విలువైన జ్ఞాపకాలు

14 May, 2017 02:05 IST|Sakshi
విలువైన జ్ఞాపకాలు

‘ఇవాళ్టి రాజకీయాలే, రేపటి చరిత్ర’అంటుంది చరిత్ర రచనా విధానం. ఇవాళ్టి రాజకీయాలంటే నడుస్తున్న చరిత్ర. ఈ నడుస్తున్న చరిత్రకు వ్యాఖ్యాతే మంచి పత్రికా రచయిత. రాజకీయ, సామాజిక పరిణామాలు, కళ, సంస్కృతి, ఉద్యమాలు వంటి వాటి వెంట నడుస్తాడు పత్రికా రచయిత. వాటితో తర్కిస్తాడు, విభేదిస్తాడు, సమర్ధిస్తాడు కూడా. అంతిమంగా సమకాలీన చరిత్ర ఫస్ట్‌ రిపోర్ట్‌ను అందిస్తాడు. అందుకే ఒక పత్రికా రచయిత జీవిత చరిత్ర సమకాలీన సామాజిక, రాజకీయ చరిత్రగా కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రముఖ పత్రికా రచయిత డాక్టర్‌ జీఎస్‌ వరదాచారి ‘జ్ఞాపకాల వరద’ అలాంటి రచనే. ‘ఒకరికి వినిపించదగిన విశేషం నా జీవితంలో ఏముంది?’అని ప్రశ్నించుకుంటూ రాసుకున్న జ్ఞాపకాలివి. అందుకే బాల్యం గురించి చెప్పినా, ఉద్యోగ జీవితం గురించి వర్ణించినా సామాజిక నేపథ్యాన్ని గమనించుకుంటూనే రాశారు. ఏడు అధ్యాయాలలో (చిన్ననాటి ముచ్చట్లు, వివాహం– విద్యాభ్యాసం, జర్నలిజం వైపు మొగ్గు, ఉద్యోగపర్వం, శ్రామికాభ్యుదయం, రచనలు–పురస్కారాలు, దొరకునా ఇటువంటి సేవ?) జీఎస్‌ జ్ఞాపకాలు వెల్లువెత్తాయి.

‘గోవర్ధన వారి ఇంట్లో దూలాలను తడితే వేదమంత్రాలు వినిపిస్తాయి’. వరదాచారి ఇంటిపేరు అదే. స్వస్థలం ఆర్మూరు (వరదాచారి తాతగారు ఆరమూరు అని రాసేవారట). ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. అదీ ఒక నానుడితో చెప్పేవారు– ‘ఆర్మూర్‌ ఖుదా కా నూర్, సేంధీ సజ్దీక్‌ పానీ దూర్‌’. అంటే ఆర్మూర్‌ దివ్యతేజం. కల్లు దగ్గర, నీరు దూరం. చుట్టూ ఈత చెట్ల తోపులు. మంచినీటికి మాత్రం క్రోసులు నడిచి వెళ్లాలి. అసలు పేరు నవనాథపురం. నిజాం పాలన, తీరుతెన్నులు అందులో ప్రతిబింబించాయి. కొన్ని హిందూ అగ్రకులాల స్త్రీపురుషులు ప్రభు వర్గీయులను అనుకరిస్తూ బురఖాలు, షేర్వాణీలు ధరించేవారు. తెలుగు భాషకు రాచ మర్యాద లేకున్నా, నాలుగో తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన జరిగేదంటూ జీఎస్‌ రాసిన వాక్యాలు చారిత్రకంగా, విద్యాపరంగా ఇప్పుడూ ప్రాముఖ్యం ఉన్న సత్యాలు. అలాగే ప్రభుత్వ పాఠశాలల పనితీరు ఎలా ఉండేదో అవగతమవుతుంది. జీఎస్‌కు ఉన్నత పాఠశాలలో ఉర్దూ పేపర్‌లో అత్యధికంగా మార్కులు వచ్చాయి. ఇదెలా సాధ్యమైందో ఇందులో చదవవలసిందే (పే 26). అప్పుడు విద్యార్థులందరికీ శుక్రవారం సెలవు. దీనిని అర్థం చేసుకోవచ్చు.

తరచూ ‘నిజాంకు కొడుకు పుట్టాడు’ అంటూ సెలవులు ఇచ్చేవారు. ఇదెలా సాధ్యమనీ, ఇంతమంది ఎలా పుడతారనీ విద్యార్థులంతా ప్రశ్నించుకున్నారు. మిషనరీల కార్యకలాపాలు ఎలా ఉండేవో కూడా రచయిత వివరించారు. ఈ క్రమంలోనే రచయిత నిజాం సాగర్‌ ప్రాజెక్టు పరిణామం గురించి కూడా ప్రత్యేకంగా రాసుకున్నారు. ఒక నియంత నిర్మించి పెట్టిన సాగునీటి పథకం, ప్రజాస్వామ్య యుగంలో ఎండిపోయిన సంగతిని గుర్తు చేసుకోవడం ఒక అవసరం కోసమే. తరువాత మజ్లిసె (ఇలాగే రాయాలట) ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (వారే రజాకార్లు) ఆవిర్భావం, కార్యకలాపాల గురించి కూడా రచయిత జ్ఞాపకం చేసుకున్నారు. ఇన్ని అంశాలను తడిమిన వారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరా టం, కమ్యూనిస్టుల పాత్ర గురించి చెప్పకుండా ఉండటం సాధ్యం కాదు. ‘కమ్యూనిస్టుల చారిత్రక తప్పిదం’అనే ఉపశీర్షిక కిందే రచయిత ఆ ముఖ్యమైన అంశాన్ని వివరించారు. రజాకార్ల హింస, భూస్వామ్య వ్యతిరేక పోరాటం, ఆనాటి ఎన్‌కౌంటర్ల గురించి కొద్దిగానే అయినా చక్కని శైలిలో అందించారు. ఇందులో అమృత్‌లాల్‌ అనే వ్యక్తి జీవిత పరిణామం గురించి కూడా చదువుతాం. ఆయన జీఎస్‌ ఉపాధ్యాయుడే. ఇదంతా జీఎస్‌ జీవి తంలో ఒక దశను వెల్లడించే ఘటనల అక్షరరూప చిత్ర చయనిక. ఆ ఘటనల అంతరార్ధాన్ని జీఎస్‌ వివరించిన తీరు ప్రత్యేకంగా ఉంటుంది.

జీఎస్‌ పత్రికా రంగంలోకి యాదృచ్ఛికంగా వచ్చినవారు కాదు. తను చదివిన మొదటి పత్రిక ‘కృష్ణా పత్రిక’ అన్న సంగతి కూడా ఆయన గుర్తుంచుకున్నారు. అనుకోకుండా ఆ పత్రికకు పాఠకుడయ్యారు జీఎస్‌. 1954 ప్రాంతం నుంచి పత్రికా రచన, జర్నలిజం కోర్సుతో పరిచయం ఏర్పడినవారాయన. అంటే దాదాపు నాన్‌ ముల్కీ అలజళ్లు, ఆంధ్రప్రదేశ్‌ అవతరణ నుంచి జరిగిన చరిత్రకు ఆయన ప్రత్యక్ష సాక్షి. ఒక పత్రికా రచయితగా ఈ చరిత్రను గమనించారు. సంపాదక లేఖగా జీఎస్‌ పంపిన రచననే ‘స్వతంత్ర’ పత్రిక వ్యాసం రూపంలో ప్రచురించిందట. అదే జీఎస్‌ తొలి వ్యాసం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిజం కోర్సు చేసిన తరువాత ‘ది హిందూ’లో కొద్దికాలం ఇంటర్న్‌షిప్‌ చేశారు జీఎస్‌. అప్పటి అనుభవాలు కొత్తగా పత్రికా రచనలోకి వస్తున్నవారు చదివితే విస్మయం కలుగుతుంది. చిరస్మరణీయ ఉదంతం పేరుతో ఆనాటి చరిత్రకారుడు మల్లంపల్లి సోమశేఖరశర్మగారితో జీఎస్‌కు ఎదురైన అనుభవం వంటిది తమ జీవితంలో కూడా సంభవించాలని ప్రతి పత్రికా రచయిత కోరుకోవాలి. తెలుగు సాహితీ వైభవాన్ని పరిశీలించే అవకాశం కూడా జీఎస్‌కు వచ్చింది. ఆ అనుభవాలు కూడా చక్కగా రాశారు. అలాగే రాసిన వార్తకు రమణీయమైన శీర్షిక పెట్టడం పత్రికా రచయిత ప్రతిభను, సృజనను వెల్లడిస్తుంది. ఈ అంశాన్ని కూడా జీఎస్‌ చర్చించారు.

అనుభవజ్ఞుడైన ఒక పత్రికా రచయిత జీవిత చరిత్ర భావి పత్రికా రచయితలకు దివిటీ వంటిదే. అలాంటి పత్రికా రచయిత చుట్టూ ఉండే విషయాలు సామాన్య పాఠకులను కూడా ఆకర్షిస్తాయి. ఆ విధంగా ఈ ‘జ్ఞాపకాల వరద’ చదవవలసిన పుస్తకమే.
జ్ఞాపకాల వరద, డా. జి.యస్‌. వరదాచారి, ఎమెస్కో ప్రచురణ. పేజీలు 272, వెల రూ. 150/–
నేటి ఉదయం 10గంలకు హైదరాబాద్‌లో (సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌) ‘జ్ఞాపకాల వరద’ను ఆవిష్కరిస్తున్న సందర్భంగా..
– గోపరాజు

Read latest Vedika News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా