కౌలు రైతులను గుర్తించరా?

14 Jul, 2017 01:20 IST|Sakshi
కౌలు రైతులను గుర్తించరా?

సందర్భం
ఈ రోజు వ్యవసాయం నడుస్తున్నదంటే అది కౌలు రైతుల పుణ్యమే. కానీ వీరికి ఎలాంటి సాయం అందడం లేదు. వచ్చే సంవత్సరం ఇచ్చే ఎకరాకు రూ. 4,000 సాయం మాత్రం కౌలు రైతులకు అందేటట్లు చూడటం మన బాధ్యత.

తెలంగాణలో ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ రైతుల మధ్య ఒకటే చర్చ. ఎవరు నిజమైన రైతు? పట్టాదారు పాస్‌బుక్‌ కలిగి వ్యవసాయం చేయనివారా? భూమి కౌలుకు తీసుకుని కష్ట, నష్టాలకు ఓర్చుకుని వ్యవసాయం చేసేవారా? సాధారణంగా భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసే వ్యక్తినే నిజమైన రైతుగా గుర్తిస్తారు. కానీ ముఖ్యమంత్రి ప్రకటన, అధికారులు వ్యవహరిస్తున్న తీరు కౌలు రైతులను రైతులుగా గుర్తించే అవకాశం ఇవ్వడం లేదు. ‘ఎవరికి భూమి ఉంటే వారే రైతు. వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఎకరాకు రూ.4,000 వేస్తాం. రెండు పంటలు వేస్తే రూ. 8,000 వేస్తాం’ ఉచిత ఎరువుల పథకాన్ని ప్రకటిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటన ఇది. ఈ ప్రకటన కౌలు రైతుల గుండెల్లో గుబులు రేపుతోంది. రుణమాఫీ ప్రయోజనాన్ని భూమి యజమానులకే కట్టబెట్టారని, ఇప్పుడు సబ్సిడీ ఎరువులకు ఇచ్చే ప్రోత్సాహకాన్నీ వారి ఖాతాల్లోనే వేస్తున్నారని, నిజంగా భూమిని సాగు చేసి, అప్పుల పాలవుతున్న, అన్ని కష్టాలనూ ఎదుర్కొంటున్న కౌలు రైతులకు అన్యాయం జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్న రైతులకే అమలైంది. రూ.23,000   కోట్ల రుణ మాఫీ అయితే, కౌలు రైతులకు వర్తించింది కేవలం రూ. 23 కోట్లు. తెలంగాణలో ఈ మూడేళ్ల కాలంలో 3 వేలమందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో అత్యధికులు భూమి లేని కౌలు రైతులు. కొందరు కొంత భూమి ఉండి మరింత భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసే కౌలు రైతులు. వీరి కుటుంబాలకు నష్ట పరిహారం కూడా లేదు.

కౌలు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కొన్ని: భూక్యా మరోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన గిరిజన మహిళా కౌలు రైతు. కౌలు రైతు గుర్తింపు కార్డు గురించి తుర్కపల్లి తహసీల్దార్‌ కార్యాలయానికి నాలుగుసార్లు తిరిగింది, గుర్తింపు కార్డు రాలేదు, రెవెన్యూ అధికారులు చెప్పిన సమాధానం భూయజమాని అంగీకారం తెలపలేదని! మరోని ఆ కార్డుపై పెద్దగా ఆశించింది ఏమీలేదు, వడగండ్ల వాన పడి పంటనష్టం జరిగింది కాబట్టి తనపేరు నమోదు చేసుకోమంటే కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే నీ పేరు నమోదు చేసుకుంటామన్నారు వ్యవసాయ అధికారులు. అదే మండలం ఇబ్రహీంపురం గ్రామానికి చెందిన నర్సిరెడ్డి తనకు కౌలు రైతు గుర్తింపు కార్డు, ఆ కార్డు మీద పంట పెట్టుబడి కోసం కొంత బ్యాంకు రుణం ఇప్పించమని అప్పటి ఉమ్మడి నల్లగొండ జిల్లా కలెక్టర్‌ కాళ్లపై పడ్డాడు. ఆ హఠాత్‌ పరిణామానికి చలించిన కలెక్టర్‌ జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ను పిలిచి నర్సిరెడ్డికి రుణం మంజూ రు చేయవలసిందిగా ఆదేశించారు. అయినా బ్యాంకు అధికారులు నిరాకరించారు. కారణం అప్పటికే భూ యజ మాని పంట రుణం తీసుకున్నాడు. 2015 కరువు నష్ట పరి హారం రాష్ట్రంలో ఒక్క కౌలు రైతుకు కూడా రాలేదు.

ఈ సందర్బంగా కౌలు రైతుల రక్షణ కోసం 2011లో వచ్చిన భూ అధీకృత సాగుదారుల చట్టం అమలు తీరు గురించి ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఆ చట్టం ప్రకా రం ప్రభుత్వం నుంచి∙వ్యవసాయ పరమైన ఏ సంక్షేమ పథకాలు వచ్చినా కౌలు రైతులకు దక్కాలి. ఈ పథకాలు వర్తించటానికి కౌలు రైతుకు గుర్తింపు కార్డు ఉండాలి. ఆ కార్డులు ఇచ్చే ప్రక్రియ దారుణంగా ఉంది. తెలంగాణలో 10 లక్షలకు పైగా కౌలు రైతులు ఉంటే గత సంవత్సరం 10 వేల మందికి కూడా అందలేదు. రెవెన్యూ శాఖ దీనిని ఎన్నడూ సమీక్షించిన దాఖలాలు లేవు. ఈ మూడు సంవత్సరాలలో ఆ శాఖ మంత్రి మహమ్మద్‌ అలీ గారు కౌలు రైతుల సమస్య గురించి ఒక్క మాటైనా మాట్లాడలేదు.ఈ విషయం గురించి చర్చించటానికి రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యాలయం ఇఇఔఅ (భూ పరిపాలన ప్రధాన అధికారి కార్యాలయం)కు వెళితే ఆ పోస్ట్‌ ఎప్పుడూ ఖాళీగానే కనిపిస్తుంది.

భూ అధీకృత సాగుదారుల చట్టం గురించి ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఆ అంశం మీద చిన్న కదలిక కూడా లేదు. పైగా కౌలు రైతులను మోసగించే ప్రక్రియకు వ్యవసాయ అధికారులు శ్రీకారం చుట్టారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చే సంవత్సరం నుంచి రైతులకు ఎకరాకు పంటకు రూ.4,000 సాయం అందిస్తామన్నది. దాని కోసం అన్ని జిల్లా కేంద్రాలలో వ్యవసాయ అధికారులు రైతు సమగ్ర సర్వే అని ఒక ప్రశ్నపత్రం రూపొందించారు. ఈ సర్వే ఆధారంగానే వచ్చే సంవత్సరం ఎకరాకు పంటకు ప్రకటించిన ఆ సాయం అందిస్తారని అంటున్నారు. కానీ వ్యవసాయ అధికారులు రూపొందించిన ఈ సర్వే పత్రంలో రైతుకు సంబంధించి 25 రకాల వివరాలు ఉన్నాయి. కౌలు రైతుకు సంబంధించిన ఒక్క విషయం కూడా లేదు. ఈ విషయం గురించి రైతు స్వరాజ్య వేదిక వ్యవసాయ కమిషనర్‌ను కలిసినా ఇంతవరకు ఎలాంటి ఫలితం కనిపించలేదు. సర్వే అధికారులకు కూడా ఈ మేరకు ఎలాంటి ఆదేశాలు అందలేదు. జూన్‌ 10వ తేదీతో సర్వే ముగుస్తుంది. ఇంకెప్పుడు కౌలు రైతుల పేర్లు నమోదు చేస్తారు? కౌలు రైతుల సమస్యల మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? ఈ రోజు వ్యవసాయం నడుస్తున్నదంటే అది కౌలు రైతుల పుణ్యమే. కానీ వీరికి ఎలాంటి సాయం అందడం లేదు. వచ్చే సంవత్సరం ఇచ్చే ఎకరాకు రూ. 4,000 సాయం మాత్రం వాస్తవంగా వ్యవసాయం చేస్తున్న రైతులకు అందేటట్లు చూడటం మన బాధ్యత.


- బి. కొండల్‌ రెడ్డి

వ్యాసకర్త రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధి
మొబైల్‌ : 99488 97734

మరిన్ని వార్తలు