మొగ్గల్ని చిదిమే అతి మోహం

3 Mar, 2017 01:44 IST|Sakshi

సమకాలీనం
ప్యూపా దశ నుంచి సీతాకోకచిలుక దశకు ఎదగడం సహజంగా జరగాలి. ఇందులో ప్రకృతి సిద్ధమైన శాస్త్రీయ సూక్ష్మత ఇమిడి ఉంది. గూడును చీల్చుకు వచ్చే దాని పెనుగులాట వల్ల రెక్కల్లోని రక్తనాళాలు తెరచుకొని, ప్రసరణ సవ్యంగా జరిగి అవి బలోపేతమౌతాయి. బయటకు వచ్చిన వెంటనే అది స్వతహాగా ఎగరగలుగుతుంది. కానీ, ఆ పెనుగులాట చూసి జాలిపడి, గూడుని మనమే చీల్చి దానికేదో సహాయపడుతున్నామనుకొని బయటకు లాగితే... రెక్కలు బలపడక మట్టిలో పడి కొట్టుకు చస్తుంది సీతాకోకచిలుక.

ఈ మధ్య నేనో మిత్రుడి ఇంటికి ఫోన్‌ చేస్తే, వాళ్లబ్బాయి ఫోన్‌ ఎత్తాడు. ‘నాన్నున్నాడా?’ అంటే, ‘ఏమో అంకుల్, చూడాల’న్నాడు. ‘కనుక్కొని చెప్పరా’ అంటే, ఒకింత విసుగ్గా ‘సెల్‌కి చెయ్యండంకుల్‌’ అని కర్తవ్యబోధ చేసి ఫోన్‌ పెట్టేశాడు. ఎంత ఇల్లని? రెండు పడగ్గదుల చిన్నిల్లు. కానీ, గదుల మధ్యే కాదు మనుషుల మధ్య కూడా గోడలు మొలిచి, ఎదిగి, దృఢపడు తున్న కాలమిది! ప్చ్‌!! ఒకే ఇంట్లో మనుషులు పరస్పరం మాట్లాడుకోవడం, మనసు విప్పుకోవడం, కదలికలు తెలియడం కూడా తగ్గిపోయిన విచిత్ర తర మనిపించింది. ఆ ఇల్లని కాదు... మా ఇంట్లో పరిస్థితీ అదే! చిన్న క్యూబికల్‌ కుటుంబాల నుంచి పెద్ద జన సమూహాల వరకు మానవ సంబంధాల్లోనే ఏదో లోపమొచ్చినట్టనిపిస్తోంది. ఈ వెలితికి మూలాలెక్కడున్నాయ్‌? ఈ ప్రశ్న నాటినుంచి మనసును తొలుస్తూనే ఉంది. బహిరంతర కారణాలు లీలగా కనిపిస్తూనే ఉన్నాయి. అస్పష్ట సమాధానం అక్కడక్కడ దొరికినట్ట  నిపిస్తూనే జారిపోతోంది. నలభయ్యేళ్ల కిందటి మా బాల్యం, కౌమారం అలలు అలలుగా గుర్తొచ్చింది.

మనిషి బుద్ధి కొద్ది, ‘అప్పుడు– ఇప్పుడు’ అంటూ పోల్చుకోవడం మామూలే కదా! ప్రస్తుతంలోకి పాత జ్ఞాపకాల దొంతర దొర్లింది. కాలమెంత మారింది? పిల్లల పెంపకంలోనే చెప్పలేనంత తేడా! ఆలోచనల్లోనే అంతరం! ఎంతో దూరం అక్కర్లే... గత శతాబ్ది అరవై, డెబ్బైలలో మేం పెరిగాం. ఇప్పుడు పిల్లల్ని పెంచుతున్నారు. అక్షరాలే తేడా! పెరగటంలో కొన్ని లోపాలున్నా, పెంచడంలో ఉన్న లోపాలు వాటిని మించి పోయాయి. మనిషి ఎదిగే క్రమంలో వ్యక్తిత్వ వికాసానికి అవసరమయ్యే పటిష్ట పునాది పడటం లేదనిపిస్తోంది. బాల్యం కొంత వరకు నయమేమో కానీ, కౌమారం కర్కశంగా నలిగిపోతోంది. ఫలితంగా విశ్వాసం లోపించిన యవ్వనం భయం భయంగా మొదలవుతోంది. యుక్త వయసుకు ముందు సాగే కౌమార జీవన గమనంలో సహజత్వానికి బదులు కృత్రిమత్వం పెరిగి పోయింది. ఒత్తిడి వారిని నలిపేస్తోంది. మెదడు వికసించే దశలో పిల్లలు ప్రకృ తికి, సహజ వాతావరణానికి, పరిసరాల పరిశీలనకి, స్వతహాగా జనించే ఆలో చనా స్రవంతికి దూరమవడం కూడా ఈ వైకల్యానికి బలమైన కారణమేమో!

తపన జడిలో తల్లిదండ్రులు
బాల్యం నుంచి బతుకు ఒక్కపెట్టున నడివయసుకో, వృద్దాప్యంలోకో దుమి కితే..! అంతకన్నా దౌర్భాగ్యం మరోటుండదు. కానీ, అదే జరుగుతోంది. ‘కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు...’ అని మహాకవి శ్రీశ్రీ అన్నది ఇలాంటి వాళ్లనుద్దేశించేనేమో! మనిషి జీవితంలో అత్యంత కీలకమైన కౌమా రదశ కర్కశంగా చిదిమివేతకు గురౌతోంది. కొందరి విషయంలో అసలది ఉందో లేదో తెలీట్లేదు. ఫలితంగా కొన్ని జీవితాల్లో యవ్వనం బలవంతపు బతుకీడ్పుగా మొదలవుతోంది. కల్లోల కడలిలో నావలా నడివయసు. ఎండకు, వానకు అల్లాడే పండుటాకులా ఏ ఆసరా లేని ముదిమి. సరళ జీవి తాన్ని సంక్లిష్టం చేసుకుంటున్నాం. బాల్యం ముగిసి శారీరకంగా, మాన సికంగా ఎదుగుదల మొదలయ్యే పదో ఏటి నుంచి ఇరవయ్యో యేడు వరకు వయసును కౌమారం (అడులుసెంట్‌)గా పరిగణిస్తుంది సమాజం. ప్రపంచ ఆరోగ్య సంస్థా  ఇదే లెక్క చెప్పింది. సరిగ్గా ఈ వయసులోనే ఆలోచనలు, దృక్పథాలు, ప్రవర్తనల్ని బలపరుచుకుంటూ మెదడు వికసిస్తుంది. ‘బాల్యం నుంచి పెద్దమనిషిగా ఎదుగుతూ, వ్యక్తిగా తాను నిర్వహించాల్సిన పాత్రను నేర్చుకునే సంధి దశ’గా కౌమారాన్ని ‘వికీపీడియా’ నిర్వచిస్తోంది.

మొగ్గకు పువ్వుకూ మధ్యలోని దశ. ఇప్పటి పిల్లలు అనేకానేక కారణాల వల్ల సహజ మానవ సంబంధాలు, ప్రకృతి పరిణామాలు, సొంత ఆలోచన, వైవిధ్యా నుభూతులకు దూరమౌతున్నారు. అవి అనుభవంలోకి రాకుండానే ఆ దశను దాటేస్తున్నారు. ఫలితంగా ఎంతో కోల్పోతున్నారు. వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన గట్టి భూమిక ఏర్పడటం లేదు. బలవంతంగా వారిపై రుద్దుతున్న మన యాంత్రిక విద్యా విధానమూ కారణమే! పోటీ ప్రపంచంలో వారిని విజ్ఞానవంతుల్ని చేసి, మంచి స్థాయిలో ఉన్నతులుగా చూడాలని తల్లిదండ్రులు ఆశించడం సహజం. ఈ క్రమంలో తమకు తెలియకుండానే వారు తమ పిల్లలపై పెంచే ఒత్తిడి చిన్నారుల వ్యక్తిత్వ నిర్మాణం, ఎదుగు దలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. అనారోగ్యకర పోటీ వాతావర ణమూ సమస్యను జఠిలం చేస్తోంది. ‘మా పిల్లలు అన్నిట్లో అగ్రభాగాన ఉండాలి, ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. ఏదడిగినా టక టకా చెప్ప గలగాలి’ ఇటువంటి కల తల్లిదండ్రులది. అందరూ తమ పిల్లలు ఐఐటీ, ఐఏఎస్, ఐపీఎస్‌ సాధించాలనో అమెరికా, యూకే వెళ్లి పుష్కలంగా సంపద కూడగట్టాలనో కలలు కంటున్నారు. అందుకే, అయిదారు తరగతుల నుంచే కాన్సెప్ట్‌ స్కూల్స్, ఫౌండేషన్‌ కోర్సులొచ్చాయి.

ఏ సిలబస్‌ చదివి, ఎన్ని మార్కులు సంపాదించి, ఎంత ర్యాంకు తెచ్చుకున్నాడనేదే కొలమానం! ఎంత జీవితాన్ని చదివాడు? ప్రాపంచిక విషయాలెన్ని తెలుసు! నిజ జీవి తంలో ఓ సమస్య వస్తే గట్టిగా నిలబడి ఎదుర్కోగలడా? ఎలా అధిగ మిస్తాడు! అన్న స్పృహ వారికి తట్టడం లేదు. స్వేచ్ఛగా ఆలోచించే వెసులు బాటు లేకుండా, పరిశీలనా తత్వం అలవడకుండా, ప్రాపంచిక విషయాలతో ప్రత్యక్ష సంబంధం లేకుండా ఎలా ఎదుగుతారు? ఇవేవీ పెద్దలకు పట్టడం లేదు. అమ్మ ఎంత కష్టపడుతోంది? నాన్న ఎన్ని త్యాగాలు చేస్తున్నాడు? నేను ర్యాంకు తీసుకురాకపోతే వారికెంత అవమానం! అని తెలియకుండానే పిల్ల లపై పెరిగే ఒత్తిడి స్లోపాయిజన్‌ లాంటిదే! ఆశించిన ఫలితం రానప్పుడు అనుభవించే వారి మానసిక క్షోభకు లెక్కే లేదు. ఈ అపరాధభావన నుంచి పుట్టే అసహనం ఓ ఆత్మన్యూనతకు, అది అయితే చెడు సావాసాలకో, కాకుంటే ఆత్మహత్యా భావనకో పురికొల్పుతోంది. ఇక జీవితం దుర్భరం.

సిలబస్‌ బయట నేర్వగల పాఠాలెన్నో!
కౌమారంలో శారీరకంగా లింగవైవిధ్యం స్థిరపడేటప్పుడు మానసిక స్థితిలో కొంత అలజడి ఉంటుంది. ఏదేదో చేయాలని, ఉనికిని ధృవపరచుకోవాలనే సంక్షోభం వెన్నాడుతుంది. అప్పుడు సహజసిద్ధమైన స్వేచ్ఛలో కన్నా కృత్రిమ నిర్బంధంలో పొరపాట్లకు ఆస్కారమెక్కువ. ఈ తరం యువత ఎదు ర్కొంటున్న ప్రధాన సమస్య ఇది. పిల్లల్ని ఏదేదో చేసేయాలనుకునే తల్లిదండ్రులు చూపే శ్రద్ధాసక్తులు, నిరంతర పరిశీలన–నిఘా, ప్రమేయాలు వారిని స్వేచ్ఛగా ఉండనివ్వవు. అవి వారి స్వీయ ఆలోచనలపై ఆంక్షలుగా కనిపిస్తాయి. రెండువైపుల ఇష్టాయిష్టాల మధ్య ఓ సంఘర్షణ. గతంలో ఇదుండేది కాదు. పిల్లలు ఏం చదువుతున్నారు? ఎక్కడ తిరుగుతున్నారు? తాము నిర్దేశించిన తీరులో ఉన్నారా–లేరా? వంటి తలిదండ్రుల నిరంతర నిఘా అప్పట్లో ఇంత లేదు. ఒక్కొక్కసారి పెద్ద పట్టింపే ఉండేది కాదు. మేం ఆరేడు నుంచి పదో తరగతి వరకు ఆడిన ఆటలు, తిరిగిన తిరుగుళ్లు ఇప్పుడు గుర్తొస్తే ఆశ్చర్యమేస్తుంది. చేలు, పొలాల్లో పంట కాపలాకో, గ్రామ పొలి మేరల్లో ఆటలకో, దిగుడు బావుల్లో ఈదులాటకో... ఎక్కడెక్కడికో వెళ్లేది. సెలవుల్లో వారాల తరబడి సమీప బంధువుల ఊళ్లకెళ్లేది.

ఆ రోజుల్లో మా వయస్కులైన అత్యధికుల అనుభవాలివే! అప్పుడు మా ఊళ్లో రెండు వేలకు మించని జనాభా! వేసవి రాత్రులు భోంచేసి పడుకోవడానికి ఆరుబయట అరుగులపైనో, వాకిళ్లలోనో పక్క పరచుకునేది. పెద్దోళ్లు ఇళ్లల్లో నిద్దరోయాక, పది–పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే టౌన్‌లో సెకండ్‌షో సినిమాకో, సురభి వారి నాటకానికో వెళ్లొచ్చేది. అయిదారుగురికి తగ్గకుండా గుంపుగా కూడి నడిచో, సైకిళ్లపైనో వెళ్లి ఆట చూసి వచ్చాక... ఏమీ జరగనట్టు/ ఎరుగనట్టు చఢీచప్పుడు లేకుండా పడుకోవడం ఓ వింత అనుభూతి. కృష్ణ లీలలు, మాయాబజార్, బాలనాగమ్మ, తోటరాముడు వంటి సురభి నాట కాలు ఇలా చూసినవే. బయటి ప్రపంచంలో ఇంకా ఎన్నెన్ని చూసేదో! ఇలా సిలబస్‌ పుస్తకాల్లో లేని బోలెడు పాఠాల్ని నేర్పేది జీవితం. గ్రామీణ వాతా వరణంలో ఉన్న ఈ వెసులుబాటు పట్టణ, నగర జీవితంలో చాలా వరకు కొరవడింది. పట్టణీకరణ పెరిగిన క్రమంలోనే విద్యార్జన స్వరూప స్వభా వాల్లో చాలా తేడా వచ్చింది. కౌమారానికి పట్టిన దుస్థితి పల్లెల్లో కన్నా పట్టణాలు, నగరాల్లో మరీ ఎక్కువ.

తాజా దుస్థితికి దోషులెందరో!
పిల్లల్లో సహజాతిసహజమైన అమాయకతను తల్లిదండ్రులు భరించలేని స్థితి వచ్చింది. ‘అయ్యో! మీ వాడికింకా ఫొటోల డౌన్‌లోడ్‌ రాదా...? మా వాడైతే, సెల్‌ పట్టాడంటే...!’ ఇదీ వరస!! చిన్న వయసులోనే పిల్లలకు అన్నీ తెలుసని, తెలియకపోతే అదో లోపమని పెద్దలు బడాయిపోయే రోజులివి. అనవసరపు పోలికలు, అశాస్త్రీయమైన పంథా! జ్ఞానానికి, పరిజ్ఞానానికి తేడా తెలియని ప్రవాహంలో తల్లిదండ్రులు, టీచర్లు కొట్టుకుపోతున్నారేమో అనిపిస్తుంది. ఫక్తు వ్యాపార పంథాలో సాగే విద్యా సంస్థలూ అలాగే తయారయ్యాయి. పిల్లల్లో జ్ఞానతృష్ణ పెరగడానికి బదులు తల్లిదండ్రుల జ్ఞానవాంఛ వారిని వాస్తవాల్ని తెలుసుకోనీకుండా చేస్తోంది. దీనికి తోడు పిల్లలకి అనేక విష యాలు నేర్పుతున్నామనో, వనరుల్ని అందుబాటులో ఉంచుతున్నామనో... ఏదేదో చేసేయడం వారికి రివాజయింది. తమ మాటల్లో, చేతల్లో దాన్నొక త్యాగంగా చూపిస్తుంటారు. ప్యూపా దశ నుంచి సీతాకోకచిలుక దశకు ఎదగడం సహజంగా జరగాలి.

ఇందులో ప్రకృతి సిద్ధమైన శాస్త్రీయ సూక్ష్మత ఇమిడి ఉంది. గూడును చీల్చుకు వచ్చే దాని పెనుగులాట వల్ల రెక్కల్లోని రక్తనాళాలు తెరచుకొని, ప్రసరణ సవ్యంగా జరిగి అవి బలోపేతమౌతాయి. బయటకు వచ్చిన వెంటనే అది స్వతహాగా ఎగరగలుగుతుంది. కానీ, ఆ పెను గులాట చూసి జాలిపడి, గూడుని మనమే చీల్చి దానికేదో సహాయపడు తున్నామనుకొని బయటకు లాగితే... రెక్కలు బలపడక మట్టిలో పడి కొట్టుకు చస్తుంది సీతాకోకచిలుక. తెలిసో–తెలియకో పిల్లల కౌమారాన్ని నలిపి మన మదే చేస్తున్నాం. దీనికి తోడు బాధ్యతా రహితంగా తీసే చౌకబారు సిని మాలు, అర్థంపర్థంలేని కార్యక్రమాలతో సాగే నేలబారు టీవీ ప్రసారాలు ఒక తరం యువతను పెడదోవ పట్టిస్తున్నాయి. ఇంటర్‌నెట్‌ విచ్ఛిత్తి తర్వాత, మరీ ముఖ్యంగా ‘సామాజిక మాధ్యమాల’ విస్తృతి పెరిగాక సెల్‌ఫోన్‌ ఈ తరం పిల్లల్ని, యువతని భ్రష్టుపట్టిస్తోంది. సానుకూలంగా మార్చుకోవాల్సిన ఓ ఆధునిక సదుపాయం సరైన మార్గదర్శకత్వం లేక పెడదారి పట్టిస్తోంది.

ఇప్పుడీ దేశంలో యువతరానికి ఆదర్శప్రాయంగా నిలిచే నాయకత్వం, వ్యక్తులు లేకపోవడం ఓ దురదృష్టకర సన్నివేశం! తగిన కృషి, ఆదరణ కొరవ డటం వల్ల తరం మారుతున్న కొద్దీ కళా–సాంస్కృతిక వారసత్వం కూడా బలహీనపడుతోంది. సెల్‌ఫోన్‌–నెట్‌ దుర్వినియోగం చూసినపుడు, మానవ సంబంధాల పరంగా వరం కావాల్సిన శాస్త్ర సాంకేతికత యువతకు శాపమైం దేమోనన్న సందేహం కలుగుతుంది.‘‘నాకో భయం, శాస్త్రసాంకేతికత మానవ సంబంధాలని దాటేసిన రోజు ఈ ప్రపంచంలో మూర్ఖుల తరమే మిగులు తుంది’’ అన్న అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ మాటలు గుర్తొస్తాయి. మన అడుగులు అటే పడుతున్నాయేమోననే సందేహం. పిల్లల్ని సహజంగా పెంచాలి. ప్రకృతికి దగ్గరగా ఉంచాలి. స్వేచ్ఛగా ఆలోచించనివ్వాలి. సరైన వయసులో సమ గ్రంగా ఎదగనివ్వాలి. ఇప్పటికైనా నిర్లక్ష్యం చేయకుండా మనం జాగ్రత్త పడితేనే, భవిష్యత్‌ ఆలోచనల్ని, ఆచరణల్ని ప్రభావితం చేసే ప్రస్తుత తరం ‘కౌమారం’ ధృతరాష్ట్ర కౌగిలిలోకి జారకుండా నిలుపుకోగలుగుతాం.

దిలీప్‌ రెడ్డి
ఈమెయిల్‌: dileepreddy@sakshi.com

మరిన్ని వార్తలు