సైనికులకు ఇవ్వాల్సింది బూటకపు గౌరవమేనా?

20 Aug, 2017 01:51 IST|Sakshi
సైనికులకు ఇవ్వాల్సింది బూటకపు గౌరవమేనా?

అవలోకనం
మన జాతీయ విమాన ప్రయాణ సంస్థ ఎయిర్‌ ఇండియా, సైనికులను గౌరవించడానికి ఒక చర్య చేపట్టాలని నిర్ణయించింది. ఇకపై ఆ సంస్థ తమ విమానాల్లోకి ఇతర ప్రయాణికుల కంటే ముందు సాయుధ బలగాల సిబ్బందిని ఎక్కమని  కోరుతుంది. ఈ చర్య సైనికుల్లో తాము ప్రత్యేకమైన వారిమనే భావనను కలిగిస్తుంది కాబట్టి, వారిని గౌరవించినట్టు అవుతుంది. దీని ద్వారా వారి సేవలను, ఇతర భారతీయులు అందించే సేవల కంటే ఎక్కువ అర్థవంతమైనవని చెప్పినట్టు అవుతుంది. ఇక్కడ మనం ఎయిర్‌ ఇండియా వారి ఈ ముందస్తు ఊహాత్మక అంచనాను గురించి ఆలోచించడానికి కాస్త ఆగుదాం.

మన దేశంలోని ఉపాధ్యాయుడు, పోస్ట్‌మ్యాన్, గ్యాస్‌ సిలిండర్లు అందించే వ్యక్తి అంతకంటే తక్కువ ముఖ్యమైన వారు ఎలా అయ్యారు? వారు ముఖ్యమైన వారు కారనే అనుకుంటే, ఎందువల్ల? సైనికులు ప్రమాదకర మైన ఉద్యోగం చేస్తున్నారని మనం వాదించవచ్చు. అలా అంటే, విద్యుత్‌ లైన్‌మన్ల పని కూడా ప్రమాదకరమైనదే. ఏటా యుద్ధంలో చనిపోతున్న సైనికులకంటే ఎక్కువ మంది మన మురుగు కాల్వలను, పైపులను శుభ్రం చేస్తూ మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఆ కార్మికులకు ఏ పతకాలూ ఇవ్వరు, ఎలాంటి గౌరవం లేదా బహుమతులూ ఇవ్వరు.

నిజానికి, వారికి రావాల్సిన బకాయిలు సైతం అందవు. నేనీ రోజు దాని జోలికి పోను. సైనికులు మన రిపబ్లిక్‌కు సంబంధించిన అత్యంత ముఖ్యమైన పని చేస్తున్నారని, ఇతరులకన్నా వారు ఎక్కువ గౌరవాన్ని పొందడానికి అర్హులని అనుకుందాం. ప్రభుత్వ వైమానికి సంస్థ విమానాల్లోకి ఎక్కడానికి సంబంధించి గౌరవప్ర దమైన స్థానాన్ని కల్పించడమే సైనికులను గౌరవించడానికి సరైన మార్గమా? కాదని నేనంటాను. అంతేకాదు, ఈ చర్య, సైనికులను గౌరవిం చడం అనే సైనిక వ్యతిరేక బూటకపు కథనాన్ని కొనసాగించడానికి  ఉద్దేశపూర్వకంగా చేపట్టినది అని కూడా అంటాను. దీన్ని వివరిస్తాను.
 
సైన్యానికి మనం రుణపడి ఉన్నందున ఆ రుణాన్ని సమంజసంగా తీర్చు  కోడానికి హామీనిచ్చే చాలా మార్గాలున్నాయి. ఒకటి, జీతభత్యాలు, జీవన పరిస్థితులకు సంబంధించినది. ఇటీవల దుర్భరమైన సైనికుల ఆహారం, జీవన పరిస్థితుల గురిం చిన వాస్తవాలను వెల్లడించిన జవాన్ల పట్ల మనం చాలా కఠినంగా ప్రవర్తించాం. అదే మనకు ఈ విషయంలో శ్రద్ధ లేదనడానికి నిదర్శనం. మన సైనికుల ఆహారాన్ని మెరుగుపరిచేలా ఎయిర్‌ ఇండియా తమ కేటరింగ్‌ సేవలను ఉప యోగిస్తే అది వారిపట్ల మెరుగైన గౌరవం అయ్యేది. రెండు, మన సైనికులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి హామీని కల్పించాలి. తీవ్రమైన పని ఒత్తిడికి గురైన జవాన్లు తరచుగా తమ అధికారులనో,  తోటి జవాన్లనోకాల్చి చంపే ఘటనలు తరచుగా జరుగుతుండటం అలాంటి హామీ లేకపోవచ్చనే సూచిస్తోంది. మన సైనికులలో చాలా మంది మానసికంగా ఆరోగ్యవంతంగా లేరని, వారికి అందే çసహాయం లేదా చికిత్స శూన్యమని పూర్వ సైనికుల సంఘాలు, సంస్థలు చెబుతున్నాయి.

మూడు, సైనికులు ఉద్యోగంలో ఉండగా, పదవీ విరమణ చేసిన తర్వాత వారికి పెన్షన్, ఉద్యోగ అవకాశాలు, విద్యావకాశాలు కల్పించడం. అమెరికా ఈ పనిని చాలా బాగా చేస్తోంది. ప్రత్యేకించి విద్యకు సంబంధించి అది పూర్వ సైనికులకు  కళాశాల ఉపకార వేతనాలను అందిస్తోంది. మనం ఆ పని చేయడం లేదు. ఇక పెన్షన్, ఉద్యోగాలకు వస్తే, మనది స్వల్పంగా వనరులున్న పేద దేశమే ఆయినా, ప్రభుత్వ ఉద్యోగులలో మరే విభాగం కంటే కూడా వారికే ప్రభుత్వం  నుంచి ఎక్కువ అందుతోందని చెప్పగలను. నాలుగు, సైనికులకు, వారు బాగా విధులను నిర్వహించినపుడు పతకాలు తదితరాలను ఇచ్చి గౌరవించాలి. వారికి అందాల్సిన గౌరవ పురస్కారాలు వారికి అందడంలేదని ఒక తాజా నివే దిక తెలి పింది. ఎవరైనా సైనికుడికి పతకం లభించిందని చెప్పినా, దాన్ని భౌతికంగా ఆ పతకాన్ని అతనికి ఇవ్వరని చెప్పి ఉండొచ్చు. ఆ జవాను దాని నకలును ఆర్మీ క్యాంటీన్‌లో కొనుక్కుని ధరిస్తాడు. ఇది అవమానకరం అని నాకు అనిపి స్తుంది.

ఇక ఐదవది, చివరిది మన సైనిక యోధులను అర్థవంతమైన రీతిలో గౌరవించడానికి ఉన్న అతి ముఖ్యమైన మార్గం. అత్యంత ధైర్యవంతులైన మన సైనికులను మోహరించిన సంఘర్షణాత్మక ప్రాంతాలను తగ్గించాలి.  గడ్డిపరక కూడా మొలవని సియాచిన్‌ ఆక్రమించుకోవడం, ఏడాదికి ఓ డజను మంది సైనికులు మరణించడం ఎందుకు? వారు చనిపోయేది పోరాడే శత్రు సైనికుల చేతుల్లో కాదు, అక్కడి వాతావరణానికి. మనం పాకిస్తాన్‌  ప్రభుత్వంతో మాట్లాడి సియాచిన్, సల్తోరో ప్రాంతాల్లో ఇరు పక్షాల సైన్యాన్ని తగ్గించుకోడానికి ప్రయత్నించలేమా? మనం చేయగలం, కాకపోతే పాకిస్తాన్‌తో మాట్లాడితేనే అది సాధ్యం. ఇప్పటికైతే మనం వారితో కయ్యం కోరుకుంటున్నాం. అంటే  మన సైనికులు చనిపోవడం కొనసాగినా ఫర్వాలేదు.

అంతర్గతంగా మన సైన్యం, పారామిలిటరీ బలగాలు ఈశాన్యంలో, ఆదివాసీ ప్రాంతాల్లో, జమ్మూకశ్మీర్‌లో నిరంతరాయంగా మోహరించి ఉంటున్నాయి. ఇవి, రాజకీయంగానే తప్ప సైనికంగా పరిష్కారమయ్యే సమస్యలు కావు. సాయుధ బలగాలు 70 ఏళ్లుగా ఈ ప్రాంతాల్లో అలసిపోతున్నాయే తప్ప ఎలాంటి అనుకూల ఫలి తాలు కలగలేదు. సాయుధ బలప్రయోగమే ఏకైక మార్గమని పట్టుబడితే, అందుకు జవాన్లు, వారితో పోరాటంలో ఉన్న పౌరులు మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది.

భారత సైనికుడు ఎక్కడ పోరాడమని అడిగితే అక్కడ పోరాడతాడు. అతడి సేవలను, త్యాగాలను అత్యంత ఉపయోగకరమైన లక్ష్యాల కోసం మాత్రమే ఉపయోగపడేలా చేయాల్సిన బాధ్యత మన ప్రజాస్వామిక సమాజం విధి. అనవస రంగా అతన్ని మన కోసం చనిపొమ్మని కోరరాదు. భారత జవాన్‌ను మనం గౌరవించగల ఏకైక అత్యుత్తమ మార్గం అదే. మోదీ ప్రభుత్వం పెంపొందింపజేస్తున్న ఈ సైనికీకరణ వాతావరణంలో ఎయిర్‌ ఇండియా, జాతీయవాదు లకు చంచాగిరీ చేస్తోందని నా అంచనా. ఇప్పటికే అది స్థానిక విమానాల్లో శాఖాహారాన్నిమాత్రమే అందిస్తామని చెప్పింది. ఆర్‌ఎస్‌ఎస్‌కు అది చాలా సంతోషాన్ని కలిగించి ఉంటుంది. చంచాగిరీతో నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు, అది అందరూ చేసేదే.

కాకపోతే యథాలాపంగా చేపట్టిన ఈ చర్య, సైనికపరమైన త్యాగాలకున్న నిజమైన అర్థాన్ని తగ్గించివేస్తుంది. అది ప్రభుత్వాన్ని సంతోషపెట్టినాగానీ, నిజ మైన సమస్యను దాటవేస్తుంది.

ఆకార్ పటేల్
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com

మరిన్ని వార్తలు