పిల్లల తిండికి ‘ఆధార్‌’ అడ్డంకి

9 Mar, 2017 00:43 IST|Sakshi
పిల్లల తిండికి ‘ఆధార్‌’ అడ్డంకి

సంక్షేమ పథకాలకూ, ఆధార్‌ కార్డులకూ ముడిపెట్టొద్దని సర్వోన్నత న్యాయస్థానం పలుమార్లు చెప్పినా మన ప్రభుత్వాలకు లక్ష్యం లేదు. రేషన్‌ ఇవ్వడం దగ్గరనుంచి ఉపాధి హామీ పథకం వరకూ... పెన్షన్ల మొదలుకొని ఆరోగ్యపథకాల వరకూ అన్ని టికీ దాన్ని ముడిపెట్టడం ఆగలేదు. తాజాగా మధ్యాహ్న భోజన పథకం కూడా అందులో చేరింది. ఆధార్‌ కార్డు వివరాలు అందజేయలేని పిల్లలకు జూన్‌ 30 తర్వాత బడుల్లో మధ్యాహ్న భోజనం పెట్టొద్దంటూ కేంద్ర మానవ వనరుల అభి వృద్ధి మంత్రిత్వ శాఖ వారం రోజులక్రితం నోటిఫికేషన్‌ జారీచేసింది.  ఈ చర్య ద్వారా కుటుంబం ఆధార్‌ తెచ్చుకునేలా ఒత్తిడి తీసుకొచ్చే భారాన్ని ప్రభుత్వం పిల్లలపై మోపింది. అయితే ఆధార్‌ లేనంతమాత్రాన మధ్యాహ్న భోజనం నిరా కరించబోమని కేంద్రం వివరణనిస్తోంది. పిల్లలకు ఆధార్‌ నంబర్‌ వచ్చేవరకూ దీన్ని అమలు చేస్తామంటోంది. ఆధార్‌ నమోదుకు వివరాలు అందజేసినట్టు స్లిప్‌ ఇచ్చినా, వేరేచోట ఈ పథకాన్ని వినియోగించుకోవడం లేదని తల్లిదండ్రులు హామీ పత్రం ఇచ్చినా దీన్ని కొనసాగిస్తామంటోంది.

మధ్యాహ్న భోజన పథకం వల్ల దేశంలో 10 కోట్లమందికి పైగా పిల్లలు లబ్ధి పొందుతున్నారు. దీనివల్ల ఇతరత్రా ఎలాంటి సత్ఫలితాలు వస్తున్నాయో అందరికీ తెలుసు. పథకం అమలు ప్రారంభించాక గ్రామసీమల్లోని నిరుపేద కుటుంబాల వారు తమ సంతానాన్ని బడిబాట పట్టిస్తున్నారు. అంతక్రితం పిల్లల్ని కూలి పనులకు పంపడం, జీతగాళ్లుగా ఉంచడం, తమతోపాటు పనులకు తీసుకెళ్లడం లాంటివి చేసిన ఆ కుటుంబాలు కనీసం ఒక్క పూటైనా పిల్లలకు కడుపుకింత తిండి దొరుకుతుందని సంతోషపడ్డారు. ఈ పథకం వల్ల ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి. అంతవరకూ అక్షరానికి దూరంగా ఉన్న పిల్లలు క్రమం తప్పకుండా తరగతులకు హాజరవుతూ చదువుపై ధ్యాస పెడుతున్నారు. వారికి పౌష్టికాహారం అందుతోంది. ఇందువల్ల వ్యాధులబారిన పడే స్థితి తగ్గుతుంది. వారు శారీరకంగా, మానసికంగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది. భిన్న కులాల, వర్గాల పిల్లలు రోజూ సహపంక్తి భోజనం చేయడం వల్ల వారి మధ్య స్నేహం, సుహృద్భావం ఏర్ప డతాయి. మన జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారమైనా, 2001లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పయినా మధ్యాహ్న భోజనం పొందడం పిల్లల హక్కు అని చెబుతు న్నాయి. ఆధార్‌ మెలిక ఈ రెండింటి స్ఫూర్తిని ఉల్లంఘిస్తోంది.

ఈ నోటిఫికేషన్‌ ఇచ్చినవారికి ఆధార్‌ కార్డులేని పిల్లల పరిస్థితేమిటన్న ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది. తోటి పిల్లలంతా కడుపు నిండా తింటుంటే తాము పస్తు ఉండాల్సిరావడం లేత మనసులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వారికి తట్టలేదు. అంతంతమాత్రం ఆదాయంతో అమ్మానాన్నలు పిల్లలకు మంచి తిండి పెట్టలేరు. వారికి రోజూ మెరుగైన ఆహారం లభ్యమయ్యేది కేవలం మధ్యా హ్నం పూట బడిలో దొరికే భోజనం వల్లనే. ఇది నిజంగా వారికి దక్కుతున్నదా అన్న అనుమానం పాలకులకు వచ్చినట్టుంది. అది తెలుసుకోవడానికి ఇతరేతర మార్గాలు చాలా ఉన్నాయి. బడులకు అందాల్సిన ఆహారపదార్థాలు సరిగా అందు తున్నాయో లేదో... పాఠశాలల్లో పిల్లల సంఖ్యకూ, హాజరుపట్టీల్లోని సంఖ్యకూ పొంతన ఉందో లేదో... నిర్దేశించిన పరిమాణంలో, ప్రమాణాల్లో పిల్లలకు ఆహారం అందుతున్నదో లేదో ఆరా తీయడం అవసరమే. తరచు జరిపే ఆకస్మిక తనిఖీల ద్వారా ఇవన్నీ నెరవేరతాయి. ఎప్పటికప్పుడు కఠిన చర్యలకు ఉపక్రమిస్తుంటే పరి స్థితి మెరుగవుతుంది. నిధుల దుర్వినియోగం ఆగుతుంది. పిల్లల కడుపు కొడదా మని చూసే స్వాహారాయుళ్ల ఆటలు సాగకుండా ఉంటాయి. నిజానికి ఈ పథకం అమలులో పరిష్కరించాల్సిన సమస్యలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అవి ఆధార్‌ వల్ల దారికొచ్చేవి కాదు. వంట చేసే సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్న కనీస ఆలోచన ప్రభు త్వాలకు ఉండటం లేదు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మినహా మిగిలిన రాష్ట్రాలు ఈ సంగతిని పట్టించుకోవడం లేదు. వంట గదులు లేని బడులు, మంచినీరు సమ కూర్చలేని బడులు ఇప్పటికీ ఉన్నాయి. ఇతరత్రా మౌలిక సదుపాయాల గురించి, పరిశుభ్రత గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది.

పిల్లలకు ఆధార్‌ తప్పనిసరి చేయడంవల్ల వచ్చే ఇతరత్రా సమస్యలున్నాయి. పదిహేనేళ్ల వయసు వచ్చేవరకూ వేలిముద్రలు సరిగా అభివృద్ధి కావు. కనుక సేక రించిన బయోమెట్రిక్‌ వివరాలు నిలకడగా ఉండవు. పెరిగే వయసుకు తగినట్టు అవి మారిపోతాయి. ఇలా మారినప్పుడల్లా వారికి తిండి పెట్టాలో, లేదో అర్ధంకాని స్థితి ఏర్పడుతుంది. పాఠం చెప్పే టీచర్‌కు ఆ విద్యార్థి తెలుస్తాడు. కానీ బయో మెట్రిక్‌ యంత్రం గుర్తించదు. అలాంటి సందర్భంలో ఆ విద్యార్థి చేతికి కంచం ఇవ్వాలో లేదో తేల్చేదెవరు? పైగా ఆధార్‌ వల్ల వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలుగుతుందన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎదుట విచారణ సాగుతోంది. ఆ పథకం పూర్తిగా స్వచ్ఛందమైనదని,  పౌరుల అంగీకారంతోనే వివ రాలు సేకరిస్తున్నామని,వాటిని వినియోగిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. పిల్లలు ఆధార్‌ తెచ్చుకోవాలంటూ పెట్టిన తాజా నిబంధన సుప్రీంకోర్టుకిచ్చిన

ఈ హామీని ఉల్లంఘించడం లేదా? మైనారిటీ తీరని పిల్లలు స్వచ్ఛందంగా, స్వతంత్రంగా నిర్ణయం తీసుకోగలుగుతారా? వారు తమంత తామే అందుకు సిద్ధపడ్డారని చెబితే అసలు చెల్లుతుందా? వీటి సంగతలా ఉంచి ఆధార్‌ అను సంధానం వల్ల ఆ పథకానికి కొత్తగా ఏర్పడే పారదర్శకత, అదనంగా వచ్చే సామర్థ్యం ఏముంటాయి? ఒకపక్క ఆధార్‌ను రేషన్‌ అందజేయడానికి, గ్యాస్‌ సిలెండర్ల పంపిణీకి మాత్రమే వినియోగించాలని 2015లో సుప్రీంకోర్టు నిర్దేశించినప్పుడు సరేనన్న ప్రభుత్వం ఆ తర్వాత స్కాలర్‌షిప్‌లు మొదలుకొని పెన్షన్ల వరకూ ఎన్నిటికో వర్తింపజేసింది. తాజా నోటిఫికేషన్‌ ద్వారా వాటికి మరో 30 పథకాలను జత చేసింది. ప్రభుత్వాలే ఇలా న్యాయస్థానాలకిచ్చిన హామీలను ఉల్లంఘించడం తగునా? జాబితా నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని తొలగిం చడం తక్షణావసరం. ఆ పథకాన్ని మరింత సమర్థవంతంగా, మెరుగ్గా అమలు చేయడం ముఖ్యం.

మరిన్ని వార్తలు