ఫిరాయింపులను సమర్థించం!

12 Apr, 2017 01:45 IST|Sakshi
ఫిరాయింపులను సమర్థించం!

కొమ్మినేని శ్రీనివాసరావుతో ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ, బీజేపీ సీనియర్‌ నేత సోము వీర్రాజు మనసులో మాట

దేశంలో కానీ, ప్రపంచంలో కానీ రాజధాని నిర్మాణం అంశానికి పెద్దగా ప్రాధాన్యత లేదని, రాజధాని నిర్మాణం చాలా సింపుల్‌గానూ, సహజక్రమంలో సాగవలసిన పరిణామం అని ఏపీ బీజేపీ సీనియర్‌ నేత, ఏపీ శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు చెబుతున్నారు. రాజధాని కాని, రాష్ట్ర అబివృద్ధి కానీ చర్చల మీద చర్చలతో కాకుండా ప్రజల కోణంలో జరగాల్సిన ప్రక్రియ అని, దీనిపై ప్రజలకు అంతిమంగా ఒక అంచనా తప్పకుండా ఉంటుందంటున్నారు. పాలకులుగా మనం చెబుతున్న అభివృద్ధి గురించి అంతిమంగా నిర్ణయించాల్సింది ప్రజలే అన్నారు. ఫిరాయింపుదార్లకు పదవులు కట్టెబెట్టడాన్ని ప్రజలు సహించరని, వారు అన్నీ గమనిస్తూనే ఉంటారని అంటున్న సోము వీర్రాజు అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.

చంద్రబాబు వద్దంటేనే ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నిక ఆగిపోయిందంటున్నారు..?
అది అవాస్తవం. మా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఎత్తుగడలు, రాజకీయ పోకడలు గమనించినప్పుడు ఎవరో దీన్ని నిలుపుదల చేశారన్నది అవాస్తవం. కొన్ని సందర్భాల్లో రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా ఎలా వ్యవహరించాలో అలా ముందుకు వెళుతుంటాం. అంతేకానీ ఒకరి ప్రభావానికి గురై బీజేపీలో ఏదీ జరగదు.

బాబు ప్రభుత్వం లోపాలను వెంకయ్య ఒక్కసారన్నా విమర్శించారా?
వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. నేను ఇక్కడ ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను. ఇక్కడ ప్రజలకు సంబంధించిన అనేక విషయాలు మేం మాట్లాడాలి. వారు అక్కడి నుంచి అనేక నిధులు తీసుకువచ్చి ఏపీ అభివృద్ధికోసం ప్రయత్నం చేస్తుటారు. ఇక్కడ ఏం చేయాలో సూచిస్తూ వెంకయ్య ముందుకెళుతున్నారు.

ఏపీలో ప్రభుత్వానికి మీరు ఎన్ని మార్కులు వేస్తారు?
రాష్ట్ర ప్రభుత్వానికి నేను మార్కులు వేయను. మిత్రపక్షంలో ఉన్నాం. ఈ రాష్ట్రానికి మేము ఏం నిధులు తీసుకొచ్చాం, ఈ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేస్తున్నాం అనే విషయాలను మేము స్పష్టంగా చెబుతాం. ఏపీ అభివృద్ధి విషయంలో ప్రధాని నరేంద్రమోదీ, వెంకయ్య నాయుడులకు నూటికి నూరుమార్కులూ వేస్తాను.

చంద్రబాబు పాలన తీరు ఎలా ఉందనుకుంటున్నారు?
మిత్రపక్షంగా ఉన్నాం. అయినా సరే ఇసుక అమ్మకాల విషయంలో ఇది బాగా లేదు అని ఏపీ ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పాం. ప్రభుత్వంతోనే ఉంటాం. జిల్లాల పెంపుదల వంటి అంశాలపై ప్రభుత్వానికి మా సలహాలను ఇస్తూనే ఉంటాం.

పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని భారీగా పెంచారు కదా?
కుడి ఎడమ కాలువల విస్తరణ పనులకు వ్యయం అంచనాను బాబు ప్రభుత్వం పెంచింది. కానీ  కేంద్రమంత్రి పోలవరం అంచనా వ్యయం 16 వేల కోట్టేనని ఇప్పుడు కూడా చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ అంచనాలు వేసి ఇచ్చినప్పటికీ దాన్ని అంతి మంగా అంచనా వేసే పూర్తి యంత్రాగం కేంద్రంలో వాటర్‌ కమిషన్‌ రూపంలో ఉంది.

రాజధానికి అన్ని వేల ఎకరాలు తీసుకోవటంపై మీ అభిప్రాయం?
భారతదేశంలో కానీ ప్రపంచంలో కాని రాజధాని అనే అంశానికి పెద్దగా ప్రాధాన్యత లేదు. ఎన్ని ఎకరాలు అనే అంశంలోకి నేను వెళ్లను. రాష్ట్రాలు విడిపోయింతర్వాత ఉదాహరణకు ఇప్పుడు నయా రాయపూర్‌ ఉంది. రాజధానికి 5 వేల ఎకరాలు తీసుకున్నారు. దాంట్లో హౌసింగ్‌ బోర్డు నిర్మాణం చేసింది. కాంగ్రెస్‌ పార్టీ చాలా కాలం క్రితం గుజరాత్‌లో గాంధీ నగర్‌ వద్ద అన్ని కాంప్లెక్స్‌లను ఒకే చోట ఉండేలా నిర్మించింది. చత్తీస్‌గఢ్, జార్కండ్, హిమాచల్‌ ప్రదేశ్‌ ఇలా రాష్ట్రాలు విడిపోయాయి. వీటికి రాజధాని నిర్మించుకోవడం ఒక సహజ ప్రక్రియ. దానికోసం అక్కడెక్కడా పెద్దగా చర్చల్లేవు.

రాజధానిని రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌గా మార్చారంటున్నారు. మీరు ఏకీభవిస్తారా?
రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిమీద కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. నేను కొన్ని ప్రాంతాల్లో జరిగిన రాజధాని నిర్మాణం గురించి చెబుతున్నాను. రాజధాని అనేది సహజంగా జరిగిపోవాలి.

ఏపీ రాజధాని విషయంలో చేస్తున్నది సరైనది కాదనే మీ అభిప్రాయమా?
నా ఉద్దేశం అది కాదు. నా అభిప్రాయం చెప్పాను. రాజధానికి 35 వేలు, 50 వేల ఎకరాలు కావాలని బాబు అభిప్రాయపడుతున్నారు. కానీ దేశంలో కొత్త రాజధానుల నిర్మాణం వెనుక నేపథ్యాన్ని నేను చెప్పదలిచాను. రాజధాని నిర్మాణం చాలా సింపుల్‌గానూ, సహజక్రమంలో సాగవలసిన పరిణామం అన్నదే నా ఉద్దేశం.

చంద్రబాబు 600 వాగ్దానాలు చేశారు. ఉద్యోగాలు అన్నారు కానీ లోకేశ్‌కి ఉద్యోగం ఇచ్చారు. మీరేం ప్రశ్నించరా?
దేశంలో చాలామంది కుమారులకు పదవులిచ్చారు. మా పార్టీలో కూడా అది జరుగుతోంది. అయితే ఈ ‘సన్‌ స్ట్రోక్‌’ గురించి ప్రజలు తీవ్రంగానే ఆలోచిస్తున్నారు. ప్రజలు గుర్తిస్తారు కూడా.

ఏపీలో ఫిరాయింపులపై మీ అభిప్రాయం?
ఈ విషయంపై వెంకయ్య నాయుడు ఇప్పటికే చాలా స్పష్టంగాచెప్పారు. మావరకు వస్తే ఒక్క ఓటు తేడాతో వాజ్‌పేయి ప్రభుత్వాన్నే వదులుకున్నాం కానీ ఫిరాయింపుల జోలికి వెళ్లలేదు. ఎవరైనా ఇలా పార్టీలు మారితే ముందుగా వారి నుంచి రాజీనామాలు తీసుకుని తర్వాతే వారిని చేర్చుకుంటాం అని కర్ణాటకలో మా వాళ్లు చెప్పేశారు. ఇదే స్ఫూర్తితో పురంధేశ్వరి ఢిల్లీకి ఉత్తరం రాశారు.

ఫిరాయింపుదార్లకు పదవులివ్వడం చంద్రబాబుకు డ్యామేజి కాదా?
ఆయనకు డ్యామేజి మాట ఏమో కానీ బీజేపీకి నష్టం జరగకుండా చూసుకోవాలన్నదే మా ప్రాధాన్యత.

టీడీపీ, బీజేపీ మధ్య 2019లో కూడా పొత్తు కొనసాగుతుందా?
దేనికైనా ఆనాడు ఉన్న పరిస్థితిని బట్టే ముందుకెళతాం.

పవన్‌ కల్యాణ్‌ను మీరే బీజేపీవైపుకు తెచ్చారని అంటారు. కానీ ఆయన చంద్రబాబును వదిలిపెట్టి బీజేపీపైన, వెంకయ్యనాయుడితో సహా నేతలందరిపైనా ఇప్పుడు విరుచుకుపడుతున్నారు?
దేశవ్యాప్తంగా బలోపేతమైన పార్టీగా మేం అలా ఆవేశపూరితంగా మాట్లాడలేం. ఎన్నికల నాటికే ఇవన్నీ ఒక కొలిక్కి వస్తాయని నా అభిప్రాయం. ఇప్పుడు కాస్త దూరంగా ఉన్నంతమాత్రాన రేపు కలవలేరని చెప్పలేం కదా. రాజకీయాల్లో దూరాలూ, దగ్గరతనాలూ ఉండవు. విధానాలూ, సిద్ధాంతాలూ బట్టే పొత్తులూ, విడిపోవడాలూ ఉంటాయి.

కాపుల రిజర్వేషన్‌పై, ముద్రగడ ఉద్యమంపై మీ అభిప్రాయం?
కాపుల రిజర్వేషన్‌పై టీడీపీ ఎన్నికల మ్యానిపెస్టోలో వాగ్దానం చేసింది కాబట్టి దాన్ని అమలు చేయాలనే బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. ముద్రగడ కూడా దాన్నే కోరుతున్నారు. చంద్రబాబు దీనిపై కమిషన్‌ వేసారు కదా. అదేదో త్వరగా పూర్తి చేయాలనే మేం చెబుతున్నాం

కాపు రిజర్వేషన్‌ కోసం ఉద్యమిస్తే తన కుటుంబాన్ని ఘోరంగా అవమానించారని ముద్రగడ అంటున్నారు. మీ వైఖరి ఏంటి?
కాపులు అనే సెక్షన్‌ని ప్రభుత్వం సరిగా అర్థం చేసుకోవాలి. నేను వ్యక్తులను గురించి చెప్పడం లేదు. వాళ్ల ఆలోచనను, శక్తిని, ఆవేదనను కూడా ప్రభుత్వం సరిగా అర్థం చేసుకోవాలి. కాపుల సమస్యను పరిష్కరించే లక్ష్యం చంద్రబాబు ప్రభుత్వానికి ఉండాలని నేను కోరుకుంటున్నాను.

ఒక్క ఓటు తేడాతో వాజ్‌పేయి ప్రభుత్వాన్నే వదులుకున్నాం కానీ ఫిరాయింపుల జోలికి వెళ్లలేదు. ఆనాడూ ఈనాడూ ఫిరాయింపులపై మా వైఖరి మారలేదు. ఎవరైనా ఇలా పార్టీలు మారితే ముందుగా వారి నుంచి రాజీనామాలు తీసుకుని తర్వాతే వారిని చేర్చుకుంటాం అని కర్ణాటకలో మా పార్టీ వాళ్లు చెప్పి పాటిస్తున్నారు. ఇదే స్ఫూర్తితో పురంధేశ్వరి ఢిల్లీకి ఉత్తరం రాశారు. ఫిరాయింపులను ప్రజలు సహించరని మాత్రం అందరూ గుర్తుంచుకోవాలి.


(సోము వీర్రాజుతో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)
https://goo.gl/Dny4Zc


https://goo.gl/doY7jp

 

మరిన్ని వార్తలు