ఒబామా హితవచనాలు

13 Jan, 2017 00:28 IST|Sakshi
ఒబామా హితవచనాలు

ఎనిమిదేళ్ల క్రితం అమెరికాలోనే కాదు... ప్రపంచమంతటా ఉత్సాహోద్వేగాలను రేపిన బరాక్‌ ఒబామా శకం ముగిసింది. అమెరికా అధ్యక్ష పీఠం నుంచి మరి తొమ్మిది రోజుల్లో వైదొలగబోతూ షికాగో వేదికగా బుధవారం ఆయన చేసిన తుది ప్రసంగం కొన్ని హిత వచనాలతో, మరికొన్ని హెచ్చరికలతో, కొంత ఆశావహ దృక్పథంతో సాగింది. ప్రసంగం సందర్భంగా ఆయనలో కనిపించిన ఉద్వేగం, ఉద్విగ్నతలు నిజానికి ఆయనవి మాత్రమే కాదు... అమెరికా పౌరులందరిలోనూ అవి ఉన్నాయి. ఇకపై దేశం ఎలా ఉండబోతుందన్న భయాందోళనల పర్యవసా నంగా ఏర్పడ్డ ఉద్వేగాలు, ఉద్విగ్నతలవి. నిజానికి ఇలాంటి స్థితిగతులు ఒబామా తొలిసారి ఎన్నికైన 2008 నాటికి పుష్కలంగా ఉన్నాయి. అప్పటికి అమెరికా సమాజాన్ని నిరుద్యోగం నిలువెల్లా బాధించేది. ఆర్ధిక మాంద్యం ఏర్పడి, వేతనాలు పడిపోయి దిక్కుతోచని స్థితిలో ప్రజలున్నారు.

ఉద్యోగాలపై అనిశ్చితి. భవిష్యత్తుపై బెంగ. వీటికితోడు అంతర్జాతీయంగా అమెరికా ప్రతిష్ట మసకబారింది. ఆ ఎన్నికల్లో ఒబామా ఒక అనుకూల నినాదంతో ముందుకొచ్చారు. ‘యస్‌...మనం సాధించ గలం’ అంటూ ఆయనిచ్చిన భరోసా ప్రజానీకంలో ఆశలు రేపింది. ఏదో అద్భుతం జరిగి అంతా సర్దుకుంటుందన్న నమ్మకం అందరిలో ఏర్పడింది. ఆనాటి స్థితిగతు లతో పోలిస్తే అమెరికా ఇప్పుడు చాలా రంగాల్లో మెరుగ్గా ఉంది. ఒబామా పగ్గాలు చేపట్టేనాటికి అమెరికాలో నిరుద్యోగం 7.8 శాతం. ఇప్పుడది 4.6 శాతం. వేతనాల్లో సైతం 3 శాతం పెరుగుదల ఉంది. ఉద్యోగ కల్పనలో సైతం వృద్ధి కనిపిస్తోంది. ఒబామా అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఇప్పటివరకూ కోటీ 58 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. కానీ రిపబ్లికన్‌ అభ్యర్థిత్వం కోసం ప్రయత్నించడంతో మొదలుబెట్టి అధ్యక్ష ఎన్నికలు ముగిసేవరకూ డోనాల్డ్‌ ట్రంప్‌ ఊదరగొట్టిన ప్రచారంలో ఇవన్నీ కొట్టుకుపోయాయి. ‘మరోసారి అమె రికాను ఉన్నతంగా నిలుపుదాం’ అని పిలుపునిచ్చిన ట్రంప్‌నే మెజారిటీ ఓటర్లు విశ్వసించారు. దేశం సరిగా లేదన్న ట్రంప్‌ మాటల్లో నిజమున్నదని వారు నమ్మారు.    

అయితే ట్రంప్‌ శూన్యం నుంచి ఉద్భవించలేదు. అందుకు దోహదపడిన అనేక కారణాల్లో ఒబామా కూడా ఉన్నారు. 2008లో తాను సాధించిన చరిత్రాత్మక ఘన విజయాన్ని అమెరికా నిరీక్షిస్తున్న మార్పుగా ఒబామా చెప్పుకోలేదు. ఆ మార్పును తీసుకురావడానికి తన విజయం ఒక అవకాశం మాత్రమేనని ఆయన ప్రకటిం చారు. కానీ ఆయన ఆ అవకాశాన్ని సంపూర్ణంగా వినియోగించుకోలేదు. ఆయన తీసుకొచ్చిన మార్పులు అట్టడుగు అమెరికన్‌ పౌరుణ్ణి పూర్తిగా తాకలేదు.  కార్పొ రేట్‌ ప్రపంచానికి ఆయన ప్రకటించిన బెయిలవుట్‌ ప్యాకేజీలు ఆర్ధిక మాంద్యాన్ని అధిగమించడానికి తోడ్పడి ఉండొచ్చు.

అంతా సవ్యంగా ఉన్నదని ఆర్ధిక నిపుణులు విశ్లేషించి ఉండొచ్చు. కానీ ఆ చాటునే ఉపాధి కోల్పోయినవారూ, ఆదాయం స్తంభించినవారూ ఇంకా మిగిలిపోయారు. వారి గురించి పట్టించుకున్నవారు లేరు. అలాంటివారందరికీ ట్రంప్‌ ఆరాధ్యుడయ్యారు. మీ నిరుద్యోగానికి, ఇతర సమస్య లకూ వలస వస్తున్నవారే కారణమని ఆయన చెబితే వారంతా నమ్మారు. అలాంటి వారందరినీ రకరకాల ఆంక్షలతో అడ్డుకుంటానని, మీ ఉద్యోగాలు మీకే వచ్చేలా చేస్తానని ఇచ్చిన వాగ్దానం వారిలో ఆశలు రేపింది. ఈ క్రమంలో ట్రంప్‌లోని బాధ్యతారాహిత్యం, జాత్యహంకారం, మహిళలపై ఆయనకున్న చిన్నచూపు వంటివి వారికి పట్టలేదు. ఎగువ తరగతి వర్గాల్లో ట్రంప్‌పై ఏర్పడి, విస్తృతమ వుతున్న భయాందోళనలు వారిని తాకలేదు. అయితే ఒబామా సాధించిన ప్రధాన విజయాల్లో ఇరాన్‌తో అణు ఒప్పందం, ఒసామా బిన్‌ లాడెన్‌ను హతమార్చడం, 2.5 కోట్ల మందిని ఆరోగ్య బీమా కిందకు తీసుకురావడం వంటివి ఉన్నాయి.

ఉదారవాద విలువలకూ, సంస్కృతికి విఘాతం ఏర్పడే ప్రమాదంపైనా, ప్రజా స్వామ్యానికి అవరోధం కలిగిస్తున్న ధోరణులపైనా అప్రమత్తంగా ఉండాలని ఒబామా తన వీడ్కోలు ప్రసంగంలో పౌరుల్ని హెచ్చరించారు. బాగానే ఉంది. కానీ అలాంటి ధోరణులను మొగ్గలోనే తుంచడానికి తన ప్రభుత్వం వైపు ఆ దిశలో ఏమేరకు కృషి జరిగిందో సమీక్షించుకుంటే మూలం ఎక్కడున్నదో ఆయనకే అర్ధమ వుతుంది. ఎడ్వర్డ్‌ స్నోడెన్, చెల్సియా మానింగ్, జెఫ్రీ స్టెర్లింగ్‌ వంటివారు వెల్లడిం చిన నిజాలపై దర్యాప్తు చేసి, ప్రభుత్వపరంగా జరిగిన తప్పిదాలపై దర్యాప్తు చేయించడానికి బదులు ఆయన ప్రభుత్వం వారిని తీవ్రంగా వేధించింది. చెల్సియా మానింగ్, జెఫ్రీ స్టెర్లింగ్‌ జైలుపాలైతే స్నోడెన్‌ రష్యాలో తలదాచుకుంటున్నాడు. ఇరాక్, అఫ్ఘానిస్తాన్‌లలో బుష్‌ అమలు చేసిన విధానాలను లిబియా వంటి దేశాల్లో ఒబామా కొనసాగించారు. అఫ్ఘాన్‌తోపాటు ఎమెన్, సోమాలియా తదితర దేశాల్లో అమెరికా ద్రోన్‌ దాడులు యథాతథంగా అమలయ్యాయి. ఈ దాడుల్లో ఉగ్రవా దులు మరణించి ఉండొచ్చుగానీ అంతకు మించి అమాయక పౌరులెందరో ప్రాణాలు కోల్పోయారు.

ఇలాంటి ఉదంతాలు ప్రపంచంలోని ముస్లింలలో అమె రికాపై ఆగ్రహావేశాలను రెచ్చగొట్టగా, ఆ మేరకు దేశంలో జాత్యహంకార ధోరణులు పెరిగాయి. ఉగ్రవాదంపై ఏర్పడాల్సిన ద్వేషం ముస్లింలపైకి మళ్లుతున్నా ఒబామా దాన్ని సరిచేయడానికి ప్రయత్నించలేదు. నల్లజాతీయులపై జరుగుతున్న దాడుల విషయంలోనూ ఆయన వ్యవహారశైలి నిరాశ కలిగించింది. నిరుడు జపాన్‌ను సంద ర్శించిన సందర్భంగా హిరోషిమా పట్టణం వెళ్లి అణు బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన లక్షన్నరమందికి ఒబామా నివాళులర్పించారు. కానీ ఆ దురంతంపై క్షమాపణ చెప్పడానికి ఆయన సిద్ధపడలేదు. ఇది ఆయన నమ్ముతున్న ఉదారవాద విలువలకు భిన్నమైనది. మొత్తానికి అమెరికా సమాజంలో ఉన్న మితవాద ధోరణు లను తగ్గించడానికి తోడ్పడే ఏ పనినీ ఒబామా సక్రమంగా చేయలేకపోయారు. మరికొన్ని రోజుల్లో ట్రంప్‌ హయాం మొదలవుతుంది. ఒబామా చెప్పినట్టు పెరు గుతున్న జాత్యహంకారం, అసమానతలు, వివక్ష తదితర పోకడలపై అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండకతప్పదు. తమ దేశాన్ని ప్రపంచంలో విలక్షణంగా, ఉన్నతంగా ఉంచిన విలువల పరిరక్షణకు ఇది చాలా అవసరం.

మరిన్ని వార్తలు