రొహింగ్యాల రోదన వినపడదా!

19 Sep, 2017 00:56 IST|Sakshi
రొహింగ్యాల రోదన వినపడదా!

రెండో మాట
40 వేలమంది రొహింగ్యాలు భారత సరిహద్దులు దాటి శరణార్థులై వచ్చారు. తమను వెనక్కి పంపించవద్దన్న శరణార్థుల విన్నపాన్ని వారి తరఫున సుప్రీంకోర్టు ప్రసిద్ధ న్యాయవాది ప్రశాంత భూషణ్‌ న్యాయస్థానానికి నివేదించారు. కానీ అలాంటి హామీని కేంద్రం తరఫున తానివ్వజాలనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజిజు కోర్టుకు తెలిపారు. ‘రొహింగ్యాలు చట్ట విరుద్ధంగా ప్రవేశించినవారు. కాబట్టి వారిని వెనక్కి పంపించేస్తాం’ అని చెప్పారు. మన పాలకుల విధానాలన్నీ పరస్పర విరుద్ధంగానే ఉంటున్నాయి.

‘ప్రపంచంలో ఎక్కడైనా, ఎప్పుడైనా ఏ జాతి అయినా హింసకు, ఆకలి దప్పులకు, అవమానాలకు మతం పేరుతోనో, అభిప్రాయభేదాల పేరుతోనో గురైతే మిగతా మానవులు వారి పక్షాన నిలబడడమే నిజమైన పౌరధర్మం.’ – పాలీ వీజిల్‌ (నోబెల్‌ బహుమతి గ్రహీత వీజిల్‌ యూదు జాతీయుడు. జర్మనీలో యూదుల పట్ల సాగిన కిరాతకాలకు ప్రత్యక్ష సాక్షి. ‘నైట్‌’ అన్న రచనలో ఆయన ఈ మాటలు రాశారు.) ‘చిట్టచివరి బాధాతప్తుడైన మానవుడు విమోచన పొందేవరకు విశ్రమించబోనని గాంధీజీ పదే పదే చెప్పేవారు. నేడు మయన్మార్‌లో శతాబ్దాల తరబడి నివసిస్తున్న రొహింగ్యా ముస్లింలు అక్కడి ప్రభుత్వం నుంచి, సైనిక కిరాతకాల నుంచి ఎదుర్కొంటున్న హింసాకాండ ఫలితంగా ఇరుగు పొరుగు దేశాలకు వలసబాట పట్టవలసి వచ్చినవారు, గాంధీ చెప్పిన ఆ ‘చివరి మానవుడు’ కోవకు చెందినవారే. వీరు ప్రపంచంలోనే అత్యంత పీడన, దోపిడీలకు, కిరాతకాలకు, అణచివేతకు గురవుతున్న మైనారిటీ ముస్లింలు. వీరిని బానిసలుగా వెట్టి చాకిరీ వైపు మయన్మార్‌ సైన్యం, ప్రభుత్వం నెట్టాయి. ఈ నరమేధంలో దారితప్పి సంకుచిత జాతీయవాదాన్ని ఆశ్రయించిన బౌద్ధమతస్తులు కూడా పాల్గొనడం విచిత్రం’.
– ప్రొ. శివవిశ్వనాథన్‌ (జిందాల్‌ విశ్వవిద్యాలయం, గ్లోబల్‌ లా ఇన్‌స్టిట్యూట్, 6–9–17)


‘ఛత్రపతి’ సినిమాలో ప్రభాస్‌ అణగారిన ఆర్తులలో ఒకరిగా, అనుభవిం చిన కిరాతకాలకు సమాధానంగా అణచివేతపై ఎవరు ఎందుకు ఎప్పుడు తిరగబడలవలసి వస్తుందో పాత్రోచితంగా ప్రేక్షకులకు చూపిస్తాడు. అలాగే ప్రాచీనకాలంలో స్పార్టకస్, నవీన యుగంలో షెగువేరా అణచివేతలకు సమాధానంగా కనిపిస్తారు. తెలుగుప్రాంతంలో అల్లూరి సీతారామరాజు, కొమురం భీం రాజ్యపాలకుల దాష్టీకాలకు వ్యతిరేకంగా పాలకుల మీద తిరగబడవలసి వచ్చింది. దారుణ జీవన పరిస్థితుల మధ్య, శతాబ్దాల వలస చరిత్ర నుంచి సంక్రమించిన భారాన్ని మోస్తూ కనీసం పౌరసత్వానికి కూడా నోచుకోని దశలో మయన్మార్‌ రొహింగ్యాలు సైన్యం మీద తిరగబడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.

దుర్భర స్థితిలో రొహింగ్యాలు
ఇలాంటి తిరుగుబాటుకు కూడా పాలకులు ‘ఉగ్రవాద’ ముద్ర వేసి రొహిం గ్యాలను తరిమి కొడుతున్నారు. దీనితో ఇరుగు పొరుగు దేశాలు ఇండియా, బంగ్లాదేశ్, మలేసియా, సింగపూర్‌లకు లక్షలాది మంది తరలిపోవలసి వచ్చింది. రొహింగ్యాలను బెంగాల్‌లో రొహింగులు అని, మయన్మార్‌ (నాటి బర్మా)లో జోహింగాలు అని పిలుస్తారు. ఈస్టిండియా కంపెనీ పాలకులు (1799 నాటికి) రూయింగాలుగా పేర్కొన్న ఈ ముస్లిం మైనారిటీలు ప్రస్తుతం మయన్మార్‌లో దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కానీ వీరి సమస్యను బీజేపీ పాలకుల మాదిరిగా నేటి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ‘ఉగ్రవాదం ఫలితం’గా చూడడం లేదు.

రొహింగ్యా ప్రజా బాహుళ్యాన్ని ఉగ్రవాదులుగా భావించడాన్ని ఖండించారు కూడా. నిజానికి బ్రిటిష్‌ ఇండియా కాలంలో ఇక్కడ నుంచి కూడా పొట్ట కూటికోసం, ఉపాధి కోసం బర్మాకు వలస వెళ్లడం గురించి కూడా మనకు తెలుసు. మయన్మార్‌లోని ఆరకాన్‌ రాష్ట్రం, ఉత్తర భాగాన్ని రఖినీ పేరుతో వ్యవహరించేవారు. అలా 15వ శతాబ్దం నాటికే బెంగాలీలు ఆరకాన్‌ రాష్ట్రంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. నిజానికి చారిత్రక ఆధారాలను బట్టి 8వ శతాబ్దం నుంచే రొహింగ్యా జాతి తెగలు ఉనికిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ కాలంలో వారిని ఆర్కనీస్‌ ఇండియన్లు అని పిలిచేవారు. ఆనాటి నుంచి వీరికి స్థిర నివాసం లేక, ఒక దేశానికి చెందినవారిగా గుర్తింపు లేకుండా ఉండిపోయారు.

2016–17లలో జాతి వివక్ష సంక్షోభం ముదిరే సమయానికి రొహింగ్యా జనాభా పది లక్షలని అంచనా. వాస్తవానికి 8వ శతాబ్దానికి ముస్లిములే మెజారిటీ వర్గీయులు కాగా, హిందువులు మైనారిటీలుగా ఉన్నారని వికీపీడియా చెబుతోంది. ఇది 2013 నాటికి మారింది. ప్రపంచంలోనే అత్యంత దారుణమైన వేధింపులకు, అవమానాలకు గురైన మైనారిటీలుగా రొహింగ్యాలను ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అలా వీరి సమస్య ప్రపంచం దృష్టికి తెచ్చింది. అయితే శతాబ్దాలుగా నివసిస్తున్నప్పటికీ రొహింగ్యాలకు మయన్మార్‌లో ఎందుకు పౌరసత్వం దక్కలేదో కూడా సమితి వివరించవలసి వచ్చింది. 1982లో అక్కడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బర్మీస్‌ పౌరసత్వ చట్టం రొహింగ్యాలకు ఆ హక్కును నిరాకరించింది.

నోరు విప్పని నోబెల్‌ శాంతి దూత
అన్నింటికన్నా దారుణమైన విషయం ఒకటి ఉంది. మయన్మార్‌ సైనిక పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించి, అనేక ఏళ్లపాటు గృహ నిర్బంధానికి గురైన ఆంగ్‌–సాన్‌ సూకీని స్వీడిష్‌  అకాడమీ నోబెల్‌ శాంతి పురస్కారానికి ఎంపిక చేసింది. కానీ సూకీ ఆ స్ఫూర్తిని  మరిచి దేశాధినేతగా రొహింగ్యాల ఊచకోతలను నిరోధించలేక పోతున్నారు. సైనిక నాయకత్వంతోపాటు తన ఉనికి కోసం ముస్లిం మైనారిటీలను ‘ఉగ్రవాదులు’గా ముద్ర వేశారు. రొహిం గ్యాలపై మయన్మార్‌ పాలక శక్తులు సాగిస్తున్న పైశాచిక దాడుల్ని ఐక్యరాజ్య సమితి ఖండించాల్సి వచ్చింది. అక్కడి మానవ హక్కుల పరిస్థితిని వర్ణిస్తూ సమితి ప్రత్యేక ప్రతినిధి, సంధానకర్త ప్రొఫెసర్‌ యాంఘీ–లీ ముస్లిం మైనారిటీల దుస్థితిని ఇలా వర్ణించాల్సి వచ్చింది (4.9.17): ‘‘ఈ రోజునే కాదు, రొహింగ్యాలను మూకుమ్మడిగా మయన్మార్‌ నుంచి బలవంతంగా తొలగించే కార్యక్రమం చాలాకాలంగా కొనసాగుతోంది.

ముస్లింలకు సైన్యం దాడులవల్ల కల్పించిన ఈ దుస్థితివల్లనే వారు తిరగబడ్డారు. రఖినీ (ఆరకాన్‌) రాష్ట్రంలో వంద కిలోమీటర్ల పర్యంతం వ్యాపించి ఉన్న రొహింగ్యాల గ్రామాలను ఖాళీ చేయించి సైన్యం ఆ గ్రామాలను తగులబెట్టింది, వేలాదిమందిని చంపేసింది. నేడు రఖినీ రాష్ట్రం ఉడికిపోతూ తీవ్రవాదం రూపం దాల్చింది. 2012 నుంచీ ఈ పరిస్థితుల్లోనే ముస్లిం మైనారిటీలు జీవించవలసి వచ్చింది. వారికి సంచార స్వేచ్ఛ లేదు, అతి మౌలికమైన సేవలు పొందే స్వాతంత్య్రమూ లేదు. వివక్షాపూరిత చట్టాల మధ్యనే రొహింగ్యాలు దశాబ్దాల తరబడి జీవిస్తూ వచ్చారు. అలాంటి దారుణ పరిస్థితుల్లోనే ఎవరైనా సరే ‘లక్ష్మ ణరేఖ’ను దాటి వ్యవహరించడం తేలికే గదా!’’ (4.9.17).

అందుకే ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి, తర్వాత సమితి తరఫున మయన్మార్‌లో పరిస్థితిని పరిశీలించి నివేదిక సమర్పించిన కోఫీ అన్నాన్‌ కూడా మయన్మార్‌ సంక్షోభం తీవ్రవాదం వైపు పోకుండా ఉండాలంటే రొహింగ్యాలకు పౌరసత్వం కల్పించి తీరాలి అని సూచించారు. అయితే, సమితి కమిషన్‌ నివేదిక వెలువడిన (ఆగస్టు 24) 24 గంటల్లోనే  సైన్యం రొహింగ్యాలపై ఆకస్మికంగా విరుచుకుపడింది. ఇది హిందువులకు, రొహింగ్యా ముస్లిం మైనారిటీలకు మధ్య అంతర్యుద్ధంగా మారింది. ఈ పరిస్థితుల్లో మన భారత పాలకుల ధోరణి రోజుకొక తీరుగా మారుతూ వచ్చింది. ప్రధాని మోదీ నేప్యీతా నగరంలో (మయన్మార్‌ పర్యటనలో) సూకీని సెప్టెం బర్‌ 6న కలుసుకున్నప్పుడు రొహింగ్యాల సమస్యను కేవలం సూకీ తరహాలోనే ‘ఉగ్రవాద హింసాకాండ’ దృష్టితోనే పరిశీలించారు.  

ప్రభుత్వ మారణకాండను తప్పించుకుంటూ 40 వేలమంది రొహిం గ్యాలు భారత సరిహద్దులు దాటి శరణార్థులై వచ్చారు. తమను వెనక్కి పంపించవద్దన్న శరణార్థుల విన్నపాన్ని వారి తరఫున  సుప్రీంకోర్టు ప్రసిద్ధ న్యాయవాది ప్రశాంత భూషణ్‌ న్యాయస్థానానికి నివేదించారు. కానీ అలాంటి హామీని కేంద్రం తరఫున తానివ్వజాలనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజిజు కోర్టుకు తెలిపారు. ‘రొహింగ్యాలు చట్ట విరుద్ధంగా ప్రవేశించినవారు. కాబట్టి వారిని వెనక్కి పంపించేస్తాం’ అని చెప్పారు.

కాగా, మయన్మార్‌ సంక్షోభం ముదిరి ఐక్యరాజ్యసమితి సూకీ ప్రభుత్వ దమన నీతిని ఖండిస్తూ ప్రకటనలు విడుదలవుతున్న సంగతి గమనించిన బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా మాత్రం ‘రొహింగ్యాలు మయన్మార్‌కు వెళ్లి అక్కడే ఉంటే వారికి ఇండియా సహాయం అందిస్తుంద’ని ప్రకటించారు. ఎందుకంటే, అస్సాంకు బంగ్లాతో 262 కిలోమీటర్ల సరిహద్దు ఉండటమేగాక, ఈశాన్య భారతంలోని మణిపూర్, మిజోరాం, నాగాలాండ్‌లతో కూడా సరిహద్దులున్నాయి. బహుశా అందుకే బీజేపీ పాలనలో ఉన్న అస్సాం, మణిపూర్‌ ప్రభుత్వాలను ‘రొహింగ్యా ముస్లిములు సరిహద్దు దాటి ప్రవేశించే పక్షంలో వెనక్కి నెట్టేయండి’ అని కేంద్ర ప్రభుత్వం ఆదేశించి ఉంటుంది (15.9.17).

పరస్పర విరుద్ధ విధానాలు
మన పాలకుల విధానాలన్నీ పరస్పర విరుద్ధంగానే ఉంటున్నాయి.  ఎవరు ఏ దేశం వారైనా, ఏ ఇబ్బందుల్లోనైనా మరొక దేశ ప్రభుత్వం నిరంకుశమైన ఆంక్షలు, నిషేధాజ్ఞలు తమపై విధించిన సమయంలోనే– అలాంటి వారికి మన దేశం ఆశ్రయం కల్పించిందా లేదా అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. భారత ఉపఖండ విభజన తర్వాత ఇండియా–పాకిస్తాన్‌లుగా విడిపోయినప్పుడు, పాకిస్తాన్‌లో భాగమైన తూర్పు పాకిస్తాన్‌ను ప్రధాని ఇందిరాగాంధీ విడగొట్టి బంగ్లాదేశ్‌ను ఏర్పాటు చేసిన సందర్భంగా– ఎన్ని వేలు, లక్షలమంది కాందిశీకులై పశ్చిమ బెంగాల్‌ సహా మరెన్ని భారత రాష్ట్రాల్లో ప్రవేశిం చలేదు? బాధల్లో ఉన్న ఎంతమందికి మనం ఆశ్రయం ఇవ్వలేదు? కశ్మీర్‌ సమస్యవల్ల ఎంతమంది కాందిశీకులయ్యారు? బంగ్లాదేశ్‌ ఏర్పాటు ఫలి తంగా మరికొందరు ముస్లిం మైనారిటీలు భారతదేశానికే కాదు, మయన్మార్‌కు సైతం పెద్ద సంఖ్యలో శరణార్థులైపోయారా లేదా? అలాగే శతాబ్దాల తరబడి బర్మా సమాజంలో అంతర్భాగమైపోయిన రొహింగ్యా ముస్లింలను భాగం కాదంటే కుదరదు గదా!

కానీ, సిరియా, సూడాన్‌ ఆంతరంగిక సంక్షోభాలతో కాందిశీకులై వెడుతున్న ప్రజల్ని రావద్దని అడ్డుకుంటున్న పశ్చిమ దేశాల ప్రభుత్వాల్ని విమర్శించగల స్థితిలో మనం ఉన్నామా? మహా పండిత రాహుల్‌ సాంకృత్యాయన్‌ మాటల్లో చెప్పాలంటే ‘‘వోల్గా తీరంనుంచి గంగానదీ తీరం దాకా సాగిన మానవ వలసలన్నీ (వోల్గా–సే–గంగా) చరిత్రలో అంతర్భాగమేగానీ వేరు కాదని గుర్తించవలసిన ఘడియలు మరొకసారి వచ్చాయి. ‘వసుదైక కుటుం బాన్ని’ నిత్యం గుర్తుచేసే ఉపనిషత్‌ వాక్యాన్ని గుర్తు చేసుకోండి.

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

మరిన్ని వార్తలు