ఉరుములేని పిడుగు!

3 Dec, 2016 01:34 IST|Sakshi
ఉరుములేని పిడుగు!

అక్షర తూణీరం
ఒక తెలుగు బిడ్డ కేసీఆర్ నోట్ల షాక్‌కు తీవ్రంగా గురయ్యారు. అన్యాయ మంటూ మోదీని తెలంగాణ యాసతో చెరిగి పోయారు. మరో తెలుగు నేత బాబు అసలీ స్కీమ్ వెనకాల తన హస్తం ఉందన్నంత కలరిచ్చారు.
 
ముందుగా ఉరుము ఉరుముతుంది. దాని వెంట మెరుపు మెరుస్తుంది. దాని తర్వాత పిడుగు పడుతుంది. ఇప్పుడు ఎలాంటి సంకేతాలు లేకుండా ఉన్న పళంగా పిడుగు పడింది. గోదాముల్లో పెద్ద కరెన్సీ  నిలవపెట్టిన వారికి కళ్లు బైర్లు కమ్మి, మెదడు మొద్దు బారినట్టయింది. నిదానంగా కోలుకుని పని చేయడం ఆరంభించింది. ఆ పిడుగు పాటుకి నల్ల కరెన్సీ కట్టలు తెల్ల మొహం వేశాయి. స్వతంత్రం వచ్చాక ఇలాంటి షాక్ ఎన్నడూ ఎరగరూ. చేస్తాం.. చేస్తాం.. అన్నవారే గానీ నిజంగా చేసిన వారు లేరు. మోదీ కూడా ఉత్తుత్త ఉరుమే అనుకున్నారు. గానీ పిడుగు దెబ్బ ఉంటుందని ఎవరూ ఊహించలేదు. గతంలో ఉరుము విన్పించినపుడల్లా, అర్జునా, ఫల్గుణా, కిరీటీ అంటూ నానా పేర్లూ స్మరించుకుని దాన్నించి తప్పించుకుంటూ వచ్చారు. ఈ సారి నిండా దొరికిపోయారు.
 
కొందరు బయటపడి నానా యాగీ చేస్తున్నారు. కొందరు తేలు కుట్టిన దొంగల్లా ఓర్చుకుని బతుకుతున్నారు. యాగీ చేస్తున్న వాళ్లేమం టారంటే - కొంచెం ముందుగా చిన్న సైరన్ అయినా వేయకుండా ఇలాంటి అఘాయిత్యాలకు ఒడికట్టడం రాజకీయ నీతి కాదని అరుస్తున్నారు. రాజనీతి వేరు, రాజకీయ నీతి వేరు. దేవుడంతటివాడు ఉరుములు మెరుపుల తర్వాతే పిడుగు వదుల్తాడు.  ఇదే మాత్రం ధర్మం కాదని కొందరు నేతలు వీధినపడి అరుస్తున్నారు.  
 
మిగతా వారి సంగతి అలా ఉంచి, మన తెలుగు గడ్డ మీదకు వద్దాం. ఒక తెలుగు బిడ్డ కేసీఆర్ నోట్ల షాక్‌కు తీవ్రంగా గురయ్యారు. అన్యాయం, అక్రమం అంటూ మోదీని తెలంగాణ యాసతో చెరిగిపోయారు. మెల్లగా ఆవేశంలోంచి స్పృహలోకి వచ్చారు. కాలు కాలినట్టు రాజ్‌భవన్‌కి, రాజధానికి రెండు మూడు సార్లు తిరిగారు. మామూలు మనిష య్యారు. మరో రోజున్నర గడిచేసరికి మనిషిన్నర అయ్యారు. మోదీ నిర్ణయం దేశ సౌభాగ్యానికి, విశ్వ కల్యాణానికి తోరణం కట్టిందని ప్రజలకు ఉద్బోధించడం ఆరంభించారు. దీని వల్ల తాత్కాలికంగా చిన్న చిన్న కుదుపులుంటాయి. గానీ తర్వాత హాయిగా గాలిలో తేలిపోవడమేనని చెబుతున్నారు.
 
మరో తెలుగు నేత చంద్రబాబు అసలీ స్కీమ్ వెనకాల తన హస్తం ఉందన్నంత కలర్ ఇచ్చారు. ‘‘ ఈయనకు బానే కాలిందండీ, కానీ బయట పడలేడు కదా పాపం, అందుకని మేకపోతు గాంభీర్యం వెలిగిస్తున్నాడ’ని  వాళ్ల ప్రాంతం పెద్ద మనిషే చెప్పాడు. చంద్రశేఖర్‌రావు ఉన్నట్టుండి కొమ్ములెందుకు ముడిచారో సామాన్యులకు అంతుబట్టని ప్రశ్న.  చంద్రబాబు సంగతి అందరికీ తెలిసిందే.  మొదట్నించీ ఆయనొక విద్య సాధన చేశారు. నోరు మాట్లాడుతూ నొసలతో వెక్కిరించడం, పడగతో స్నేహం తోకతో పగ పెంచుకోవడం ఆయనకు బాగా తెలుసు. అందుకే ఇప్పుడు మోదీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వేనోళ్ల పొగిడేస్తున్నారు. తెలుగుదేశం ఎం.పీ.లు మాత్రం బయటపడి నోట్ల నిర్ణయాన్ని తీవ్రంగా గర్హిస్తు న్నారు. మొత్తానికి మోదీ ఇద్దరు నేతలకు త్రిశంకు స్వర్గం చూపిస్తున్నారు.
 
తెలంగాణకు బోలెడన్ని పాత బాకీలు ఈ దెబ్బతో వసూలయ్యాయి. వాటితో కనీసం భాగ్యనగరంలో రోడ్లయినా వెయ్యచ్చు.  ఇక చంద్రబాబు సమస్యని లొంగతీసుకుని తనకి అనుకూలంగా మార్చుకునే చాణక్యుడు అని ఆయన నమ్మకం.  బంగారంపై నిఘాతో చరాస్తులని చెరపట్టినట్టే! తర్వాతి మెట్టు స్థిరాస్తులు. ప్రధానమంత్రి చాలా విజ్ఞతతోనే వ్యవహరిస్తున్నారని అనుభవజ్ఞులంటున్నారు. అందుకే చంద్రబాబుని అదేదో కమిటీకి పెద్దగా నియమించాడు. కరెన్సీ రహిత లావాదేవీలకు ఇకపై ఆయనే దిశా నిర్దేశం చేస్తారు. జరిగిన దానికి కంటనీరు వస్తున్నా, వాటిని ఆనంద బాష్పాలుగా స్వీకరించాల్సిందేగానీ మార్గాంతరం లేదు.

శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

మరిన్ని వార్తలు