అఖిలేశ్‌ యాదవ్‌ రాయని డైరీ

12 Mar, 2017 01:56 IST|Sakshi
అఖిలేశ్‌ యాదవ్‌ రాయని డైరీ

నాన్నగారు ఢిల్లీలో ఉన్నారు. నేను లక్నోలో ఉన్నాను. ఇద్దరం వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నాం. నాన్నగారు నా వైపు చూడడం లేదు. సీరియస్‌గా టీవీ చూస్తున్నారు. నిజానికి సీరియస్‌గా టీవీ చూడాల్సింది నేను. కానీ నాన్నగారు చూస్తున్నారు. చూస్తే చూశారు. మధ్యమధ్యలో నా వైపు తిరిగి, ‘చెబితే విన్నావా’ అన్నట్లు నన్ను చూస్తున్నారు. ఆయన నాకేం చెప్పరు. చెప్పాననుకుని, నేను వినలేదనుకుని అలా నా వైపు చూడడం ఆయనకు అలవాటు.

టీవీ స్క్రీన్‌ మీద.. రావడం రావడమే బీజేపీ లీడింగ్‌లోకి వచ్చింది! ‘‘టెన్షన్‌గా ఉంది నాన్నగారూ’’ అన్నాను. నాన్నగారేమీ మాట్లాడలేదు. నాలా టెన్షన్‌ కూడా పడడం లేదు. టీవీలో ఆత్మీయతలు–అనుబంధాల సీరియలేదో నాలుగు వందల మూడో ఎపిసోడ్‌ చూస్తున్నట్లుగా ఎన్నికల ఫలితాలను చూస్తున్నారు.
టీవీ ఆన్‌ చేయకముందు వరకు.. వచ్చేస్తామని ఎక్కడో నమ్మకంగా ఉండేది నాకు. టీవీ ఆన్‌ చేశాక కూడా  కొద్దిసేపు ఆ నమ్మకంతోనే ఉన్నాను.

‘‘ఎగ్జిట్‌ పోల్స్‌ అప్పుడప్పుడూ లెక్క తప్పుతాయి కదా నాన్నగారూ’’ అని  ఆశగా అన్నాను.
నాన్నగారు నా వైపు చూడలేదు.

‘‘తమిళనాడులో అన్నాడీయెంకే పోతుందన్నారు. పోలేదు. వచ్చింది. బిహార్‌లో బీజేపీ వస్తుందన్నారు. రాలేదు. పోయింది. అవును కదా నాన్నగారూ’’ అన్నాను. అప్పుడు చూశారు నాన్నగారు నావైపు!
సడన్‌గా టీవీ స్క్రీన్‌ మీద మా పార్టీ లీడింగ్‌లోకి వచ్చినంతగా సంతోషం వేసింది నాకు. నాన్నగారు నావైపు తిరిగారు. నాన్నగారు నావైపు చూశారు. నాన్నగారు నాతో మాట్లాడబోతున్నారు! అదీ నా సంతోషం. నాన్నగారిని నేను చాలా మిస్‌ అయ్యాను. ఎప్పుడో ఎలక్షన్‌ నోటిఫికేషన్‌ వచ్చినప్పుడు ఇద్దరం కలసి టీవీ చూస్తూ మాట్లాడుకున్నాం. మళ్లీ ఇప్పుడు.. టీవీలో ఎలక్షన్‌ రిజల్ట్‌ని కలసి చూస్తున్నాం.

‘‘అవును అఖిల్‌బాబు. ఎగ్జిట్‌ పోల్స్‌ అప్పుడప్పుడూ లెక్క తప్పుతుంటాయి. మూడేళ్ల క్రితం.. యూపీ ఎంపీ ఎలక్షన్స్‌లో బీజేపీకి అన్ని సీట్లు రావన్నారు. వచ్చాయి. కాంగ్రెస్‌కు అన్ని సీట్లు పోవన్నారు. పోయాయి’’ అన్నారు నాన్నగారు.  
నాన్నగారు నాకేం చెప్పదలచుకున్నారో అర్థమయింది. ఎగ్జిట్‌ పోల్స్‌ ఒక్కోసారి లెక్క తప్పి ఓడిస్తాయి. ఒక్కోసారి లెక్క తప్పకుండా ఓడిస్తాయి! ‘‘అంతే కదా నాన్నగారూ’’ అన్నాను.
నాన్నగారు నావైపు చూడడం లేదు. టీవీ వైపూ చూడడం లేదు. చూడ్డానికి ఏమీ లేదు. కౌంటింగ్‌ జరగడానికైతే జరుగుతోంది కానీ.. జరిగేందుకు అక్కడేం లేదు.

‘‘నీ ఫోన్‌ రింగ్‌ అవుతోంది చూడు’’ అన్నారు నాన్నగారు.
చూసుకున్నాను. రాహుల్‌ ఫోన్‌ చేస్తున్నాడు!! లిఫ్ట్‌ చేశాను. ‘‘హాయ్‌ అఖిలేశ్‌’’ అన్నాడు. ‘‘ఊ’’ అన్నాను.
‘‘లౌకిక శక్తుల పునరేకీకరణకు ఒక్కో పార్టీకి  కనీసం ఇన్ని సీట్లు వచ్చి ఉండాలన్న రాజ్యాంగ నిబంధన ఏమైనా ఉందా అఖిలేశ్‌?’’ అని అడుగుతున్నాడు!

- మాధవ్‌ శింగరాజు

మరిన్ని వార్తలు