చేతన కొరవడితే యాతనే!

12 May, 2017 00:51 IST|Sakshi
చేతన కొరవడితే యాతనే!

సమకాలీనం
పారదర్శకత గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలిచ్చే అధినేతలకు పాలనావ్యవస్థల్లోని సమాచారం ప్రజలకు అందించడమంటేనే వెరపు! సమాచార వెల్లడితో కొత్త చిక్కుల్ని ఆహ్వానించే కన్నా గోప్యత ద్వారా పబ్బం గడుపుకోవచ్చన్న తప్పుడు ఆలోచనే ఇందుకు కారణం. సమాచారం నిరాకరించే, జాప్యం చేసే ప్రతి సందర్భంలోనూ, అంటే అన్ని ఫిర్యాదులు, అప్పీళ్లల్లో నిందితులుగా నిలవాల్సింది ప్రభుత్వ యంత్రాంగమే! తనను దోషిగా నిలబెట్టి ప్రశ్నించే ఏ పరిస్థితినైనా ప్రభుత్వ వ్యవస్థ ఎందుకు సాఫీగా అనుమతిస్తుంది?

‘సదా అప్రమత్తంగా ఉండటమే స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు మనం చెల్లించే మూల్యం’  (Eternal vigillance is the price of liberty) అని తొలుత ఎవరు చెప్పారో కానీ, గడచిన రెండు శతాబ్దాలుగా ప్రపంచమంతా ప్రాచుర్యంలో ఉన్న మాట ఇది! ఇప్పటికీ వర్తిస్తున్న మాట! ఐరిష్‌ న్యాయవాది జాన్‌ ఫిల్‌పోట్‌ తొలుత చెప్పారనేదొక ప్రచారం. అమెరికాలో సాగిన బానిసత్వ వ్యతిరేక పోరులో క్రియాశీల కార్యకర్తగా వెండెల్‌ ఫిలిప్స్‌ 1882లో ఈ మాటన్నారనీ చెబుతారు. ఆధారాల్లేకపోయినా... అమెరికా నిర్మాతల్లో ఒకరైన థామస్‌ జెఫర్సన్‌ అంతకు ముందెప్పుడో అన్నట్టు ఆయన పేరిట ప్రచారముంది. ఎవరు చెప్పినా విశ్వవ్యాప్తంగా అనేక పౌర ఉద్యమాలకు ఊపిరులూదిన, ఇంకా ఊదుతున్న గొప్ప స్ఫూర్తి వాక్యం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు అతికినట్టు సరిపోయే ఆణిముత్యమీ మాట! పౌర సమాజం చైతన్యంతో ఉండి పోరాడితే తప్ప ప్రజాస్వామ్యపు మౌలిక హక్కులు కూడా దక్కని దుస్థితి క్రమంగా బలపడుతోంది.

సమాచార హక్కు చట్టం అమలును చూస్తే అది తేటతెల్లమౌతోంది. రాజ్యాంగ స్ఫూర్తితో, చట్టం సాక్షిగా దక్కిన ఈ హక్కు అమలు పర్యవేక్షణకిక తెలుగునాట నేటితో కాలం చెల్లనుంది. పూనిక వహిస్తే తప్ప పునరుద్ధరణకు మరెంత కాలమో! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల, నిరంతరాయంగా సాగాల్సిన చట్టం అమలు పర్యవేక్షణకు ఇప్పుడు గండి పడుతోంది. రేపట్నుంచి కొంత కాలంపాటు చట్ట శూన్యత, ఇంకా చెప్పాలంటే రాజ్యాంగ శూన్యత ఏర్పడే పరిస్థితులు దాపురించాయి. అడిగినా సమాచారం లభించని సందర్భాల్లో పౌరులు చేసుకొనే ఫిర్యాదులు, అప్పీళ్లు, చట్టం అమలును చూసే సమాచార కమిషన్‌ రేపట్నుంచి ఉనికిలో లేకుండా పోతోంది. రాష్ట్ర విభజన నేపధ్యంలో, రెండు రాష్ట్రాలకు విడిగా రెండు కమిషన్లను సమకూర్చుకునే జాగ్రత్తలు తీసుకోకపోగా ఉన్న ఉమ్మడి కమిషన్‌కు కాలం చెల్లిపోతున్నా ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. కొత్త కమిషన్, కమిషనర్ల నియామకాలు ఇంకా మొదలు కాలేదు. తెలంగాణలో ఇప్పుడిప్పుడే ప్రక్రియకు తెరలేపుతున్నా ఏపీలో కనీసం ఆ ఊసే లేదు!

సహజ మరణంలా కనపడేట్టు చంపుతున్నదెవరు?
ప్రభుత్వాలు ఏ కొంచెం జాగ్రత్త తీసుకున్నా కమిషన్‌కు ఈ పరిస్థితి తలెత్తేదే కాదు. 2014 జూన్‌లో రాష్ట్ర విభజన తర్వాత మిగతా పలు విభాగాల్లాగే సమాచార కమిషన్‌నూ పంచుకోవాల్సింది. పంపకాల జాబితాలో మొదట ఎక్కడా కమిషన్‌ ప్రస్తావన కూడా లేకపోవడం అందరినీ విస్మయ పరిచింది. తర్వాత జ్ఞానోదయమై, పదో షెడ్యూల్‌ జాబితాలో చేర్చారు. నిబంధనల ప్రకారం ఏడాదిన్నరలో ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు సయోధ్యతో కమిషన్‌ను పంచుకోవాలి. ఇందులో పంచుకోవడానికీ, పంపకంలో వివాదాలు తలెత్తడానికీ ఆస్తు  లేం లేవు! ఉన్నదల్లా కమిషనర్లను, ఇతర సిబ్బందిని పంచుకొని ఏ రాష్ట్రపు అప్పీళ్లు, ఫిర్యాదుల్ని ఆ కమిషన్‌ పరిష్కరించడం, అక్కడ చట్టం అమలును పర్యవేక్షించడం. ఇంత తేలిక వ్యవహారాన్నీ సర్కార్లు తేల్చలేదు, పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. ఏడాదిన్నర గడువు మీరితే కేంద్ర ప్రభుత్వం చేసిపెట్టాలి. అదీ జరక్కుండానే మొత్తం మూడేళ్లవుతోంది. ఈ మధ్య కాలంలో ఒక్కరొక్కరుగా ముఖ్య సమాచార కమిషనర్లు పదవీ విరమణ చేశారు. పదవిలో కొనసాగుతున్న నలుగురు కమిషనర్ల నియామకమే చెల్లదంటూ లోగడ హైకోర్టిచ్చిన తీర్పును ఈ మధ్యే సుప్రీంకోర్టు ఖరారు చేసింది. దాంతో వారు ఇంటిబాట పట్టారు. అది జరిగిన ఒకట్రెండు రోజుల్లోనే అప్పటివరకు ఆపద్ధర్మ ముఖ్య కమిషనర్‌గా ఉన్న రతన్‌ పదవీ విరమణ చేశారు.

ఇక కమిషన్‌లో మిగిలిన ఏకైక కమిషనర్‌ విజయబాబుకు ఈ రోజు (శుక్రవారం) ఆఖరి పనిదినం. ఇక కమిషన్‌ ఉనికిలో లేనట్టే! ఎందుకంటే, చట్టంలో నిబంధనలలా ఉన్నాయి. సమాచార హక్కు చట్టం–2005 సెక్షన్‌ 15(4) ప్రకారం ‘కమిషన్‌ నిత్యనిర్వహణ, దిశా నిర్దేశం అన్నది కమిషనర్ల సహకారంతో ముఖ్య కమిషనర్‌ నిర్వహించాలి...’ అని ఉంది. ఏ వ్యవహారమైనా కమిషనర్లు లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించజాలవు, నిర్వహించకూడదు. ముఖ్య కమిషనర్, ఇతర కమిషనర్లెవరూ లేనప్పుడు కమిషన్‌ ఉనికిలో లేనట్టే అని గుజరాత్, ఉత్తరాఖండ్‌ కమిషన్ల నిర్వహణ వివాదంలో అక్కడి ఉన్నత న్యాయస్థానాలు ఇదివరకే తేల్చిచెప్పాయి. లోగడ ఆ తీర్పులతో జడిసిన ఆయా ప్రభుత్వాలు ముఖ్య కమిషనర్‌ను (గుజరాత్‌), ఇతర కమిషనర్లను (ఉత్తరాఖండ్‌) సత్వరమే నియమించుకున్నాయి. అందుకే ప్రభుత్వాలు ఈ శూన్యత రాకుండా ఉండటానికి తగినంత ముందుగానే ప్రక్రియ ప్రారంభిస్తాయి. చివరి కమిషనర్‌ పదవీ విరమణ నాటికి కొత్తగా నియమితులైనవారు బాధ్యత తీసుకునేలా ప్రక్రియను పూర్తి చేస్తాయి. ఆ తెలివిడి ఇప్పుడు రెండు ప్రభుత్వాలకూ లేకుండా పోయింది.

సర్కార్లకు శీతకన్నెందుకు?
సమాచార హక్కు చట్టం పట్లనే ఈ ప్రభుత్వాలకు సదుద్దేశమున్నట్టు లేదు! అమలు చేయకుంటే నేం? అన్న ధీమాతోనే ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తుండవచ్చని ఆర్టీఐ క్రియాశీల కార్యకర్తలంటున్నారు. పాలకుల ఈ భావనలకు ఉన్నతాధికార వ్యవస్థ అనాసక్తి తోడవుతోంది. దాంతో చట్టం అమలు నీరుగారుతోంది. ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న అమలు, పర్యవేక్షణ ఇక కమిషన్‌ కూడా లేకుంటే మరింత కుదేలవడం ఖాయం. ఇలా కమిషన్‌ ఉనికే లేని పరిస్థితికి నెట్టడం సర్కార్ల నిర్లక్ష్యానికి నిదర్శనం. పాలకులు, ఉన్నతాధికార వ్యవస్థ నుంచి ప్రత్యక్షంగా–పరోక్షంగా అందే సంకేతాలను బట్టే కింది స్థాయి అధికారులు, సిబ్బంది పనితీరు ఉంటుంది. అదే ఆర్టీఐ విజయ–వైఫల్యాలను నిర్ణయిస్తుంది. పారదర్శకత గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలిచ్చే అధినేతలకు పాలనావ్యవస్థల్లోని సమాచారం ప్రజలకు అందించడమంటేనే వెరపు! పూర్వపు/తమ నిర్వాకంలోని అలసత్వం, ఆశ్రిత పక్షపాతం, అక్రమ– అవినీతి వ్యవహారాలు బట్టబయలవుతాయనే భయం కూడా కారణం కావచ్చు.

సమాచార వెల్లడితో కొత్త చిక్కుల్ని ఆహ్వానించే కన్నా గోప్యత ద్వారా పబ్బం గడుపుకోవచ్చన్న తప్పుడు ఆలోచనే ఇందుకు కారణం. దాంతో సమాచార హక్కు చట్టం అమలంటేనే తప్పించుకునే దొంగదారులు వెతుకుతారు. సమాచారం నిరాకరించే, జాప్యం చేసే ప్రతి సందర్భంలోనూ, అంటే అన్ని ఫిర్యాదులు, అప్పీళ్లల్లో నిందితులుగా నిలవాల్సింది ప్రభుత్వ యంత్రాంగమే! తనను దోషిగా నిలబెట్టి ప్రశ్నించే ఏ పరిస్థితినైనా ప్రభుత్వ వ్యవస్థ ఎందుకు సాఫీగా అనుమతిస్తుంది? అందుకే ఈ అవరోధాలు. సమాచార వెల్లడికి సంబంధించి తామిచ్చే ఆదేశాలను అధికార యంత్రాంగం పాటించడం లేదని, ఈ విషయంలో సర్కారు సహకరించకుంటే నిర్వహణ కష్టమని కమిషనర్లే తమ వార్షిక సదస్సులో బాహాటంగా చేతులెత్తేసిన దుస్థితి విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రపదేశ్‌లో వెల్లడైంది. విభజనానంతరం ఇక ఆ కమిషన్‌ ఎవరికీ పట్టని సంస్థగానే మిగిలింది. ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం. ఒక దశలో కమిషన్‌ ఆర్థిక నిర్వహణ, కమిషనర్లు ఇతర సిబ్బంది జీతభత్యాలకూ తిప్పలు తప్పలేదు.

ఇది రాజ్యాంగ విహిత బాధ్యత
సమాచారం తెలుసుకోవడం అన్నది పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పలుమార్లు తీర్పుల్లో వెల్లడించింది. పౌరులు తమ వాక్‌ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ (అధికరణం 19 (1) (ఎ)లో అంతర్భాగంగా) వినియోగించుకునే క్రమంలోనే ఈ హక్కు సంక్రమిస్తుందనీ స్పష్టం చేసింది. దీన్ని సక్రమంగా అమలు పరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్థాయిల్లో కమిషన్లను ఏర్పాటు చేసి, నిర్వహించాలని సమాచార హక్కు చట్టం (సెక్షన్లు 12, 15) నిర్దేశిస్తోంది. ఈ నిర్వహణ లేకుంటే కచ్చితంగా ఇది చట్టోల్లంఘన, రాజ్యాం గోల్లంఘన కిందకే వస్తుందని పౌర సమాజం పేర్కొంటోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సత్వరమే ముఖ్య, ఇతర కమిషనర్ల నియామక ప్రక్రియ చేపట్టాలని ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులకు ఆర్టీఐ జాతీయ ప్రచార వేదిక (ఎన్సీపీఆర్‌ఐ) ఇటీవలే విడివిడిగా వినతిపత్రాలు సమర్పించింది. అరుణరాయ్, నిఖిల్‌డే, శైలేశ్‌ గాంధీ, రాకేశ్‌రెడ్డి, రామకృష్ణంరాజు తదితరులు ఇందులో ఉన్నారు.

యోగ్యత కలిగిన సమర్థుల్ని కమిషనర్లుగా నియమిస్తూ, ఆ నియామక ప్రక్రియనూ పౌరులకు తెలిసేలా పారదర్శకంగా జరిపించాలనీ కోరారు. ‘నమిత్‌శర్మ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా’కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో, నియామకాలకు ఏ ప్రక్రియను పాటించమందో కూడా ఈ వినతిపత్రంలో వారు ప్రస్తావించారు. సుప్రీం తీర్పుననుసరించి కేంద్ర ప్రభుత్వం లోగడ కేంద్ర సమాచార కమిషనర్లను నియమించేటప్పుడు పత్రికల్లో ప్రకటన జారీ చేసి ఆసక్తి గల అర్హుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానించింది. సమాచార హక్కు చట్టం (సెక్షన్లు 12(5), 15(5) లలో) నిర్దేశించినట్టు ప్రజాజీవితంలో ప్రముఖులై ఉండి న్యాయ, శాస్త్ర–సాంకేతిక, సమాజసేవ, పత్రికారంగం, పాలన, నిర్వహణ తదితర రంగాల్లో విస్తృత పరిజ్ఞానం కలిగిన వారి దరఖాస్తుల్ని పరిశీలించాలి. ఎవరి అర్హతలేమిటో నిర్దిష్టంగా పేర్కొంటూ, జాబితా కుదింపు ప్రక్రియలో ప్రతి పేరు పక్కన మినిట్స్‌ నమోదు చేస్తూ ఈ సమాచారాన్ని పౌరులకు అందుబాటులో ఉంచాలి. అలా కుదించిన జాబితా నుంచి అవసరమైనన్ని పేర్లను ముఖ్యమంత్రి, విపక్షనేత, సీనియర్‌ మంత్రితో కూడిన త్రిసభ్య సంఘం గవర్నర్‌కు ప్రతిపాదిస్తుంది. ఆయన పరిశీలించి ఖరారు చేస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిది సత్వరం జరగాల్సి ఉంది. దీనికి చాలా సమయమే పట్టొచ్చు!

చెవి మెలితిప్పితే తప్ప....!
కొన్ని వ్యవహారాల్లో ప్రభుత్వ నిర్వాకాలు చిత్రాతిచిత్రంగా ఉంటాయి. న్యాయస్థానాలతో మొట్టికాయలు వేయించుకునే వరకు తెలిసి తెలిసీ నిస్సిగ్గుగా చట్టాల్ని, రాజ్యాంగాన్నీ ఉల్లంఘిస్తుంటాయి. ఆర్టీఐ అమలు విషయంలో ఇప్పుడిదే జరుగుతోంది. ఒక్క ఆర్టీఐ అనే కాదు, చాలా వ్యవహారాల్లో జరుగుతున్నదిదే. రెండు రాష్ట్రాల్లోనూ మానవహక్కుల సంఘం దాదాపు లేనట్టే! ఛైర్మన్, సభ్యులెవరూ లేకపోవడంతో కార్యదర్శిగా ఉన్న అధికారే ఇప్పుడు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. తెలంగాణలో పరిపాలనా ట్రిబ్యునల్‌ లేదు. ఇంకా చాలా సంస్థల్ని క్రమంగా నిర్వీర్యం చేస్తున్నారు. అధికార–విపక్షమనే రాజకీయ వ్యవస్థల్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం, అధికారాన్ని అడ్డుపెట్టుకొని విపక్షాల్ని బలహీనపరచడం ద్వారా ఆధిపత్య సాధన! ఇదే, ఇప్పుడు జరుగుతున్న వ్యూహాత్మక తంతు! ఇతర ఏ ప్రజాస్వామ్య వ్యవస్థల్నీ మననీయకుండా చూడటం కుట్రలా సాగుతోంది. అయితే మొత్తానికి లేకుండా చేయడం, కుదరక కొనసాగినా... నిర్వహణ పరంగా వాటిని నిర్వీ   ర్యపరచడం పాలకులకు రివాజయింది. ఫలితంగా నష్టపోవడం ప్రజల వంతవుతోంది. ఈ దుస్థితిని అధిగమించడానికి పౌర చైతన్యమే మిగిలిన మార్గం. హక్కుల్ని, హక్కులు కాపాడే ప్రజాస్వామ్య సంస్థల్ని బతికించుకోవడమే పౌరసమాజ తక్షణ కర్తవ్యం. ప్రభుత్వాలేవైనా ప్రజలు గ్రహించాల్సిందిదే! ఎక్కడో శివసాగర్‌ (కె.జి.సత్యమూర్తి) అడిగిన ప్రశ్న గుర్తొస్తుంది. ‘ఏ పులి మేకను సంరక్షిస్తుంది? ఇది చరిత్ర చెప్పిన సత్యం!’.

వ్యాసకర్త: దిలీప్‌ రెడ్డి
ఉమ్మడి ఏపీ సమాచార పూర్వ కమిషనర్‌
ఈమెయిల్‌: dileepreddy@sakshi.com

మరిన్ని వార్తలు