నిస్సహాయ ‘గంగ’

15 Jul, 2017 04:16 IST|Sakshi
నిస్సహాయ ‘గంగ’

గంగా నదిపై సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్‌జీటీ) తరచు ఇస్తున్న ఆదేశాలు మన ప్రభుత్వాల తీరుతెన్నుల్ని ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. ఏళ్లు గడుస్తున్నా  నదుల విషయంలో ఇంకా చెప్పించుకునే స్థితిలోనే తప్ప... ప్రశంసించదగ్గ రీతిలో ప్రభుత్వాలు చేసింది ఒక్కటి కూడా లేదని ఈ ఆదేశాల పరంపర చూస్తే అర్ధ మవుతుంది. అయిదు రాష్ట్రాల్లో 2,525 కిలోమీటర్ల నిడివిలో ప్రవహించే గంగా నది కొన్ని దశాబ్దాలుగా కాలుష్యం బారిన పడుతోంది. ఆ నీరు తాగడం మనుషులకు, జంతువులకు హానికరమయ్యే దుస్థితి ఏర్పడింది.

హరిద్వార్, కనౌజ్‌లాంటి ఘాట్‌ లలో నీటిని పరీక్షించి చూస్తే స్నానానికి అది పనికిరాదని తేలిందని ఇటీవలే కేంద్ర మంత్రి విజయ్‌ గోయెల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతక్రితం యూపీఏ ప్రభుత్వ హయాంలో, ప్రస్తుతం ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చాక గంగ ప్రక్షాళన కోసం భారీ యెత్తున నిధులు కేటాయించారు. ఆ నిధుల్లో సింహభాగం ఖర్చు కాకపోవడం ఒకటైతే... వ్యయం చేసిన నిధుల వరకైనా పనికొచ్చిన వైనం కనబడకపోవడం మరో విషాదం. గత మూడేళ్ల లెక్కలు తీసుకున్నా ఈ సంగతే వెల్లడవుతుంది.  2014–15లో రూ. 2,053 కోట్లు కేటాయిస్తే కేవలం 170 కోట్లు ఖర్చుచేశారు. 2015–16లో రూ. 1,650 కోట్లు కేటాయిస్తే రూ. 602.60 కోట్లు వినియోగించారు. నిరుడు కేటాయించిన రూ. 1675 కోట్ల నిధుల్లో రూ. 756.01 కోట్లు ఖర్చయ్యాయి. యూపీఏ హయాంతో మొదలుపెడితే మొన్న మార్చి వరకూ మొత్తంగా గంగా నది ప్రక్షాళన కోసం రూ. 7,304.64 కోట్లు వ్యయం చేశారని గణాంకాలు చెబుతు న్నాయి. కానీ జరిగిందేమిటి?

మూడేళ్లక్రితం గంగాహారతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ 2019లో జరగబోయే మహాత్మాగాంధీ 150వ జయంతినాటికల్లా గంగానదిని ప్రక్షాళన చేసి ఆ మహనీయుడి స్మృతికి ఘనంగా నివాళి అర్పిద్దామని పిలు పునిచ్చారు. అందుకోసం రూ. 20,000 కోట్లు వ్యయం కాగల ‘నమామి గంగ’ ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. కానీ నిధుల కేటాయింపు, వ్యయం చేస్తున్న తీరు గమనిస్తే ఆ లక్ష్యం నెరవేరుతుందన్న ఆశ ఎవరికీ కలగదు. వచ్చే రెండేళ్లలో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ వరకూ గల 543 కిలోమీటర్ల మేర పురపాలక సంస్థల నుంచి మురుగునీరు, పరిశ్రమల వ్యర్థాలు, చర్మశుద్ధి కేంద్రాల వ్యర్థాలు నదిలో చేరకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి ఎన్‌జీటీ తాజాగా ఆదేశాలిచ్చింది. వ్యర్థాలు నదిలో విడిచిపెట్టేవారికి రూ. 50,000 మేర జరిమానా విధించాలని సూచించింది.

ఈ ఆదేశాలు ఈ ప్రాంతంలోని గంగానదికి మాత్రమే కాదు... దాని ఉప నదులకు కూడా వర్తిస్తాయి. తమ ఆదేశాలను సక్రమంగా అమలు చేస్తే 27 శాతం మేర కాలుష్యం తగ్గుతుందని ఎన్‌జీటీ లెక్కేసింది. హరిద్వార్‌–ఉన్నావ్‌ల మధ్య జనా వాసాల నుంచి 86 మురుగు కాల్వలు ఈ నదిలో కలుస్తున్నాయి. వందవరకూ పరిశ్రమలున్నాయి. ఈ నది ప్రవహించే అయిదు రాష్ట్రాల్లో 1,000 పరిశ్రమలుంటే అవి రోజుకు 50 కోట్ల లీటర్ల వ్యర్థాలను నదిలో విడుస్తున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ వాటి కట్టడిలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. నదీ జలాల్లో క్రోమియం, కాడ్మియం, సీసం, కోబాల్ట్‌ వంటివి వచ్చి చేరుతున్నాయి. సమస్య గంగానదికి మాత్రమే పరిమితమై లేదు. భూగర్భ జలాలకు సైతం ఈ కాలుష్యం అంటుతోంది. చివరకు తినే తిండి కూడా కలుషితమవుతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు 285 పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టినప్పుడు అందులో 85 సంస్థలు వ్యర్థాల శుద్ధికి సంబంధించిన ఏ ప్రమాణాలనూ పాటించడం లేదని తేలింది. పరిశ్రమల ఏర్పాటుకు అనుమతించినప్పుడే అందులోని వ్యర్థాలను ఏం చేస్తారన్న అంచనాలు అధికారులకు ఉంటాయి. అయినా అనుమతులు మంజూరవుతాయి. తమను అడిగేదెవరన్న అహంభావమే దీనంతకూ మూలం. ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే గంగానది ప్రక్షాళన, పునరుజ్జీవం కోసమని ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. దాన్ని కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉంచింది. కానీ ఏం లాభం? ఇంతవరకూ జరిగిందేమీ లేదని ఎన్‌జీటీ ఆదేశాలే చెబుతున్నాయి.

గంగా నది కాలుష్యాన్ని అరికట్టడానికి కేవలం దానిపై భక్తివిశ్వాసాలుంటే సరిపోదు. అందుకు దృఢమైన రాజకీయ సంకల్పం అవసరం. గంగా జలాల కాలుష్యం కారణంగా పౌరులు ప్రమాదకరమైన వ్యాధుల బారినపడుతున్నారు. తాగే నీరు, పీల్చేగాలి విషతుల్యమై వారి ఆయుఃప్రమాణం తగ్గుతోంది. నదిలో ఉండే చేపలు, ఆ నది పరిసరాల్లో ఉండే పశుపక్ష్యాదులు కూడా అంతుచిక్కని వ్యాధులతో మృత్యువాత పడుతున్నాయి. యమునా నదీ జలాలు పరీక్షిస్తే అవి దాదాపు మురుగునీరు మాదిరిగా ఉన్నట్టు తేలిందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆమధ్య ప్రకటించింది. నాలుగు నెలలక్రితం ఉత్తరాఖండ్‌ హైకోర్టు గంగ, యమున నదుల్ని సజీవ వ్యక్తులుగా గుర్తిస్తూ ఆదేశాలివ్వడం, ఈమధ్యే సుప్రీం కోర్టు ఆ ఉత్తర్వులపై స్టే విధించడం అందరికీ తెలుసు. నదిని అమ్మగా, దేవతగా ఆరాధించే సంప్రదాయం మన దేశంలో ఉంది. కానీ దాన్ని కలుషితం చేయడానికి ఇలాంటి విశ్వాసాలు, సంప్రదాయాలు అడ్డురావడం లేదు. ఇవి సాధించలేని ప్రయోజనాన్ని వ్యక్తి హోదా సాధిస్తుందని ఎవరనుకోగలరు? కేవలం వందల కోట్లు ఖర్చు పెడితే సరిపోదు. ఆ నదీ పరీవాహ ప్రాంత ప్రజలందరినీ అందులో భాగ స్వాములుగా మార్చాలి. తమ మనుగడ ఆ నదితో ముడిపడి ఉందన్న అవగాహన కల్పించాలి. వారి నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణ స్పందన ఉండాలి. ఇవన్నీ చేసినప్పుడే అనుకున్న ఫలితం వస్తుంది. లక్ష్యం నెరవేరుతుంది. ప్రచారార్భాటం లేకుండా గ్రామ, పట్టణ ప్రాంత పౌరులందరినీ ఈ కార్యక్రమంలో భాగస్తుల్ని చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి. మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్‌ రెండేళ్లక్రితం రాజస్థాన్‌లో ఆ సంగతి రుజువు చేశారు.

మరిన్ని వార్తలు