‘రాజద్రోహం’ పరామర్శ

18 Mar, 2016 00:22 IST|Sakshi

మంచికో చెడుకో ఇన్నాళ్లకు రాజద్రోహం చట్టంపై అందరి దృష్టీ పడింది. వలస పాలకులు తీసుకొచ్చిన ఆ చట్టానికి జనస్వామ్యంలో స్థానమే లేదని ప్రజాస్వామిక వాదులు వాదిస్తున్న తరుణంలో దాన్ని సమీక్షించబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం బుధవారం రాజ్యసభలో ప్రకటించింది. దేశంలో ఇప్పుడు నెలకొన్న పరిస్థితులనూ, ఎన్‌డీఏ ప్రభుత్వ వైఖరినీ గమనిస్తున్నవారికి ఈ సమీక్ష పర్యవసానంగా ఆ చట్టం రద్దవుతుందన్న ఆశలేమీ కలగవు. సమీక్ష పర్యవసానంగా కనీసం ఏది రాజద్రోహం కిందకొస్తుందో స్పష్టత వచ్చే అవకాశమైతే ఉంటుంది. అది జరిగాక ఆ నిర్వచనం లోని లోటుపాట్లు ఎటూ చర్చకొస్తాయి. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 124-ఏ కింద రాజద్రోహానికి ఇప్పుడున్న నిర్వచనం విస్తృతమైనది కావడంవల్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ఎవరిపైన అయినా దాన్ని ప్రయోగించే వీలుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజూ ఒప్పుకున్నారు. అందువల్లే సమగ్రమైన సమీక్ష జరపమని లా కమిషన్‌కు సూచించినట్టు చెప్పారు. 

 

రాజద్రోహం అనేది యావజ్జీవ శిక్ష పడేంత పెద్ద నేరం. కానీ ఆ చట్టం కింద నిర్బంధిస్తున్నవారినీ, వారు చేసిన ‘నేరాలనూ’ గమనిస్తే అంత కఠినమైన చట్టాన్ని ఇలా అలవోకగా వర్తింపజేయడమేమిటని ఆశ్చర్యపోతాం. ప్రభుత్వానికి వ్యతిరే కంగా మాట్లాడటమే రాజద్రోహమైతే దేశంలో సగం పార్టీలను నేరస్త పార్టీలుగా పరిగణించాల్సి వస్తుందని చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు గానీ...ఆ చట్టాన్ని దుర్వినియోగం చేయడంలో, ప్రత్యర్థులపై ఎడా పెడా దాన్ని ప్రయోగించడంలో ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాల చరిత్ర అంత ఘనమై నదేమీ కాదు.

 

నాలుగేళ్లక్రితం అవినీతిపై కార్టూన్లు వేసినందుకు ముంబైలో కళాకా రుడు అసీమ్ త్రివేదీని రాజద్రోహ నేరం కింద ఖైదు చేసిన సంగతి ఎవరూ మరిచి పోలేరు. ఆ కేసులో తుది తీర్పు వెలువరిస్తూ బొంబాయి హైకోర్టు నిరుడు ఒక సూచన చేసింది. ఈ చట్టంకింద ఎలాంటివారిపై కేసులు పెట్టవచ్చునో వివరిస్తూ పోలీసులకు ఒక సర్క్యులర్ జారీ చేయాలన్నది. అంతే... అత్యుత్సాహానికి పోయిన మహారాష్ట్ర ప్రభుత్వం పచారీ కొట్టు సరుకుల జాబితాను గుర్తు చేసేలా ఎడాపెడా అన్నిటినీ గుదిగుచ్చింది. ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసే విమర్శ అయినా, కూలదోసేలా ఉన్నా అది రాజద్రోహమే అవుతుందని చెప్పింది. రాజకీయ నాయకులపైనా, ఎన్నికైన ప్రజాప్రతినిధులపైనా విమర్శలు చేసినా అది రాజద్రోహమే అవుతుందని వివరించింది. సారాంశంలో రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కుల్లో దేన్ని ఉపయోగించుకున్నా ఆ జాబితా ప్రకారం ‘రాజద్రోహులే’ అవు తారు. దానిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాక ఆ జాబితాను ఉపసంహ రించుకున్నారు.

 

రాజద్రోహానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వకపోవడంలో వలసపాలకులకు కొన్ని ప్రయోజనాలున్నాయి. తమ పాలనకు వ్యతిరేకంగా అక్కడక్కడా మొదలైన ప్రజా ఉద్యమాలను గమనించాక వారు ఈ చట్టాన్ని 1870లో తీసుకొచ్చారు. రాజద్రోహ మంటే ఏమిటో చెప్పేస్తే విచక్షణారహితంగా దాన్ని ఉపయోగించడానికి వీలు పడదు గనుక దాన్ని అస్పష్టంగానే వదిలేశారు. బాలగంగాధర తిలక్, అనీబిసెంట్, మహాత్మా గాంధీ తదితర స్వాతంత్య్ర సమరయోధుల్ని ఈ చట్టంకిందే బ్రిటిష్ పాలకులు నిర్బంధించారు. మన జాతీయోద్యమాన్ని అణచడానికి తీసుకొచ్చిన ఆ చట్టాన్ని స్వాతంత్య్రం వచ్చిన వెంటనే రద్దు చేసి ఉంటే ఆ ఉద్యమం ప్రవే శపెట్టిన విలువలకు హారతి పట్టినట్టయ్యేది. కానీ దురదృష్టవశాత్తూ ఆ పని జరగలేదు. ఈ చట్టం ఎంత కఠినమైనదో ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్ధి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ కేసును చూస్తేనే అర్ధమవుతుంది. ఆయన దేశ వ్యతిరేక నినాదాలు చేసినట్టు ప్రచారంలోకొచ్చిన వీడియో టేపులు నకిలీవని ఫోరెన్సిక్ ల్యాబ్ వెల్లడించింది. ఆయన నినాదాలు చేసినట్టు విశ్వసనీయమైన సాక్ష్యాలు లేవు. అయినప్పటికీ పక్షం రోజులపాటు జైలుపాలయ్యాడు. చివరకు బెయిల్‌పై బయటికొచ్చినా ఆ కేసులో నిజానిజాలు తేలేసరికి ఎన్నేళ్లు పడుతుందో ఎవరూ చెప్పలేరు. ఇదే సెక్షన్‌కింద నిర్బంధంలో ఉన్న మరో ఇద్దరు విద్యార్థి నేతలపైనా, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ గిలానీపైనా ఉన్న కేసుల పరిస్థితీ అదే. 

 

దేశ రాజధాని నగరంలో పెట్టిన కేసులు గనుక ఇవి ప్రచారంలోకొచ్చాయి గానీ 2014లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఈ చట్టంకింద 47మంది అరెస్టయ్యారని జాతీయ క్రైం రికార్డుల బ్యూరో నివేదిక వెల్లడించింది. దేశభక్తి, జాతీయత హోరెత్తుతున్న వర్తమానంలో ఈ చట్టంకింద జమ్మూ-కశ్మీర్‌లో అత్యధికులు అరెస్టయి ఉంటారని అందరూ అనుకుంటారు. ఎందుకంటే అక్కడ తరచుగా దేశ వ్యతిరేక, పాక్ అనుకూల నినాదాలు వినిపి స్తుంటాయి. కానీ అక్కడ ఒక్కరిని కూడా ఈ చట్టం కింద నిర్బంధించలేదు. 47మంది ‘రాజద్రోహుల్లో’ 34మంది బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోనే ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాలూ నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలని అందరికీ తెలుసు. ఇందుకు విరు ద్ధంగా నక్సలైట్ల ప్రాబల్యం ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో కేవలం ఒక్కరిపై మాత్రమే ఈ చట్టం ప్రయోగించారు. గుజరాత్‌లో పటేళ్లకు రిజర్వేషన్లు కావాలని ఉద్యమం నిర్వహిం చిన హార్దిక్ పటేల్‌పై రాజద్రోహం కేసులు రెండున్నాయి.

 

 ఇప్పటికి రెండు సందర్భాల్లో లా కమిషన్లు రాజద్రోహం చట్టాన్ని సమీక్షిం చాయి. చట్టంలో లోపం ఉన్నమాట వాస్తవమేనని ఒక నివేదిక ఒప్పుకున్నా దాన్ని తొలగించడాన్ని వ్యతిరేకించింది. మరో నివేదిక రాజద్రోహం నిర్వచనాన్ని మార్చా లని సిఫార్సు చేసింది. ఇప్పుడు తాజాగా మరోసారి సమీక్షిస్తామంటున్నారు గనుక రాజద్రోహం చట్టం ఒక్కటే కాదు... రాజ్యానికి వ్యతిరేకంగా నేరం చేశారని కేసులు పెట్టడానికి వీలు కల్పిస్తున్న భారత శిక్షాస్మృతిలోని 12 సెక్షన్లపైనా లా కమిషన్ సమీక్ష జరపాలి. సెక్షన్ 121 మొదలుకొని 124-ఏ వరకూ ఈ సెక్షన్లు ఉన్నాయి. ఈ సెక్షన్లకింద దేశవ్యాప్తంగా 176మందిపై కేసులు నమోదయ్యాయి. మధ్య భార తంలో సహజవనరులను బహుళజాతి సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకించే వారూ, ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్నవారూ వీరిలో ఉన్నారు. వీరిలో చాలామంది నిరక్షరాస్యులు. తమపై మోపిన నేరాల తీవ్రత తెలియనివారు. ఇలాంటి అభాగ్యులు నిష్కారణంగా జైళ్లపాలు కాకుండా చట్టాలకు తగిన కట్టుదిట్టాలు చేయాల్సిన అవసరం ఉన్నదని పాలకులు గుర్తించాలి.

>
మరిన్ని వార్తలు