‘నరక’ జీవనం!

2 Apr, 2016 01:28 IST|Sakshi

ఎన్నికల హడావుడిలో తలమునకలయి ఉన్న కోల్‌కతాను పెను విషాదం చుట్టు ముట్టింది. అక్కడ నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌లో కొంత భాగం కూలి గురువారం మధ్యాహ్నం 24మంది దుర్మరణం చెందిన ఘటన అందరినీ దిగ్భ్రాంతిపరిచింది. దాదాపు 40 మీటర్ల మేర చేపట్టిన కాంక్రీటు నిర్మాణం 24 గంటలు గడవకుండానే భారీ శబ్దంతో కూలిపోయింది. ఆ కాంక్రీటుకు ఆలంబనగా అమర్చిన ఇనుప దూలాలు పడిపోవడంతో ఒక బస్సు, మూడు టాక్సీలు, ఇతర వాహనాలు దాని కింద చిక్కుకుపోయాయి. అనేకమంది పాదచారులు సైతం ప్రమాద సమయంలో అక్కడున్నట్టు సీసీ టీవీ ఫుటేజ్‌లోని దృశ్యాలు చెబుతున్నాయి. అక్కడికక్కడే 20మందికిపైగా మరణిస్తే మరికొందరు ఆస్పత్రులకు తీసుకెళ్తుండగా చనిపో యారు. మరో 88మంది గాయపడ్డారు.

నగర జీవనం ఎంత అస్తవ్యస్థంగా, అరాచకంగా ఉంటుందో...అక్కడ అడుగడుగునా ప్రమాదాలెలా పొంచి ఉంటాయో ఈ విషాదఘటన మరోసారి వెల్లడించింది. ప్రమాదం జరిగిన బుర్రాబజార్ ప్రాంతం నిత్యం ఎంతో రద్దీగా ఉంటుంది. ఆసియాలోనే అతి పెద్ద హోల్‌సేల్ మార్కెట్లలో ఒకటి కావడంవల్ల అక్కడ వాహనాల తాకిడి, వాటితో వచ్చే ట్రాఫిక్ సమస్యలు అధికం. అందుకు పరిష్కారంగానే హౌరా వరకూ రెండున్నర కిలోమీటర్ల పొడ వునా ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఏడేళ్లుగా అది సాగుతూనే ఉంది. మరో 20 శాతం పనులు పూర్తయితే ఫ్లైఓవర్ జనానికి అందుబాటులో కొస్తుందనుకున్నంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది.

రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల వంటి భారీ నిర్మాణాలు చేపట్టినప్పుడు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు, అలాంటి నిర్మాణాలకు అవసరమైన నిపుణత కొరవడటంవంటి కారణాలు జనానికి శాపంగా మారుతున్నాయి. హైదరాబాద్ నగరంలో సెక్రటేరియట్ సమీపంలో చంద్రబాబు సీఎంగా ఉండగా 1998లో పనులు మొదలెట్టిన తెలుగుతల్లి ఫ్లైఓవర్ నిర్మాణమే దీనికి ఉదాహరణ. దాని పనులు సగంలో ఉండగా ట్యాంక్‌బండ్ సమీపంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహాన్ని వేరే చోటకు తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై దళిత సంఘాలనుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడం, రోడ్డు వెడల్పులో సమస్యలు ఎదురుకావడం పర్యవ సానంగా అది దీర్ఘకాలం నిలిచిపోయింది. దళిత సంఘాల అభీష్టానికి అను గుణంగా ఆ ఫ్లైఓవర్ డిజైన్‌ను ఎలా సవరించాలో అప్పటి ప్రభుత్వానికి అర్ధం కాలేదు. 2004లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ప్రమాణం చేశాక అదంతా కొలిక్కి వచ్చి, పనులు చకచకా సాగి 2005 జనవరిలో ఫ్లైఓవర్ ప్రారంభమైంది. మొత్తంగా ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడానికి ఏడేళ్ల సమయం పట్టింది.

ముందు చూపు లేకుండా, అవసరమైన ప్రత్యామ్నాయాలను ఆలోచిం చకుండా లేడికి లేచిందే పరుగన్నట్టు వ్యవహరిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది.  ఇప్పుడు బుర్రాబజార్‌లో కూలిన ఫ్లైఓవర్ చరిత్రా అలాంటిదే. రోడ్డుకు అటూ ఇటూ భారీ భవంతులున్నాయి. వాటిని అవసరమైనంతమేర తొలగించి రోడ్డు వెడల్పుచేశాక పనులు ప్రారంభిస్తే నిర్మాణం అవరోధం లేకుండా సాగేది. అలా చేయకపోవడంవల్ల సమస్య కోర్టులకెక్కి ఇంత జాప్యం చోటుచేసుకుంది. 2009 ఫిబ్రవరిలో నిర్మాణం పనులు ప్రారంభంకాగా 2010 ఆగస్టుకల్లా పూర్తిచేయాలని అప్పట్లో అనుకున్నారు. ఇప్పటికి తొమ్మిదిసార్లు గడువు తేదీలు దాటిపోయాయి. తాజా గడువు వచ్చే ఆగస్టు. అందుకోసం ఆదరాబాదరగా పనులు చేపట్టడమే ప్రమాదానికి దారి తీసి ఉండొచ్చునని కొందరు నిపుణులు భావన. ఈ ఫ్లైఓవర్ డిజైన్‌లో లోపాలున్నాయని, అది కొన్ని భవంతులకు అత్యంత సమీపంనుంచి పోయేలా రూపొందించారని వారు చెబుతున్నారు. ప్రమాదానికి కారణం మీరంటే మీరని రాజకీయ పక్షాలు ఆరోపించుకుంటున్నాయి. ఇప్పుడు అక్కడ ఎన్నికల జాతర నడుస్తున్నది గనుక ఇది సాధారణమే. అయితే ప్రమాదం విధి లిఖితమని కంపెనీ ప్రతినిధి అనడం అమానవీయం, దుర్మార్గం.

నగరాలు, పట్టణాలు ఎదుర్కొనే ట్రాఫిక్ రద్దీకి పరిష్కారమవుతాయ నుకున్న ఫ్లై ఓవర్లు, స్కైవేలు ఆచరణలో వాటికవే సమస్యలుగా మారడం, ఉన్న ఇబ్బందుల్ని మరింతగా పెంచడం చాలాచోట్ల కనిపిస్తోంది. 2010-14 మధ్య జరిగిన అసహజ మరణాల్లో ఫ్లైఓవర్లు, ఇతర నిర్మాణాలు కూలిన కారణంగా సంభవించినవే అధికమని జాతీయ క్రైం రికార్డుల బ్యూరో నిరుడు వెల్లడించింది. ఆ అయిదేళ్లలోనూ ఈ కేటగిరి కింద మొత్తంగా 13,473మంది చనిపోతే అందులో 47.3 శాతం...అంటే 6,233మంది ఫ్లైఓవర్లవంటి నిర్మాణాలు కూలి పోవడంవల్ల ప్రాణాలు కోల్పోయారని ఆ సంస్థ చెబుతోంది. పౌరులకు ఇవెంత ప్రమాదకరంగా పరిణమించాయో ఈ గణాంకాలే వివరిస్తున్నాయి. పట్టణీకరణ వల్ల తలెత్తే సమస్యలకు  ఫ్లైఓవర్లు, స్కైవేలు, మెట్రో రైళ్లు, ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు పరిష్కారమని ప్రభుత్వాల అధినేతలు విశ్వసిస్తున్నారు.

ఈ-గవర్నెన్స్, పెనువేగంతో కూడిన బ్రాడ్‌బాండ్ వంటివి సమకూర్చి కళ్లు చెదిరేలా నగరాలను నిర్మిస్తే అవి దేశ, విదేశీ కార్పొరేట్లను ఆకర్షిస్తాయని...అందువల్ల పెట్టుబడులు వెల్లువలా వచ్చిపడతాయని, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వారు నమ్ముతున్నారు. కానీ ఈ క్రమం నగరంలో మురికివాడల విస్తరణకు దోహదపడుతుందని వారు గుర్తించడంలేదు. ఇలాంటి అభివృద్ధి నమూనాలవల్ల నగర జీవనం అస్తవ్యస్థమవుతుందని, మౌలిక సదుపాయాల కల్పన పెద్ద సమస్యగా మారుతుందని, నేరాలు పెరుగుతాయని, కాలుష్యం ఆవరిస్తుందని తెలుసుకోవడంలేదు. ఈ వైఖరివల్ల వెనకబడిన ప్రాంతాలు శాశ్వతంగా వెనకబడే ఉంటున్నాయని అర్ధంకావడంలేదు. ఇలాంటి మనస్తత్వం మారనంత వరకూ నగరాలు నరకాలుగానే ఉంటాయి. సమస్యలతో సామాన్య జనం సతమతమ వుతూనే ఉంటారు. కోల్‌కతా విషాద ఘటనైనా పాలకులను పునరాలోచనలో పడేస్తుందని ఆశించాలి.

మరిన్ని వార్తలు