పరమ శాంతి

21 Apr, 2016 01:49 IST|Sakshi
పరమ శాంతి

జ్యోతిర్మయం
 
ఈ సృష్టిలో ప్రతిమనిషి శాంతిని పొందేందుకు భౌతికంగా లేక ఆధ్యాత్మికంగా ప్రయత్నిస్తుంటాడు. భౌతికంగా పొందేందుకు వినోదం, విహారం వంటి మార్గాలను ఆశ్రయించేవారు. అల్పకాలికంగా శాం తిని పొందొచ్చేమో కానీ, ఆ తరువాత మళ్ళీ అదే నిరాశ, దుఃఖం కల్గుతుంది. ఇంకొక వైపు భౌతిక సాధనాలతో శాంతి లభించట్లేదని పరమాత్మ చింతన చేస్తున్నప్పటికీ భక్తిలో కూడా మనస్సు ఏకాగ్రత, స్థిరమైన శాంతి అనుభవం కావు. కారణం పరమాత్మ చింతనకు మాల, మంత్రం, మూర్తి వంటి స్థూల ఆధారాలు తీసుకొంటున్నాం. ఓం నమః శివాయః అంటూ మంత్రం జపిస్తూ మాల తిప్పుతూ, ప్రదక్షిణలు చేస్తున్నా మనస్సు ‘ధ్యాస’ లెక్క మీద ఉందే కానీ, ఈశ్వరునితో లేదు. శాంతి అనేది ఇటువంటి బాహ్య సాధన’లతో లభించేది కాదు. మనస్సు సూక్ష్మమైనది. కాబట్టి మనస్సును పరమాత్మపై ఏకాగ్రం చేసేందుకు సూక్ష్మమైన సాధన కావాలి.

మనస్సు ఒక అభౌతిక శక్తి. అది ప్రతి ఒక్కరి భృకుటి మధ్యలో కేంద్రీకృతమై ఉన్న చైతన్య శక్తి ఆత్మలో అంతర్భాగమే కానీ పాంచభౌతిక దేహంలో భాగం కాదు. సంకల్ప శక్తినే మనస్సు అంటారు. నిర్మాణం, విధ్వంసం అన్నింటికీ మూలం- సంకల్పం, చిత్తం. అన్ని సమస్యలకు కారణం,  నివారణ కూడా మనస్సే. ఇటువంటి అపూర్వమైన సంకల్ప శక్తిని ఆత్మ జ్ఞానం, పరమాత్మ చింతన ద్వారా సరియైన మార్గంలో పెట్టి సాధన చేసినప్పుడు మనస్సులో పాజిటివ్ శక్తి ఉత్పన్నమై మనోబలం పెరిగి నెగటివ్ ఆలోచనలు, భావోద్వేగాలపై అదుపు లభిస్తుంది.

ఆంతరంగికంగా మనస్సు’ చింతనను పరివర్తన చేసుకోకుండా.. సంకల్పాలను అణచటంలేక శూన్యం చేసుకోవటం వల్ల, బలవంతంగా బాహ్యంగా విషయా లను నిగ్రహించుకున్నప్పటికీ ఇంద్రియ విషయాల పట్ల ఆసక్తిని వీడనంత వరకు మనస్సు కళ్లెం లేని గుర్రం లాగా పరిగెడుతూనే ఉంటుంది. ప్రాపంచిక విషయాల చింతన వల్ల ఆసక్తి, ఆసక్తి వల్ల వాటిని పొం దాలన్న కోరిక, కోరిక తీరనప్పుడు క్రోధం, క్రోధం వల్ల వ్యామోహం, వ్యామోహం వల్ల ఈశ్వర స్మృతి ఛిన్నాభిన్నమై, సద్బుద్ధి నశించి మనోదౌర్బల్యం ఆవ రించి మనిషి తన స్థితి నుంచే పతనమై అశాంతి పాలవుతాడు.
 
కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞాన చింతన అనే కళ్లెంతో మనస్సును వశంలో ఉంచుకొన్న మానవుడే పరమ పిత పరమాత్మ, శాంతి దాత అయిన జ్యోతిర్బిందు స్వరూప శివ పరమాత్మతో మనస్సు సంబంధాన్నిజోడించగల్గి, రాగ ద్వేష రహితుడై పరమ శాంతిని పొందగల్గుతాడు. శాంతి కావాల్సింది మనస్సుకే కానీ తనువుకు కాదు. అందుకే తనువు చాలించిన తర్వాత కూడా ఆత్మ శాంతి కోసం భగవంతుడిని ప్రార్థిస్తారు. శాంతి అనేది భౌతిక సంపదలతో లభించేది కాదు, ఆధ్యాత్మిక జ్ఞాన సంపద ద్వారానే సముపార్జించ గల్గినది.    
..బ్రహ్మకుమారి వాణి

Read latest Vedika News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా