‘పోలియో’ పోరు!

17 Jun, 2016 00:24 IST|Sakshi

 నేరుగా నాడీ మండలంపై దాడిచేసి పసిపిల్లలను పక్షవాతానికి గురిచేసే ప్రమాద కరమైన పోలియో వైరస్ మళ్లీ హైదరాబాద్ నగరంలో కనబడిందన్న వార్తలు అందరినీ కలవరపరిచాయి. మన దేశంలో అయిదేళ్లక్రితం చివరి పోలియో కేసు నమోదైంది. మూడేళ్ల తర్వాత అంటే...2014లో భారత్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) పోలియో రహిత దేశంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం ఆందోళన కలిగించింది. అందువల్లే డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి బృందం హైదరాబాద్‌లో మకాం వేసి నేరుగా దీన్ని పర్యవేక్షిస్తోంది. ఈ నెల20 నుంచి ఆరు రోజులపాటు 3 లక్షలమంది పిల్లలకు వ్యాక్సిన్ అందించే ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం సిబ్బందికి ప్రత్యేక శిక్షణను ప్రారంభించ డంతోపాటు మూడు లక్షల డోసుల ఇంజక్షన్లను తెప్పించారు. అయితే ఇదంతా ముందుజాగ్రత్తలో భాగం మాత్రమేనని అధికారుల వివరణ. ఇప్పుడు గుర్తించిన పోలియో వైరస్ అంత ప్రమాదకారి కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంటున్నది. ఇప్పటికీ మనది పోలియో రహిత దేశమేనని చెబుతున్నది. నిజానికి ఇప్పుడు హైదరాబాద్‌లో బయటపడింది తొలి ఉదంతం అనుకోనవసరం లేదు. 2014 తర్వాత దేశంలో ఈ మాదిరి కేసులు నాలుగు బయటపడ్డాయి. అయితే అవి ప్రమాదకరం కానివని తేల్చారు. 

కలుషిత జలాలు, కలుషిత ఆహారమూ, అపరిశుభ్ర పరిసరాలూ కారణంగా వ్యాపించే ఈ వ్యాధికి శతాబ్దాల చరిత్ర ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది పిల్లలు దీనిబారిన పడి అంగవైకల్యానికి గురయ్యేవారు. చిన్నతనంలోనే కన్ను మూసేవారు. 2000 సంవత్సరంనాటికల్లా భూగోళంనుంచి పోలియోను శాశ్వ తంగా నిర్మూలించాలని 1988లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సమావేశం సంకల్పిం చింది. అయితే గడువులోగా ఆ లక్ష్యాన్ని సాధించడం ఓపట్టాన సాధ్యం కాలేదు. ఎన్నో ప్రయత్నాలు...అందులో అనేక వైఫల్యాలు ఎదురుకావడం, వాటినుంచి ఎప్పటికప్పుడు గుణపాఠం తీసుకుని కదలడం పర్యవసానంగానే పోలియో నిర్మూ లన సాధ్యమైంది. ఇంత కృషీ విఫలమై పరిస్థితి మొదటికొస్తుందంటే ఎవరికైనా ఆందోళనకరమే.

ఇప్పుడు బయటపడ్డ పోలియో వైరస్‌పై భిన్న కథనాలున్నాయి. ఈ వ్యాధి రాకుండా వాడే చుక్కల మందు వ్యాక్సిన్‌ను తీసుకున్న మనిషి శరీరంనుంచి వెలువడిన వైరస్ మురుగు నీటిలో కలిసి ఉంటుందని అధికారుల అంచనా. అయితే ఈ వైరస్‌కు పోలియో వ్యాధిని కలిగించే శక్తి లేదని కూడా వారంటున్నారు. వాస్తవానికి అత్యంత ప్రమాదకరమైన రకం వైరస్‌ను 1999లో చివరిసారిగా గుర్తించారని చెబుతున్నారు. దీన్ని అంత తేలిగ్గా తీసుకోలేమన్నది నిపుణుల మాట. రోగ నిరోధక శక్తి తక్కువుంటే, పౌష్టికాహార లేమితో బాధపడుతుంటే దీని ప్రభావం నుంచి తప్పించుకోవడం సులభం కాదని వారి అభిప్రాయం. కనుక నిరుపేద వర్గాలు నివసించే ప్రాంతాల్లోని పిల్లలను ప్రధాన లక్ష్యంగా చేసుకుని పోలియో వ్యాక్సిన్‌ను అందించడం, వారికి పౌష్టికాహారాన్ని సమకూర్చడం తక్షణావసరం.

మన దేశంలో పోలియో నిర్మూలన ఇతర రాష్ట్రాల్లో ఏదో మేర విజయవం తమైనా ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు మాత్రం సమస్యాత్మకంగా ఉండేవి. వాస్త వానికి దేశంలో బయటపడే కేసుల్లో 95 శాతం ఆ రాష్ట్రాల్లోనే ఉండేవి. అసలు పోలియో వైరస్ నిర్మూలనకు ఉపయోగించే వ్యాక్సిన్‌ల తయారీ పెద్ద చిక్కుముడిగా ఉండేది. పోలియో వైరస్‌పై శాస్త్రవేత్తలు సాగించిన సమరం ఎన్నదగినది. చెప్పా లంటే అది శాస్త్రవేత్తలతో దాగుడుమూతలాడింది. వారిని ముప్పుతిప్పలు పెట్టింది. ఒక రకం వైరస్ నిర్మూలనకు ఉపయోగించే వ్యాక్సిన్ ఇతర రకాల వ్యాక్సిన్‌లను ప్రభావరహితం చేసేది. పర్యవసానంగా ఒక వైరస్ ద్వారా వ్యాపించే వ్యాధిని అరికట్టామనుకునే లోగానే మరో రకం వైరస్ పసివాళ్లను రోగగ్రస్తం చేసేది. ఆ వైరస్‌ల నిర్మూలన పెను సమస్యగా మారేది. దీన్నొక సవాలుగా తీసుకున్న శాస్త్రవేత్తలు ఎన్నో రకాలుగా ప్రయోగాలు చేసి ఎట్టకేలకు మెరుగైన వ్యాక్సిన్ల రూపకల్పనలో విజయం సాధించగలిగారు. వ్యాక్సిన్ల తయారీ ఒక ఎత్తయితే వాటిని గడప గడపకూ తీసుకెళ్లడం మరో ఎత్తు. అన్ని మాధ్యమాల ద్వారా దాన్ని పెద్దయెత్తున ప్రచారం చేయడం, ప్రకటనలివ్వడం, సెలబ్రిటీలతో చెప్పించడం వగైరాలన్నీ ఫలితమిచ్చాయి. బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, బడులు... అన్నీ పోలియో మందు ఇవ్వడానికి కేంద్రాలయ్యాయి. పోలియో మహమ్మారిపై బహుముఖాలుగా సాగించిన యుద్ధంలో అందరూ సైనికులయ్యారు. కనుకనే ఆ వైరస్‌పై ఘన విజయం సాధించడం సాధ్యమైంది.

అయితే పోలియో మహమ్మారి విషయంలో అత్యంత జాగరూకతతో వ్యవ హరించాలని డబ్ల్యూహెచ్‌ఓ ఎప్పటికప్పుడు అన్ని దేశాలనూ హెచ్చరిస్తూనే ఉంది. రెండో రకం పోలియో వైరస్‌ను పూర్తిగా నిర్మూలించినందువల్ల మూడు రకాల పోలియో వైరస్‌లతో కూడిన టీకానుంచి ఆ రకాన్ని పూర్తిగా తొలగించారు. ప్రస్తుతం ఒకటి, మూడు రకాల వైరస్‌లున్న చుక్కల మందును అమల్లోకి తెచ్చారు. దీంతోపాటే పోలియో టీకాను కూడా ఉపయోగిస్తున్నారు. ఈ దశలో రెండో రకం పోలియో వైరస్ బయటపడింది. ఈ వైరస్ ప్రమాదరహితమైనదే అనుకున్నా... ఇతరత్రా మార్గాల్లో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్‌లలో ఈ ఏడాది 16 పోలియో కేసులు బయటపడ్డాయి.

ఆ రెండు దేశాలకూ రాకపోకలు ఉంటున్నాయి గనుక అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక బంగ్లాదేశ్ అనుభవం మరింత ఆందోళనపరిచేది. అక్కడ పసిపిల్లలకు అందించే చుక్కల మందు 43 శాతంమందిలో మాత్రమే ఫలితాన్నిస్తున్నదని నాలుగేళ్లక్రితం గుర్తిం చారు. యూరప్‌లో 95 శాతం మందిని మెరుగుపరుస్తున్న వ్యాక్సిన్ ఇక్కడ ఎందుకు పనిచేయడం లేదన్న ప్రశ్నలు తలెత్తాయి. ఎన్నో పరిశోధనల తర్వాత పౌష్టికాహార లోపం, రోగనిరోధక శక్తి లేకపోవడం కారణమని తేల్చారు. ఇలాంటి ఉదంతాలన్నీ పోలియో వ్యాక్సిన్‌లు, ఇంజక్షన్లపైన మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తే సరిపోదని... నిరుపేద వర్గాల చిన్నారులకు మంచి పౌష్టికాహారం అందించడం లోనూ శ్రద్ధవహించాలని చాటిచెబుతున్నాయి. అన్నిరకాలుగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి. హైదరాబాద్‌లో వెల్లడైన కేసు ఆ దిశగా కార్యా చరణకు పురిగొల్పుతుందని ఆశించాలి.

 

పోలియో నిర్మూలనకు కొత్త లక్ష్యాలంటూ ఏవీ ఉండవు. ఉన్న లక్ష్యం పట్ల అప్రమత్తతగా ఉండటమే అవశ్యం.

 - వైరా ష్కిబ్ నర్

 చెకొస్లొవేకియా ప్రొఫెసర్

మరిన్ని వార్తలు