‘జై జవాన్‌’ మరిచారా?

4 Nov, 2016 00:13 IST|Sakshi
‘జై జవాన్‌’ మరిచారా?

ఆదేశాలనే తప్ప పర్యవసానాలను ఆలోచించకుండా, ప్రాణాలను లెక్క చేయ కుండా ముందుకురికే అలవాటున్న త్రివిధ దళాల సిబ్బంది తమ సమస్యల పరి ష్కారం కోసం రోడ్డెక్కరు. వారి క్రమశిక్షణ అలాంటిది. వారి సర్వీస్‌ నిబంధనలు అలాంటివి. త్రివిధ దళాలకు సంబంధించిన చట్టాలు భావప్రకటనా స్వేచ్ఛను నిర్ద్వంద్వంగా నిరాకరించాయి. ‘ఒకే ర్యాంక్‌... ఒకే పింఛన్‌ (ఓఆర్‌ఓపీ)పై గత కొన్నేళ్లుగా చోటుచేసుకుంటున్న వివాదం రిటైరైన సైనిక సుబేదార్‌ ప్రాణాలు కోల్పోవడానికి దారి తీయడమే దురదృష్టమనుకుంటే... దాని వెనకే జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు అందరినీ దిగ్భ్రమపరుస్తున్నాయి.

న్యూఢిల్లీలో రక్షణమంత్రి మనోహర్‌ పారికర్‌ను బుధవారం కలిసి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన అయిదారు గురు మాజీ సైనికోద్యోగుల్లో రాంకిషన్‌ ఒకరు. వారికా అవకాశం రాకపోవడంతో నిరాశతో వెనుదిరిగి అక్కడికి దగ్గర్లో ఉన్న పార్క్‌లో కూర్చున్నప్పుడు ఉన్నట్టుండి రాంకిషన్‌ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాన్ని ఆస్పత్రికి చేర్చాక ఆ సమాచారం అందుకుని అక్కడికొచ్చిన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తదితరులను పోలీసులు అడ్డగించి అరెస్టు చేశారు. రాహుల్‌గాంధీ బుధవారం రెండుసార్లు, ఇవాళ ఒకసారి పోలీసు నిర్బంధంలోకి వెళ్లారు. ఇవాళ చేసింది అరెస్టు కాదని పోలీసులంటున్నారు. రాంకి షన్‌ కుటుంబంపట్ల అగౌరవంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ జంతర్‌మంతర్‌ వద్ద సాగుతున్న నిరసన ప్రదర్శనలో పాల్గొనడానికి వచ్చిన రాహుల్‌ను పోలీస్‌ వ్యాన్‌ ఎక్కించడమైతే వాస్తవం.


ఓఆర్‌ఓపీ వ్యవహారంలోనూ, ప్రత్యేకించి ఈ ఉదంతానికి సంబంధించి ఎన్‌డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరునూ విపక్షాలు తప్పుబడుతుంటే... మాజీ సైనికుడి మరణాన్ని రాజకీయం చేయజూస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతు న్నారు. వివాదం తలెత్తినప్పుడు పాలకపక్షాన్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నిం చడం ఎక్కడైనా, ఎప్పుడైనా రివాజే. 2011లో మాజీ సైనికులు రోడ్డెక్కినప్పుడు వారిని బీజేపీ సమర్ధించింది. 2014 ఎన్నికల ముందు సైతం వారి ఆందోళనకు పూర్తి మద్దతు ప్రకటించింది. ఇప్పుడు విపక్షంలో ఉండి కాంగ్రెస్‌ ఆ పనే చేస్తోంది. కనుక ఈ అంశంలో ఫలానా పార్టీది రాజకీయమని ప్రకటించడం కూడా రాజ కీయమే అవుతుంది. ఓఆర్‌ఓపీ సమస్య ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో వచ్చిపడింది. 1973లో ఏర్పాటుచేసిన కేంద్ర వేతన సవరణ సంఘం(పీఆర్‌సీ)లో తొలిసారి సైనికుల నుంచి ప్రాతినిధ్యం లేకుండా చేయడం వల్ల వేతన సవరణలో వారికి అన్యాయం జరిగింది. అప్పటినుంచీ ఆ సంప్రదా యమే కొనసాగుతోంది. దీనివల్ల త్రివిధ దళాలకు పెరిగే జీతాలకూ, ప్రభుత్వ సిబ్బందికి పెరిగే జీతాలకూ వ్యత్యాసం ఉంటోంది.

పింఛన్లలో సైతం అది ప్రతిబింబిస్తోంది. హోదాల గుర్తింపులోనూ సమస్యలొస్తున్నాయి. 1986నాటి నాలుగో వేతన సవరణ సంఘం నివేదికతో ఇది మరింత పెరిగింది. త్రివిధ దళాల్లోని కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్‌ కల్నల్, కల్నల్‌ వంటి హోదాలు పోలీసు ఉన్నతాధికారుల హోదాతో పోలిస్తే తగ్గిపోయాయి.  వేతనాల్లో, పింఛన్లలో కూడా ఆమేరకు వ్యత్యాసం వచ్చింది. సైన్యంలో 30 ఏళ్ల సర్వీసు పూర్తిచేసినవారిలో కేవలం 0.8 శాతంమందికి మాత్రమే మేజర్‌ జనరల్‌ పదోన్నతి వస్తుంది. కానీ పౌర అధికారుల్లో దానికి సమాన ర్యాంక్‌ అయిన జాయింట్‌ సెక్రటరీ హోదాకు 18 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన ఐఏఎస్‌లలో వంద శాతంమంది, 20 ఏళ్ల సర్వీసు పూర్తిచేసిన ఐపీఎస్‌లలో 80 శాతంమంది చేరుకుంటారు. ఇదే స్థితి మిగిలిన హోదాల్లోనూ ఉంది.

ఓఆర్‌ఓపీ అమలు చేస్తామని 2004 ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసిన కాంగ్రెస్‌ దాన్ని వమ్ము చేసింది. దాని అమలు సాధ్యంకాదని యూపీఏ సర్కారు 2008లో ప్రకటించింది. పర్యవసానంగా 22,000మంది రిటైరైన సైనిక సిబ్బంది తమ పతకాలనూ, అవార్డులనూ రాష్ట్రపతికి తిరిగిచ్చేశారు. తమ నెత్తుటి సంత కాలతో వినతిపత్రం సమర్పించారు. ఆ తర్వాతే 2011లో అన్ని పక్షాలతో బీజేపీ నేత భగత్‌సింగ్‌ కోషియారి నేతృత్వంలో పార్లమెంటరీ కమిటీ ఏర్పడటం, అది ఓఆర్‌ఓపీని అమలు చేయాలని సిఫార్సు చేయడం పూర్తయింది. ఆ తర్వాతైనా యూపీఏ ప్రభుత్వం చురుగ్గా కదల్లేదు. కమిటీ నివేదికను ఆమోదించడానికి దాదాపు రెండేళ్ల సమయం తీసుకుంది. 2014 ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఓఆర్‌ఓపీ అమలును ప్రకటించింది. పాలనాపరమైన ఉత్తర్వు ఇచ్చింది. ఎన్నికల అనంతరం గద్దెనెక్కిన ఎన్‌డీఏ సర్కారు బడ్జెట్‌లోనూ దీని ప్రస్తావన ఉంది.

ఓఆర్‌ఓపీని అమల్లోకి తెచ్చామని మొన్న ఫిబ్రవరిలో ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రకటించినా అసంతృప్తి చల్లారలేదు. ఇచ్చిన హామీకీ, దీనికీ పొంతన లేదని ఉన్నత స్థాయిలో పనిచేసి రిటైరైనవారే పెదవి విరిచారు. అమలు సంగతలా ఉంచి ఆందో ళన జరుపుతున్నవారితో వ్యవహరిస్తున్న తీరు గర్హించదగ్గది. నిరుడు స్వాతంత్య్ర దినోత్సవం సమయంలోనూ, ఆ తర్వాత నిరసనకు దిగినవారితో ఢిల్లీ పోలీసులు అతిగా వ్యవహరించారు. రాంకిషన్‌ మరణానికి కారణమేమిటన్నది పోస్టుమార్టం నివేదికలో వెల్లడవుతుంది. కానీ ఆయన కుమారుడు, ఇతర కుటుంబసభ్యుల విషయంలో పోలీసుల ప్రవర్తన... పరామర్శకొచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తోసహా నేతలను అరెస్టు చేయడం ప్రభుత్వ ప్రతిష్టను పెంచవు. పరామర్శే నేరమనుకో వడం మంచిదికాదు. దీనికితోడు నోరుజారడంలో అపకీర్తి గడించిన విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే సింగ్‌ రాంకిషన్‌ మానసిక స్థితిపై అనుమానాలు వ్యక్తం చేయడం, ఆయనిప్పుడు కాంగ్రెస్‌ సర్పంచ్‌ అని చెప్పడం దేనికి సంకేతం? వీకే సింగ్‌ మాదిరే పలువురు బీజేపీ నేతలు నోరుపారేసుకున్నారు. సర్జికల్‌ దాడుల విషయంలో జవాన్లను కీర్తిస్తూనే వారి ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని,  వారిని అవమానిస్తున్నారని అందరూ అనుకుంటారన్న ఇంగితం కూడా ఈ నేతలకు లేకపోయింది. ఇలాంటి ఎత్తుగడలు విడనాడి సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించడం అవసరమని పాలకులు గుర్తించాలి.

మరిన్ని వార్తలు