-

ఎవరికీ పట్టని ‘ఆరోగ్యం’

4 Mar, 2017 03:53 IST|Sakshi
ఎవరికీ పట్టని ‘ఆరోగ్యం’

ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కు చేయాలన్న సంకల్పం మూడేళ్లుగా మూలనబడి మూలుగుతోంది. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో కనీసం 2.5 శాతం మొత్తాన్ని ఆరోగ్య రంగానికి కేటాయించాలన్న నిర్ణయమూ నాలుగేళ్లుగా అటకెక్కింది. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు కావస్తున్నా ఈనాటికీ దేశంలో ఆరోగ్య సదుపాయాలు అంతంతమాత్రంగా ఉంటున్నాయి. ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కు చేయదల్చుకున్నామని ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించిన ముసాయిదా రూపొందిందని వార్తలు వెలువడ్డా ఆ విషయంలో ఇంతవరకూ ఎలాంటి పురోగతి లేదు. 2012 మార్చిలో యూపీఏ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇకపై జీడీపీలో 2.5 శాతం నిధుల్ని ఆరోగ్య రంగానికే కేటాయి స్తామని ప్రకటించారు.

అంతేకాదు... వచ్చే అయిదేళ్లలో రూ. 3 లక్షల కోట్లు ఖర్చు చేసి పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థను రూపొందిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. యూపీఏ సర్కారు ఆ తర్వాత మరో రెండేళ్లు అధికారంలో ఉన్నా ఆ వాగ్దానాల ఊసే లేదు. ప్రభుత్వాలు మారినా ఇప్పటికీ ఆ పరిస్థితిలో మార్పేమీ లేదు. ఈసారి కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి రూ. 47,352 కోట్లు కేటాయిం చారు. అంతక్రితం వార్షిక బడ్జెట్‌తో పోలిస్తే ఇది దాదాపు పదివేల కోట్ల రూపా యలు ఎక్కువే. కానీ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నాక లెక్కేస్తే ఇది 2011–12 బడ్జెట్‌ కేటాయింపు కన్నా తక్కువంటున్నారు ఆర్థిక నిపుణులు. ఈసారి కూడా ఈ కేటాయింపు జీడీపీలో 0.29 శాతం మాత్రమే! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ మన దేశంలో ఆరోగ్య రంగానికి వెచ్చిస్తున్న మొత్తం జీడీపీలో 1.2 శాతం మించడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలో మనకంటే ఆరోగ్యానికి తక్కువ వెచ్చించే దేశం పాకిస్తాన్‌ మాత్రమే. ఈ విషయంలో ఆ దేశంకన్నా మెరుగ్గా ఉన్నామని చెప్పుకునే స్థితి ఉండటం ఎంత సిగ్గుచేటు!

దేశంలో ఇప్పటికీ వైద్యంలో ప్రైవేటు రంగానిదే పైచేయి. పట్టణ ప్రాంతాల్లో 70 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 63 శాతంమంది ప్రైవేటు వైద్యంపైనే ఆధారపడుతు న్నారని ఇటీవలి సర్వేలో తేలింది. బాలింతల మరణాలు, శిశు మరణాలు ఈమధ్య కాలంలో తగ్గుముఖం పడుతున్న సంగతి నిజమే అయినా అవి ఇంకా ఆందోళనకర స్థాయిలోనే ఉన్నాయి. మనదేశంలో లక్షకు 167మంది బాలింతలు మరణిస్తున్నారు. ఈస్తోనియా(2), గ్రీస్‌(3) పోలాండ్‌(5)తో పోలిస్తే మనం ఎక్కడో ఉన్నాం. శిశు మరణాల్లోనూ అదే స్థితి. ప్రతి వేయిమంది పిల్లలకూ 39మంది కళ్లు తెరవకుండానే కన్నుమూస్తున్నారని తాజా సర్వే చెబుతోంది. జపాన్, స్వీడన్‌లాంటిచోట వేయికి రెండు మరణాలు కూడా లేవు. చిలీ(6), శ్రీలంక(8), సిరియా(12)తో పోల్చినా మనం ఎంతో వెనకబడి ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు వైద్యం అందు బాటులో లేకపోవడం వల్లా, వారికి వైద్య నిపుణుల సలహాలు లభించకపోవడం వల్లా ఈ దుస్థితి ఏర్పడుతోంది. వైద్యం కోసం పౌరులు భారీ మొత్తం ఖర్చు చేయ వలసివచ్చే దేశాల జాబితాలో కూడా మనమే ముందున్నాం. మన దేశంలో ప్రజా రోగ్యానికయ్యే వ్యయంలో 58 శాతాన్ని పౌరులే భరించుకోవాల్సివస్తోంది. థాయ్‌ లాండ్‌లాంటి దేశంలో 11 శాతం, వియత్నాంలో కూడా 49శాతం ఉన్నదంటే మన దుస్థితి అర్థమవుతుంది.

జీడీపీలో కనీసం 2.5 శాతాన్ని ఖర్చు చేస్తే తప్ప ఈ స్థితి మారదని నిపుణుల బృందం రెండేళ్లక్రితం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. నిజానికి నిధుల పెంపు సంగతలా ఉంచి  ఉన్న నిధులు సద్వినియోగం అయ్యేలా చూడటం అవసర మని ప్రజారోగ్య కార్యకర్తలు అంటారు. ఆ విషయంలోనూ విఫలమవుతున్నాం. ప్రభుత్వాసుపత్రుల్లో బిడ్డల్ని కని, పిల్లలకు క్రమం తప్పకుండా టీకాలు వేయించే తల్లుల ఖాతాలకు రూ. 6,000 బదిలీ చేస్తామని నూతన సంవత్సర ఆరంభంలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. మొత్తం ప్రసవాల్లో నాలుగోవంతు ప్రభుత్వాసు పత్రుల్లో జరిగినా ఇందుకు ఏడాదికి రూ. 5,000 కోట్లకు పైగా వ్యయమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలా చూస్తే జాతీయ ఆరోగ్య పథకాలకు కేటాయించిన రూ. 27,153 కోట్లలో అధికభాగం బాలింతలకే వెళ్తుంది. మిగిలిన మొత్తంతో ప్రామాణికమైన వైద్య సదుపాయాలను కల్పించడం సాధ్యంకాదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పటిష్టం చేస్తే హృద్రోగాలనూ, కేన్సర్‌వంటి వ్యాధులనూ సకా లంలో గుర్తించి చికిత్స అందించే అవకాశం ఉంటుంది. అందువల్ల శస్త్రచికిత్సల వరకూ వెళ్లే అవసరం తగ్గుతుంది. పౌష్టికాహారం, మంచినీరు, పారిశుద్ధ్యం మెరుగు పరిస్తే అనారోగ్య సమస్యలను నివారించడం సులభమవుతుంది. విద్యారంగాని కిచ్చే ప్రోత్సాహం కూడా ఈ కృషిలో తోడ్పడుతుంది. కానీ దేనిలోనూ ప్రభుత్వాలు పూర్తి విజయం సాధించలేకపోతున్నాయి.

నిజానికి ప్రభుత్వ ప్రమేయం అధికంగా ఉండాల్సిన రెండు కీలక రంగాలు విద్య, వైద్యం అని నోబెల్‌ గ్రహీత అమర్త్యసేన్‌ అంటారు. ఈ రెండుచోట్లా సంపూర్ణ సేవలు అందించడం ప్రైవేటు రంగానికి అసాధ్యమని చెబుతారు. చిత్రమేమంటే పౌరులకు ప్రాణావసరమైన ఈ రెండు రంగాలనూ మన ప్రభుత్వాలు ప్రైవేటు రంగానికి విడిచిపెట్టాయి. అక్కడ వారి అతీగతీ ఎలా ఉందో గ్రహించలేక పోతు న్నాయి. రైతుల ఆత్మహత్యలు పరిగణనలోకి తీసుకున్నా, గ్రామీణప్రాంతాల్లో జరిగే ఇతర ఆత్మహత్యలను గమనించినా అందులో అధికభాగం రుణభారం వల్లనేనని సులభంగానే తెలుస్తుంది. ఇంట్లో ఎవరికైనా ప్రాణాంతక వ్యాధి వస్తే, శస్త్ర చికిత్స అవసరమైతే అధిక వడ్డీలకు అప్పు చేయక తప్పని స్థితి ఏర్పడుతుంది. వాటి వరకూ పోనవసరం లేదు.. ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసవానికయ్యే వ్యయం కనీసం రూ.15,000 నుంచి రూ. 20,000 వరకూ ఉంటుంది. వైద్య రంగంపై సమగ్రమైన దృక్పథం ఉంటే తప్ప ఈ స్థితి మారదు. నిధులు సమకూర్చడంలో, అవసరమైన మానవ వనరులను అందుబాటులోకి తీసుకురావడంలో చొరవ ప్రదర్శిస్తే తప్ప ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టపరచడం సాధ్యం కాదు. ఈ విషయంలో ప్రభుత్వాలు మరింత దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోవడం అవసరం.

మరిన్ని వార్తలు