ఎవరి పంచాంగం వారిదే!

2 Apr, 2016 00:51 IST|Sakshi
ఎవరి పంచాంగం వారిదే!

అక్షర తూణీరం

అన్నీ ఉన్నట్టే పార్టీలకీ, నేతలకీ సొంత పంచాంగాలుంటాయి. పంచాంగవేత్తలు వేదికని బట్టి కందాయ ఫలాలని శ్రవణానందం చేస్తారు. అవి విని ఆనందించి ముగ్ధులైపోతారు. ఆ ఫలితాల స్క్రిప్ట్ మనం రాయించుకున్నదేనని మర్చిపోయి నాయక బృందం ఆనంద పారవశ్యంలో మునిగిపోతుంది. ఆత్మలోకంలో దివాలా!

మన్మథ వేదిక దిగి చివరి మెట్టుపై నిలబడి ఉంది. దుర్ముఖి రంగ ప్రవేశం చేయడానికి పారాణి దిద్దుకుంటోంది. ఉగాది కోసం కొత్తచిగుళ్ల స్వాగత తోరణాలు, పూలు, బుక్కాలు సిద్ధంగా ఉన్నాయి. కోయిలలు వసంతగోష్టి కోసం గుట్టుగా రిహార్సల్స్ చేసుకుంటున్నాయి. పచ్చని చెట్టుకొమ్మలు కానరాక కరెంటు స్తంభాలను, సెల్‌టవర్స్‌ని ఆశ్రయిస్తున్నాయి. షడ్రుచుల ప్రసాదం దినుసులన్నీ కార్బైడ్ నిగారింపులతో నిలబడి ఉన్నాయి.

మన్మథ మిగిల్చి వెళ్లిన మధుర జ్ఞాపకాలేవీ జుట్టు పీక్కున్నా గుర్తు రావడం లేదు. ఎటొచ్చీ గోదావరి పుష్కరాలు గొప్ప ఈవెంట్. ఇది మా ఘనతేనని చెప్పుకుంటే చేయగలిగిందేమీ లేదు. మనది చాంద్రమాన సంవత్సరాది. ఔను, రెండు తెలుగు రాష్ట్రాలకీ చంద్రమానమే వర్తిస్తుంది. చచ్చు శ్లేషలు ఇలాగే అఘోరిస్తాయి. మన్మథ మాటల సంవత్సరంగా కాలక్షేపం చేసి వెళ్లిపోయింది. పశువులకు మేతలు లేవు, సరికదా కడుపు నిండా నీళ్లు కూడా లేని దుస్థితి. మరో వైపు రాబోయే మిగులు జలాలపై గంటలకొద్దీ ముచ్చట్లు. ఏడాది పైగా అమరావతి వైభవాలు వినీ వినీ చెవులు దిబ్బెళ్లెత్తాయి. వేరే సరుకు లేనందున దుర్ముఖి కూడా గొప్పలే వినిపిస్తుంది. మనకు వినక తప్పదు. కొత్త క్యాపిటల్ మిగతా హంగులేవీ అమర్లేదు గాని పేరు మాత్రం జనం నోళ్లల్లో నానిపోతోంది. వెనకటికి ఓ మొగుడు గారెలు వండమని పెళ్లాన్ని ఆదేశించాడు. ఆవిడ వేలొక్కటి చూపి, మగడా, గారెలకు చిల్లు పెట్టడానికి ఈ వేలు మాత్రమే ఉంది. మిగతా దినుసులేవీ కొంపలో లేవని చెప్పిందట. వేలు కాదుగానీ వేల ఎకరాలు సేకరించి, విదేశీ కంపెనీలకు గాలం వేసి కూచున్నారు.

యాభైవేల ఎకరాల సుక్షేత్రాలు పచ్చదనాన్నీ, మట్టి వాసననీ కోల్పోయాయి. ఆవులు మేసే గడ్డిపై బుల్‌డోజర్లు పొగలు కక్కుతున్నాయి. తమలపాకు తోటలని ఉక్కుపాదాలు కర్కశంగా తొక్కేయగా ఆ నేలంతా ఎర్రబారింది. అవిశి పువ్వులు ఇక కనిపించవు. గోరువంకల కువకువలు, గువ్వపిట్టల రిక్కలు ఇక వినిపించవు. లక్ష అరకలకు శాశ్వతంగా సెలవిచ్చి పుణ్యం కట్టుకున్నారు. సహజ ప్రకృతినీ, పంట పొలాలనీ సమాధి చేసి ఆకాశహర్మ్యాలకు పునాదులు వేస్తున్నారు. అవినీతి సాంద్రత తగ్గిన దాఖలాలు లేవు. ఆశ్రీత కులపక్షపాతాలు గుర్రపుడెక్కలా ఏపుగా విస్తరిస్తున్నాయి. స్వపరాగ, పరపరాగ సంపర్కాలతో అవకాశమున్న అన్ని వర్గాలు కరెన్సీని పండించుకుంటున్నాయి.

నేతలకిప్పుడు సొంత మీడియా హౌసులున్నాయి. నేతల కోతలక్కడ పదే పదే ప్రతిధ్వనిస్తాయి. ఆకలితో వస్తున్న కడుపు నొప్పులకు అపెండిసైటిస్ ఆపరేషన్లు చేస్తున్నారు అధ్యక్షా! సొంత మీడియాతో బాటు, ఒక సొంత స్వామి నేతలకు బులెట్ ప్రూఫ్ వాహనంలా తప్పనిసరి అయింది. స్వచ్ఛభారత్ నినాదాన్ని లౌక్యంగా గాంధీతాత కళ్లజోడులోంచి చూపిస్తూ పెద్దాయన ఏడాది గడిపేశారు. స్వచ్ఛభారత్‌లోకి ఆ చెత్త నోట్లు దేనికని స్విస్ ఖాతాలు తెరవేలేదంటున్నారు. మిషన్ కాకతీయ కాదు, ‘కమీషన్ కాకతీయ’ అంటూ ప్రతిపక్షాలు చమత్కరిస్తున్నాయి. కొయ్యగుర్రం మీద ఊగుతూ ఆ విధంగా ముందుకు పోతావున్నామని రెండేళ్లుగా జనాన్ని నమ్మించే ప్రయత్నంలో ఉన్నారు చంద్రన్న.

అన్నీ ఉన్నట్టే పార్టీలకీ, నేతలకీ సొంత పంచాంగాలుంటాయి. పంచాంగవేత్తలు వేదికని బట్టి కందాయ ఫలాలని శ్రవణానందం చేస్తారు. అవి విని ఆనందించి ముగ్ధులైపోతారు. ఆ ఫలితాల స్క్రిప్ట్ మనం రాయించుకున్నదేనని మర్చిపోయి నాయక బృందం ఆనంద పారవశ్యంలో మునిగిపోతుంది. ఆత్మలోకంలో దివాలా!

 (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

 శ్రీరమణ

మరిన్ని వార్తలు