నిలువుటద్దం

23 Mar, 2017 01:14 IST|Sakshi
నిలువుటద్దం

జీవన కాలమ్‌
చివరగా– జెరూసలేమ్‌ నుంచి జాన్‌ ముల్లర్‌ నాకు సందేశం పంపారు. ‘‘తమ ఉనికిని అంగీకరించమని భారతీయులు అమెరికాని ‘అడుక్కునే’ బదులు– మీ భారతీయులు ఇండియాలో ఒక ‘అమెరికా’ను తయారు చేసుకోలేరా?

పైవారం కాలమ్‌ (‘భూత’ ద్దం) చదివి చాలామంది స్పందించారు. ముఖ్యంగా మిత్రులు, అతి తరచుగా అమె రికా వెళ్లివచ్చే మిత్రులు– తన కొడుకూ, కూతురూ సంవత్స రాల తరబడి అక్కడ ఉన్న మిత్రులు– పేరు చెప్పినా పర వాలేదు– యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌గారు ఫోన్‌ చేశారు. ఆయన నిర్మొహమాటి. వాస్తవాన్ని కుండ బద్దలుకొట్టి చెప్పే మనిషి. ‘ఈనాటి అమెరికా అనర్థంలో మనవారి వాటా కూడా ఉంది మారుతీరావుగారూ’ అన్నారు.

భారతీయులు– అందునా తెలుగువారు ఎక్కడికి వెళ్లినా తమ పతాకాన్ని గర్వంగా ఎగురవేస్తారు. సామ ర్థ్యంలో, క్రమశిక్షణలో ఒక్కొక్కరూ అరడజను అమెరికన్ల పెట్టు. అలనాడు అమెరికాలో వైద్య రంగానికీ, ఇప్పు డిప్పుడు సాఫ్ట్‌వేర్‌ రంగానికి వారు చేస్తున్న సేవలు అనితర సాధ్యం. అపూర్వం. ఒక్క సత్య నాదెళ్ల, సుందర్‌ పిచ్చయ్‌ పేరు ప్రపంచంలో మన సామర్థ్యాన్ని పతాక స్థాయిలో నిలిపారనడానికి ఉదాహరణలు.

అయితే– తాము మాతృదేశానికి దూరంగా ఉంటూ నష్టపోయినదేదో ఎరిగిన వీరు– తమ సంపా దనతో, కృషితో అక్కడ నిలుపుకుంటున్నారు. అది అభిలషణీయమే. కాలిఫోర్నియాలో, చికాగోలో, పిట్స్‌ బర్గ్‌లో, హూస్టన్‌లో– ఇలా ప్రతీచోటా మన దేవాల యాలు వెలిశాయి. ఉత్సవాలు, సంబరాలు, కోకొల్లలు. ఏటేటా ఆటా, తానా, నాటా, పాటా– మీ ఇష్టం. తెలుగు తేజం వెల్లివిరుస్తుంది. ‘పాడుతా తీయగా’లు పల్లవి స్తాయి. క్లీవ్‌లాండ్‌లో ఏటేటా జరిగే కర్ణాటక సంగీ తోత్సవాలు చెన్నై సంగీత సభలకి తీసిపోవు. అమెరి కాలో బాలమురళీకృష్ణ, సంజయ్‌ సుబ్రహ్మణ్యం, టీఎం కృష్ణ, సుధా రఘునాథన్, కూచిపూడి పరపతి భారత దేశంలో స్థాయికి ఏ విధంగానూ తీసిపోదు.

ఇక మరో పార్శ్వం. మనవారు కులాల పేరుతో కోర్టులకు ఎక్కి అమెరికా కోర్టుల్లో నవ్వులపాలయ్యారు. ఇంకా తెలుగు సినిమాల రిలీజుకి అమెరికాలో కార్లలో ర్యాలీలు, తమ కులం కాని హీరోల పోస్టర్లు చింపే అల్లర్లు– ఇవన్నీ మన దేశంలోని వెర్రితలలను అమెరి కాకి దిగుమతి చేసిన వికారాలు. ఈ మధ్య తాజాగా చేరిన మరో రగడ– తెలంగాణ, ఆంధ్ర సోదరుల మధ్య ప్రాంతీయ అసహనం. ఇవన్నీ కడుపునిండినవారి విన్యా సాలు. అందరూ ఉపాధి కోసం మరో దేశానికి వచ్చిన వారే. భారతీయుల సామర్థ్యానికీ, క్రమశిక్షణకీ వచ్చిన ప్రాచుర్యం ఈ ‘అరాచకం’ ముందు నిలవలేదు. నిల వదు. ఉపాధి కోసం తాపత్రయం తలవంచుతుంది. అవసరానికి మించిన ఆదాయం, కుల, ప్రాంత, మత దురభిమానం వీధిన పడేస్తుంది. ఈ పని చైనావారు కానీ, పాకిస్తాన్‌వారు కానీ, బంగ్లాదేశ్‌వారు, ఫ్రెంచ్‌వారు గానీ చేయలేదు.

ఏతావాతా మన భారతీయ సోదరులు మరచి పోయినది ఏమిటంటే– మనమున్నది పరాయిదేశం. మన దేశంలో ఉన్న హక్కులు, వెసులుబాట్లు ఇక్కడ లేవు. ఉండవు. మనకి అంత రక్షణ లేదు. మనవాళ్ల కొందరి జేబుల్లోనయినా పౌరహక్కులున్నాయి. కానీ వారందరి జేబుల్లోనూ తుపాకులున్నాయని మరచి పో కూడదు. పైగా ఇక్కడ ఇప్పుడు చేస్తున్న పనులు భారత దేశంలోనూ నిషిద్ధాలు. మత సమైక్యత, ప్రాంతీయ సమైక్యత, కుల సమైక్యత వీటికి ఎల్లలు లేవు. మనకి పరాయి దేశంలో అన్యాయం జరిగినప్పుడు– భారతీ యులం. అంతా సవ్యంగా ఉన్నప్పుడు తమిళులం, ఫలానా కులం వారం, ఫలానా ప్రాంతం వారం. మన కోసం పొలాలు అమ్మి, పొట్టకట్టుకుని పనిచేసినవారు ఇంకా మనదేశంలో వృద్ధాశ్రమాలలో ఏకాకులుగా ఉన్నారు– అని మరచిపోతున్నాం. మనలాగే పరాయి దేశాల నుంచి వచ్చిన వారికి బాధ్యతారాహిత్యమైన ఈ విశృంఖలత్వం– వెగటుగా కనిపిస్తుంది.
ఫలితం ఏమిటి? అక్కడివారిలో వీరి వికారాలపట్ల విసుగు. ఆత్మన్యూనతా భావం. మత్సరం.

ఏతావాతా– అమెరికాలో ఉన్న భారతీయులు అమె రికా వారితో ఏకోన్ముఖం కాక, తమదైన సంస్కృతినీ, ఐడెంటిటీని తమ వెర్రితలలతోనూ పెంచుకోవాలని చూస్తున్నారు. గొంతులు చించుకుంటున్నారు. బహు శా– ఇదే ట్రంప్‌గారి ఆలోచనా ధోరణికీ, తత్కారణంగా రెచ్చిన దుష్ప్రభావానికీ పెట్టుబడి కావచ్చు.

చివరగా– నాకు ఎవరో ఈ సందేశాన్ని పంపారు. ఇది జెరూసలేమ్‌ నుంచి జాన్‌ ముల్లర్‌ అనే ఆయన ప్రకటించినది. ‘‘తమ ఉనికిని అంగీకరించమని భారతీ యులు అమెరికాని ‘అడుక్కునే’ బదులు– మీ భారతీ యులు ఇండియాలో ఒక ‘అమెరికా’ను తయారు చేసు కోలేరా? ఇజ్రేల్‌ దేశస్థుడుగా నేను చాలాసార్లు ఇండియా వచ్చాను. ఇండియాలో ఉన్న అపూర్వమైన శక్తి సామర్థ్యా లను గమనించాను. నిజం చెప్పాలంటే మీ భారతీ యులు తమ స్వదేశం నుంచి పారిపోవడానికి ఉర్రూత లూగుతుంటారు. కారణం–అటువైపు జీవితం ‘పచ్చగా’ ‘గొప్పగా’ కనిపిస్తుంటుంది. భారతదేశాన్ని ఆకాశంలో నిలిపే కృషి నిజంగా భారతీయులు చేయగలి గితే ఈ శతాబ్దం భారతదేశానిది. భారతీయులు ఇప్ప టికైనా ఈ సవాలును తీసుకుంటారా?’’


- గొల్లపూడి మారుతీరావు

మరిన్ని వార్తలు