‘నిఖా’ర్సయిన దగా!

22 Sep, 2017 00:31 IST|Sakshi
‘నిఖా’ర్సయిన దగా!

పేదరికం ఎక్కడుంటుందో కష్టాలక్కడ ఉంటాయి. అలాంటిచోట ఆడ, మగ వివక్ష మరింత ఎక్కువగా ఉంటుంది. పేదరికం ఉన్నచోట మహిళలు, బాలికల స్థితి మగవాళ్లతో పోలిస్తే అత్యంత దుర్భరంగా, దయనీయంగా ఉంటుంది. నిరుపేద కుటుంబాలకు సంప్రదాయం పేరుతో, నిఖా పేరుతో వలవేసి ఆ ఇళ్లలోని ఆడపిల్ల లకు మెరుగైన జీవితాన్నిస్తామని అబద్ధాలు చెప్పి వివాహం చేసుకున్నట్టు నటించి వారి బతుకుల్ని నాశనం చేస్తున్న అరబ్‌ షేక్‌లు, వారి తరఫున గద్దల్లా వాలే దళా రీలు హైదరాబాద్‌లోని పాత బస్తీలో మరోసారి పట్టుబడ్డారు. బుధవారం పోలీసులు వెల్లడించిన వివరాలు అత్యంత దిగ్భ్రాంతికరమైనవి. ముంబైకి చెందిన ఒక ప్రధాన ఖాజీ సహా ఈ వ్యవహారంలో 20మందిని వారు అరెస్టు చేశారు. ఈ పెళ్లిళ్ల వెనక భారీ నెట్‌వర్క్‌ ఉన్నదని గుర్తించారు.

ఆ ప్రధాన ఖాజీ ఇప్పటికే వేల సంఖ్యలో ఇలాంటి దొంగ పెళ్లిళ్లు జరిపించాడని, వాటికి వివాహ ధ్రువీకరణ పత్రా లిచ్చి గల్ఫ్‌ దేశాలకు పంపించాడని తేలింది. పాత బస్తీ ఇలాంటి దురన్యాయాలకు చాన్నాళ్లక్రితమే ప్రధాన కేంద్రంగా మారింది. ప్రతి నెలా అక్కడ 20 నుంచి 30 కాంట్రాక్టు పెళ్లిళ్లవుతాయని ఆమధ్య ఒక స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఈ పెళ్లిళ్ల ద్వారా ఏటా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. అప్పులపాలైన కుటుంబాలు... తీవ్ర అనారోగ్యంతో కుములుతూ చికిత్స చేయించుకునే స్థోమత లేని కుటుంబాలు... అర్ధాకలితో అలమటిస్తూ కనీసం తమ పిల్లయినా సుఖపడు తుందన్న ఆలోచన ఉన్న కుటుంబాలు దళారులు చెప్పే మాటలకు లొంగి పోతున్నాయి. తమ పిల్లల జీవితాలను అగాధాల్లోకి నెడుతున్నామని గుర్తించలేక పోతున్నాయి.

నిఖాలతో పేరిట సాగుతున్న ఈ తంతు అత్యంత దుర్మార్గమైనది. ఇందుకు సహకరించే ఖాజీలు ఫోన్‌లో సైతం పెళ్లిళ్లు జరిపించేస్తున్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. అరబ్‌ దేశాల నుంచి వచ్చే వృద్ధ షేక్‌లు మైనర్‌ బాలికలతో పెళ్లి తంతు ముగించుకుని ఒకటి రెండు నెలలు కాపురం పేరిట వారితో కాలక్షేపం చేసి తలాఖ్‌ చెప్పి వెళ్లిపోవడం లేదా తప్పుడు ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ఆ దేశాలకు తీసుకుపోయి వారిని కట్టుబానిసల్లా చూడటం రివాజుగా మారింది. దుబాయ్, ఒమన్, సూడాన్, బహ్రెయిన్, నైజీరియా తదితర దేశాల నుంచి వచ్చే వృద్ధ షేక్‌లు భారీగా కమిషన్‌ ఇస్తామని దళారులకు ఆశ చూపి వారి ద్వారా ఈ మైనర్‌ బాలికలను రప్పించుకుంటున్నారు. ఒక పెద్ద మాఫియా నెట్‌ వర్క్‌ కనుసన్నల్లో ఇదంతా జరుగుతున్నది కాబట్టి బయటకు పొక్కేవి చాలా తక్కువం టున్నారు. పాతబస్తీలో వెల్లడవుతున్న ఘటనలు వింటుంటే అసలు మనం ఎలాంటి సమాజంలో ఉంటున్నామన్న సందేహం తలెత్తుతుంది. నిరుడు ఆత్మ హత్య చేసుకున్న ఒక బాలిక ఉదంతం ఈ కాంట్రాక్టు పెళ్లిళ్ల తీరును వెల్లడించింది.

ఒక్కొక్కరితో నెల నుంచి అయిదు నెలలు గడిపేలా ఒప్పందాలు కుదిర్చి 17 కాంట్రాక్టు వివాహాల్లో ఆమెను ఇరికిస్తే జీవితంపై విరక్తి చెంది బాలిక ఆత్మహత్య చేసుకుంది. పదహారేళ్ల బాలికను 68 ఏళ్ల వృద్ధుడికిచ్చి కట్టబెట్టి ఒమన్‌ పంపిస్తే అక్కడ నిత్యం ఎదురవుతున్న చిత్రహింసలకు తాళలేక గత నెల తల్లికి ఫోన్‌ చేసి మొరపెట్టుకుంది. భార్యగా తీసుకెళ్లి వెట్టి చాకిరీ చేయించుకోవడం, వ్యభిచార గృహాలకు అమ్మేయడంలాంటి ఉదంతాలు కూడా జరుగుతున్నాయి. ఈ దొంగ పెళ్లిళ్లకు బలైనవారిలో 13 ఏళ్ల బాలిక కూడా ఉన్నదంటే పరిస్థితి ఏ స్థాయికి చేరుకుందో అర్ధమవుతుంది. ఒక్కో పెళ్లికి దాదాపు రు. 20 లక్షల వరకూ చేతులు మారుతుండగా బాలిక కుటుంబానికి మిగిలేది వేల రూపాయలకు మించడం లేదు. అమృతా అహ్లువాలియా అనే ఎయిర్‌హోస్టెస్‌ ఒకరు 1991లో విమానంలో ప్రయా ణిస్తున్న ఒక బాలిక ఆగకుండా రోదిస్తుండటాన్ని గమనించి ముంబైలో దిగగానే పోలీసులకు ఫిర్యాదు చేసి పట్టించిన ఘటనలో తొలిసారి ఈ దొంగ పెళ్లిళ్ల వ్యవ హారం ప్రముఖంగా బయటికొచ్చింది. ఆనాటినుంచీ పోలీసులు అడపా దడపా దాడులు చేసి నిందితులను అరెస్టు చేస్తున్నా ఈ దుర్మార్గం అంతకంతకూ పెరుగు తున్నదే తప్ప తగ్గడం లేదు. ఇదిప్పుడు కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలకు కూడా పాకింది.

ఇలాంటి ఉదంతాలను కేవలం పెళ్లిళ్ల కోణంలో చూసి కేసులు పెట్టడంలోనే సమస్యంతా ఉంది. ఈ వ్యవహారాన్ని మోసపు పెళ్లిగా మాత్రమే గుర్తించి... ఖాజీలిస్తున్న వివాహ ధ్రువీకరణ పత్రాలనూ, వాటి ఆధారంగా మైనారిటీ సంక్షేమ శాఖ ఇచ్చే నిఖా ధ్రువపత్రాలనూ పరిశీలించడానికి, వాటిల్లోని నిజానిజాలను తేల్చడానికి సమయం వృథా చేయకుండా మైనర్‌ బాలికలను అపహరించి తరలిస్తున్నట్టు పరిగణించాలి. అందుకు కారకులైనవారిని, వారికి సహకరిస్తున్న వారిని కిడ్నాపర్లుగా గుర్తించి కేసులు నమోదు చేయాలి. అలాగైతేనే నిందితులకు  యావజ్జీవ శిక్ష వరకూ పడే అవకాశం ఉంటుంది. అది జరగాలంటే పకడ్బందీ ఆధారాలు సమర్పించి న్యాయస్థానాల్లో కేసుల సత్వర విచారణకు సహకరించాలి. అప్పుడు ఈ మాదిరి నేరాలకు పాల్పడేవారిలో భయం ఏర్పడుతుంది. ఇప్పుడను సరిస్తున్న విధానాలవల్ల ఎవరిపైనా సరైన చర్య తీసుకోలేకపోతున్నారు. నిందితులు సులభంగా బెయిల్‌ సంపాదించి బయటికొస్తున్నారు. తమ నేరాలను యధావిధిగా కొనసాగిస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఈ పెళ్లిళ్ల తంతుకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్డినెన్స్‌ తీసుకురావాలన్న ఆలోచనతో కూడా ఉందంటున్నారు. ఐపీసీలోని కఠిన సెక్షన్లు వర్తించేలా అందులోని నిబంధనలుండాలి. పాత బస్తీలోని కొన్ని ప్రాంతాలు దుర్భర దారిద్య్రానికి మారుపేరుగా ఉన్నాయి. అక్కడ 40 శాతం కుటుంబాలు పేద రికంలో మగ్గుతున్నాయని చెబుతున్నారు. ఉపాధి అవకాశాలను పెంచడం, మెరు గైన విద్యా సదుపాయాలు కల్పించడం, ఆడపిల్లలను చదివించే కుటుంబాలకు ఆసరా కల్పించడం వగైరా చర్యలు కూడా అవసరం. అలాగే మత పెద్దల సహ కారాన్ని కూడా తీసుకోవాలి. ఇవన్నీ సమగ్రంగా అమలు చేసినప్పుడే దీన్ని శాశ్వ తంగా రూపుమాడానికి అవకాశం ఉంటుంది.

Read latest Vedika News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా