బతుకంతా పండుగ కావాలి!

7 Oct, 2016 07:07 IST|Sakshi
బతుకంతా పండుగ కావాలి!

సమకాలీనం
పూలను పేర్చి చేసే బతుకమ్మల పండుగ ప్రకృతి పూజే! పూలు నవ్వినట్టే స్త్రీలు సంతోషంగా ఉండాలి. బతుకమ్మ పండక్కి పుట్టింటి కి ఆడబిడ్డలొస్తేనే కళ. కొడుకైతేనేం, కూతురై తేనేం అన్న ధ్యాస, ఆడ బిడ్డే ఇంటికి కళ అన్న స్పృహ తగ్గుతోంది. గతంలో ఈ పండుగ నాటికి వర్షాలు కురిసి, చెరువులు నిండి, ఏర్లు పొంగి పారేవి. మానవ ప్రవర్తనను బట్టే ప్రకృతి స్పందిస్తుందేమో! ఈ సారి కాలం బాగుంది. చిన్న జిల్లాలతో పల్లెలు, గ్రామసీమల అవకాశాల్ని మెరుగుపరుస్తున్నారు. అలాగే మహిళల అవకాశాల్నీ విస్తృతపరచాలి.
 
 పల్లెకు పండుగొచ్చింది. అంతకు ముందే పండుగ కళొచ్చింది. ప్రకృతి చల్లని చూపూ తోడవడంతో తెలంగాణ చెరువులన్నీ నేడు నీటితో నిండి కళకళలాడు తున్నాయి. చెరువంచుల్లో ఏపుగా ఎదిగిన సర్కారు తుమ్మ కొమ్మ కొసలు, తూటి పొద చివర్లు వయ్యారంగా వంగి నీటిని ముద్దాడుతున్నాయి. పల్లెకు ఆనుకొనో... ఆ పక్కో, ఈ పక్కో నెలకొన్న చెరువుల్లో పరుపులా పరుచుకున్న నీరు ఎండకు వెండిలా తళుక్కున మెరుస్తోంది. మొత్తమ్మీద ఊరి వెలుగే వేరుగా ఉంది. ఊరూరా బతుకమ్మల ఆటలు జోరుమీదున్నాయి. రంగుల కల బోతగా బారులుతీరిన మహిళలు పల్లెకాంతికి వర్ణాలద్దుతున్నారు. అంతటా ఆనందం వెల్లివిరుస్తోంది.
 
 బతుకు కథలే నేపథ్యంగా అల్లుకున్న బతుకమ్మ పాటలు ఊరుమ్మడి స్వరాలై ఉబికి వస్తున్నాయి. సాయంత్రం ఆట కాగానే రోజువారీ బతుకమ్మలు చెరువుల్ని చేరి, అలల కదలికలపై తేలుతూ సాగు తున్నాయి. ఆఖరునాడు సద్దుల బతుకమ్మ, ఆ పైన దసరా! అదే రోజున కొత్త జిల్లాల ఆవిర్భావం. పాలనా వికేంద్రీకరణ, దశాబ్దాల కలకు కార్యరూపం. ఇక సందడే సందడి! పండుగంటేనే సంబురం. ఏటా పండుగలొస్తుంటాయ్, పోతుంటాయ్! మనస్ఫూర్తిగా ఆనందం నింపే పండుగలే ప్రత్యేకంగా నిలు స్తాయి. ఈసారి రాష్ట్రమంతా నెలకొన్న వాతావరణమే అలా ఉంది. పాత బంగరు రోజులు గుర్తొస్తున్నాయి.
 
అన్నీ వ్యవసాయాధారిత గ్రామాలయినం దుకేమో... ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పండక్కి ముందే కళ వచ్చేసింది. కాలం కలిసివస్తేనే ఏదైనా! ప్రభుత్వాలు, పాలకులు ఎన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా... ప్రకృతి సహకరించకపోతే, అవేవీ పూర్తి ఫలితాలి వ్వవు. ప్రభుత్వాలు చొరవ తీసుకోకున్నా ప్రగతి శూన్యం. సంవత్సరాల తరబడి వర్షాలు లేక కరవుతో అల్లాడినా క్రమం తప్పకుండా ఏటా పండుగలు వస్తూనే ఉంటాయి! కానీ, పండుగ పండుగలా ఉండదు. ఆనందం అడుగం టుతుంది. అంతా మొక్కుబడి వ్యవహారంలా సాగుతుంది. బలవంతంగా ముఖానికి నవ్వు పులుముకోవడమూ కష్టమౌతుంది. కాస్త ఆలస్యమైనా ఇటీవల వర్షాలు బాగా కురిశాయి.
 
అంతకు ముందు... సకాలంలో వానలు రాక కొంత, పండిన అరకొర ఖరీఫ్ పంట దెబ్బతిని ఇంకొంత నష్టపోయింది రైతాంగం. ఈ పరిస్థితి వినాయక చవితి పండుగలో కనిపించింది. కానీ, రబీ పంటలకు భరోసా కల్పిస్తూ సమృద్ధిగా కురిసిన వానలు, నిండిన చెరువులు భవిష్యత్తుపై ఎన్నో ఆశలు కల్పిస్తున్నాయి. మిషన్ కాకతీయ పుణ్యమా అని భూగర్భజల మట్టాలూ పెరిగాయి. సదరు ఆనందం ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఊరూరా ప్రతిబింబిస్తోంది. దీనికొక శాశ్వతత్వం కావాలి. సమానావకాశా  లతో మహిళలకు మంచి రోజులొచ్చి, ఉపాధి దొరికి యువతరం పెడదారి వీడితే గ్రామాల్లో ఆనందం పండుగై కలకాలం నిలుస్తుంది.
 
ప్రకృతికి ప్రతీక బతుకమ్మ
వర్షాకాలం మొదలయ్యాక విరివిగా పూసే పూలను పేర్చి చేసే బతుకమ్మల పండుగ నిజానికి  ప్రకృతి పూజే! గుమ్మడాకులో అందంగా పేర్చే బతుకమ్మకు నిండుగా నవ్వుతున్నట్టుండే తంగేడు, గునుగు పూలు తప్పనిసరి. నట్టింట మహిళలు కలకాలం నవ్వుతూ ఉంటేనే బతుకు పండుగకు సంబురం! ‘కలకంఠి కంట కన్నీరొలికిన ఇంట సిరితానుండనొల్లద’న్న పెద్దల మాట అక్షర సత్యం. బతుకమ్మలో పూలు నవ్వినట్టే ఇంటింటా స్త్రీలు సంతోషంగా ఉండాలి. ‘పుష్పలావికల’ని వ్యాసం రాస్తూ దేవులపల్లి కృష్ణ శాస్త్రి అన్నట్టు ఆడపిల్లలంటేనే పూలు. పెళ్లయిన కొత్తలో అయిదారేళ్ల దాకా అమ్మాయిలు తప్పనిసరిగా బతుకమ్మ పండక్కి పుట్టింటికొస్తారు. అప్పుడా ఇంటి కళే వేరు! పది రోజుల పాటు సందడి సందడిగా ఉంటుంది. తలిదండ్రుల కళ్లల్లో ఆ వెలుగు ప్రతిఫలిస్తుంది. కూతురైతేనేం? కోడలైతేనేం? ఆడపిల్ల ఆడపిల్లే! ఆ స్పృహ మనవాళ్లకి కొరవడుతోంది. కొడుకైతేనేం? కూతురైతేనేం? బిడ్డ బిడ్డే! అన్న ధ్యాసా తగ్గుతోంది. మానవసంబంధాలు మాసిపోయి ఆర్థికబంధా లుగా మారుతున్న ప్రపంచీకరణలో ఆడపిల్లను భారమని భావిస్తున్నారు.
 
భ్రూణ హత్యలతో పుట్టకముందే కడతేరుస్తున్నారు. 1980-90ల తర్వాత పెచ్చుమీరిన ఈ దురాలోచనల ఫలితం, ఈ రోజు యుక్తవయసు యువతీ- యువకుల నిష్పత్తి గగుర్పాటు కలిగిస్తోంది. పెళ్లీడు మగపిల్లలు పది మంది ఉంటే, అదే వయసు ఆడపిల్లలు నలుగురు కూడా లేరు. మనమెటు పయ నిస్తున్నాం? ఒకప్పుడు ఈ నిష్పత్తి భిన్నంగా ఉంటే సంతోషించేవారు! ‘‘ఇద్దరక్క చెల్లెండ్ల ఉయ్యాలో ఒక్కూరికిచ్చి ఉయ్యాలో..... ఒక్కడే మా యన్న ఉయ్యాలో వచ్చన్నా పోడు ఉయ్యాలో’’అని పాడుకోవడంలోనే ఆ ఆర్తి, ఆప్యాయతలు, అనుబంధం, ఆనందం ప్రస్ఫుటమౌతాయి.
 
 ‘‘ఎట్లొత్తు చెల్లెలా ఉయ్యాలో ఏరడ్డమాయె ఉయ్యాలో!’’ అంటే బతుకమ్మ పండుగ నాటికి సంతృప్త స్థాయిలో వర్షాలు కురిసి, చెరువులు నిండి, ఏర్లు పొంగి పారేవి. మానవ ప్రవర్తనను బట్టే ప్రకృతి ప్రతిస్పందిస్తుందేమో! ఏమైతేనేం ఈ సారి కాలం బాగుంది. చిన్న జిల్లాల ఏర్పాటుతో పాలనను వికేంద్రీకరించి అన్ని పల్లెలు, గ్రామసీమల అవకాశాల్ని మెరుగుపరుస్తున్నారు. పురుషులతో పాటు మహిళల అవకాశాల్నీ విస్తృతపరచాలి. ప్రభుత్వ విధానాల్లో, అభి వృద్ధి-సంక్షేమ కార్యక్రమాల్లో వారికి ప్రాతినిధ్యం, ప్రాధాన్యత పెంచాలి. జెండర్ బడ్జెట్ స్పృహ ప్రభుత్వ ప్రతిపాదనల్లో ప్రతిబింబించాలి. అప్పుడే, ఆకాశంలోనే కాదు అవకాశాల్లోనూ సగం నువ్వు సగం నేను అని సగర్వంగా చెప్పగలిగే పండుగ!
 
పండుగంటే అదికాదని చెప్పాలె!
వరుస కరువులతో, ప్రభుత్వాల నిర్లక్ష్యంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నమైనపుడు తెలుగు పల్లెలు చిన్నబోయాయి. ఊరు వల్లకాడై, ఉపాధి అవకాశాలు ఉట్టెక్కడం వల్ల ముఖ్యంగా నష్టపోయింది గ్రామీణ యువతరం. ఉపాధి వేటలో పలు కుటుంబాలే పొట్టచేత పట్టుకొని పట్టణాలు, నగరాల వైపు వలసబాట పట్టాయి. చేతి వృత్తుల కుటుంబాలు చెల్లాచెదరయ్యాయి. ఉన్న ఊరి బంధం వీడక, కాస్తోకూస్తో కలిగిన భూమిపై ఆశ చావక కొన్ని కుటుంబాలు గ్రామాల్లోనే మిగిలిపోయాయి. సొంతూళ్లో ఏ ఆదరువూ లేకున్నా... కదిలి వెళ్లే ధైర్యం చాలక, ఉన్నచోటే ఉపాధికి యాతన  పడ్డ కుటుంబాలు మరికొన్ని. అలా గ్రామాల్లో మిగిలిపోయిన పేద కుటుంబాల్లో దారిద్య్రం తాండవించింది. ఉపాధిహామీ పథకమైతేనేం, వృద్ధాప్య -వితంతు -వికలాంగుల పెన్షన్ల వల్ల ఆ కుటుంబాలు పదీ పరకా కళ్ల జూశాయి. కొన్ని పేద కుంటుంబాలకు చౌకధరకు బియ్యం, ఇతర నిత్యా వసరాలు లభిం చడంతో కొంత నిలదొక్కుకునే యత్నం చేశాయి.
 
 ఆ కుటుంబాల్లోని యువ కుల్లో అత్యధికులు ఎందుకూ కొరగాకుండా పోయారు. విద్యావకాశాలు సరిగా లేక, ఉన్నా వినియోగించుకోలేక మెజారిటీ గ్రామీణ యువత చదు వులు సగంలోనే ఆగిపోయాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాల్లేక యువత గాలి తిరుగుళ్లకు అలవాటు పడింది. 15-16 ఏళ్ల నుంచి 40 దాటిన వారి వరకు తాగుళ్లకు అలవాటు పడ్డారు. డబ్బుంటే బీరు,  విస్కీలు, లేకుంటే కల్లు, సారా... ఇలా వ్యసనానికి బానిసలయ్యారు. మెజారిటీ యువకులకు చీకటి పడితే చాలు, ఇంకొందరికయితే పగలు-రాత్రి తేడా లేదు.
 
 పండుగ లొస్తే ఇక పట్టపగ్గాలుండవు, మద్యంలో మునిగితేలు తారు. దసరా, సంక్రాంతి వంటి పండుగలు వారి విపరీత చేష్టలకు పరాకాష్ట! అసలు పండుగలొచ్చేదే అందుకని కూడా వారు సూత్రీకరిస్తారు. అది పట్ట ణాలు, నగరాల్లోనూ ఉంది. తాగి కన్నుమిన్నుకానని యువకుల వికృత చేష్టలు, మద్యం మత్తులో వాహనాలు నడపడం వంటివి ఇతరులకెలా ప్రాణాంత కమవుతాయో నగరంలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాలే నిద ర్శనం. యువత ఈ దుస్థితి నుంచి బయటపడాలి. పండుగ సంబురాలకు అర్థం అది కాదని గ్రహించాలి. ఒకరి ఆనందం... హద్దులు దాటి స్వయంగా తమకే అయినా, ఇతరులకైనా ఆటంకం, ప్రాణాంతకం కావొద్దని తెలుసు కోవాలి. అరకొరగానే అయినా అందుబాటులో ఉన్న అవకాశాల్ని అంది పుచ్చుకొని ఎదగాలి. అలా పండుగ చేయాలి.
 
ప్రభుత్వాల చొరవతోనే కొత్తగాలి
యువశక్తిని వినియోగించుకొని పల్లెల్లో పండుగ జేసే కొత్తగాలి వీయాలి. అందుకు ప్రభుత్వాలు చొరవ చూపాలి. జీవనదులు దిగువన ప్రవహిస్తుంటే తెలంగాణ దక్కన్ పీఠభూమిపై ఎగువన ఉన్నందుకు ఇక్కడ చెరువులు, కుంటలే ప్రత్యామ్నాయ జలవనరు. నదులు సమతలంగా పారి, ప్రాజె క్టులు-కాలువల వ్యవస్థ ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి వేరు. వర్షాలు ఆలస్యంగా కురిసినందువల్ల ఖరీఫ్ పంటలు ఎండిపోయిన ఏపీలోని వెనుక బడిన జల్లాల్లో పరిస్థితి నేడు దయనీయంగా ఉంది.
 
 ప్రతిపక్షనాయకుడు, వైఎస్సార్‌సీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి కరువు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటి స్తుంటే రైతాంగం తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రత్యేక సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల్ని ఆదుకోని ప్రభుత్వ వైఖరిని నిరసిస్తున్నారు. ప్రకృతి సహకరించినపుడైనా వ్యూహా త్మకంగా నడుచుకోవడం ప్రభుత్వాల కనీస బాధ్యత. చెరువులు నిండు కుండల్లా ఉన్న తాజా పరిస్థితిని సానుకూలంగా మలచుకుంటూ తెలంగాణ ప్రభుత్వం మత్స్య పరిశ్రమాభివృద్ధికి పూనుకోవడం ప్రశంసలందుకుం టోంది.
 
‘‘పరక చేపలకు గాలాలేసే తురకల పోరలు యాడికిబోయిరి.... లారీ లల్లా క్లీనర్లయ్యిర.... పెట్రోల్ మురికిల మురికయ్యిండ్రా... తల్లి దూద్ సేమియకు దూరమయ్యినారా సాయబుల పోరలు ఆ బేకరి కేఫ్‌లో ఆకలి తీరిందా ఆ పట్టణాలలో...’’ అని గోరటి వెంకన్న రాసిన ‘పల్లె కన్నీరు పెడు తుందో...’ అన్న పాట, విన్న ప్రతి ఒక్కరినీ కంట తడి పెట్టించింది. 48 కోట్ల రూపాయలు వెచ్చించి, 4,532 చెరువుల్లో 35 కోట్ల చేప పిల్లల్ని విడవడం  ద్వారా భవిష్యత్ గ్రామీణ ఉపాధి అవకాశాల్ని ప్రభుత్వం మెరుగుపరు స్తోంది. ప్రజల బతుకుల్ని పండుగ చేసే తెలివిడి ప్రభుత్వాలకున్నపుడే ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.... బంగారు బతుకమ్మ ఉయ్యాలో...’ అన్న పాట సార్థకమవుతుంది.
 - దిలీప్ రెడ్డి
 సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్
 ఈమెయిల్: dileepreddy@sakshi.com

మరిన్ని వార్తలు