క్రికెట్‌లో రిజర్వేషన్‌.. జట్టుకూ, దేశానికీ మంచిదే

9 Jul, 2017 00:17 IST|Sakshi
క్రికెట్‌లో రిజర్వేషన్‌.. జట్టుకూ, దేశానికీ మంచిదే

అవలోకనం
క్రికెట్‌లో రిజర్వేషన్‌ ప్రవేశపెట్టి కోటా ప్రకారం ఆటగాళ్లను తీసుకున్నప్పటికీ ఒక జట్టుగా దక్షిణాఫ్రికా ప్రపంచంలో క్రికెట్‌ ఆడే దేశాలన్నింటికీ కొరకరాని కొయ్యలాగే ఉంటూ వచ్చింది. దళితులకు భారత క్రికెట్‌లో రిజర్వేషన్‌ కల్పిస్తే దీర్ఘకాలంలో అది జట్టుకు, దేశానికి కూడా ప్రయోజనం కలిగించవచ్చు. కేంద్రమంత్రి రామ్‌దాస్‌ అథవాలే 25 శాతం రిజర్వేషన్లనే కావాల న్నారు. ఈ అంశంపై దృష్టి సారించి, ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేశ జనాభాలో 25 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీలకు క్రికెట్‌లో ప్రాతినిధ్యం లేకపోవడం విషాదకరం.

మన దేశంలో మధ్యతరగతి రిజర్వేషన్‌లను ఇష్టపడలేదు అనే విషయాన్ని ఇటీవల జరిగిన రెండు ఘటనలు ముందుపీఠికి తెచ్చాయి. క్రికెట్‌లో రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రమంత్రి రామ్‌దాస్‌ అథవాలే డిమాండ్‌ చేశారు. భారత క్రికెట్‌ టీమ్‌ ప్రత్యర్థులతో పేలవమైన రికార్డును కలిగి ఉందని ఆయన ఆరోపిం చారు. భారత జాతీయ క్రికెట్‌ జట్టు సాధించిన విజయాల కంటే పరాజయాలే ఎక్కువని రామ్‌దాస్‌ చెప్పడం నిజమేనా? అవునన్నదే  సమాధానం.

టెస్టు క్రికెట్‌లో ఇతర దేశాల జట్లతో భారత్‌కు పరాజయ రికార్డే ఉంది. ఆస్ట్రేలియాతో భారత్‌ (41 ఓటములు, 21 విజయాలు), ఇంగ్లండుతో (43 ఓట ములు, 25 విజయాలు), పాకిస్తాన్‌తో (12 ఓటములు, 9 విజయాలు), వెస్టిం డీస్‌తో (30 ఓటములు, 19 విజయాలు), దక్షిణా ఫ్రికాతో (13 ఓటములు, 10 విజయాలు) రికార్డు కలిగి ఉంది. వీటితో పోలిస్తే బంగ్లాదేశ్, న్యూజిలాండ్, జింబాబ్వే, శ్రీలంక జట్లతోనే మనకు విజయాల రికార్డు అధికంగా ఉంది.

ఇక వన్డే ఇంటర్నేషనల్స్‌ విషయంలోనూ ఈ రికార్డు పెద్ద తేడాతో లేదు. వన్డే మ్యాచ్‌లలో ఆస్ట్రేలియాతో భారత్‌ (72 ఓటములు, 41 విజయాలు) కలిగి ఉండగా పాకిస్తాన్‌తో (73 ఓటములు, 52 విజయాలు), వెస్టిండీస్‌తో (61 ఓట ములు, 56 విజయాలు), దక్షిణాఫ్రికాతో (45 ఓటములు, 29 విజయాలు) రికార్డును కలిగి ఉంది. క్రికెట్‌ ప్రపంచంలోని ప్రధాన జట్లలో ఒక్క ఇంగ్లండుతో మాత్రమే (39 ఓటములు, 52 విజయాలు) అపజయాల కంటే విజయాలను అధికంగా కలిగి ఉన్నాం. దీన్ని బట్టి చూస్తే, క్రికెట్‌లోనూ రిజర్వేషన్లు ఉండాలన్న కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ సూచనను పరిశీలించడానికి మనం సిద్ధపడాల్సి ఉంది.

గత సంవత్సరం దక్షిణాఫ్రికా తన క్రికెట్‌ జట్టులో వివక్షా వ్యతిరేక కోటాను తీసుకువచ్చింది. జట్టులో ఆడే 11 మంది ఆటగాళ్లలో తప్పకుండా 6గురు నల్ల వాళ్లు ఉండాలి. వీరిలో కనీనం ఇద్దరు ఆఫ్రికన్‌ నల్లవాళ్లు అయి ఉండాలి.  ఇండి యన్‌ లేదా భారత ఉపఖండానికి చెందిన హాషిమ్‌ ఆమ్లా, ఇమ్రాన్‌ తాహిర్‌ వంటి ఆటగాళ్లను పై ఇద్దరి జాబితాలో కాకుండా ఆరుగురి జాబితాలో పొందుపర్చు తారు. దక్షిణాఫ్రికా ఎందుకలా చేసిందంటే దేశ జనాభాలో 80 శాతం మంది ఆఫ్రికన్‌ నల్లజాతి ప్రజలే కానీ వారికి జట్టులో న్యాయమైన ప్రాతినిధ్యం లేదు. అదే తెల్లజాతి ప్రజల విషయానికి వస్తే జనాభాలో వీరు 10 శాతం మాత్రమే ఉన్నప్పటికీ టీమ్‌లో ఎల్లప్పుడూ వారి ఆధిక్యమే ఎక్కువగా ఉంటోంది. ఎందు కంటే దక్షిణాఫ్రికాలో వర్ణవివక్ష అమలులో ఉన్నప్పుడు దశాబ్దాలుగా శ్వేతజాతీ యులే అత్యున్నత స్థాయిల్లో క్రీడా సౌకర్యాలను, శిక్షణ, కోచింగ్‌ వనరులను పొందగలుగుతూ వచ్చారు. దక్షిణాఫ్రికా జనాభాలో భారతీయులు 2 శాతం మాత్రమే ఉన్నప్పటికీ ఆ దేశ క్రికెట్‌ జట్టులో వీరికి మంచి ప్రాతినిధ్యం ఉండేది. కాబట్టే ప్రత్యేకించి దక్షిణా్రíఫికా నల్లవారికే కోటా తప్పనిసరి అవసరమైంది.

మరి ఈ కోటా అనేది జట్టు పనితీరును దెబ్బతీసిందా? అంటే లేదు. కోటా ప్రకారం ఆటగాళ్లను తీసుకున్నప్పటికీ ఒక జట్టుగా దక్షిణాఫ్రికా ప్రపంచంలో క్రికెట్‌ ఆడే దేశాలన్నింటికీ కొరకరాని కొయ్యలాగే ఉంటూ వచ్చింది. కాని ఈ కోటా పద్ధతి వల్ల జరిగే ప్రయోజనం రానున్న దశాబ్దాల్లోనే ఒనగూరుతుంది. గతంలో కులీన వర్గాలు మాత్రమే ఆడుతూ వచ్చిన ఆటలో లక్షలాదిమంది నల్ల ఆఫ్రికన్లు భాగం కావడం ద్వారా జాతీయ జట్టు నిజంగానే మేలు  పొందుతుంది.

ఇక భారత్‌లో దళిత, ఆదివాసీ జనాభా మొత్తం జనాభాలో 25 శాతంగా ఉంది. కానీ క్రికెట్‌లో వారి ప్రాతినిథ్యం ఇప్పటికీ శూన్యమే. భారత్‌ క్రికెట్‌ జట్టులో భాగమైన బ్రాహ్మణ క్రీడాకారులను (గవాస్కర్, టెండూల్కర్, ద్రావిడ్, గంగూలీ, శ్రీనాథ్, కుంబ్లే) గురించి తెలుసుకోవడం చాలా సులభం. కానీ వెనుకబడిన సామాజిక బృందాలు, దళితులు, ఆదివాసీల నుంచి వచ్చి జట్టులో చేరిన వారి పేర్లను కనుగొనడం చాలా కష్టం. రామ్‌దాస్‌ అథవాలే 25 శాతం రిజర్వేషన్లనే కావాలన్నారు. ఈ అంశంపై దృష్టి సారించి, ఆలోచించాల్సిన అవసరం ఉంది.

ఇక రెండో కథనం ఏమిటంటే రాజకీయాల్లో రిజర్వేషన్లు. బీజేపీ భారత రాష్ట్రపతి పదవికి ఒక దళితుడిని నామినేట్‌ చేసింది. నిజంగానే ఇది చాలా తెలి వైన, సమర్థనీయమైన నిర్ణయం. కోవింద్‌ ఆరెస్సెస్‌ నుంచి రాలేదు. సాపేక్షికంగా చూస్తే.. 40 ఏళ్ల పైబడిన వయస్సులోనే ఆయన పార్టీలో చేరారు. దళితులతో ఆరె స్సెస్, బీజేపీకి ఉన్న సంక్లిష్ట సంబంధానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తారు.

అయితే స్వభావరీత్యానే హిందుత్వ పార్టీ రిజర్వేషన్లకు, దళితులను అంత ర్భాగం చేసుకోడానికి వ్యతిరేకమైనట్టిది. ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘ్‌చాలక్‌ల జాబి తాను మనం చూడవచ్చు (హెగ్డేవార్, పరాంజపే, గోల్వాల్కర్, దేవరస్, సుద ర్శన్, ప్రస్తుత చీఫ్‌ భగవత్‌). వీళ్లంతా బ్రాహ్మణులే. రాజేంద్రసింగ్‌ అనే ఒకే ఒక ఆరెస్సెస్‌ చీఫ్‌ మాత్రమే బ్రాహ్మణేతరుడు. తనుకూడా అగ్రకులం నుంచి వచ్చారు. ఆరెస్సెస్‌కు అధిపతిగా దళితుడిని నియమించడం కంటే దళితుడిని భారత రాష్ట్రపతిగా చేయడం హిందుత్వకు సులభమని చెబుతున్నారు మరి.

ఈ ఆరోపణకు వ్యతిరేకంగా ఆరెస్సెస్‌ సింపుల్‌గా ఇలా సమర్థించుకుం టుంది. ‘మేము కులం గురించి అడగం, కులాన్ని గుర్తించం కూడా’. కింది వర్గా లను మీ సిబ్బందిలో ఎలా అంతర్భాగం చేసుకుంటున్నారని ప్రశ్నించినప్పుడు కార్పొరేట్‌ ఇండియా కూడా ఇలాగే చెబుతూ వస్తుంది. భారత క్రికెట్‌ జట్టు కూడా తనకు కులం పట్టింపు లేదని చెప్పవచ్చు. కానీ వివక్ష పాటింపు, కింది వర్గాలను మినహాయించడం అనే వాస్తవాన్ని అది మరుగుపరుస్తోంది.

కింది వర్గాలను అంతర్భాగం చేయడం, వైవిధ్యతను పాటించడం అనేది దీర్ఘకాలంలో క్రికెట్‌ జట్టుకే కాకుండా దేశానికి కూడా ప్రయోజనం కల్పించవచ్చు. ఇలాంటి చర్య వల్ల ఆటలో మన రికార్డు మసకబారుతుందని వాదించేవారికి నేను డేటాను చూపిం చడమే కాకుండా బలమైన జట్టుతో తలపడినప్పుడు మనం ప్రత్యేకించి మంచి టీమ్‌గా లేమని చెప్పగలను. అందుకనే క్రికెట్‌లో మన రికార్డును సమర్థించుకోవ డానికి ఆ డేటాను వాడుకోవడం కాకుండా, రామ్‌దాస్‌ అథవాలే చెప్పిన అంశంపై తీవ్రంగా దృష్టి పెట్టాలి.


- ఆకార్‌ పటేల్‌

వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com

మరిన్ని వార్తలు