చంద్రబాబు శీర్షాసనం!

23 Apr, 2017 09:56 IST|Sakshi
చంద్రబాబు శీర్షాసనం!

త్రికాలమ్‌
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నీ తలకిందులుగా ఆలోచిస్తున్నారనడానికి ఈ వారంలో జరిగిన రెండు ఉదంతాలను పరామర్శించాలి. మొదటిది–చిత్తూరు జిల్లాలో జరిగిన ఒక ఉదంతం కాగా, రెండోది సోషల్‌ మీడియా వలంటీర్‌ ఇంటూరి రవికిరణ్‌ అరెస్టు. చిత్తూరు జిల్లాలో మునగాల పాలెం, గోవిందాపురం ఇరుగుపొరుగు గ్రామాలు. ఈ రెండు గ్రామాల మధ్యలో స్వర్ణముఖి నదికి దారి. ఇసుక దోపిడీకి అదే మార్గం. గోవిందాపురం గ్రామానికి చెందిన ధనుంజయనాయుడు, మనగాల పాలెం నివాసి రాధాపతినాయుడు రెండేళ్ళుగా య«థేచ్ఛగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా అరి కట్టడానికి ప్రభుత్వం మండల స్థాయిలో ఆరుగురు సభ్యులతో కమిటీ వేసింది. తహసీల్దారు, సీఐ, ఎండివో, మైనింగ్‌ ఆఫీసర్‌ తదితరులు ఈ కమిటీ సభ్యులు. వీరందరిపైనా కలెక్టర్‌.

ఇసుక రవాణా చేస్తున్న లారీలు గ్రామాలలోకి ప్రవేశించ కుండా ప్రజలు కంచె నిర్మించారు. ఇసుక దొంగలు జేసీబీతో కంచెను తొలగిం చడం, గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేయడం, అధికారులు మిన్నకుండటం రెండేళ్ళుగా సాగుతున్న తంతు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి సన్నిహి తుడైన మనోహర్‌ అండదండలు ధనుంజయనాయుడికి దండిగా ఉన్నాయి. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డితో పరిచయం ఉంది. కమిటీ సభ్యులను సుము ఖులను చేసుకొని వారి నోరు మూయించడం ఇసుక దొంగలకు పెద్ద పని కాదు. మొన్నటి వరకూ జిల్లా కలెక్టర్‌గా పని చేసిన సిద్దార్థజైన్‌ ఒక ఐఏఎస్‌ అధికారిగా, ప్రజాసేవకుడుగా వ్యవహరించకుండా అధికారపార్టీ నాయకుల ప్రతినిధిగా వ్యవ హరించారు. ఈ రెండు గ్రామాల ప్రజలు ఎన్ని సార్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. వీరిలో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినవారే. సాధారణ రైతులు. ఇసుక దందాను నిరోధించేందుకు వారంతా సమష్టిగా ఉద్య మించారు. వారు చేయని ప్రయత్నం లేదు. కలుసుకోని అధికారి లేరు. చేయని విన్నపం లేదు. కానీ అధికారపార్టీ అండ దండలున్న ఇసుక దొంగలు చెలరేగి పోతున్నారు. వందల లారీల ఇసుకను చిత్తూరు, తిరుపతి, చెన్నైలకు రవాణా చేస్తున్నారు.
 
నిరాటంకంగా ఇసుకదోపిడీ
2014లో టీడీపీ అధికారంలో వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక దోపిడీ ఊపందుకుంది. అధికారపార్టీ నాయకులూ, కార్యకర్తలూ విజృంభించారు. ముఖ్య మంత్రి ఆశీర్వదించారు. అడ్డువచ్చిన వనజాక్షి వంటి నిబద్ధత కలిగిన తహసీ ల్దారును మందలించారు. ఆమె జుట్టుపట్టి ఈడ్చిన శాసనసభ్యుడు చింత మనేని ప్రభాకర్‌కు మద్దతు పలికారు. అడ్డగోలుగా సంపాదించడం ఒక్కటే రాజకీ యంగా, పరిపాలనగా చెలామణి అవుతున్న కాలంలో ఇసుకదోపిడీని నిలువ రించడానికీ, తమ గ్రామాలను రక్షించుకోవడానికీ సాధారణ పౌరులే నడుం బిగించారు. నెల రోజుల కిందట  తహసీల్దారు కార్యాలయానికి తాళం వేశారు. కొత్తగా నిర్మించిన కంచెను ఇసుకదొంగలు తిరిగి జేసీబీతో తొలగించడంతో తహ సీల్దారుకు మరోసారి ఫిర్యాదు చేయడానికి నలభై, యాభై మంది కలిసి ఏర్పేడు వెళ్ళారు. తహసీల్దారు లేరని తెలిసి పోలీసు అధికారులను కలుసుకునేందుకు వెళ్ళారు.

రోడ్డు పక్కనే పోలీసు స్టేషన్‌. వారు తమ గోడు సీఐకి వినిపిస్తున్న తరు ణంలో అక్కడికి చిత్తూరు అర్బన్‌ ఎస్‌పీ జయలక్ష్మి వెళ్ళారు. రైతులను దాటుకొని హుటాహుటిన స్టేషన్‌లోకి వెళ్ళారు. గంట తర్వాత బయటికి వచ్చి రైతులు చెప్పింది అయిదు నిమిషాలు ఆలకించి ఇసుక తన పరిధిలోకి రాదనీ, ఇది మైనింగ్, రెవెన్యూ శాఖలకు చెందిన వ్యవహారమనీ, అయినా సరే కనుక్కుంటా ననీ చెప్పి వెళ్ళిపోయారు. ఆమె వెళ్ళిన తర్వాత మీడియా ప్రతినిధులతో రైతులు మాట్లాడు తున్న సమయంలో అదుపు తప్పిన  పన్నెండు టైర్ల లారీ రూపంలో భయంకరమైన మృత్యువు వారి మీదికి దూసుకువచ్చింది. అక్కడే ఉన్న రెండు ఆటోలను ఢీకొన్న తర్వాత విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్నది. ఆటోలు ధ్వంసమై పెట్రోలు కారింది. రాపిడికి నిప్పులు లేచి మంటలు వ్యాపించాయి. విద్యుత్‌ స్తంభం విరిగి కరెంటు షాక్‌ తగిలింది. టైర్ల కింద పడి, మంటలలో కాలి, విద్యు దాఘాతం తగిలి మొత్తం 15 మంది అక్కడికక్కడే నిమిషాలలో చనిపోయారు. 24 మంది గాయపడ్డారు. తిరుపతిలోని స్విమ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మొత్తం విషాదంలో మృతి చెందిన రైతుల తప్పేమిటి? వారి చావుకు కారకులు ఎవరు? ప్రభుత్వం ప్రజల పక్షాన ఉన్నదా, ఇసుక దోపిడీ దారుల పక్షాన ఉన్నదా?

తప్ప తాగి మృత్యుశకటాన్ని రైతుల మీదికి దూకించిన డ్రైవర్‌ గురవయ్యను శుక్రవారమే అరెస్టు చేశారు. లారీ యజమాని నెల్లూరుకు చెందిన రమేష్‌ను శని వారంనాడు అదుపులోకి తీసుకున్నారు. ఇసుకదొంగలు క్షేమం. వారికి అక్రమంగా తోడ్పడిన అధికారులూ, వారికి అండగా నిలిచిన అధికార పార్టీ ప్రముఖులూ, కలెక్టర్‌ సిద్దార్థ జైన్‌ సుఖంగా ఉన్నారు. నలభై కుటుంబాలలో విషాదం నింపిన ఈ ఉదంతం ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న అరాచక వ్యవస్థకి సంకేతం. అక్కడ పాలకుల వైఖరికీ, పై నుంచి కింది వరకూ అంతా అక్రమ సంపాదనలో, నేరస్థులకు కొమ్ముకాయడంలో తలమునకలైన దౌర్భాగ్యస్థితికీ నిదర్శనం. శనివారంనాడు ముగ్గురు మంత్రులతో కలిసి ఏర్పేడు వెళ్ళిన ఐటీ మంత్రి నారా లోకేశ్‌ అసలు ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక మాఫీయా లేనేలేదంటూ బుకాయించారు. కొత్త కలెక్టర్‌గా చేరిన ప్రద్యుమ్నకు మొదటి రోజే చేదు అనుభవం. ఆయన బాధ్యతలు స్వీకరించిన అరగంట వ్యవధిలోనే పెనువిషాదం సంభవించింది. కిరణ్‌కుమార్‌ రెడ్డి ముఖ్య మంత్రిగా ఉండగా జాయింట్‌ కలెక్టర్‌ హోదాలో రాజ కీయ ఒత్తిళ్ళకు లొంగకుండా చట్టబద్ధంగా, నియమబద్ధంగా వ్యవహరించి మంచి అధికారిగా పేరు తెచ్చుకున్న ప్రద్యుమ్న ఇసుకదోపిడీని అరికట్టగలరో లేదో చూడాలి. అటువంటి ప్రయత్నం చేస్తే అధికారపార్టీ ఆగ్రహానికి గురి కాకుండా, స్థానభ్రంశం లేకుండా తప్పించు కోగలరా అన్నది ప్రశ్న.

రవాణాశాఖ కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యంపై విజయవాడ లోక్‌సభ సభ్యుడు నానీ, శాసనసభ్యుడు బోండా ఉమ, ఎంఎల్‌సీ బుద్ధా వెంకన్న, మేయర్‌ కోనేరు శ్రీధర్, పోలీసు హౌసింగ్‌ బోర్డు చైర్మన్‌ నాగూర్‌ మీరాలు దౌర్జన్యం చేసి నట్టు సాక్షి పత్రికలో వచ్చిన వార్తను ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌)గా పరి గణించాలని ఉమ్మడి హైకోర్టు నిర్ణయించడం చట్టపాలన కోరుకునేవారికి ఊరట. శేషాచలం అడవులలో కూలీలపైన కాల్పులు, గోదావరి పుష్కరాలలో ముఖ్య మంత్రి సమ క్షంలోనే తొక్కిసలాట జరిగి 29 మంది మృతి, ఇప్పుడు ఈ ఘోరం. దర్యాప్తు సాగదు. దోషనిర్ధారణ జరగదు. ఇవి ప్రాణనష్టానికి సంబంధించిన ఘటనలు. అవినీతి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

సోషల్‌మీడియా ప్రతాపం
విధియుక్త ధర్మం నిర్వహించడంలో ఘోరంగా విఫలం అవుతున్న ప్రభుత్వం వ్యక్తిగత ఎజెండాకోసం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయడంలో మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. ఇందుకు తాజా నిదర్శనం సోషల్‌ మీడియా వలం టీర్, పొలిటికల్‌ పంచ్‌ వెబ్‌సైట్‌ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్‌ను పోలీసులు శుక్రవారం తెల్లవారుజామునే అరెస్టు చేసి కృష్ణాజిల్లా తీసుకొని వెళ్ళి రోజంతా తిప్పి మర్నాడు తెలవారుతుండగా శంషాబాద్‌లో ఇంటి దగ్గర దింపి వేసిన ఉదంతం. కోర్టులో హాజరుపరచకుండా రోజంతా కారులో తిప్పడమే కాకుండా శనివారం ఉదయం వైఎస్‌ఆర్‌సీపీ సోషల్‌మీడియా కార్యాలయానికి పోలీసులు వెళ్ళడం అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ. సామాజిక మాధ్య మంలో వస్తున్న వ్యంగ్యాస్త్రాలను తట్టుకోలేక అసహనానికి గురి అవుతున్న  చంద్రబాబు, లోకేశ్‌ పోలీసులను ప్రయోగించడం వల్ల జాతీయ స్థాయిలో అపకీర్తి మూటగట్టు కున్నారు.

చంద్రబాబు రాజకీయ శైలి 1995లో ఏ విధంగా ఉన్నదో ఇప్పుడూ అదే విధంగా ఉన్నది. కానీ మీడియా చాలా మారిపోయింది. సోషల్‌ మీడియా విశ్వరూపం ప్రదర్శిస్తున్న కాలంలో అన్ని పత్రికల, న్యూస్‌ చానళ్ళ నోళ్ళు మూయించినా సోషల్‌ మీడియా కోడై కూస్తుంది. నోమ్‌ చోమ్‌స్కీ చెప్పినట్టు సమ్మతి, అసమ్మతి సృష్టిలో ప్రావీణ్యం సంపాదించి తమకు ఇష్టమైన ప్రభుత్వాన్ని గుడ్డిగా సమర్థించడం, ఇష్టంలేని ప్రభుత్వాన్ని అంతే గుడ్డిగా వ్యతిరేకించడంలో ఆరితేరిన పత్రికలూ, చానళ్ళ శక్తిని సవాలు చేస్తున్నది సోషల్‌ మీడియా. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ముఖ్యమంత్రిగా ఎవరున్నా సోషల్‌ మీడియాలో విమర్శలకు తావు ఇవ్వకుండా నడుచుకోవలసిందే.  ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడంలో సోషల్‌ మీడియా శక్తి క్రమంగా పెరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ కేసు వేయడానికి ప్రాతి పదికగా చూపుతున్న కార్టూన్‌ని సమర్థించేవారు ఉంటారు. తప్పుపట్టేవారూ ఉంటారు. ఎవరు ఎటువైపు ఉన్నారనేదానిపైన తప్పా, ఒప్పా అన్నది ఆధారపడి ఉంటుంది. అపరిపక్వమైన లోకేశ్‌ మానసిక స్థితికి అద్దం పట్టడమే తన ఉద్దేశమని రవికిరణ్‌ వివరించినప్పటికీ ఆ కార్టూన్‌ను మరో విధంగా అన్వయించే అవకాశం ఉంది. వ్యంగ్యాస్త్రాలు సంధించే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వేళ రవికిరణ్‌ చేసింది తప్పు అని శాసనసభ కార్యదర్శికి అనిపించినా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసి శాసనమండలి ఔన్నత్యానికి భంగం కలిగించారు.

అసెంబ్లీ కార్యదర్శి తనకు అభ్యంతరంగా కనిపించిన కార్టూన్‌ను శాసనమండలి అధ్యక్షుడి దృష్టికి తీసుకువెళ్ళవలసింది. అసెంబ్లీ కార్యదర్శి కేవలం ఒక ఉద్యోగి. శాసనసభ్యులకూ, శాసనమండలి సభ్యులకూ ఉండే రాజ్యాంగపరమైన హక్కులూ, అధికారాలూ ఉద్యోగికి ఉండవు. కార్టూన్‌పైన చర్చ జరిపించి కార్టూన్‌ గీయడం తప్పనిపిస్తే రవికిరణ్‌ని మందలించే అధికారం, అభిశంసించే హక్కు శాసనమండలికి ఉంది. అవసరమైతే సభాహక్కుల సంఘాన్ని శాసన మండలి అధ్యక్షుడు నియమించవచ్చు. విచారణ జరిపించవచ్చు.

తాము చేస్తే ఒప్పు, ఇతరులు చేస్తే తప్పు
ఈ కార్టూన్‌కే ఇంతగా విలవిలలాడిపోయి పోలీసులను ప్రయోగిస్తే ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి మీదా, ఆయన కుటుంబ సభ్యులమీదా సోషల్‌ మీడియాలోనూ, తెలుగుదేశం పార్టీ అధికార వెబ్‌సైట్‌లోనూ, చట్టసభలలోనూ చేస్తున్న వికృతమైన విమర్శలకూ, అర్ధం లేని అభియోగాలకూ ఏ రకమైన శిక్ష ఎవరు విధించాలి? సోషల్‌ మీడియా ద్వారానే 2014 ఎన్నికల సమయంలో  దుష్ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు అదే సోషల్‌ మీడియా ఇప్పుడు తమపైన విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే తట్టుకోలేక అప్రకటిత ఎమర్జెన్సీని తల పింపజేస్తున్నారు.

తమ చేతిలో ఉన్న ప్రసార, ప్రచార సాధనాల ద్వారా పని గట్టుకొని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నవారే సోషల్‌ మీడియా మీద నిప్పులు చెరుగుతున్నారు. తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ పాలకులపైన సోషల్‌ మీడియా కొరడా ఝళిపిస్తున్నది. ఇది ప్రత్యామ్నాయ మీడియా. ప్రధానస్రవంతిగా చలామణి అవుతున్న పత్రికలూ, న్యూస్‌ చానళ్ళూ వాస్తవాలను దాచినా దాగవు. వాటిని అదుపు చేయవచ్చునేమో కానీ సోషల్‌ మీడియాను అదుపు చేయడం సాధ్యం కాదు. అధికారంలో ఉన్నవారు పోలీసులను ప్రయోగిస్తారు. బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనపైన వచ్చిన వ్యంగ్య చిత్రాన్ని మరొకరికి పంపించిన నేరానికి జాధవ్‌పూర్‌ యూని వర్శిటీ ప్రొఫెసర్‌ అభికేశ్‌ మహాపాత్రను అరెస్టు చేయించారు. పదకొండో తరగతి విద్యార్థి తనపైన విమర్శనాత్మకమైన వ్యాఖ్యను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడనే ఆగ్రహంతో అప్పటి  ఉత్తరప్రదేశ్‌ మంత్రి ఆజంఖాన్‌ రాంపూర్‌కు చెందిన యువకుడిని అరెస్టు చేయించారు.

బాల్‌ఠాక్రే మరణించినప్పుడు బంద్‌ నిర్వహించడాన్ని విమర్శిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసినందుకు ఇద్దరు యువతులను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. శ్రేయాసింఘాల్‌ వర్సెస్‌ కేంద్ర ప్రభుత్వం కేసులో ఐటీ యాక్ట్‌ సెక్షన్‌ 66ఎ కింద అరెస్టులు చేయడం తప్పని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ చలమేశ్వర్, ఆర్‌ఎఫ్‌ నారిమన్‌ చారిత్రక తీర్పు ఇస్తూ ఈ సెక్షన్‌ రాజ్యాంగ విరుద్ధమనీ, చెల్ల నేరదనీ స్పష్టం చేశారు. పార్లమెంటును ఎద్దేవా చేస్తూ కార్టూన్‌ గీసినందుకు దేశద్రోహం నేరారోపణ చేసి అసీమ్‌ త్రివేదీని 2012లో అరెస్టు చేసింది కూడా ఈ సెక్షన్‌ కిందే.  భావప్రకటనా స్వేచ్ఛకు రాజ్యాంగం ఎంతటి ప్రాధాన్యం ఇచ్చిందో, 19(2) అధికరణను ఎంత పకడ్బందీగా రూపొందించారో తెలియజెప్పడానికి ఈ తీర్పును ఉదహరించవచ్చు. భావప్రకటనాస్వేచ్ఛ వినియోగంలో పొరపాట్లు జరగ వచ్చు. వాటిని సవరించే విధానం ఉన్నది. అంతే కానీ, అధికారం చేతిలో ఉన్నది కదా అని పోలీసులను వినియోగించడం, అరెస్టులు చేయించడం, వ్యక్తులను భయ భ్రాంతులను చేయడం రాజ్యాంగవిరుద్ధం.కె.రామచంద్రమూర్తి

Read latest Vedika News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా