ఉద్యమాల ఉపాధ్యాయుడు

20 Nov, 2016 02:52 IST|Sakshi
ఉద్యమాల ఉపాధ్యాయుడు

సందర్భం
పేదరిక నిర్మూలన కోసం దేశంలో జరి గిన అనేక సమరశీల పోరాటాల ఫలి తంగా ప్రభుత్వాలు పలు సంక్షేమ పథ కాలు నిర్వహిస్తున్నాయి. అయినా సమాజంలో దారిద్య్రం పోలేదు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ నుంచి నేటి చుక్కా రామయ్య వరకు అక్షర జ్ఞానమే ప్రజలకు అక్షయ సంపద అని, తరతరాల తలరాతలను మార్చి, మనిషి మౌలిక అవసరాలు తీర్చి, ఆత్మగౌర వంతో జీవింప చేసే చదువును అందరికీ పంచాలని భావించారు.

అక్షరాన్ని సామాన్యుల దరికి చేర్చడమే ధ్యేయంగా జీవి తంలో అత్యధిక భాగాన్ని అర్పించినవారు– ప్రముఖ విద్యావేత్త డాక్టర్‌ చుక్కా రామయ్య. ఆ చదువుల తల్లి ముద్దుబిడ్డ 89వ ఏట అడుగుపెడుతున్నారు.  ఉపాధ్యాయ వృత్తిలో సుదీర్ఘ ప్రయాణం చేస్తూ.. అనేక ప్రయోగాలు చేశారు. గణితంపై ఆయనకు ఉన్న పట్టు అపారమైనది. రామయ్య సాంఘిక సంక్షేమ గురుకుల కళా శాలకు ప్రిన్సిపల్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ట్యూషన్‌ మాస్టర్‌గా విద్యారంగానికి సేవలు ప్రారంభించారు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. కుటుంబం ఆర్థిక ఒడిదుడుకుల మధ్య ఉపాధి మార్గంగా ఆరంభించిన రామయ్య ఐఐటి కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వందలాది మంది తెలుగు బిడ్డలకు వరమైంది. ఈ సంస్థ సానపెట్టిన ప్రతిభావంతులైన విద్యార్థులు 80కి పైగా దేశాల్లో రాణిస్తున్నారు. మన ఇస్రో మెుదలుకొని అమెరికాలోని నాసా వరకు అనేక రక్షణ పరిశోధన, వైజ్ఞానిక రంగాలలో నిష్ణాతులుగా, బ్రాండ్‌ అంబాసిడర్లుగా పనిచేస్తు న్నారు. రామయ్య తపన, ఆరాటం, అలుపెరగని అధ్యయనం అపారమైన బోధనా నైపుణ్యాల ఫలితంగా ఐఐటిలలో తెలుగు బిడ్డల ప్రవేశాలు ఇతోధికంగా పెరిగాయి. ఈ ప్రయత్నం పరో క్షంగా రాష్ట్రానికి అపార ఆర్థిక సంపదగా మారింది.

పోరాటాల పురిటిగడ్డ వరంగల్‌ జిల్లా, పాలకుర్తి మండలం, లింగాల గూడూర్‌ గ్రామంలో నవంబర్‌ 20, 1927న రామయ్య  జన్మించారు. తండ్రి అనంతరామయ్య, తల్లి నర్సమ్మలకు రామయ్య పెద్దకొడుకు. వీరికి తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు. దొరతనం దుర్మార్గాల గురించి ఆయనలో బాల్యంలోనే అంతర్మథనం మెుదలైంది. ఒక వైపు చదువు. మరోవైపు దొరల గడీల మీద సాయుధ పోరాటాలు. ఫలితంగా రామయ్యను నైజాం ప్రభుత్వం నిర్భందించి మూడేళ్లు ఔరంగాబాద్‌ జైలులో పెట్టింది. అక్కడే అభ్యుదయ, విప్లవ సాహిత్యాన్ని వంట పట్టించుకొన్న రామయ్య అప్పటికే పట్టభద్రులు. జైలు సూపరింటెండెంట్‌ పిల్లలకు పాఠాలు కూడా చెప్పేవారు. నిబద్ధత, నిజాయితీలకు నిలువుటద్దంగా నిలిచిన పుచ్చలపల్లి సుందరయ్య ప్రసంగాలకూ,  వ్యక్తిత్వానికీ ఆకర్షితులైన రామయ్య ఒక దశలో పార్టీకి పూర్తి సమయం కార్యకర్తగా వెళ్లాలని అనుకున్నారు. కానీ బాల్యంలోనే తండ్రిని కోల్పోయి పుట్టెడు కష్టాలు, కన్నీళ్ల మధ్య; పొట్టకు పిడికెడు మెతుకులు లేక తల్లి, తమ్ముడు, చెల్లెలు పడుతున్న బాధల నుంచి తొలుత వారిని గట్టెక్కించాలని భావించారాయన.  ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుని, ఉద్యోగం చేస్తూనే అనేక ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించారు. పని చేసిన ప్రతీచోట పాఠశాలలను సంస్కరిస్తూ సాగిన వారి జీవనంలో ఎన్నో మైలురాళ్లు కనిపిస్తాయి. తొలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి మలిదశ పోరు వరకు ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఉద్యమ జేఏసీకి దిశదశలను నిర్దేశించిన గురుతుల్యులు రామయ్య. శాసనమండలికి ఎన్నికైన రామయ్య ప్రసంగాలు ప్రభుత్వ, ప్రతిపక్ష సభ్యులను ఎంతగానో ఆలోచింపచేసేవి.

‘పుట్టుక నీదీ, చావు నీది, బ్రతుకంతా దేశానిది’ అన్న కాళోజీ మాటలను సార్థకం చేసే విధంగా 89 ఏళ్ల వయోభారం, అనారోగ్యం వంటి ఇబ్బందులు ఉన్నా వారి ఉద్యమ చైతన్యయాత్ర ఆగలేదు. విద్యా సంస్కరణలు తేవడానికి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం చేయడానికి కృషి చేస్తూనే ఉన్నారు. బడుగుల బిడ్డలు చదువుకునే బడులు మూతపడితే ప్రజాస్వామిక విలువలు పతనమవుతాయని గట్టిగా నమ్మిన ఆయన ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలు తిరిగి వారి పరిశోధనలపై అధ్యయనం చేసి అరుదైన సమాచారాన్ని తెలుగు ప్రజలకు అందించారు. భవిష్యత్తు కోసం ఆరాటపడే విద్యార్థుల జీవితాలకు ఊతమిస్తూ,  బడుగుల బిడ్డలు చదివే బడులతోనే బంగారు తెలంగాణ  సాధ్యం కావాలన్న రామయ్య జీవన స్వప్నం నెరవేరాలని ఆశిద్దాం.

(చుక్కా రామయ్య 89వ ఏట అడుగిడుగుతున్న సందర్భంగా నేడు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఆత్మీయ మిత్రబృందం ‘సమత్వం, సామాజిక న్యాయం, విద్య ఒక సామాజిక న్యాయం’ అనే అంశం మీద ఆయన దార్శనికత ఆధారంగా విద్యా సదస్సు నిర్వహిస్తున్నారు.)

వ్యాసకర్త సామాజిక కార్యకర్త‘ మొబైల్‌: 98490 54339
వందేమాతరం రవీంద్ర

మరిన్ని వార్తలు