ఫ్రాన్స్‌ ఎన్నిక చెప్పేదేమిటి?

9 May, 2017 01:58 IST|Sakshi
ఫ్రాన్స్‌ ఎన్నిక చెప్పేదేమిటి?

అందరి అంచనాలకూ తగ్గట్టే ఫ్రాన్స్‌ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో మధ్యస్థ మితవాద పక్షం ఎన్‌ మార్చ్‌ పార్టీ అభ్యర్థి ఇమానియెల్‌ మేక్రోన్‌ ఘన విజయం సాధించారు. పోలైన ఓట్లలో 66.06 శాతం ఆయనకు లభిస్తే తీవ్ర మితవాద సిద్ధాంతంతో దూకుడుగా రంగం మీదికొచ్చిన లీపెన్‌కు 33.94 శాతం ఓట్లొచ్చాయి. ఫ్రాన్స్‌ పౌరులు లీ పెన్‌ ప్రవచించే తీవ్ర జాతీయవాదంవైపు మొగ్గు చూపుతారా లేక కొన్ని మార్పులతో ఇప్పుడున్న విధానాలనే కొనసాగిస్తే సరిపోతుందని వాదించే మేక్రోన్‌కు పట్టం గడతారా అన్న మీమాంస యూరప్‌ ఖండంలో మాత్రమే కాదు... ప్రపంచం మొత్తంలో ఏర్పడింది. అక్కడ తప్పటడుగు పడితే దాని ప్రభావం ప్రపంచ దేశాలపై కూడా తీవ్రంగా ఉంటుందని అందరూ ఆందోళనపడ్డారు. అలా జరగనందుకు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎక్కడో ఉన్న జపాన్‌ మొదలుకొని అన్ని ప్రధాన దేశాల స్టాక్‌ మార్కెట్‌లు ఉత్సాహంతో ఉరకలెత్తడమే ఇందుకు తార్కాణం.

లీపెన్‌ ఎన్నికైతే బ్రిటన్‌ తరహాలోనే ఫ్రాన్స్‌ కూడా యూరప్‌ యూని యన్‌(ఈయూ)నుంచి బయటికొచ్చేది. ఆ సంస్థ భవితవ్యం అయోమయంలో పడేది. దాని ప్రభావం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై తీవ్రంగా ఉండేది. అమెరికాలో నిరుడు నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో  ట్రంప్‌–హిల్లరీల మధ్య సాగిన హోరాహోరీ పోరుతో ఈ ఎన్నికను చాలామంది పోల్చారు. ట్రంప్‌ మాదిరే లీపెన్‌ కూడా వలసలకు బద్ధ వ్యతిరేకి. ఉపాధిలో దేశ పౌరులకే తప్ప బయటివారికి ప్రాముఖ్యతనీయరాదనే జాతీయవాదంతోపాటు జనాన్ని ఆకర్షించే పథకాలు ప్రకటించడం వగైరాల్లో కూడా ఇద్దరికీ పోలిక ఉంది. ఎన్నికల వేళ హిల్లరీని బజారుకీడ్చి ఆమె విజయావకాశాలను దెబ్బతీసినట్టుగానే మేక్రోన్‌ గుట్టు రట్టు చేసి ఇంటి దారి పట్టించాలని రష్యా హ్యాకర్లు గట్టిగానే ప్రయత్నించారు. కానీ దాన్ని ఆయన అవలీలగా అధిగమించగలిగారు. అయితే నెగ్గాల్సిన మరో ప్రధాన పరీక్ష ఉంది. 577 మంది సభ్యులుండే పార్లమెంటుకు వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో ఆయన పార్టీ నెగ్గాలి. అది జరిగితేనే తన విధానాలను అమలు చేయడానికి వీలవుతుంది. లేనట్టయితే అసాధ్యం.

ఈ ఎన్నిక మెజారిటీ ప్రజలను ఏకం చేసిందని సంబరపడుతున్నవారున్నట్టే దీనిపై పెదవి విరుస్తున్నవారూ ఉన్నారు. ప్రాణాంతకమైన గుండెపోటును యూరప్‌ వెంట్రుకవాసిలో తప్పించుకున్న మాట నిజమే అయినా... ఆ ప్రమాదం సమసిపోలేదని విశ్లేషకుల వాదన. ఇందులో నిజముంది. లీ పెన్‌ ప్రచార సరళి ఎంత నిస్తేజంగా ఉన్నా ఆమె పార్టీకి కోటికి పైగా ఓట్లు లభించాయి. దేశ చరిత్రలో తీవ్ర మితవాద పక్షానికి ఈ స్థాయిలో ఓట్లు లభించడం ఇదే తొలిసారి. 2002లో ఆమె తండ్రి పోటీ చేసినప్పుడు ఇందులో సగం కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. 2022 ఎన్నికల నాటికి ఆమె పార్టీ విజేత కాగలిగినా ఆశ్చర్యం లేదు. మరో ప్రమాదకరమైన ధోరణి కూడా ఈ ఎన్నికల్లో కనబడింది. పోలింగ్‌లో 74 శాతంమంది మాత్రమే పాలుపంచుకున్నారు. ఇది గత యాభైయ్యేళ్లలో అతి తక్కువ. ఎవరొచ్చినా ఒరిగేదేమీ లేదన్న నిర్లిప్తత ఓటర్లలో నెలకొని ఉండటమే ఇందుకు కారణం. వరస ఉగ్రవాద దాడుల తర్వాత ప్రకటించిన అత్యవసర పరిస్థితి దేశంలో ఇంకా కొనసాగుతోంది. ఆ భయం ఫ్రాన్స్‌ను వెన్నాడుతోంది. మరోపక్క దేశ ఆర్థిక వ్యవస్థ మన్ను తిన్న పాములా స్తంభించిపోయింది. ఉపాధి అవకాశాలు లేక యువత దశాబ్దాలుగా తీవ్ర నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయింది. పాలక పక్షాలుగా గుర్తింపు పొందిన మితవాద, వామపక్షాలు రెండూ చరిత్రలో తొలిసారి తీవ్రంగా దెబ్బతిన్నాయి. వారిని జనం విశ్వసించడం లేదని ఈ ఎన్నికలు నిరూపించాయి. తీవ్ర మితవాద పక్షాన్ని ఎదుర్కొనే భారం రాజకీయంగా అనుభవంలేని మేక్రోన్‌ భుజస్కంధాలపై పడింది.

ఈ ఎన్నికల్లో మేక్రోన్‌ పేద జనం బాధల గురించి, వాటినుంచి గట్టెక్కేందుకు తన దగ్గరున్న పథకాల గురించి మాట్లాడలేదు. ఆయనదంతా వ్యాపారవేత్తల భాష. స్వేచ్ఛా మార్కెట్‌ విధానాలకు ఆయన అను కూలం. సామాజిక సమస్యలపై వామపక్ష దృక్పథంతో వ్యవహరిస్తానని చెప్పినా, ఈయూను బలోపేతం చేయడమే ఆయన లక్ష్యం. ఆ విధానాల ఆచరణ తర్వాత అసలు కథ మొదలవుతుంది.  జీడీపీలో ప్రస్తుతం 56 శాతంగా ఉన్న ప్రజా సంక్షేమ పథకాల  వ్యయాన్ని 52 శాతానికి తగ్గిస్తానని మేక్రోన్‌ ఇప్పటికే ప్రకటించారు. ఆ పని చేయాలంటే పెన్షన్లపై కోత పెట్టాలి. విద్య, ప్రజారోగ్యం, పిల్లల ఉచిత సంర క్షణ వంటి అంశాలపై వ్యయం తగ్గించాలి.  కార్మిక రంగ సంస్కరణలు తీసుకు రావాలి. వీటి అమలు అంత సులభమేం కాదు. నిజానికి సమస్య ఫ్రాన్స్‌ది కాదు. ఈయూ లాంఛనంగా ప్రారంభమైననాడు పెట్టుకున్న సమష్టి సౌభాగ్యం, రాజకీయ సమన్వయ సాధన అనే ద్విముఖ లక్ష్యాలను సాధించగలిగి ఉంటే ఫ్రాన్స్‌ మాత్రమే కాదు... అందులో భాగంగా ఉన్న ఏ దేశమూ సమస్యల్లో కూరుకుపోయేది కాదు.

యూరప్‌ దేశాలమధ్య పరస్పర అవిశ్వాసం, ఆగ్రహం అంతకంతకూ పెరుగుతున్నాయి. దేశాల మధ్య ఉండే వైవి ధ్యతను, వాటి ఆర్థిక వ్యవస్థల్లో ఉండే వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకోకుండా అమల్లోకి తెచ్చిన ఉమ్మడి కరెన్సీ వ్యవస్థ–యూరో దీనంతటికీ మూలం. ఇటలీ, గ్రీస్, స్పెయిన్, బ్రిటన్‌లాంటి దేశాల్లో ప్రమాదకర ఛాయలు కనిపిస్తున్నా సరిదిద్దుకోవడానికి ఈయూ పెద్దలు ముందుకు రాలేదు. 2009లో అమెరికాలో నిరుద్యోగిత 10 శాతం ఉంటే దాన్ని ఇప్పుడు 5 శాతంకన్నా దిగువకు తీసుకు రాగలిగారు. యూరప్‌లో సైతం అప్పటికి నిరుద్యోగిత అదే స్థాయిలో ఉంది. కానీ అది ఆనాటినుంచీ పెరగడమే తప్ప తగ్గడం లేదు. వీటన్నిటి పర్యవసానంగానే యూరప్‌లో ఎక్కడికక్కడ తీవ్ర మితవాద పక్షాలు బలం పుంజుకుంటున్నాయి. బ్రిటన్‌ ఏకంగా ఈయూ నుంచే నిష్క్రమించింది. ఫ్రాన్స్‌లో ఉదారవాదం సాధిం చిన విజయాన్ని చూసి మురుస్తూ, తన కర్తవ్య నిర్వహణను మరిస్తే ఈయూ దుకాణం మూతబడే ప్రమాదం ఎంతో దూరంలో ఉండదు. ఫ్రాన్స్‌ అధ్యక్ష ఎన్నిక చాటుతున్న సత్యమిదే.

మరిన్ని వార్తలు