ఇంకుడు గుంతలు అను మేధోబిలాలు

23 Apr, 2016 14:33 IST|Sakshi
ఇంకుడు గుంతలు అను మేధోబిలాలు

అక్షర తూణీరం

చంద్రబాబు సదా మెదడు గుంతల్ని మెయిన్‌టెయిన్ చేసుకోవాలి. పిచ్చి పిచ్చి ఆలోచనల ఆకులు అలమలు పడినప్పుడు పూడిక తీసుకోవాలి. ఉదాహరణకి వారసత్వంగా పవర్ సంక్రమింపచేద్దామనే ఆలోచన ఇంకుడు గుంతలో పడి, గుంటని పూడ్చేస్తుంది. ఇక ఆపైన ఏవీ కిందికి దిగవు. అప్పుడు ఇందిరాగాంధీ, సంజయ్‌గాంధీలను స్మరించుకోవాలి.
 
పెద్దగా పనిలేనివాడు, బొత్తిగా బాధ్యత  లేని వాడు నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు. ‘‘తవ్వు కోండి... ఎవరి గొయ్యి వాళ్లు తవ్వుకోండి!’’ అని వ్యాఖ్యానించడంలో బోలెడు అనుభవరాహిత్యం కనిపిస్తుంది. ఏ మాటకామాట చెప్పుకోవాలి, దేనికదే ఒప్పుకోవాలి - చంద్రబాబు ఇంకుడు గుంతల మీద ఎప్పటి నుంచో కృషి చేస్తున్నారు. కిందటిసారి పవర్‌లో ఉన్నప్పుడు ‘ఇం.తల’ ప్రచారానికి కోట్లాది రూపాయలు వెచ్చించారు. లక్షలాది కరపత్రాలు, ప్రచార సామగ్రి తయారు చేసిన మిత్రుడు అప్పట్లో మంచి ఇల్లు ఏర్పాటు చేసుకుని, అందులో ఇంకుడు గుంత తవ్వించుకున్నాడు. వెంకయ్య లాంటి జాతీయ నాయకులు మొదలు మన ప్రాంతీయ నాయకుల దాకా రాబోయే నీటిచుక్కల్ని ఒడిసి పట్టేందుకు శ్రమదానం చేస్తున్నారు. చెమటోడుస్తున్నారు.

ఇప్పుడు మనం పై చినుకుల్ని ఒడిసి పట్టడంతో పాటు, మునుపటి తరాల వారు అందించిన ఆదర్శాలను, త్యాగాలను కూడా ఇంకించుకోవలసిన చారిత్రక అవసరం ఉంది. అందుకోసం మన నేతలు, వివిధ వ్యాపార దిగ్గజాలు, శాస్త్రవేత్తలు, లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఆచార్య దేవుళ్లు, న్యాయమూర్తులు తమ తమ మెదళ్లలో తగు పరిమాణంలో ఇంకుడు గుంతలు తవ్వుకోవలసిన అవసరం ఉంది. దీనికి పలుగులు, పారలతో పనిలేదు. మానసికంగా ఈ మేధోబిలాన్ని తవ్వుకోవచ్చు. మోదీ లాంటి అగ్రనేతలు ధర్మ, న్యాయ విచక్షణలను ఇంకింపచేసుకుంటే తరచు ఎదురు దెబ్బలు తగలకుండా ఉంటాయి. చంద్రబాబు సదా మెదడు గుంతల్ని మెయిన్‌టెయిన్ చేసుకోవాలి. పిచ్చి పిచ్చి ఆలోచనల ఆకులు అలమలు పడినప్పుడు పూడిక తీసుకోవాలి.

ఉదాహరణకి వారసత్వంగా పవర్ సంక్రమింప చేద్దామనే ఆలోచన ఇంకుడు గుంతలో పడి, గుంటని పూడ్చేస్తుంది. ఇక ఆపైన ఏవీ కిందికి దిగవు. అప్పుడు ఇందిరాగాంధీ, సంజయ్‌గాంధీలను స్మరించు కోవాలి. వెంటనే పూడిక కరిగి మేధోబిలం ప్రతి అనుభవసారాన్ని ఒడిసి పట్టడానికి సిద్ధంగా ఉంటుంది. కాంగ్రెస్ నేతలు సామూహికంగా ఇంకుడు గుంతలు తవ్వుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే నూటనలభయ్ సంవత్సరాల ఊట ఇంకిపోయింది. పార్టీ పెద్ద చవిటిపర్రగా మిగిలింది. తక్షణం బిలాల మీద దృష్టి సారించండి. మంచి ఆలోచనలను ఒడిసి పట్టి, ఇంకింప చేసి పార్టీ జెండాని చిగురింప చేయండి.

డాక్టర్లకిప్పుడు ఈ గుంతలు అత్యవసరం. బిలాలు కరెన్సీతో కవర్ కాకుండా చూసుకోవాలి. విద్య గరిపేవారు, వైద్యులు, నీతికోవిదులు వీరిని దైవసమానులుగా మనం భావిస్తాం. న్యాయ, నీతి, ధర్మశాస్త్రాలు ఎలాంటి అమృతవాక్కులు కురిపించాయో తెలుసు. వాటిని ఒడిసిపట్టి వారి వృత్తుల్ని పండించుకుంటే ఎంత బావుంటుంది! స్వామీజీలు, బాబాలు, మాతృశ్రీలు, అవధూతలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. మేము... మేము అని తమని తాము సంబోధించుకుంటూ ప్రసార మాధ్యమాలు సొంత ప్రచార మాధ్యమాలుగా మారిపోతున్నాయి. వీరంతా మేధోమథనం చేసుకోవాలి. తక్షణం వారంతా వారికి తగిన పరిమాణంలో ఇంకుడు గుంతలు తవ్వుకోవాలి. పై కొలతలు ఎలా ఉన్నా వీరంతా లోతు పెంచుకోవడం శ్రేయస్కరం.

వ్యాసకర్త: శ్రీరమణ (ప్రముఖ కథకుడు)

మరిన్ని వార్తలు