కాలాన్ని శాసించిన క్యాస్ట్రో

12 Dec, 2016 15:14 IST|Sakshi
కాలాన్ని శాసించిన క్యాస్ట్రో

కొత్త కోణం
ప్రజల ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకోవడం వల్ల ఎప్పటికప్పుడు తన విధానాలను సమీక్షించుకొని క్యూబా ముందుకు పోతున్నది. మొదట రష్యా తరహాలో కేంద్రీకృత ప్రణాళికలను రూపొందించుకున్నప్పటికీ; ఆ తర్వాత చైనా, వియత్నాం పద్ధతుల్లో ఆర్థిక విధానాలను రూపొందించుకున్నది. ఇటీవల మరికొన్ని నిర్ణయాలను తీసుకొని ప్రస్తుతం ఉన్న ఆర్థిక విధానాలను విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత లాంటి అంశాలు దెబ్బతినకుండా మార్చుకోవాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది.
 
ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే స్థానాన్ని సాధించుకున్న కమ్యూనిస్టు వీరుడు క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో. ఆయన జీవితం, పోరాటం, విజయాలు భవిష్యత్ తరాలను ఉత్తేజపరుస్తూనే ఉంటాయి. అమెరికా తొత్తుగా వ్యవహరిస్తున్న బటిస్టా నియంతృత్వ ప్రభుత్వాన్ని కూలదోసి, విప్లవపతాకను ఎగురవేసినప్పటి నుంచి ప్రధా నమంత్రిగా, ఆ తర్వాత అధ్యక్షుడిగా క్యాస్ట్రో సాగించిన పాలన అమె రికాను ఎదిరించడానికే పరి మితం కాలేదు. అమెరికాకు వ్యతిరేకంగా క్యాస్ట్రో సాగించిన పోరాటం, సాధించిన విప్లవ విజయం క్యూబా ప్రజల సామాజిక, ఆర్థికాభివృద్ధిపై చెరగని ముద్రవేశాయి. దాదాపు 638 సార్లు అమెరికా జరిపిన హత్యా యత్నాలను ఎదుర్కొని నిలబడ గలిగారా యన. దేశ ప్రజానీకం మొత్తం క్యాస్ట్రోకు రక్షణ కవచంగా నిలిచిందనడానికి అమెరికా విఫలయత్నాలే నిదర్శనం. నిజానికి 1990వ దశకంలో జరిగిన సోవియట్ యూనియన్ పతనం క్యూబాకు పెద్ద విఘాతమే. అయినా క్యూబా ఆ సమస్యను అధిగ మించింది. ప్రపంచాన్ని అబ్బుర పరిచే ప్రగతిని సాధించగలిగింది.

అక్కడి చక్కెర అమెరికాకు చేదే
క్యూబా పురాతన దేశం. 1492లో స్పెయిన్ నావికుడు క్రిస్టోఫర్ కొలం బస్ అప్పటి ఇటలీ ప్రభుత్వ సహకారంతో భారతదేశాన్ని కనుగొనాలని బయలు దేరి, దారి తప్పి అమెరికా సహా క్యూబాను కనిపెట్టాడు. అప్పటి నుంచి అక్కడికి స్పెయిన్ దేశీయుల వలస ప్రారంభమైంది. 1898 వరకు క్యూబా స్పెయిన్ వలస దేశమే. స్పానిష్ అమెరికన్ యుద్ధం తరువాత 1898లో క్యూబా అమెరికా వలసగా మారింది.  కొద్ది కాలంలోనే క్యూబాను అమెరికా స్వతంత్ర దేశంగా ప్రకటించినా, ఆ స్వతంత్రం నామమాత్రమే. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో అమెరికా క్యూబాను పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకుంది. చెరుకు తోటల పెంపకం, చక్కెర ఉత్పత్తి అమెరికా తన గుత్తాధిపత్యంలో ఉంచుకుంది. దేశ ఆర్థిక రంగానికి మూలాధారమైన చక్కెర ఉత్పత్తి అమెరికా నియంత్రణలో ఉండడం వల్ల ప్రజల బతుకుతెరువు అగ్ర దేశం దయాదాక్షిణ్యాల మీద కొనసాగింది.

బటిస్టా నాయకత్వంలోని నియం తృత్వ ప్రభుత్వం కూడా అమెరికా కనుసన్నల్లో ఉండేది. చక్కెర పరిశ్రమలో, చెరుకు తోటలో పనిచేసేవారు కేవలం 30 శాతం. మిగిలిన 70 శాతం నిరు ద్యోగంలో లేదా అర్థ నిరుద్యోగంలో కొట్టుమిట్టాడుతుండేవారు.
ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా, అమెరికా ఆర్థిక దోపిడీ లక్ష్యంగా నిర్మితమైన క్యూబా ఆర్థిక వ్యవస్థ ఆ దేశాన్ని పేదరికంలోకి నెట్టింది. నిత్యా వసరాలైన పాలు, గుడ్లు, మాంసాహారం కూడా కరువయ్యాయి. 89 శాతం మందికి కనీసం పాలు కూడా దొరకని స్థితి. 96 శాతం మంది మాంసాహారం తిని ఎరుగరు. 98 శాతం మందికి గుడ్లు కూడా లభించేవి కావు. ప్రభుత్వంతో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారు. వివిధ రూపాల్లో కొన్ని తిరుగుబాట్లు చేశారు. ఆ క్రమంలోనే క్యాస్ట్రో విద్యార్థి నేతగా ఉద్యమాల్లో అడుగుపెట్టారు.
 
బటిస్టా ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1953 జులై 26వ తేదీన క్యాస్ట్రో నాయకత్వంలో శాంటియాగో డీక్యూబా లోని మంకోడా సైనిక స్థావరం మీద దాడి జరిగింది. ప్రభుత్వం 24 మందిని అరెస్టు చేసి, జైలుకి పంపింది. 60 మంది విప్లవకారులను హత్య చేసింది. ప్రజా ఉద్యమాల ఫలితంగా 1955 ఏప్రిల్‌లో క్యాస్ట్రో సహా విప్లవకారులంతా విడుదలయ్యారు. విప్లవ కార్య క్రమాల మీద నిర్బంధం పెరగడంతో క్యాస్ట్రో తన కార్యస్థానాన్ని మెక్సికోకి మార్చి, అక్కడి నుంచే సాయుధ గెరిల్లా పోరాటానికి సన్నాహాలు చేశారు. క్యాస్ట్రో సోదరుడు, ప్రస్తుత క్యూబా అధ్యక్షుడు రవుల్  క్యాస్ట్రో, యువ విప్లవ కెరటం చేగువేరా కూడా ఆయనను అనుసరించారు. చిట్టచివరిగా 1959 జన వరి 1వ తేదీన క్యాస్ట్రో నాయకత్వంలోని రెడ్‌ఆర్మీ బటిస్టా ప్రభుత్వాన్ని కూల దోసింది. ఆ ఫిబ్రవరి 10న క్యాస్ట్రో ప్రప్రథమ ప్రధానమంత్రిగా పదవిని చేప ట్టారు. బటిస్టా దేశం వీడి పారిపోయాడు.
 
ఆదిలో అల్లకల్లోలం
క్యాస్ట్రో ప్రభుత్వం మొదటి చర్యగా అమెరికా ఆస్తులను, పరిశ్రమలను జాతీ యం చేసింది. వేల కోట్ల డాలర్ల సంపదను కోల్పోయిన అమెరికా క్యూబా విప్లవ ప్రభుత్వాన్ని అడుగడుగునా దెబ్బతీయడానికి  యత్నించింది. విప్లవ ప్రభుత్వం ఏర్పడడంతో బటిస్టా మద్దతుదారులైన ధనికవర్గం అమెరికాకు పారిపోయింది. అందులో వివిధ రంగాల నిపుణులు, వైద్యులు, ఇతర మేధా వులు కూడా ఉన్నారు. దాదాపు 50 శాతం వైద్యులు క్యూబాను వీడారు. తీవ్ర స్థాయిలో వైద్యుల కొరత ఏర్పడింది. అయినా క్యాస్ట్రో ప్రభుత్వం చలించ కుండా పెద్ద మొత్తంలో వైద్యవిద్యను ప్రోత్సహించి, అవసరమైనంత మంది వైద్యులను తయారుచేసుకోగలిగింది. ఆరేళ్లలోనే అవసరమైన ఆరోగ్య వ్యవ స్థను స్థాపించుకోలిగింది. 1970 సంవత్సరానికి ఆరోగ్యరంగంలో అనన్యసా మాన్యమైన విజయాలను సాధించింది.

తమ బడ్జెట్‌లో సింహభాగాన్ని ఆరోగ్య అవసరాలకు, డాక్టర్ల శిక్షణకు వినియోగిం చడం వల్ల ఇది సాధ్య మైంది. 1970కి వచ్చే సరికి మలేరియా, పోలియో పూర్తిగా నిర్మూలించారు. క్షయ, జీర్ణకోశ వ్యాధులతో జరిగే మరణాలను చాలా పెద్దమొత్తంలో అరి కట్టగలిగారు. 1980లో ఈ కృషిని మరింత విస్తృత పరచగలిగారు. ఈరోజు ఆరోగ్యరంగంలో క్యూబా ప్రపంచ దేశాలన్నింటిలో అగ్రభాగాన ఉండడమే కాకుండా, ప్రజలు వైద్య సౌకర్యాల లేమితో బాధపడ కుండా చేయగలిగింది. ఆరోగ్యం ప్రజల హక్కుగానే కాకుండా ప్రభుత్వ బాధ్యతగా ప్రకటించుకు న్నది. ఆదర్శవంతమైన డాక్టర్- నర్స్ పథకాన్ని అమ లుచేసింది. చేస్తున్నది.

150 కుటుంబాలకు ఒక నర్స్, ఒక డాక్టర్ వంతున నియమించి వైద్య ఆరోగ్య విషయాలలో ప్రజలందరిని చైతన్యపరిచే అరుదైన వ్యవస్థను క్యూబాలో అద్భుతంగా అమలు పరిచారు. ఆ 150 కుటుంబాల ఆరోగ్య వివరాలన్నీ డాక్టర్ - నర్స్‌ల బృందం వద్ద ఉంటాయి. ప్రతి 30 వేల నుంచి 60 వేల జనాభా ఉన్న ప్రాంతానికి ఒక పాలిక్లినిక్‌ను ఏర్పాటు చేస్తారు. క్యూబాలో ఇప్పుడు 498 పాలిక్లినిక్‌లున్నాయి. వైద్య విద్యనభ్యసిస్తున్న విద్యా ర్థులు మొదటి ఏడాది నుంచే పాలిక్లినిక్‌లలో వైద్యసేవలందిస్తూ ఆచరణలో వైద్యవిద్యను నేర్చుకుంటారు. క్యూబాను దెబ్బతీసేందుకు అత్యవసరాలైన మందులు, వైద్య పరికరాలను సైతం అమెరికా నిలిపివేసింది. కానీ అవేవీ క్యూబా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేకపోయాయి. విప్లవం వచ్చేనాటికి క్యూబా శిశుమరణాల రేటు 80 అయితే ఈ రోజు అది 4.63 శాతం. మన దేశంలో 41.1 శాతం. అమెరికాలో 5.74శాతం. అంటే క్యూబా కంటే అధికమే. చిన్న దేశం క్యూబా సాధించిన వైద్య విజయాన్ని అర్థం చేసు కోవడానికి ఇదొక్క ఉదాహరణ చాలు. అంతేకాక లాటిన్ అమెరికన్ మెడికల్ స్కూల్స్ స్థాపించి 72 దేశాలకు చెందిన దాదాపు 20,500 మంది వైద్యులను అందించింది. క్యూబాలో వైద్య ఆరోగ్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. అలా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
 
విజయ పరంపర
విద్యారంగంలో క్యూబా సాధించిన విజయం కూడా ఘనమైనదే. నూటికి నూరు శాతం విద్యారంగం బాధ్యత ప్రభుత్వానిదే. మూడు దశాబ్దాల క్రితమే నూటికి నూరు శాతం అక్షరాస్యతను ఆ దేశం సాధించింది. ఇందుకు కారణం 1961లోనే 2 లక్షల మంది ఉపా ద్యాయులను సమీకరించి, ఒక ఉద్యమ స్ఫూర్తితో అక్షరాస్యతను అందించగలిగింది. అదే సమయంలో విద్యను ఉత్పత్తితో అను సంధానం చేస్తూ భవిష్యత్తు ఉపాధి నైపుణ్యాలను పెంచే కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. మహిళల అక్షరాస్యతలో కూడా నూటికి నూరు శాతం ఫలితాలను సాధించగలిగింది క్యూబా. రాజకీయరంగంలో సైతం క్యూబా సాధించిన విజయం అనేక ప్రజాస్వామ్య దేశాలకు కనువిప్పు వంటిది.

పార్లమెంటులో ఇప్పుడు దాదాపు 45 శాతంగా మహిళల ప్రాతి నిధ్యం ఉందంటే, స్త్రీల రాజకీయ భాగస్వామ్యంలో ఆ దేశం ఎంత ముందుందో అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం అనే కమైన మార్పులను చేపట్టింది. భూమిని కొందరి చేతుల్లో కేంద్రీకృతం చేసే అసమాన వ్యవస్థగా కాకుండా ప్రభుత్వం మాత్రమే యావత్ భూమిపైన హక్కును కలిగి ఉంటుంది. రైతులు సహకార సంఘాలుగా ఏర్పాటై వ్యవ సాయాన్ని నిర్వహించే అవకాశాన్ని కలిగించారు. దానితో సహకార రంగం ద్వారా ఉత్పత్తి పెరగడం మాత్రమే కాకుండా క్యూబా ప్రభుత్వం ధరలను సైతం నియంత్రించగలిగింది.
 
ఆయన చిరస్మరణీయుడు
ప్రజల ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకోవడం వల్ల ఎప్పటిక ప్పుడు తన విధానాలను సమీక్షించుకొని క్యూబా ముందుకు పోతున్నది. మొదట రష్యా తరహాలో కేంద్రీకృత ప్రణాళికలను రూపొందించుకున్నప్ప టికీ; ఆ తర్వాత చైనా, వియత్నాం పద్ధతుల్లో ఆర్థిక విధానాలను రూపొం దించు కున్నది. ఇటీవల మరికొన్ని నిర్ణయాలను తీసుకొని ప్రస్తుతం ఉన్న ఆర్థిక విధానాలను విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత లాంటి అంశాలు దెబ్బ తినకుండా సమయానుకూలంగా మార్చుకోవాలని ఆలోచి స్తున్నట్టు తెలుస్తున్నది. పారిశ్రామిక రంగంలో కొంత వెసులుబాటు కల్పించి త్వరితగతిన వృద్ధిని సాధించాలని చూస్తున్నారు.

గత అరవైయేళ్లుగా సామా జికార్థిక ప్రగతికి ప్రజలే కేంద్రబిందువుగా పాలనను అందిస్తూ అనేక దేశాల్లో సోషలిస్టు విధానాలు విఫలమైనప్పటికీ, తమ గడ్డమీద మాత్రం సోషలిజం నిజమని రుజువు చేసింది క్యూబా. కమ్యూనిజం శాశ్వత సత్యమని చాటి చెప్పింది. తొమ్మిది పదుల నిండు జీవితంలో సామ్రాజ్యవాదంపై అలు పెరు గని యుద్ధం చేసి, జనక్యూబాను నిర్మించిన ఫిడెల్ క్యాస్ట్రోను ప్రపంచ సోషలిస్టుల్లో చిగురించిన కమ్యూనిస్టు విశ్వాసంగా నిరంతరం స్మరించు కుందాం.
 

మల్లెపల్లి లక్ష్మయ్య
 వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు  మొబైల్ : 97055 66213

మరిన్ని వార్తలు