లంచాల క్రీడ రక్షణపై నీలినీడ

7 May, 2016 01:11 IST|Sakshi
లంచాల క్రీడ రక్షణపై నీలినీడ

జాతిహితం
ఎలాంటి లొసుగులూ లేని కొనుగోళ్ల వ్యవస్థను ప్రవేశపెట్టడం నేటి రాజకీయ వ్యవస్థలో అసాధ్యం. కాబట్టి మన వ్యవస్థలోని అంతర్గత పరిమితులను అంగీకరించి సకాలంలో కావల్సిన వాటిని సమకూర్చుకోవడం ఉత్తమం. ఆ తర్వాత మన దౌత్యాన్ని, వ్యూహాత్మక వైఖరిని తదనుగుణంగా మలుచుకోవచ్చు. ఇది ఎవరికీ ఎక్కదు. బహుశా మనం ఈ గందరగోళాన్ని భరిస్తూ, కుంభకోణాల దెబ్బలు తింటూ, కొరతలతో కొట్టుమిట్టాడుతూ, దోషులను పట్టుకోకుండా మన సైనికులను నిరాశానిస్పృహలకు గురిచేస్తూనే ఉంటాం.

'స్నానం నీటితో పాటూ బిడ్డను కూడా పారేసుకోకూడదు' వంటి మాటలు చెప్పే బామ్మల విసుగెత్తించే విజ్ఞతకు మన భారతీయులం అతీతులం. మనం స్నానం నీళ్లను ఉంచుకుని బిడ్డను పారేసే బాపతు. మన సైనిక కొనుగోళ్ల వ్యవహారాన్నే ఉదాహరణగా తీసుకోండి. కొత్త కొనుగోళ్లలో అత్యధిక భాగం కుంభకోణాలే. దీంతో పలు కొనుగోళ్ల ఒప్పందాలు రద్దయి మన సాయుధ బలగాలు కొద్దిపాటి నిల్వలతో, విడిభాగాలు, మందుగుండు సామగ్రి కొరతతో సతమతమవుతున్నాయి. అలా అని ఈ కుంభకోణాల్లో ఎవరూ పట్టుబడ్డదీ లేదు, ఎవరికీ శిక్ష పడిందీ లేదు. మన కాలానికి సంబం ధించిన కొన్ని ఉదాహరణలను చూద్దాం:
  1. అత్యంత ఎక్కువ కథనాలు వెలువడ్డ కుంభకోణం బోఫోర్స్. మొదటి ఆర్డర్‌కు అందిన శతఘు్నలే మన సైన్యం వద్ద ఉన్నాయి. దేశీయంగా వాటి తయారీ మొదలు కాలేదు. ఇప్పుడు ఉన్న శతఘు్నలకు విడిభాగాలు, మందుగుండు కొరత ఏర్పడింది. 17 ఏళ్ల క్రితం, కార్గిల్‌లో పోరాడుతుండగా సైన్యం ఎంతంటే అంతా చెల్లించి మరీ దిగుమతులు చేసుకోవాల్సి వచ్చింది. బోఫోర్స్ కుంభకోణం తర్వాత 30 ఏళ్లలో కొత్తగా శతఘు్నలను దిగుమతి చేసుకోలేదు. అన్నిటికంటే ముఖ్యంగా, లంచాలు తీసుకున్నందుకు ఎవరినీ శిక్షించిందీ లేదు, డబ్బును తిరిగి రాబట్టిందీ లేదు. బిడ్డను పారేసి మురికి స్నానపు నీటిని దాచుకోవడానికి ఇది ఉత్తమమైన ఉదాహరణ.

 2. 'టైప్ 2090' కుంభకోణంగా పిలిచిన జర్మన్ తయారీ హెచ్‌డీడబ్ల్యూ జలాంతర్గాముల కుంభకోణం కూడా అదే కాలం నాటిది. అవి మన సైన్యం సమకూర్చుకున్న మొట్టమొదటి ఎస్‌ఎస్‌కేలు (జలాంతర్గాములను ధ్వంసించే జలాంతర్గాములు) అయ్యేవి. ఆ కార్యక్రమమూ మూలన పడింది. పదేళ్ల తర్వాత  కేవలం రెండిటిని కొనుక్కున్నాం, మరో రెండిటిని అసెంబుల్ చేసుకున్నాం. ఇక సాంకేతికత బదలాయింపు, విస్తరణ జరిగిందే లేదు.

 3. సరిగ్గా ఈ రెండు కుంభకోణాల సమయంలోనే జరిగినందున రక్షణశాఖ కొనుగోళ్ల కిందకు రాని ఎయిర్ బస్-320ల కుంభకోణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుందాం. అప్పుడే ముడుపుల గురించిన పుకార్లు విన బడుతుండగా బెంగళూరు వద్ద ఒక ఏ-320 కూలిపోయింది. దీంతో కొన్న మొత్తం విమానాలను ఉపయోగించకుండా పక్కన పెట్టేశారు. సద్దాం హుస్సేన్ కువైట్‌పై దండెత్తినప్పుడు వేలాది మంది భారత పౌరులను కువైట్ నుంచి విమానాల్లో తరలించాల్సి వచ్చింది. నిజ జీవితంలో ఆ పని చేసిపెట్టే అక్షయకుమార్ లేడు, మన ఎయిర్ ఇండియా సామర్థ్యం అందుకు సరిపోదు. కాబట్టి నాటి వీపీ సింగ్ ప్రభుత్వానికి మూలనపడి ఉన్న ఏ-320ల దుమ్ముదులిపి తీయడం తప్ప గత్యంతరం లేకపోయింది. ఒక్కసారి అవి అలా ఎగరడం మొదలు పెట్టాక ఇక ఆగింది లేదు. ఆ విమానాలన్నిటినీ మూలన పడేయడం వల్ల వచ్చిన నష్టాల నుంచి ఇండియన్ ఎయిర్‌లైన్స్ కోలుకున్నది లేదు. ఈ విషయంలో కూడా ఏమీ రుజువు కాలేదు, ఎరినైనా పట్టుకోవడమో లేదా శిక్షించడమో జరగలేదు.

రాజకీయ ప్రతీకార క్రీడ
బోఫోర్స్‌తో తగిలిన ఎదురుదెబ్బ, కలిగిన అవమానం అత్యంత క్రూర రాజకీయ ప్రతీకారాల పరంపరకు దారితీసింది. ‘తెహెల్కా’ స్టింగ్ ఆపరే షన్‌తో  కాంగ్రెస్‌కు అవకాశం దొరికింది. పథకం ప్రకారం తమ వాళ్లను ఇరికించారని ఎన్‌డీఏ గగ్గోలు పెట్టింది. బంగారు లక్ష్మణ్, ఫెర్నాండెజ్‌లు తమ పదవులను కోల్పోవాల్సి వచ్చింది (రెండోవారు తాత్కాలికంగానే). నిజానికి ఎలాంటి రక్షణ ఒప్పందంతోనూ సంబంధం లేని బంగారు లక్ష్మణ్ ఒక్కరు తప్ప మరెవరినీ చట్టం శిక్షించలేదు. 'తెహెల్కా' స్టింగ్ ఆపరేషన్‌లో ఇందిరా గాంధీ కుటుంబం... బోఫోర్స్ విషయంలో రాజీవ్‌పై విరుచుకుపడ్డ బీజేపీపైన, ప్రత్యేకించి అతి తీవ్రంగా దాడి చేసిన ఫెర్నాండెజ్‌పైన కసిగా ప్రతీకారాన్ని తీర్చుకునే అవకాశాన్ని చూసింది. అయితే వాజ్‌పేయి విశ్వసనీయత, జనాకర్షణ ఫలితంగా బీజేపీ వదుల్చుకోదగిన బంగారు లక్ష్మణ్‌ను పక్కనబెట్టి, ఫెర్నాండెజ్ ప్రతిష్ట పునరుద్ధరణకు సహకరించింది.

కాంగ్రెస్ ప్రతీకారం అసంపూర్తిగానే మిగిలిపోయింది. కాబట్టి ఆ తర్వాతి కాలంలో ఎన్‌డీఏపై మరో ప్రతీకార యత్నం సాగింది. 'శవ పేటికల కుంభకోణం'గా పిలిచిన ఆ వ్యవహారంలో కూడా చివరికి ఏమీ రుజువు కాలేదు. అయితే, దాని పర్యవసానంగా కార్గిల్‌లో పరిమిత సంఘర్షణ సాగుతున్నా, ఇంచుమించు పూర్తిస్థాయి యుద్ధ పరిస్థితులు ఏర్పడ్డా (ఆపరేషన్ పరాక్రమ్)... ఆరేళ్ల వాజ్‌పేయి పాలనా కాలంలో పెద్దగా రక్షణ కొనుగోళ్లు జరగలేదు. చేతలుడిగిన ప్రభుత్వం చెప్పుకోదగిన రష్యాయేతర తయారీ రక్షణ వ్యవస్థలు వేటినీ ప్రవేశపెట్టలేదు. శత్రు క్షిపణుల, వైమానిక దాడుల నుంచి మన నావికా బలగాలకు   రక్షణను కల్పించే ఇజ్రాయెలీ బరాక్ క్షిపణి వ్యవస్థల తయారీదారు రాఫేల్‌పై నిషేధం వల్ల అవి మూలనపడ్డాయి. దీంతో అత్యంత విలువైన మన నౌకలు రక్షణ లేకుండా ఉండాల్సి వచ్చింది. ఇప్పడు కూడా అలాంటి పరిణామమే జరిగింది. మన అత్యాధునిక జలాంతర్గామి స్కోర్పెని టోర్పెడోలు (నౌకా విధ్యంసక వ్యవస్థలు) లేకుండానే జలప్రవేశం చెయ్యాల్సి వచ్చింది. వాటిని తయారుచేసే 'వాస్' అగస్టాకు అనుబంధ సంస్థ కావడంతో దానిపై యూపీఏ రక్షణ మంత్రి ఆంథోనీ నిషేధం విధించారు.

క్రియాశూన్యతే ఉత్తమమా?
అనుకోకుండా 2004లో కాంగ్రెస్ అధికారంలోకి తిరిగి రావడంతో అది ఎన్‌డీఏ హయాంలోని రక్షణ ‘‘కుంభకోణాల’’కు సంబంధించి ఏదైనా కనిపెట్టాలని నానా ప్రయాస పడింది. కానీ ఏమీ దొరకలేదు. యూపీఏ మొదటి రక్షణమంత్రి ప్రణబ్ ముఖర్జీ విజ్ఞతాయుతులైనందువల్ల కక్ష సాధింపు చర్యలకు దిగలేదు. ఈ పరస్పర కక్ష సాధింపుల పర్యవసానంగా చివరికి మన సాయుధ బలగాలు మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని ఆయన కు తెలుసు. కుంభకోణాలు వేటినీ ‘కనిపెట్ట’లేని ఆయన అశక్తత సోనియా కుటుంబానికి చిరాకు తెప్పించింది. ఆయనను రక్షణశాఖ నుంచి తప్పించి విధేయుడైన ఏకే ఆంథోనీని నియమించడానికి బహుశా అదే కారణం కావచ్చు. ఆంథోనీ కూడా ఈ కక్ష సాధింపును ప్రారంభించలేకపోయారు. ఆయన తన సంగతి తాను చూసుకుంటూ, తన చేతులకు బురద అంటకుండా చూసుకోవడమే ప్రధాన కర్తవ్యంగా భావించారు. ఒక కుంభ కోణం గురించి మొదటి పుకారు వెలువడటంతోనే సీబీఐని పిలవడం, ఆ సరఫరాదారును నిషేధించడం ఆయన విశిష్ట స్పందనగా ఉండేది.

ఈ క్రమంలోనే ఆయన  అత్యంత సుదీర్ఘ కాలం రక్షణమంత్రిగా పనిచేసినవారు కాగలిగారు. అంతేకాదు, బహుళజాతి రక్షణ సంస్థల విలీనాలు, స్వాధీనాలు (ఎమ్-ఏలు) జోరుగా సాగుతున్న వాతావరణంలో...అత్యధికంగా సరఫరా దారులను నిషేధించి సైన్యానికి మచ్చలేని సరఫరాదారునే కనుగొనలేని పరిస్థితి ఏర్పరచారు. ఉదాహరణకు, ఆయన 2012లో జర్మనీకి చెందిన రీన్‌మెటాల్‌ని నిషేధించడంతో, దానికి అనుబంధంగా ఉన్న 109 ఇతర పాశ్యాత్య ఆయుధ కంపెనీలపైన కూడా నిషేధం వేటు పడింది.  యూరో పియన్ కంపెనీలనే కాదు, సింగపూర్, ఇజ్రాయెల్ కంపెనీలను కూడా ఆయన నిషేధించారు. ‘త్వరలోనే ఆయన పాకిస్తానీ సైన్యాన్ని కూడా నిషేధిం చేస్తారు కాబట్టి అసలు సమస్యే పరిష్కారమైపోతుంది’ అనే జోక్ రక్షణశాఖ ప్రధాన కార్యాలయంలో ప్రచారంలో ఉండేది. సాయుధ బలగాలు ఈ ధోరణితో నిరాశానిస్పృహలకు గురవుతుండటంతో, నేను ఆయన రక్షణశాఖ ఆధునికీకరణ వైఖరిని ‘‘మెత్తటి గొలుసులతో బంధించినది’’గా వర్ణించడం ప్రారంభించాను.

 అగస్టా వెస్ట్‌ల్యాండ్ లంచానికి సంబంధించి పెద్ద విచిత్రమేమిటంటే అది ఆంథోనీ రక్షణమంత్రిగా ఉన్నాగానీ జరిగినది. లంచాలు తీసుకున్నది నిజమేనని అంగీకరించి ఆయన ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. పెనాల్టీ షరతులపై విజ్ఞప్తి చేసుకుని విచారణలకు ఆదే శించారు. ఇటాలియన్ అధికారులు ఈ వ్యవహారంలో అవకతవకలను క నుగొన్న తర్వాత, వాటిని ఒక భారత వార్తాపత్రిక, దాని విలేకరి వాటిని బయటపెట్టి, ఆ కథనాన్ని విడవకుండా అదేపనిగా దాని గుట్టుమట్టులను వెలికితీసిన తర్వాతనే ఆయన చర్య తీసుకున్నారనేది నిర్వివాదమైన వాస్తవం. నేటికీ ఆ విలేకరి ఆ కృషిని కొనసాగిస్తుంటే... మిగతావారు జోరుగా గతానికి సంబంధించిన ‘‘న్యూస్- బ్రేక్’’లకు తామంటే తామే కారకులమని చెప్పుకోగలుగుతున్నారు.

 అగస్టా లంచాలు ఇచ్చిందనేది నిర్వివాదం కాబట్టి కేసును వేగంగా విచారించి దోషులను శిక్షించాల్సిందే. అయితే ఈ కుంభకోణాన్ని, అంతకంటే పెద్ద సమస్య అయిన సైన్యం ఆధునికీకరణ నుంచి వేరుచేసి చూపేది ఏమిటో చెప్పగల వివేకం మనకుందా? మనం మేక్ ఇన్ ఇండియా గురించి మాట్లా డగలం. కానీ అత్యధిక ‘‘భారత’’ వ్యవస్థలు సైతం ఇంజన్లు, వైమానిక ఎలక్ట్రానిక్ పరికరాలు, సెన్సార్లు, ఆయుధాల గెడైన్స్ వ్యవస్థలు తదితరాల కోసం భారీ ఎత్తున దిగుమతులపైనే ఆధారపడి ఉన్నాయి. అత్యంత ప్రము ఖంగా కనిపించే తేజాస్, ఏఎల్‌హెచ్, స్టెల్త్ ఫ్రిగేట్లు, ఎమ్‌బీడీ అర్జున్‌లు సైతం అనుకున్న దానికంటే 30 ఏళ్లు వెనుకబడి ఉన్నాయి.

నిరాశా నిస్పృహలే సైన్యానికి ‘బలం’
మన దేశం ఎంచుకోడానికి మూడు మార్గాలున్నాయి. ఒకటి, చీకటి ఆయుధాల బజార్‌లో టెండర్ల ప్రాతిపదికపై కొనుగోళ్లు జరపడం ఇక ఎంత మాత్రమూ సాధ్యంకాదని అంగీకరించాలి. భావి కొనుగోళ్లన్నీ ప్రభుత్వం నుంచి పూర్తిగా ప్రభుత్వానికి  లేదా అమెరికన్లు పిలిచేట్టు ఎఫ్‌ఎమ్‌ఎస్ (ఫారిన్ మిలిటరీ సేల్స్) ప్రాతిపదికపైనే జరగాలి. ఈ మార్గం ద్వారానే ఐఏఎఫ్, నావికా బలగాల కోసం కొత్త సీ-130లు, సీ-17లు, పీ-81లకు యూపీఏ ఆర్డర్లను ఇచ్చింది. దీని ఫలితంగా ఆంథోనీ తనకు భావజా లపరంగా ఏ మాత్రం గిట్టని అమెరికా నుంచి ఈ కొనుగోళ్లు చేయాల్సింది. ఆయన హయాంలో గత 65 ఏళ్లలోనే మొదటిసారిగా అమెరికా మనకు అతిపెద్ద ఆయుధాల సరఫరాదారుగా మారింది. బీజేపీ ఇప్పుడు రెండు స్క్వాడ్రన్ల ఫ్రెంచ్ రాఫేల్ విమానాలను అదే మార్గం ద్వారా కొంటోంది, అమెరికా శతఘు్నలను పరిశీలిస్తోంది. దీనివల్ల కొనుగోలుదారులుగా మనకు ఎంచుకోవడానికి ఉండే అవకాశాలు, బేరసారాలాడే శక్తీ తగ్గిపోతుంది. అయితే మధ్యవర్తులను దూరంగా ఉంచగలం.

 ఇక రెండవది, ఎలాంటి లొసుగులూ లేని కొనుగోళ్ల వ్యవస్థను ప్రవేశపెట్టడం. చీలిన మన రాజకీయ వ్యవస్థలో అది అసాధ్యం. మూడవది, మన వ్యవస్థలో అంతర్నిహితమై ఉన్న పరిమితులను అంగీకరించి సకాలంలో కావల్సిన వాటిని సమకూర్చుకోవడం (వీవీఐపీల హెలికాప్టర్ అవసరాన్ని 1999లోనే ఆమోదించినా ఇంకా సమకూరలేదు) ఉత్తమం. ఆ తర్వాత మనం మన దౌత్యాన్ని, వ్యూహాత్మక వైఖరిని తదను గుణంగా మలుచుకోవచ్చు. ఇది ఎవరికీ అక్క ర్లేదు. కాబట్టి బహుశా మనం ఈ గందరగోళాన్ని భరిస్తూ, కుంభకోణాల దెబ్బలు తింటూ కొరతలతో కొట్టుమిట్టాడుతూ, దోషులు ఎవరినీ పట్టు కోకుండా మన సైనికులను నిరాశానిస్పృహలకు గురిచేస్తూనే ఉంటాం. క్లుప్తంగా చెప్పాలంటే, బిడ్డను పారేస్తూ, మురికి స్నానపు నీటిలో ఆటలాడుతూ ఉంటాం.
http://img.sakshi.net/images/cms/2015-08/81438371243_295x200.jpg

శేఖర్ గుప్తా: twitter@shekargupta
                                                
 

>
మరిన్ని వార్తలు