బంగారు మనిషి

17 Aug, 2017 01:11 IST|Sakshi
బంగారు మనిషి

విశ్లేషణ (జీవన కాలమ్‌)
జీవితంలో ఆఖరిసారిగా పోటీలో పాల్గొంటున్న మహావీరుడికి గెలిచిన వీరుడు అక్కడికక్కడే మోకాళ్ల మీద నిలిచి మోకరిల్లాడు. ప్రపంచం నిశ్చేష్టమయింది. ఓ గొప్ప చరిత్ర ముగిసింది.


అతను ప్రపంచంలోకెల్లా వేగంగా పరిగెత్తగల యోధుడు. తొమ్మిది సంవత్సరాలపాటు ప్రపంచాన్ని దిగ్భ్రాంతుల్ని చేసి, అభిమానుల్ని ఆనందోత్సాహాలతో ఉర్రూతలూగించిన చాంపియన్‌. అతను ఉస్సేన్‌ బోల్ట్‌.

అభిమానుల తృప్తికోసం ఆఖరిసారి పరుగుపందెంలో పాల్గొంటున్నాడు. అభిమానులు గర్వంగా అతని విజయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రపం చం మరొక్కసారి ఆ విశ్వవిజేత చేసే విన్యాసానికి సిద్ధపడుతోంది. కాని ఆ రోజు అతని అడుగు ఒక్క లిప్తకాలం జంకింది. శరీరం మొరాయించింది. ఆఖరి 50 మీటర్లు ఒక జీవితకాలం దూరంగా కనిపించాయి. తనని దాటి ఏనాడూ కాలు కదపలేని ఇద్దరు ముందుకు దూసుకుపోయారు. అతనికి కాదు. వారికే ఇది పెద్ద షాక్‌.

ఇదేమిటి? పెద్దాయన తడబడ్డాడు! 9 సంవత్సరాలపాటు అతనికి ముందు గాలికూడా జొరబడలేని వేగంతో 8 ఒలింపిక్‌ పతకాలూ, 11 ప్రపంచ చాంపియన్‌ పతకాలూ గెలుచుకుని ఎన్నోసార్లు తనని తానే జయించుకుని రికార్డులు సృష్టించిన ఒక వీరుడు ఆ రోజు కేవలం మూడు సెకెన్లు ఆలస్యమయాడు. అతని ముందు ఇద్దరు నిశ్చేష్టులయి, నిస్సహాయంగా ముందుకు దూకారు. అక్కడితో కథ ముగియలేదు. జీవితంలో ఆఖరిసారిగా పోటీలో పాల్గొంటున్న మహావీరుడికి గెలిచిన వీరుడు అక్కడికక్కడే మోకాళ్ల మీద నిలిచి మోకరిల్లాడు. ప్రపంచం నిశ్చేష్టమయింది. ఓ గొప్ప చరిత్ర ముగిసింది.

9 సంవత్సరాలు ప్రపంచంలో మకుటం లేని మహారాజుగా నిలిచిన బోల్టు ఏమన్నాడు? ‘నేనూ మామూలు మనిషినే!’ అన్నాడు. ఇలాంటి మామూలు మనుషులు చరిత్రలో ఎంతమంది ఉంటారు! అలాంటి అనూహ్యమైన సంఘటన మరొక్కసారి జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత క్రికెట్‌ లెజెండ్‌ డాన్‌ బ్రాడ్‌మెన్‌ బ్యాటింగ్‌ ఏవరేజ్‌ 100 ఉండేది. ఇది అనూహ్యం. కాని ఆయన ఆఖరి ఆటలో కంటినిండా నీరు ఉంది. మొదటి బాల్‌కి అవుట్‌ అయాడు. కనుక ఏవరేజ్‌ 99.99 అయింది. ఇది కూడా చాలా అరుదయిన విషయం.

పరుగు పందెం ముగుస్తూనే బోల్ట్‌– ఆఖరిసారి పందెం చివరి గీతని తలవొంచి తాకి ముద్దుపెట్టుకున్నాడు.. ఆ గీతమీద లోగడ గోమఠేశ్వరుడిలాగ నిలిచిన చరిత్ర అంతటితో ముగిసింది. చూస్తున్న లక్షలాది అభిమానుల కళ్లు చెరువులయాయి. ఒక దశాబ్దంపాటు ప్రపంచాన్ని పరిపాలించిన ఈ జమైకా వీరుడు– 30సార్లు ప్రపంచంలోని ఎందరో పరుగు వీరులతో పోటీ చేశాడు. వారిలో కేవలం 9 సందర్భాలలో మాత్రమే మాదకద్రవ్యాలు పుచ్చుకోని వీరులు పరుగు తీశారు. ఆ 9 సందర్బాలూ ఒక్క బోల్ట్‌ విజయాలే!

ఓ పాత్రికేయుడు– ఆయన గురించి అన్న మాటని– ఎంత ప్రయత్నించినా తెలుగులో అంత గొప్పగా చెప్పలేను.  At a time when there was-and still is- a deep sense of cynicism about sporting excellence of any kind, he was the ultimate escape artist. ఆఖరి పరుగు పందాన్ని గెలిచిన గాట్లిన్‌ అన్నాడు. ‘‘నేను గెలుస్తున్నంత సేపూ నన్ను వేళాకోళం చేసే కేకలు అభినందించే చప్పట్లకన్నా మిన్నుముట్టాయి. కారణం నాకు తెలుసు. ప్రపంచం బోల్ట్‌ అపజయాన్ని కూడా పండగ చేస్తోంది.. గెలిచినా బోల్ట్‌ ముందు ఒక్కసారి మోకరిల్లాలనుకున్నాను. ఈ క్రీడకి ఆయన చేసిన ఉపకారం అనితరసాధ్యం.’’  బోల్ట్‌ అన్నాడు: ‘‘ఈ వెక్కిరింతలు న్యాయం కాదు. గాట్లిన్‌ గొప్ప పోటీదారుడు. మంచిమనిషి’’.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రపంచంలోని నలుమూలల నుంచి అభిమానుల సందేశాలు వెల్లువెత్తాయి. మనకు తెలిసివచ్చే ఒకే ఒక అభిమానిని ఉటంకిస్తాను. అతను ఇండియా క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ. ఆయన మాటలు: ‘ప్రపంచంలో బోల్ట్‌ కంటే గొప్పవాడెవడూ లేడు. ఉండడు.. అంత గొప్ప క్రీడా జీవితాన్ని ఇంతవరకూ చూడలేదు. ఇంత త్వరగా ఆ రికార్డులు ఎవరూ అధిగమించలేరు. ఉస్సేన్‌ సాబ్‌! ప్రపంచం మిమ్మల్ని తప్పక మిస్‌ అవుతుంది. ఎప్పుడయినా సరదాకి క్రికెట్‌ ఆడాలనిపిస్తే రండి. నేనెక్కడ ఉంటానో మీకు తెలుసు!’. బోల్ట్‌ గొప్ప క్రికెట్‌ అభిమాని. ‘థ్యాంక్స్‌ చాంప్‌’ అని సమాధానం ఇచ్చాడు.

పర్వతాన్ని ఎక్కిన ప్రతీవాడికీ దిగే రోజు వస్తుంది. కిరీటాన్ని ధరించిన మహారాజుకీ ఆఖరి విశ్రాంతి ఆరడుగులే. కాని తలవొంచే క్షణంలో తనూ మనలాంటి మనిషే అన్న స్పృహ అతన్ని మళ్లీ ఆకాశాన నిలుపుతుంది. బోల్ట్‌ వేగంలో గాలికి పాఠం నేర్పిన గురువు. మనలాగే అందలాన్ని దిగి మనమధ్య నిలిచిన మహోన్నతమైన వీరుడు. చరిత్రలో ఎక్కువమంది బోల్ట్‌లు ఉండరు. ఆ మాటకి వస్తే ఎక్కువమంది డాన్‌ బ్రాడ్‌మెన్‌లూ ఉండరు.

గొల్లపూడి మారుతీరావు

మరిన్ని వార్తలు