీక్ష చేయించుకోవాలి. జింక్ తగినంత ఉందో లేదో తెలుసుకోవాలి. జింక్ లోపమున్నట్లు తేలితే తప్పని సరిగా ముందుగానే సరైన మోతాదులో జింక్ సల్ఫేట్‌ను వేసుకోవాలి. వరి పంటకైతే ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్‌ను దుక్కిలో నాటే ముందు వేసుకోవాలి. మూడు పంటలకు ఒకసారి గానీ, రెండేళ్లకోసారి గానీ ఇలా చేయాలి. ఏటా వరి వేసుకోవాలనుకుంటే మాత్రం రబీలోనే జింక్ వేసుకోవాలి. సమస్యాత్మక నేలలు అంటే క్షార, చవుడు, సున్నపు, నేలలైతే జింక్ సల్ఫేట్‌ను ఎకరానికి 40 కిలోల చొప్పున వేసుకోవాలి.

Read latest Vanta-panta News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా