అమ్మను దోషిని చేస్తారా!?

2 Mar, 2016 10:55 IST|Sakshi
అమ్మను దోషిని చేస్తారా!?

అభిప్రాయం
దేశంలోని 50 వేల స్కాన్ సెంటర్ల రికార్డు సక్రమంగా నిర్వహించేలా పర్యవేక్షించటం చేతకావటం లేదు. కానీ ప్రతి ఏటా 2 కోట్ల 90 లక్షల మంది గర్భవతుల గర్భాలలో ఉన్నది ఆడో, మగో స్కాన్ చేసి, నమోదు చేయించి... ట్రాక్  చేసి ఆడ శిశువుల్ని కాపాడతారట. ఉట్టి కెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతాననడం అంటే ఇదే కదా!

 ‘‘డాక్టర్లని ఎంత కాలం శిక్షిస్తాం? ఇకనయినా లింగ నిర్ధారణను చట్టబద్ధం చేసి ఆడ శిశువుల్ని కాపాడాలి’’ అంటూ మన కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి మనేకాగాంధీ ఇటీవల మేధోమథనం చేశారు. ఈ దేశంలో ఎవరయినా స్కాన్ సెంటర్‌కు వెళ్ళి గర్భంలోని బిడ్డ ఆడో, మగో చెప్పమంటే కాదనే ధైర్యం ఎవరికుంటుంది’’ అని పాపం డాక్టర్ల నిస్సహాయత పట్ల చలించిపోయారు. లింగ నిర్ధారణ చట్ట రీత్యా తీవ్ర నేరం అని ప్రతి ఆసుపత్రిలో పెట్టిన బోర్డు కూడా అడిగిన వారికి చూపించలేనంత భయంతో డాక్టర్లు ఈ దేశంలో బతుకుతున్నారు... గర్భవతుల నుండి డాక్టర్లను కాపాడే చట్టం తెస్తే ఇంకా బాగుంటుం దేమోనని సదరు మంత్రి మలివిడతలో ప్రస్తావించ వచ్చు.

 పురుష వీర్య కణాలలోని ఎక్స్, వై క్రోమోజో ములను వడపోసి కేవలం మగ పిండాన్ని ఏర్పర్చే వై క్రోమోజోము వీర్య కణాలనే స్త్రీ గర్భంలో ప్రవేశ పెట్టడం అంటే అసలు ఆడపిండం ఏర్పడే అవకాశాన్ని లేకుండా చేసే పద్ధతి... డబ్బు, అవకాశంలేని వారు రూ.10 వేలతో లింగ నిర్ధారణ, గర్భస్రావాలకు వెళితే.. ఉన్నత, నయా మధ్యతరగతి లక్షన్నర ఖర్చుతో క్రోమో జోముల వడపోతలకు పాల్పడుతున్నారు.

 అంటే లింగాన్ని బట్టి గర్భస్రావాలు చేయటం నేరం అంటే మన వైద్యులు సాంకేతిక పరిజ్ఞానంలోని మరింత ఆధునికతను వాడి ఆడ శిశువులను పుట్ట కుండా చేస్తున్నారన్న మాట... అంటే వైద్యవృత్తిలోని కనీస నైతిక విలువల్ని, చట్టాన్ని రెండింటినీ ఉల్లంఘి స్తున్నారన్న మాట.

 2003 చట్ట సవరణ కాలం నుండి 2014 వరకూ దేశంలో కోటి 21 లక్షల మంది ఆడ శిశువులని  ముందే తెలియడంతో గర్భస్రావాలు జరిగితే 206 మంది డాక్టర్లకు మాత్రం కనీస శిక్షలు విధించారు. వారి సర్టిఫికెట్లు మాత్రం ఉపసంహరించిన దాఖలాలు లేవు. 15 రాష్ట్రాల్లో అస్సలు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఊపిరి తీయకుండా అమ్మ గర్భంలోనే హతమైనకోటిన్నర మంది పసిపాపల గురించి ఒక కన్నీటి బొట్టు రాలలేదు కాని మనేకాగాంధీ దయార్ద్ర హృదయం నేరస్తులైన ఈ 206 మంది వైద్యుల కోసం మాత్రం ఆక్రోశిస్తోంది.

 ఇక లింగ నిర్ధారణ చట్టబద్ధం అయితే గర్భాలలో ఉన్నది అంతా మగ శిశువులే అని నమోదు చేస్తారు. ఆడ శిశువుల భ్రూణ హత్య నేరంగాని మగ శిశువుల అబార్షన్ కాదు కదా. రకరకాల వైద్య కారణాలతో మగ శిశువులుగా నమోదైన ఆడ పిండాల్ని యధేచ్ఛగా తొలగిస్తారు. ఆడవాళ్ళకు పిండాలు పెట్టి గర్భస్రావ పరిశ్రమ విరాజిల్లడం ఖాయం. అంతగా వివక్షత అనుకుంటే ఆడ డాక్టర్లు మాత్రమే లింగ నిర్ధారణ చేయాలని నియమం పెడితే సంపూర్ణ సమానత్వం సిద్ధిస్తుంది.

 ఆడ పిల్లను కనాలా వద్దా? అసలు ఎంత మందిని కనాలి? ఎప్పుడు కనాలి? అసలు కనాలా వద్దా? అనే విషయంలో నోరు మెదిపే అధికారం ఆడవాళ్ళకు ఈ దేశంలో ఉందా? ఎందరికి ఉంది? స్త్రీల శరీరాలపై స్త్రీలకు హక్కు అనడం పాశ్చాత్య సంస్కృతి. అది ఇక్కడ చెల్లదని కుల మతాల గుత్తేదార్లు రంకెలు వేసి కాలు దువ్వుతున్న కాలం ఇది.

 ప్రతి దేశభక్తి గల స్త్రీ 10 మంది పిల్లల్ని (ఇతర మతాల వారికి మినహారుుంపు) కనాలని, లేదంటే కనీస పక్షం నలుగురు కొడుకుల్ని మాత్రం కనాలని బహి రంగంగా శాసించే పార్లమెంటు బాబాలను ఎన్నుకున్నందుకు స్త్రీలు ఈపాటి మూల్యం చెల్లించాలికదా!

 త్యాగం చేయటం, అణగి వుండటం ఉగ్గు పాలతో తాగి ఆచరించేవారే మన దేశపు నిజమైన స్త్రీలు  కాబట్టి గర్భస్థ శిశువు అడయినా మగయినా నిర్ధారణ జరిగాక దాన్ని కాపాడటం నూటికి రెండొందల పాళ్ళు అమ్మల కర్తవ్యమే... అందుకే కదా మాతృ దేవోభవ అన్నది... ఆ గర్భం చట్టబద్ధంగానో, నాటు పద్ధతితోనో, కొట్టడం, తన్నడం వంటి ఖర్చులేని టెక్నాలజీ వల్లనో లేదా ప్రమాదవశాత్తుగానో లేదా అసలు సహజసిద్ధ కారణాల వల్లనో గర్భస్రావం అయితే ఆమె నేరస్తురాల వుతుందన్న మాట. దీనికి వేరెవరూ బాధ్యులు కాదు. భావజాలం, సమాజం, కుటుంబ, డాక్టర్లు, ప్రభుత్వం ఇవన్నీ కూడా ఆడ శిశువుల మరణాలకు, భ్రూణ హత్యలకు బాధ్యులనడం దేశ ద్రోహం...

 అసలు స్త్రీల శరీరాలపై స్త్రీలకు హక్కులుండాలనడం మన కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసే అంతర్జాతీయ కుట్ర. 10 మందిని కనడం, కుటుంబ పోషణకు మాత్రమే సంపాదించడం (ఆర్థిక స్వావ లంబన వల్ల స్త్రీలు విచ్చలవిడి అవుతారట) వంటి పాతివ్రత్య సూత్రాల పునరుద్ధరణతోనే అభివృద్ధి సాధ్యం. ఇప్పటికే ‘‘ఇండియాస్ డాటర్’’ నిషేధం, బాలనేరస్తుల వయస్సు తగ్గింపులతో స్త్రీలపై అత్యాచా రాలు అరికట్టడం జరిగింది. అద్దె గర్భాలు చట్టబద్ధం అయితే ఇల్లు కదలకుండా స్త్రీలు స్వయం ఉపాధి పొంది లక్షలు ఆర్జించవచ్చు.

 మానవ సమతుల్యం కంటే జంతు సమతుల్య తను ప్రేమించేవారు మంత్రిగా ఉండి ఇటువంటి ఆలో చనలు చేయటం మన జన్మజన్మల కర్మఫలం. కనుక మనం ఒక అగ్రరాజ్యంగా ఎదగడాన్ని భగ్నం చేయ డానికే స్త్రీల హక్కులు, మానవ హక్కులు, దళిత హక్కులని గగ్గోలు పెడుతూ అభివృద్ధి నుండి మనల్ని ప్రక్కదారి పట్టిస్తున్నారని దేశ భక్తులంతా గమనిం చాలని మనవి.


వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, దేవి
pa_devi@rediffmail.com

మరిన్ని వార్తలు