అట్లాంటాలో ముగిసిన షణ్మఖ శర్మ ప్రవచనాలు

22 Jun, 2017 22:32 IST|Sakshi
అట్లాంటాలో ముగిసిన షణ్మఖ శర్మ ప్రవచనాలు

అట్లాంటా: నగరంలో ఈ నెల 14వ తేదీ నుంచి హిందూ టెంపుల్‌ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు జరిగిన ప్రవచనాల ప్రవాహంలో పాల్గొని భక్త జనం పులకరించారు. ఇందులో భాగంగా శివుని విలాసం-శక్తి వైభవంపై బ్రహ్మశ్రీ సామవేదం షణ్మఖ శర్మ ప్రవచించారు. ఉపనిషత్తుల సారం మొదలు శివపురాణం, శ్రీనాధ హరవిలాసం, పోతన భాగవతం, కాళిదాసు కుమార సంభవాలను సమన్వయపరుస్తూ అద్భుతంగా ఆవిష్కరించారు.

మహాశివుడి లీల, లాస్యం, తత్వం, కరుణ, కారుణ్యాలను షణ్ముఖ శర్మ భక్తులకు విశదీకరించారు. రుద్రునిగా, వీర భద్రునిగా, సుందరేశునిగా, కామేశునిగా, పరమేశ్వరునిగా మహాశివుడి లీలను కళ్లకు కట్టినట్లు వివరించారు. షణ్ముఖ శర్మ ప్రవచనాలు భక్తుల సందేహాలను పటాపంచలు చేశాయి. ఈ కార్యక్రమానికి అట్లాంటా నుంచే కాకుండా.. కొలంబస్‌, అలబామా, చికాగోల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు.

హిందూ టెంపుల్‌ ఆచార్యులు పవన్‌ కుమార్‌ కిష్టపాటి శివపార్వతులకు కళ్యాణం నిర్వహించారు. అనంతరం అట్లాంటా హిందూ దేవాలయ అధ్యక్షులు కొట్టె కుసుమ ఆలయం తరఫున షణ్మఖ శర్మను ఘనంగా సత్కరించారు. ఐదు రోజుల పాటు సాగిన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలు అందజేశారు.

ఇందుకు సన్‌షైన్‌ పిడియాట్రిక్స్‌, శేఖర్‌ రియల్టర్‌ రాజేసింగ్‌, లాజిక్‌ లూప్స్‌, స్వప్న రెస్టారెంట్‌, కృష్ణ విలాస్‌, రమేష్‌ వల్లూరి, హనుమాన్‌ నందపాటి, డా.రవి వర్మ, డా.బీకే మోహన్‌, సురేష్‌ సజ్జా, నేమాని సోమయాజులు, ప్రూడెన్షియల్‌ ఇన్సూరెన్స్‌, శ్రీనివాస్‌ మేడూరి, దివాకర్‌ జమ్మలమడుగు, కృష్ణ కాళకూరి, పార్థ రామరాజు, కొండల్‌ నల్లజర్ల, శంకర్‌ బోనాలి, శశి ఉప్పల తదితర దాతలు సాయం చేశారు. కాగా, అమెరికాలో 68 రోజుల పర్యటనలో భాగంగా 15 నగరాల్లో షణ్మఖ శర్మ ప్రవచనాలు ఇస్తున్న విషయం తెలిసిందే.



మరిన్ని వార్తలు