‘ఎన్‌ఎస్‌జీ’ ఆశాభంగం

28 Jun, 2016 01:33 IST|Sakshi
‘ఎన్‌ఎస్‌జీ’ ఆశాభంగం

అణు సరఫరా దేశాల బృందం(ఎన్‌ఎస్‌జీ)లో సభ్యత్వం కోసం భారత్ చేసిన ప్రయత్నాన్ని ఊహించినట్టుగానే చైనా వమ్ముచేసింది. వాస్తవానికి అలా చేసింది అదొక్కటే కాదు...స్విట్జర్లాండ్, బ్రెజిల్, మెక్సికో, టర్కీలు కూడా చైనా దోవనే ఎంచుకున్నాయి. అయితే చైనా వ్యతిరేకించడానికీ, మిగిలిన దేశాల అభ్యంత రాలకూ మధ్య తేడా ఉంది. స్విట్జర్లాండ్, బ్రెజిల్, మెక్సికో, టర్కీలు ఎన్‌ఎస్‌జీ సభ్యత్వం ఇవ్వడానికి సంబంధించిన ప్రక్రియకు అనుసరించే ప్రమాణాలేమిటో ముందుగా నిర్ణయించాలని కోరాయి. చైనా ఇంకాస్త ముందుకెళ్లింది. అది అంత ర్జాతీయ నిబంధనలు, సూత్రాలు ఏకరువు పెట్టింది.

మిగిలిన దేశాల సూచనల వల్ల మనకు కలిగే నష్టమేమీ లేదు. ఎందుకంటే అణు పరిజ్ఞానాన్ని లేదా అణు పదార్థాన్ని ఎవరికీ  రహస్యంగా చేరేసిన చరిత్ర మన దేశానికి లేదు. అలాంటి చరిత్ర ఉంటే గింటే చైనాకుంది. ఇలాంటి ప్రమాణాలను ఏర్పర్చడం ప్రారంభిస్తే చైనా, మరికొన్ని ఇతర దేశాల సభ్యత్వాలు గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు కూడా. అయితే భారత్ విషయంలో చైనా చెబుతున్న అభ్యంతరాల సారాంశం వేరే ఉంది. అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పీటీ)పై సంతకం చేసిన దేశాలకే ఎన్‌ఎస్‌జీ తదితర సంస్థల్లో సభ్యత్వం ఇవ్వాలన్న నిబంధన ఎన్‌పీటీలో ఉంది. అలా సంతకం చేయాలంటే ముందుగా మన అణు హోదాను వదులుకోవడానికి సిద్ధపడి ఉండాలి.

ఎన్‌పీటీ ఒప్పందమే ఎంతో వివక్షతో కూడుకుని ఉన్నది. దాన్ని ఏర్పరిచిన అయిదు అగ్ర దేశాలూ ఆ నిబంధననుంచి తమకు తాము మినహా యింపు ఇచ్చుకున్నాయి. దీన్ని ఎత్తి చూపే మన దేశం మొదటినుంచీ ఆ ఒప్పం దంపై సంతకం పెట్టడానికి నిరాకరిస్తోంది. అమెరికాతో 2008లో పౌర అణు ఒప్పం దం కుదరడానికి ముందు మన దేశం అదేమాట చెప్పింది. అందుకు అమెరికా అంగీకరించడంవల్లే ఆ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అది చైనాకు కంటగింపుగా ఉంది.

ఇప్పుడు ఎన్‌పీటీతో ఎన్‌ఎస్‌జీ సభ్యత్వాన్ని ముడిపెడితే భారత్‌ని అడ్డుకోవడం చైనాకు సులభమవుతుంది. మనం ఎప్పటిలా ఎన్‌పీటీపై సంతకానికి నిరాకరిస్తాం గనుక చర్చంతా దాని చుట్టూ నడుస్తుంది. చివరకు అలా ఒప్పుకుంటే తప్ప భారత్ సభ్యత్వాన్ని అంగీకరించకూడదని ఎన్‌ఎస్‌జీలో మిగిలిన దేశాలు భావించవచ్చు. ఎందుకంటే అందులో సభ్యత్వం పొందిన దేశాలన్నీ అలా సంతకం పెట్టి వచ్చాయి. తమకు లేని మినహాయింపు భారత్‌కు ఎందుకని అవి నిలదీ యొచ్చు. ఆ విషయంలో అమెరికా అందరినీ ఒప్పించగలిగినా వివక్షాపూరిత ఎన్‌పీటీపై తమ తరహాలో కాక భారత్ పంతం నెగ్గించుకుందన్న న్యూనతకు ఆ దేశాలు గురవుతాయి. అలాంటి పరిస్థితి ఏర్పడేలా చూడటమే చైనా ధ్యేయం. తన చిరకాల మిత్ర దేశం పాకిస్తాన్ ప్రయోజనాలను నెరవేర్చడం చైనా చర్యలోని ఆంతర్యం. పైకి భారత్, పాకిస్తాన్‌లు రెండింటికీ సభ్యత్వాన్ని ఇవ్వొద్దని చైనా వాదిస్తోంది. ఒక ప్రాంతంలో తరచు విభేదించుకునే రెండు దేశాల్లో ఒకదానికి సభ్యత్వమిచ్చి రెండో దేశానికి ఇవ్వకపోవడం మరిన్ని సమస్యలకు దారితీస్తుం దన్నది ఆ దేశం పైకి చెబుతున్న మాట. కానీ భారత్‌కు సభ్యత్వం ఇవ్వదల్చుకుంటే పాకిస్తాన్‌కు కూడా ఇవ్వాలన్నది దాని ఉద్దేశం.
 
పాక్‌కు ఎన్‌ఎస్‌జీ సభ్యత్వం ఇవ్వడాన్ని మన దేశం అడ్డుకోవడంలేదు. కానీ ఎన్‌ఎస్‌జీలోని మిగిలిన దేశాలకు తీవ్ర అభ్యంతరాలున్నాయి. ఉత్తర కొరియాకు అణు పరిజ్ఞానం అందించింది పాకిస్తానేనని చాలా దేశాలకు అనుమానాలున్నాయి. సమస్యంతా దానిచుట్టూ తిప్పితే భారత్ సభ్యత్వం ఆగిపోతుందని చైనా భావి స్తున్నట్టు కనబడుతోంది. ఎన్‌ఎస్‌జీ సభ్యత్వం ఉంటే అణు రియాక్టర్లు, యురేని యంవంటివి ఎవరివద్దనైనా కొనుగోలు చేయడానికి, అమ్మడానికి అవకాశం ఏర్ప డుతుంది.

భారత్ ప్రధాన అవసరం అణు విద్యుదత్పత్తి కాబట్టి తనతో ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంటే సరిపోయేదానికి ఎన్‌ఎస్‌జీ సభ్యత్వం అవసరం ఏము న్నదని చైనా అనుకుంటుండవచ్చు. కాని యూరోప్ దేశాల సాంకేతికతతో పోలిస్తే చైనా అణు రియాక్టర్లు మెరుగైనవేమీ కాదు. ఒక వేళ చైనానుంచి కొనాలనుకున్నా ఎన్‌ఎస్‌జీ సభ్యత్వం ఉంటే మిగిలిన దేశాలు ఇవ్వజూపుతున్న ధరతో పోల్చి ఆ దేశంతో బేరసారాలు జరపడానికి మనకు అవకాశం ఉంటుంది. అది లేకుండా చేయడం కూడా చైనా ఉద్దేశం కావొచ్చు.  
 
భారత్‌కు సభ్యత్వం విషయంలో చైనాకు ఎలాంటి అభ్యంతరాలూ ఉండబో వని మన దేశం భావించింది. విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ ఒకటికి రెండుసార్లు ఆ సంగతి చెప్పారు. మన విదేశాంగ కార్యదర్శి ఎస్. జయశంకర్ ఈ విషయమై చర్చించడానికి చైనా కూడా వెళ్లారు. చైనా మద్దతుపై ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాంటి అభిప్రాయం మన దేశానికి కలిగించడంలో చైనా నాయకత్వం సఫలమైంది. అయితే ఎన్‌ఎస్‌జీ సభ్యత్వానికి తమ మద్దతుంటుందని మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనో నీటో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ఈనెల మొదట్లో ప్రకటించినా తీరా సమయం వచ్చేసరికి ఆ దేశం ఎందుకు వ్యతిరేకించిం దన్నది అనూహ్యం. స్విట్లర్లాండ్ సైతం ఇలాగే హామీ ఇచ్చి వెనక్కు తగ్గింది. అసలు ఎన్‌ఎస్‌జీ సభ్యత్వం కోసం అర్రులు చాచడం అనవసరమని కొంతమంది నిపు ణులు చెబుతున్న మాట. అమెరికాతో పౌర అణు ఒప్పందం కుదిరినప్పుడే ఎన్‌ఎస్‌జీ సభ్యత్వం ద్వారా సమకూరే చాలా ప్రయోజనాలు మనకు దక్కాయని వారంటున్నారు.

ఇప్పుడు కొత్తగా చేరడంవల్ల భవిష్యత్తులో ఆ సంస్థకు సంబం ధించిన నిబంధనల రూపకల్పనలో పాలుపంచుకోవడం మినహా మనకు అద నంగా దక్కేదేమీ ఉండదని వారి వాదన. ఎన్‌ఎన్‌జీ పుట్టుక, పెరుగుదలలో భారత్ వ్యతిరేక మూలాలున్నాయి. 1974లో మన దేశం పోఖ్రాన్‌లో అణు పరీక్ష జరిపాక దీన్ని ఏర్పాటు చేశారు. రెండోసారి పరీక్ష సమయంలో దాని నిబంధనలు మరింత కఠినం చేశారు. అలాంటి సంస్థలో మనకు అంత సులభంగా సభ్యత్వం దక్కడం కూడా సాధ్యం కాదు.

ఒకవేళ అంతా సవ్యంగా జరిగి ఎన్‌ఎస్‌జీ సభ్యత్వం లభిస్తే దౌత్యపరంగా ఘన విజయం సాధించామని చెప్పుకోవడానికి ఎన్‌డీఏ ప్రభు త్వానికి అవకాశం ఉండేది. ఇప్పుడది దూరమైంది. భారత్‌కు ఆ సభ్యత్వం రావడం పెద్ద కష్టం కాదని, త్వరలోనే అది లభిస్తుందని అమెరికా చెబుతోంది. ఆ సంగతెలా ఉన్నా ఆచితూచి అడుగేయడం, చైనా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని మనం గుర్తించకతప్పదు.

మరిన్ని వార్తలు