ఏ వెలుగులకీ ప్రజాధనం?

30 Nov, 2016 01:11 IST|Sakshi
ఏ వెలుగులకీ ప్రజాధనం?

డేట్‌లైన్ హైదరాబాద్
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే సచివా లయాన్ని అక్కడి నుంచి మార్చే ఆలోచన చేశారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసం విషయంలో కూడా ఆయనకు మొదటి నుంచి విముఖతే ఉంది. మనుషులకు విశ్వాసాలు ఉండటం సహజం. ఎవరి మత విశ్వాసాలు, వాస్తు నమ్మకాలు వారివి. అయితే అవి వ్యక్తిగతం కావాలి కానీ పరిపాలకుడి హోదాలో వాటిని ఆచరిస్తానంటేనే, అందుకోసం ఇంతింత ప్రజాధనాన్ని ఖర్చు చేస్తానంటేనే అభ్యంతరం.
 
మన రాజకీయ నాయకులు ప్రజల డబ్బుతో ఆడంబరాలకు పోయినప్పు డల్లా భారతదేశంలో రెండవ పెద్ద రాష్ట్రం బిహార్‌కు రెండుసార్లు ముఖ్య మంత్రిగా పనిచేసిన కర్పూరీ ఠాకూర్ గుర్తుకొస్తారు. గతవారం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన అధికారిక గృహ సముదాయ ప్రవేశం చేసినప్పటి దృశ్యాలు టీవీలలో చూసినప్పుడు, వార్తాపత్రికలలో ఆ వార్తలు చదివినప్పుడు కర్పూరీ ఠాకూర్ మరొక్కసారి గుర్తుకొచ్చారు. స్వాతంత్య్ర సమరయోధుడు కర్పూరీ ఠాకూర్ స్వగ్రామం సమస్తిపూర్‌కు 10 కిలోమీటర్ల దూరంలోని పితుంజియా. ఒక పేద క్షురకుల కుటుంబంలో జన్మించిన కర్పూరీ మొట్టమొదటి కాంగ్రెసేతర సోషలిస్ట్ ముఖ్యమంత్రి. ఆయన లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ సంపూర్ణ క్రాంతి ఆందోళనలో భాగస్వామి కూడా.

ప్రస్తుత క్రియాశీల రాజకీయ నాయకులు లాలూప్రసాద్ యాదవ్, రామ్‌విలాస్ పాశ్వాన్, బిహార్ ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వంటి పలువురు కర్పూరీ ఠాకూర్ శిష్యులే. బిహార్ ప్రజలు ఆయనను ‘జన నాయక్’ అని పిలుచుకునేవారు. కర్పూరీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా ఆయన కుటుంబం స్వగ్రామంలోనే ఉండేది. భార్యాపిల్లలు, తండ్రి, తమ్ముడు అందరూ. ఆయన పూర్వీకుల ఆస్తి నాలుగు గుడిసెలు. ఒక ప్రముఖ పత్రికా విలేకరి ముఖ్యమంత్రి గ్రామానికి వెళ్లి ఆయన తండ్రి గోకుల్ ఠాకూర్‌ను పలకరించినప్పుడు ‘‘కొడుకు ముఖ్యమంత్రి కదా! మీరేమిటి ఇలా?’’ అని అడిగితే ‘‘అయితే ఏమిటి’’  అని జవాబిచ్చాడట గోకుల్. ఆ విలేకరి రాష్ట్ర రాజధాని పట్నా తిరిగొచ్చి ముఖ్యమంత్రిని కలసి, ‘ఏమిటి? మీ కుటుంబం అలా పల్లెలో, పేదరికంలో?’’ అని అడిగితే ‘‘నేను అంత తెలివి గలవాడిని కాదేమో’’  అని చిరునవ్వుతో సమాధానం ఇచ్చారట.

ఒక రోజు కర్పూరీ ఠాకూర్ అప్పటి బిహార్ గవర్నర్‌ను కలసి ప్రభుత్వ వ్యవహారాలు ఏవో చర్చించి వెళ్లిపోయారు. మరునాడు పత్రికల్లో ముఖ్యమంత్రి కుమారుడి వివాహం జరిగిన వార్త చూసిన గవర్నర్ ఆయనకు ఫోన్ చేసి, ‘‘ఇదేమిటి నన్ను పిలవలేదు మీ ఇంట పెళ్ళికి?’’ అని అడిగితే ‘‘మీలాంటి వారిని పిలిచే స్థాయి, వనరులు నాకు లేవు సార్!’’ అని వినమ్రంగా జవాబిచ్చారట. ఈ రోజుల్లో ఇటువంటివి కనీసం ఊహించగలమా? పదవుల్లో ఉన్న రాజకీయ నాయకుల కుటుంబాలు పేదరికంలోనే ఉండిపోవాలని కాదు, ఈ ఉదాహరణ కర్పూరీ నిరాడంబరత్వాన్ని గుర్తు చెయ్యడానికి మాత్రమే.

ఆడంబరాలకి అందలం
పదవుల్లో ఉన్నవారు వీలైనంత నిరాడంబరంగా ఉండాలన్న స్పృహ, మనం ఖర్చు చేసే ప్రతి పైసా ప్రజలదేనన్న స్పృహ రోజురోజుకూ రాజకీయ నాయ కుల్లో తగ్గిపోతున్నదని చెప్పుకోవడానికే ఇదంతా. ఇప్పటికి కూడా కర్పూరీ ఠాకూర్ లాగా నిరాడంబర జీవితం గడుపుతున్న నేతలు అక్కడక్కడా లేక పోలేదు. ప్రసిద్ధ ‘టైం’ పత్రిక 2012లో ప్రపంచంలోని అత్యంత ప్రభా వశీలురైన వ్యక్తులలో ఒకరిగా ఎంపిక చేసిన ‘ఫైర్ బ్రాండ్’ రాజకీయ  నాయకురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరాడంబ రతకు పెట్టింది పేరు.

వామపక్ష నాయకుడు 1998 నుంచి త్రిపుర ముఖ్య మంత్రిగా ఉన్న మాణిక్ సర్కార్ తన జీతభత్యాలన్నిటినీ మార్క్సిస్ట్ పార్టీకి విరాళంగా ఇచ్చేసి, నెల నెలా పార్టీ ఇచ్చే 5 వేల రూపాయలు తన సొంత ఖర్చులకు సర్దుకుంటారు. ఆయన కుటుంబానికి సొంత ఇల్లు కానీ, వాహనం కానీ లేవు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా 2011లో పదవీ విరమణ చేసిన ఆయన భార్య పాంచాలీ భట్టాచార్య స్వయంగా బయటికెళ్లి తన పనులన్నీ చక్కబెట్టుకుంటారు. ఈ నాయకుల రాజకీయాలు ఎట్లా ఉన్నా, వాటితో ఎవరికైనా అంగీకారం లేకపోయినా వారి జీవనశైలి మాత్రం అను సరణీయం, ఆదర్శనీయం కూడా.
 
ఇప్పుడు అవసరమా?
ఇక తెలంగాణ  ముఖ్యమంత్రి అధికార నివాస సముదాయం విషయానికి వస్తే - 150 గదులతో, తొమ్మిది ఎకరాల స్థలంలో 39 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తొమ్మిది మాసాల్లో ఆగమేఘాల మీద నిర్మించారు. ముఖ్య మంత్రికి ప్రభుత్వ కార్యక్రమాలను సమీక్షించడానికి అనువైన సౌకర్యాలు అవసరమే. అవి లేనప్పుడు వాటిని సమకూర్చుకోడంలో తప్పులేదు. ముఖ్య మంత్రి నివశించడానికి సొంత ఇల్లు లేకపోతే తప్పకుండా ప్రభుత్వ వసతి కూడా అవసరమే. పరిపాలనలో తీసుకునే అనేక నిర్ణయాల కారణంగా భద్రత కూడా అవసరమే కావచ్చు. అయితే ఈ ఏర్పాట్లన్నీ తెలంగాణ  రాజ ధాని హైదరాబాద్‌లో ఇంతకు ముందు లేవా అన్నదే ప్రశ్న. మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి, రాజధాని లేకుండా ఏర్పడిన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రికి ఆ సమస్య ఉంటే అర్థం చేసుకోవచ్చు.

రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రికి కూడా ఆ అవసరం ఉంటే కూడా అర్థం చేసుకోవలసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిది ఇంకో విడ్డూరం. ఆయన అమరావతి అనే ఎవరికీ అంతుపట్టని ఒక రాజధాని నిర్మాణం గురించి అందరినీ ఊరిస్తున్నారు. అందులో ముఖ్యమంత్రి అధికారిక గృహ సముదాయం ఎట్లా ఉంటుందో కానీ ఆయన ఇప్పటికే తమది కాని చోట, తనది కాని డబ్బు కోట్లలో తాత్కా లిక గృహ సముదాయాలకు తగలేశారు. హైదరాబాద్‌లో ఆయనకు కేటాయించిన సచివాలయ భవనాలు ఎప్పటికైనా తెలంగాణ ప్రభుత్వానికి అప్ప జెప్పాల్సిందే అని తెలిసీ వాటి మీద  ఆంధ్రప్రదేశ్ ప్రజల నిధులు కోట్ల కొద్దీ ఖర్చు చేశారు. తాత్కాలిక క్యాంపు కార్యాలయం లేక్ వ్యూ అతిథి గృహం మీద మరికొన్ని కోట్లు- ఇట్లా ప్రజాధనం, తమది కాని తాత్కాలిక అవస రాలకు మంచినీళ్లప్రాయంగా ఖర్చు చేసిన ముఖ్యమంత్రి బహుశా దేశంలో చంద్ర బాబునాయుడు ఒక్కరేనేమో!

ప్రజాధనం నమ్మకాల పాలు
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే సచివాలయాన్ని అక్కడి నుంచి మార్చే ఆలోచన చేశారు. ముఖ్య మంత్రి అధికారిక నివాసం విషయంలో కూడా ఆయనకు మొదటి నుంచి విముఖతే ఉంది. మనుషులకు విశ్వాసాలు ఉండటం సహజం. ఎవరి మత విశ్వాసాలు, వాస్తు నమ్మకాలు వారివి. అయితే అవి వ్యక్తిగతం కావాలి కానీ పరిపాలకుడి హోదాలో వాటిని ఆచరిస్తానంటేనే, అందుకోసం ఇంతింత ప్రజాధనాన్ని ఖర్చు చేస్తానంటేనే అభ్యంతరం. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మత విశ్వాసాలకు అనుగుణంగా నూతన గృహ సముదాయ ప్రవేశం జరిగిందిలెమ్మని ఎవరైనా సరిపెట్టుకోవచ్చు కానీ రాజ్యాంగబద్ధంగా సంక్ర మించిన ముఖ్యమంత్రి ఆసనంలో ఒక మతగురువును కూర్చోబెట్టడం తీవ్ర అభ్యంతరకరం. దీనిని గురించి ఎవరూ మాట్లాడరు. మీడియా కూడా మౌనంగా ఉంటుంది.

చంద్రశేఖరరావు గారి స్వగృహంలో ఆయన ఏ మత గురువును ఎక్కడ కూర్చోబెట్టినా ఎవ్వరికీ అభ్యంతరం ఉండకూడదు. అడిగే హక్కు ఎవరికీ ఉండదు. భారీ వ్యయంతో నిర్మించిన ఈ అధికారిక నివాస సముదాయం విషయంలో ముఖ్యమంత్రి ఇంకో విమర్శను ఎదుర్కోక తప్పదు. అధికారానికి రాక ముందు నుంచే పేద ప్రజలకూ, వివిధ వర్గాల వారికీ రెండు పడకల గృహాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. సొంత ఇంటి కల నెరవేర్చుకోలేని అనేక మంది ఆ హామీ నెరవేరుతుందని ఆశతో ఉన్న సమయంలో రెండున్నరేళ్లు గడిచినా ఆరంభశూరత్వంగానే మిగిలి పోవడం చూస్తున్నాం.

అంతేకాదు, ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు మాసాల కాలంలో వివిధ వృత్త్తి, కులసంఘాలకు భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అది కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నది. ఇవన్నీ వదిలేసి అంత అత్యవసరంకాని ముఖ్యమంత్రి అధికార గృహ సముదాయాన్ని సమకూర్చుకోవడం ఎట్లా సమర్ధనీయం? చంద్రశేఖరరావు గారికి సొంత ఇల్లు ఉంది. అదీకాక గతంలో డాక్టర్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు నిర్మించిన అధికారిక గృహ సముదాయం ఉంది.

తమ విశ్వాసాల కోసం వాటిని కాదని ఇప్పుడు మరో సముదాయం నిర్మించడం ఆక్షేపణీయమే. గతంలో ముఖ్యమంత్రులు చాలా వరకు తమ సొంత ఇళ్లలోనే ఉండేవాళ్లు. ఒకరిద్దరికి ఇల్లు లేకపోతే ప్రభుత్వ అతిథి గృహాన్ని అధికార నివాసం కింద మార్చుకున్నారు. ఒక్క డాక్టర్ రాజశేఖరరెడ్డి మాత్రమే 2004లో ముఖ్యమంత్రి అయ్యాక అధికార నివాసం నిర్మించారు. ముఖ్య మంత్రి అయ్యేనాటికి రాజధానిలో ఆయనకు సొంత ఇల్లు లేదు. అయినా రాజశేఖరరెడ్డి  కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే తెలంగాణ ముఖ్య మంత్రి ఈ నూతన గృహ, కార్యాలయ సముదాయం నుంచి చేపట్టే జనహిత కార్యక్రమాల ప్రగతి మీద ఆధారపడి ఉంటుంది, ప్రజల నుంచి ఈ చర్యకు సమర్ధన. అయినా ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా వాళ్ల విశ్వాసాలకు అనుగుణంగా కొత్త  బంగ్లాలు కడతామంటే ఎట్లా?
 


దేవులపల్లి అమర్
datelinehyderabad@gmail.com

మరిన్ని వార్తలు