'గాంధీజీని బ్రిటిష్ ఏజెంట్ అన్నా.. సారీ'

2 Oct, 2016 14:51 IST|Sakshi
'గాంధీజీని బ్రిటిష్ ఏజెంట్ అన్నా.. సారీ'

రాత్రి పడుకునేటప్పుడే అనుకున్నాను... గాంధీజీ కల్లోకి రాకూడదని. కానీ ఆయన వచ్చారు! ‘‘బాపూజీ..!’’ అన్నాను విస్మయంగా. గాంధీజీ బోసినవ్వు నా చెంపను తాకింది. రెండో చెంప చూపబోయాను. నాకంతటి యోగ్యత ఉందా అని ఆగిపోయాను. ‘‘ఆగిపోయావేం కట్జూ?’’ అన్నారు గాంధీజీ మళ్లీ నవ్వుతూ. ‘‘మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను బాపూజీ, మీరు బ్రిటిష్ ఏజెంటు అని కూడా అన్నాను’’ అని చెంపలేసుకున్నాను. ‘‘పర్వాలేదు కట్జూ, మోహన్‌దాస్ కరమ్‌చంద్‌ని మార్కండేయ కట్జూ విమర్శించకూడదని ఏ చట్టంలో ఉంది చెప్పు?’’ అన్నారు. ‘‘మహాత్మా, మీ అంతటివారితో నాకు పోలికా?!’’ అన్నాను.

 ‘‘కాసేపు మాట్లాడుకుందాం కట్జూ. నువ్వు జడ్జివి కాబట్టి కూర్చొని మాట్లాడు. జడ్జి దగ్గరకు వెళ్లిన వాళ్లెవరైనా నిలబడే మాట్లాడాలి కాబట్టి నేనిక్కడ నిలుచుని మాట్లాడతాను’’అన్నారు గాంధీజీ!  ‘‘ఎంత మాట బాపూజీ’’ అని ఆయన కాళ్ల మీద పడిపోయాను. ‘‘అవును కట్జూ.. నేను నీ కల్లోకి రాకూడదని ఎందుకనుకున్నావ్’’ అన్నారు గాంధీజీ... గొప్ప క్షమతో నా భుజాలు పట్టుకుని పైకి లేపుతూ.
 ‘‘అనుకున్నాను బాపూజీ. నేను చెడు వింటున్నాను, చెడు చూస్తున్నాను, చెడు మాట్లాడుతున్నాను. అందుకే మీకు కనిపించకూడ దని అనుకున్నాను. అక్టోబర్ రెండున అసలే కనిపించకూడదనుకున్నాను’’ అని చెప్పాను.  ‘‘చెడు వింటున్నాను, చెడు మాట్లాడుతున్నాను, చెడు చూస్తున్నాను అంటున్నావ్! అంత చెడేం ఉంది కట్జూ ఈ లోకంలో. ఎంత చెడ్డా... మనుషులంతా మంచివాళ్లే కదా’’ అన్నారు గాంధీజీ! అయ్యో బాపూజీ అనుకున్నాను. ‘‘మనుషులొక్కరే కాదు కదా బాపూజీ... ఈ లోకంలో జడ్జీలు కూడా ఉన్నారు’’ అన్నాను. గాంధీజీ కళ్లు పెద్దవి చేశారు.

 ‘‘క్వీన్ ఆఫ్ హార్ట్ అనే క్యారెక్టర్ గురించి మీరు చదివే ఉంటారు బాపూజీ. ఎవరు కనిపించినా వారి తలను నరికేయమని ఆదేశించడం ఆ క్వీన్ పని. ‘నేరారోపణ చేయాలి, విచారణ జరిపించాలి, శిక్ష విధించాలి. అప్పుడు కదా తల నరికేయడం’ అని నాలాంటి వాడెవడైనా అంటే.. ‘అవన్నీ తర్వాత, ముందైతే తల నరికేయండి’ అనేవారు క్వీన్. అలా కింగ్ ఆఫ్ హార్ట్‌లు అయ్యారు బాపూజీ ఈ జడ్జీలు’’ అని ఆవేదనగా చెప్పాను.  ‘‘జస్టిస్ ఆర్.ఎం.లోథా, జస్టిస్ టి.ఎస్.ఠాకూర్‌ల గురించే కదా కట్జూ నువ్వంటున్నది’’ అన్నారు గాంధీజీ!!  ‘‘నువ్వూ ఒక జడ్జివే కదా కట్జూ. సర్వోన్నతులైన న్యాయమూర్తులను అలా అనొచ్చా’’ అన్నారు గాంధీజీ మందలింపుగా.

 అకస్మాత్తుగా ‘సబ్ కో సన్మతి దే భగవాన్..’ పాట వినిపించింది! కల బయటి పాటకు, కల లోపలి గాంధీజీ అదృశ్యమైపోయారు. ‘జడ్జిని కాబట్టే జడ్జీలను అనగలిగాను బాపూజీ. మనుషులకు జడ్జీలను అనేంత ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ ఎక్కడిది... ఈ స్వతంత్ర భారతదేశంలో...’ అని గాంధీజీతో చెప్పాలనుకున్నాను. ప్చ్.. పాట నిద్ర లేపేసింది.

(కట్జూ (మాజీ న్యాయమూర్తి) రాయని డైరీ)
 - మాధవ్ శింగరాజు

>
మరిన్ని వార్తలు