పరీక్షలు విద్యార్థి నుదుటి రాతలు

1 Apr, 2017 04:19 IST|Sakshi
పరీక్షలు విద్యార్థి నుదుటి రాతలు

విశ్లేషణ
ప్రశ్నపత్రాలను కఠినంగా ఇవ్వవద్దు–తేలికగా ఉండాలన్న డిమాండ్‌ వల్ల మన యువతరం దీర్ఘకాలంలో దగా పడుతుందని మరువవద్దు. పబ్లిక్‌ పరీక్షల్లో విషయ అవగాహన, అనువర్తన (అప్లికేషన్‌)పై ప్రశ్నలు ఇచ్చినట్లయితే విద్యా ప్రమాణాలు పెరుగుతాయి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఎస్‌సీ బోర్డు ద్వారా నిర్వహించిన పదవ తరగతి భౌతిక శాస్త్రంలో ఇచ్చిన ప్రశ్నలు క్లిష్టంగా ఉన్నా యని.. మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రశ్నలు పదవ తరగతి భౌతిక శాస్త్రం పాఠ్య పుస్తకంలో లేవని అందువల్ల విద్యార్థులకు అన్యాయం జరిగి గ్రేడ్లు తగ్గి పోతాయన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. అందువల్ల భౌతిక శాస్త్రం పరీక్షను మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్‌ కూడా విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రైవేట్‌ స్కూల్స్‌ యాజమాన్యాల నుంచి వస్తోంది. దీనికి ప్రతిగా ప్రభుత్వం ఈ పేపర్‌కు నాలుగు మార్కులు కలుపుతున్నట్లుగా ప్రకటించింది.

సాధారణంగా ఏ ప్రశ్న పత్రాన్నయినా విద్యార్థులు మార్కుల కల్ప వృక్షాలుగా భావిస్తారు. అందులో తప్పులేదు. వారి వయసు, అవగా హన రీత్యా వారిని తప్పుపట్టలేం. అయితే ప్రశ్నపత్రాలను మార్కులు, గ్రేడ్లు చిలికించే అమృత భాండాలుగా చూడలేం. ప్రతి తరగతి పాఠ్య పుస్తకానికి ఒక లక్ష్యం ఉన్నట్లుగానే ప్రశ్నపత్రాలకూ కొన్ని లక్ష్యాలుం టాయి. ఈ ఏడాది భౌతిక శాస్త్ర  ప్రశ్నపత్రంలో ఇచ్చిన ప్రశ్నలలో సగం ప్రశ్నలు నేరుగా పాఠ్యపుస్తకం నుంచి రాకపోవడమే ప్రస్తుత కలవరానికి కారణం. సదరు ప్రశ్నలు పాఠ్య పుస్తకంలోని పాఠాలలో వెతికినా కన్పిం చనందున అవి పాఠ్య ప్రణాళిక పరిధిని దాటాయని, అలాంటి ప్రశ్నలకు విద్యార్థులు జవాబులు రాయడం ఎలా అన్న విమర్శలు తలెత్తాయి.

సాధారణంగా ప్రశ్నపత్ర రూపకల్పన రెండు విషయాలపై ఆధార పడి ఉంటుంది. ఒకటి ప్రశ్నపత్ర బ్లూ ప్రింట్, రెండవది ప్రశ్నపత్ర లక్ష్యం. ప్రశ్నపత్ర రూపకల్పనకు ఏ ప్రాతిపదికలు పాటించాలన్నది బ్లూ ప్రింట్‌ నిర్ద్ధేశిస్తుంది. ప్రశ్నపత్రం రూపకల్పనలో సమాచార ఆధారిత ప్రశ్నలు, అవగాహన ప్రశ్నలు, అనువర్తన ప్రశ్నలు అన్న మూడు రకాల ప్రశ్నలు ఇవ్వాలని బ్లూ ప్రింట్‌ నిర్దేశిస్తుంది. న్యూటన్‌ గమన సిద్ధాం తాలలో రెండో నియమాన్ని రాయమంటే అది సమాచార ఆధారితప్రశ్న. న్యూటన్‌ గమన నియమాలు బట్టీపడితే చాలు ఈ ప్రశ్నకు జవాబు రాయవచ్చు. ఇవి జ్ఞాపకంపై ఆధారపడిన ప్రశ్నలు. ఇక రెండో తరహా ప్రశ్నలు విద్యార్థి అవగాహనను పరీక్షించే ప్రశ్నలు. ఇదే న్యూటన్‌ గమన సిద్ధాంతంపై ప్రశ్నను తుపాకి మీట నొక్కినప్పుడు గుండు వేగంగా దూసుకుపోవడంలో ఉన్న సూత్రం ఏమిటని అడిగితే అది విద్యార్థి అవ గాహనను తెలుసుకునేందుకు రూపొందించిన ప్రశ్నగా పరిగణిస్తాం.

అనువర్తన ప్రశ్నలు అత్యంత కీలకమైనవి. అంటే విద్యార్థి చదివి తెలుసుకున్న జ్ఞానం నిత్య జీవితంలో ఎక్కడెక్కడ వినియోగపడుతున్నది పరిశీలన ద్వారా గుర్తించగలిగే సామర్థ్యాన్ని తెలుసుకునే ప్రశ్నలు. ఈ కోవకు చెందిన ప్రశ్నలే విద్యార్థిలో ఆలోచనల మ«థనాన్ని, విశ్లేషణ దృక్ప« థాన్ని, అనువర్తన నైపుణ్యాన్ని పెంచుతాయి. జాతీయ స్థాయి పోటీ పరీ క్షల్లో ఈ తరహా ప్రశ్నలే ఎక్కువ ఉంటాయి. వీటికి జవాబులు టెక్ట్స్‌ బుక్స్‌లో నేరుగా కన్పించవు. పదవ తరగతి భౌతిక శాస్త్ర ప్రశ్నపత్రంలో సగం ప్రశ్నలు ఈ శ్రేణికి చెందినవి కావడంతో వీటిని ‘అవుట్‌ ఆఫ్‌ సిలబస్‌’ (సిలబస్‌ పరిధిలో లేనివి) ప్రశ్నలుగా భావిస్తున్నారు.

మనకు అప్రియమైనా ఒక నిజాన్ని పరిశీలిద్దాం. పాఠ్యపుస్తకం ఆధారంగా అందులో ఉన్న ప్రశ్నలనే ఇõ¯్త  పేపర్‌ తేలికగా ఉందన్న భావన కలుగుతుంది. విద్యార్థులకు మంచి గ్రేడ్లు వస్తాయి. ఇది తాత్కా లికంగా కలిగే అనుభవం. ఆ తర్వాత ఇంటర్మీడియెట్‌కు వెళ్లిపోతారు. ఆపై జరిగే ప్రవేశ పరీక్షలన్నీ జాతీయ స్థాయిలో లక్షలాదిమంది పోటీ పడేవే. వాటిలో ఒక విషయంపై నేరుగా వచ్చే ప్రశ్నల కంటే విద్యార్థి అవగాహన, అనువర్తన స్థాయిని పరిశీలించే ప్రశ్నలే ఎక్కువ. అప్పటిక ప్పుడు ఆ స్థాయిని అందుకోవడం కష్టం.పదవ తరగతి నుంచే  పునాది పడాలి. విద్యా ప్రమాణాల పెంపుదల పరీక్షల నుంచే మొదలవ్వాలి.

ఒకప్పుడు ఇక్కడ కాస్త అటు ఇటుగా చదువుకొని, అమెరికా వెళ్లి అక్కడి విశ్వవిద్యాలయాలలో విశ్వ విజయ సూత్రాలు అలవర్చుకొని డాలర్ల పంటలు పండించవచ్చునన్న నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడా డాలర్‌డ్రీమ్స్‌ చెదిరిపోయాయి. ఇప్పుడు తమ గడ్డ మీదకు వచ్చి ప్రతి భను మెరుగుపరచుకోవాలనుకునే వారు తమకు అక్కర లేదని, తమ దేశ సరిహద్దుల్లోకి ప్రవేశించక ముందే ప్రతిభావంతులైతేనే అవకాశం అని అమెరికా అధ్యక్షుడే హెచ్చరిసున్నారు. మరోప్రక్క మనం సేవా రంగంపై అతిగా ఆధారపడటం తగ్గించి తయారీ రంగం వైపు దృష్టి పెట్టాలన్నది ప్రభుత్వ విధానం. తయారీ యుగంలో నైపుణ్యాలు సంత రించుకొని రాణించాలంటే సృజనాత్మక ఆలోచనా సరళి ఏర్పడాలి. చది విన పాఠ్యాంశాల నిత్య జీవిత అనుసంధానం వల్లనే సృజనాత్మకత ఏర్ప డుతుంది. అందుకు ప్రశ్నపత్రాలే వేదిక. అందువల్ల ప్రశ్నపత్రాలను కఠి నంగా ఇవ్వవద్దు–తేలికగా ఉండాలన్న డిమాండ్‌ వల్ల మన యువతరం దీర్ఘ కాలంలో దగా పడుతుందని మరువవద్దు.

ప్రభుత్వం, పరీక్షల విభాగం పరీక్షలను ఒక వార్షిక తంతుగా ముగించకుండా, లోపరహితమైన పరీక్ష విధానాన్ని తీసుకురావాలి. ఎప్పుడూ జరిగే క్రతువులా పరీక్షలు పెట్టేసి ఆపై విద్యా వర్గాల నుంచి ప్రతికూల స్పందన వస్తే నాలిక కరచుకొని నాలుగు మార్కులు విసిరేసి శాంతింపజేõ¯  పద్ధతిని మార్చుకోవాలి. పరీక్షలు విద్యార్థి నుదుటిరాతలు కాబట్టి వీటిని అత్యంత పారదర్శకంగా జరపాలి. ప్రశ్నపత్ర రూప కల్పనకు బ్లూ ప్రింట్‌ అనుసరించడం దగ్గర నుంచి పరీక్షలో ఇచ్చే ప్రతి ప్రశ్నకు బాధ్యత వహించాలి. అంతే తప్ప పరీక్ష ముగిసిన తర్వాత ప్రశ్నలో సందిగ్ధత ఉందని మార్కులు కలపడం ఉపశమనమే కానీ ఇదొక సాంప్రదాయకం కాకూడదు. అలాంటి ప్రశ్నలకు జవాబులు రాబట్టేం దుకు విద్యార్థి పరీక్షలలో పడే వేదనను గుర్తించాలి. అలాగే పరీక్ష కాగానే ప్రశ్న పత్రాలను పరీక్షించేందుకు ఒక వ్యవస్థ ఉండాలి. ప్రశ్నపత్రం రూప కల్పనలో తగిన ప్రమాణాలు అనుసరించారా? ఇచ్చిన వ్యవధిలో పూర్తి చేయగలిగే స్థాయిలో ఉందా? పదవ తరగతి విద్యార్థి మానసిక స్థితి దృష్ట్యా ఆ ఉద్వేగాలకు సరిపడే రీతిలోనే ప్రశ్నపత్రం రూపకల్పన జరి గిందా? పదవ తరగతి పాఠ్యాంశాల లక్ష్యాలను ఈ ప్రశ్నపత్రం నెర వేర్చే పంథాలో ఉందా? అన్న విమర్శనాత్మక దృష్టితో పరిశీలించగలిగే వ్యవస్థ ఉండాలి. ఈ విధమైన విశ్లేషణ ద్వారా వచ్చిన అభిప్రాయాలను బట్టి జవాబు పత్రాల మూల్యాంకనం జరగాలి. తదుపరి సంవత్సరం ప్రశ్న పత్రాల రూపకల్పనలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రశ్న పత్రాలను, పరీక్షలను అటు ప్రభుత్వం ఇటు తల్లిదండ్రులు భవిష్యత్‌ తరాలను మలచే వేదికలుగా భావించాలి.


- చుక్కా రామయ్య

వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త ‘ శాసనమండలి మాజీ సభ్యులు

మరిన్ని వార్తలు