ఫిడెల్ క్యాస్ట్రో రాయని డైరీ

24 Dec, 2016 23:41 IST|Sakshi
ఫిడెల్ క్యాస్ట్రో రాయని డైరీ

(మాధవ్ శింగరాజు)

రెండు గంటల విమాన ప్రయాణానికే ప్రాణం అలసిపోతోందంటే గమ్యం దగ్గరవుతున్నట్లు కాదు. గమ్యానికి దగ్గరవుతున్నట్లు! ఓపిక పోయాక కూడా ఊపిరి తీసుకుంటూ కూర్చోవడం నాకు సాధ్యం కావడం లేదు.

క్యూబాకి ఆ చివర్న హవానా. ఈ కొసన శాంటియాగో. ఇక్కడ ఇల్లు. అక్కడ పార్టీ ఆఫీసు. వెళ్లొచ్చే సరికి ఒళ్లు వెచ్చగా అయింది. ఏళ్ల విరామం తర్వాతి బయటి ప్రయాణం! క్యాస్ట్రో పెద్దవాడై పోయాడని రాశాయి అమెరికన్ పత్రికలు. మాట సరిగా రావడం లేదని, మనిషి స్థిరంగా లేడనీ రాశాయి.  ‘అవన్నీ చదువుతూ కూర్చోకండి’ అంటోంది డాలియా. క్యాస్ట్రో వృద్ధాప్యం గురించి కలలోనైనా మాట్లాడడానికి ఇష్టపడని అచ్చమైన క్యూబా దేశపు పౌరురాలు నా భార్య! క్యాస్ట్రోకి మరణం లేదని క్యూబా అనుకుంటున్నట్లే ఆమె కూడా అనుకుంటోందా?
 
పార్టీ దినపత్రిక ‘గ్రాన్‌మా’ ఆవేళ్టి నా సంపాదకీయం కోసం ఎదురుచూస్తోంది. ఏం రాయాలి? ఇక రాసేందుకు ఏమీ లేదని రాయాలా? ఇక ముందు రాయలేకపోవచ్చు అని రాయాలా?
 
‘పార్టీ మీటింగులో కూడా మీరిలాగే మాట్లాడారు మిస్టర్ క్యాస్ట్రో’ అంటోంది డాలియా. కానీ నాకు తెలుస్తోంది. త్వరలోనే కొన్ని రోజులకు అందరికీ జరిగినట్లే నాకూ జరుగుతుంది. ఎవరి వంతు వారికి వస్తుంది కదా. అలాగే నా వంతు. విప్లవంలో నా వంతు. అజ్ఞాతంలో నా వంతు. పోరాటంలో నా వంతు. విజయంలో నా వంతు. విరామంలో నా వంతు. విశ్రమణలో నా వంతు. మరణంలో నా వంతు!
 
నా వంతు కనుక నాక్కాస్త వ్యవధిని ఇస్తే.. మళ్లొకసారి క్యూబాకు చెప్పాలి. మనకు కావలసినంత చక్కెర ఉంది.. తియ్యటి మాటలు నమ్మొద్దని చెప్పాలి. ఒబామా మంచివాడా కాదా అని కాదు. అమెరికా మంచిదా కాదా అని తెలుసుకుని ఉండాలి.. పుట్టిన ప్రతి ఒక్క క్యూబన్ పిల్లవాడు అని చెప్పాలి.
 
‘ఒబామా పని గట్టుకుని వచ్చాడు కదా నువ్వొకసారి మాట్లాడి ఉంటే బాగుండేదేమో’ అన్నాడు నా తమ్ముడు రౌల్.  శత్రువును ఎప్పుడూ శత్రువు గానే చూడాలి. స్నేహహస్తం ఇచ్చామంటే ధైర్యంగా ముందుకు వస్తాడు. ధైర్యంగా భుజంపై చెయ్యి వేస్తాడు. అప్పుడు వాడిని దూరంగా ఉంచే ధైర్యం మనం చెయ్యలేం. క్యూబా అమెరికాకు వంద మైళ్ల దూరంలో ఉంటూ అమెరికాను వేల మైళ్ల హద్దుల్లో ఉంచగలిగిందంటే.. స్నేహధర్మం కన్నా శత్రుధర్మం ముఖ్యమని నమ్మడమే.  
 
రౌల్ ఒబామాతో కరచాలనం చేశాడు. ఒబామాతో కలిసి డిన్నర్ చేశాడు. ఒబామాతో కలిసి యు.ఎస్.-క్యూబా బేస్‌బాల్ గేమ్ చూశాడు. ‘మనం ఫ్రెండ్స్‌లా ఉందాం. ఇరుగుపొరుగులా ఉందాం. ఒక ఫ్యామిలీలా ఉందాం’ అని చెప్పి వెళ్లాడు ఒబామా. గతాన్ని ఎక్కడ పూడ్చి పెట్టాలన్నది మాత్రం ఆయన చెప్పలేదు. అమెరికన్ ప్రజలు, క్యూబా ప్రజలు కలిస్తే ఎన్ని పనులైనా జరగొచ్చు. అమెరికా, క్యూబా కలవడం మాత్రం ఎప్పటికీ జరగని పని. (కమ్యూనిస్టు శిఖరం కూలిపోయింది. క్యూబా మాజీ అధ్యక్షుడు ఫెడల్‌ క్యాస్ట్రో కన్నుమూశారు. గడిచిన కొన్నేళ్లుగా ఆరోగ్య సమస్యల కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న ఆయన శనివారం కన్నుమూసినట్లు క్యూబా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.) 

మరిన్ని వార్తలు