బేత్వా గండం

12 Dec, 2016 14:39 IST|Sakshi
బేత్వా గండం

దేశ రక్షణ కోసం త్రివిధ దళాలు నిరంతర అప్రమత్తతతో, సర్వసన్నద్ధతతో ఉంటాయి. ఈ దళాల్లో చేరేవారు తమ బాధ్యతలెటువంటివో, ఎంతటి ప్రాణాంతక మైనవో తెలిసే చేరతారు. దేశాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చడం కోసం సంక్లిష్టమైన వాతావరణ పరిస్థితుల మధ్య పనిచేస్తుంటారు. అలాంటివారికి మెరుగైన రక్షణ పరికరాలతోసహా వారి కర్తవ్యనిష్టకు దీటైనవన్నీ అందుబాటులో ఉంచడం ప్రభు త్వాల బాధ్యత. ఈ నేపథ్యంలో రెండురోజులక్రితం ముంబై నావికా దళ డాక్ యార్డ్‌లో క్షిపణి వాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ బెత్వా ప్రమాదానికి గురై ఇద్దరు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారన్న వార్త ఆందోళన కలిగిస్తుంది. ఇదే ప్రమాదంలో మరో 15మంది గాయాలపాలయ్యారు. యుద్ధ సమయంలో పొంచి ఉండే శత్రువు కారణంగా అనుకోని ఆపదలో పడటం వేరు. సాధారణ పరిస్థితుల్లో ఇలా జరగటం వేరు.

2004తో మొదలు పెట్టి అడపాదడపా మన నావికాదళం ఇలాంటి ప్రమాదాల్లో చిక్కుకుంటూనే ఉంది. అందులో ఒక జలాంతర్గామితోపాటు చిన్న, పెద్ద యుద్ధ నౌకలు రెండింటిని నావికాదళం పోగొట్టుకుంది. మూడేళ్లనాడు జలాంత ర్గామి ఐఎన్‌ఎస్ సింధురక్షక్‌లో పేలుళ్లు సంభవించి 18మంది సిబ్బంది మరణిం చారు. ఇక చిన్న చిన్న ప్రమాదాల సంగతి చెప్పనవసరమే లేదు. తాజా ఉదంత మైతే నావికా దళ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఘటన. డ్రై డాక్‌లో ఈ తరహా ప్రమాదం ఇంతక్రితం ఎప్పుడూ జరగలేదు. 3,850 టన్నుల బరువుండే ఐఎన్‌ఎస్ బెత్వా గగనతలంలోకి, నౌకలపైకి ప్రయోగించగల క్షిపణులను మోసుకెళ్తుంది. సముద్ర జలాల అట్టడుగున సైతం ప్రయోగించగల బాంబులను తీసుకెళ్తుంది. అలాంటివన్నీ అమరి ఉండగా, డ్రైడాక్‌లో ఒక్కసారిగా ఉన్నట్టుండి అది పక్కకు ఒరిగిపోయింది. నౌకలోని కొంత భాగం ఈ ప్రమాదంలో విరిగిపోయిందని నావికా దళ ప్రతినిధి సమాచారం.

సాధారణంగా యుద్ధ నౌకల అడుగు భాగానికి మరమ్మ తులు చేయాల్సివచ్చినప్పుడు డ్రై డాక్‌కు వాటిని మళ్లిస్తారు. అవసరమైనప్పుడు నీటితో నింపడానికీ, లేనప్పుడు వాటినుంచి నీటిని తోడటానికీ ఈ డ్రైడాక్‌లు అను వుగా ఉంటాయి. నీటితో నింపి నౌకను రప్పించాక దాన్ని స్థిరంగా ఉండేలా చూసు కుని నీరు తోడేస్తారు. ఆ తర్వాత అవసరమైన తనిఖీలు, మరమ్మతులు పూర్తి చేస్తారు. 2004లో నావికాదళంలోకి ప్రవేశించిన ఐఎన్‌ఎస్ బెత్వాకు ఇలాంటి తనిఖీలు, అవసరమైన మార్పులు చేసి దాన్ని మరింత సమర్ధవంతంగా పని చేయించడం కోసమే డ్రైడాక్‌లోకి తీసుకొచ్చారు. ఇదంతా పూర్తి కావడానికి మరి కొన్ని నెలల సమయం పడుతుంది. ఈలోగానే ఈ ప్రమాదం జరిగింది. 

యుద్ధ నౌక ఎంత బరువు మోసుకుపోగలదో, ఆ బరువులో ఎంత భాగాన్ని ఏ వైపు అమర్చాలో వివిధ పరికరాల సాయంతో శాస్త్రీయంగా అంచనా వేసుకుం టారు. దానికి అనుగుణంగానే అన్నిటినీ చేరేస్తారు. చివరిగా అంతా సక్రమంగా ఉన్నదని నౌక కెప్టెన్ ధ్రువీకరించాల్సి ఉంటుంది. యుద్ధ సమయంలో మెరుపు వేగంతో పనిచేయాల్సి వచ్చినప్పుడు సైతం ఈ అంచనాల్లో కొంచెమైనా తేడా రాకూడదు. నిజానికి ఈ విషయంలో మన నావికాదళ సామర్థ్యం ఎన్నదగినది. వివిధ దేశాల్లోని డ్రైడాక్‌లలో ఇలాంటి ప్రమాదాలు జరిగిన దాఖలాలున్నా మన దగ్గర మాత్రం నావికాదళం అత్యంత జాగ్రత్తగా ఈ ప్రక్రియను పూర్తి చేసేది. ఇటీవల బెత్వా కంటే బాగా పెద్దదైన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రమా దిత్యకు సైతం డ్రైడాక్‌లో విజయవంతంగా మెరుగులు దిద్దారు. ఈసారి నౌకను డ్రైడాక్‌లో ఉంచడంలో తేడానా, అందులో రక్షణ సామాగ్రి అమరిక సరిగా లేక పోవడమా, ఇతరత్రా సాంకేతిక లోపమేదైనా ఈ ప్రమాదానికి కారణమా అన్నది తేలడానికి మరికొంత సమయం పడుతుంది.

మన నావికాదళానికి చాలినన్ని జలాంతర్గాములు, యుద్ధ నౌకలు, హెలికా ప్టర్లు, నిఘా విమానాలు లేవని ఎప్పటినుంచో ఆ విభాగ అధిపతులు ప్రభు త్వాలకు చెబుతూ వస్తున్నారు. 79,000కు పైగా సిబ్బంది ఉన్న నావికాదళానికి ఇప్పటికే రెండు విమాన వాహక నౌకలు, ఇతర రకాల యుద్ధ నౌకలు మరో 34, అణుశక్తి ఆధారిత జలాంతర్గామి, బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి, 13 సాధారణ జలాంతర్గా ములు, 27 గస్తీ నౌకలు, మందుపాతరల ఆచూకీ కనుక్కునే నౌకలు ఆరు ఉన్నాయి. అటు హిందూ మహా సముద్రంలో, బంగాళాఖాతంలో అత్యంత అప్రమత్తతతో ఉండటంతోపాటు పర్షియన్ జలసంధి ప్రాంత దేశాలతో కమ్యూని కేషన్ల సంబంధాలు కొనసాగాలి. సముద్ర జలాల మీదుగా దేశానికెదురవుతున్న ఉగ్రవాద సవాళ్లు కూడా తక్కువేమీ కాదు. ఈ కార్యకలాపాలన్నిటికీ అదనంగా మరో మూడు విమాన వాహక నౌకలు, అయిదు అణు జలాంతర్గాములు అవసరమవుతాయని నావికాదళ నిపుణులు చెబుతున్నారు. మన దగ్గర ఇప్పటికే ఉన్న జలాంతర్గాములు వార్ధక్యానికొచ్చాయి. ఉన్నవాటిని మరమ్మతు చేసు కోవడమే తప్ప కొత్తగా వచ్చి చేరేవి అంతంతమాత్రమే. స్వావలంబన సాధిం చాలని నావికా దళం లక్ష్యంగా పెట్టుకున్నా ఆ దిశగా ఆశాజనకమైన ప్రగతి లేదు. మన నావికాదళాన్ని తిరుగులేని శక్తిగా రూపుదిద్దడానికి అవసరమైనవన్నీ అంది స్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పినా ఆ విషయంలో చురుకుదనం కనిపించడం లేదు.

ఒకపక్క ఈ అవసరాలను తీర్చే విధానాన్ని రూపుదిద్దడంలో జాప్యం జరుగు తుండగా ఉన్నట్టుండి ఐఎన్‌ఎస్ బెత్వా ప్రమాదానికి గురికావడం ఆందోళన కలిగిస్తుంది. పశ్చిమ నావికాదళ కమాండ్‌లో గత మూడేళ్లలో వరసబెట్టి జరిగిన ప్రమాదాల పరంపరలో తాజా ఉదంతం కూడా చేరింది. ఈ ప్రమాదంపై లోతైన దర్యాప్తు జరిగి, లోపాలు వెల్లడైతే భవిష్యత్తులో ఇలాంటివి చోటు చేసుకోకుండా నివారించడానికి అది దోహదపడుతుంది. ఇదే సమయంలో మన నావికాదళ అవ సరాలపైనా దృష్టి పెట్టాలి. సముద్ర జలాల్లో చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లకు దీటుగా నావికాదళాన్ని సన్నద్ధపరచాలంటే ఇది తప్పనిసరి. దాంతోపాటు ఇలాంటి ప్రమాదాలకు తావీయని సాంకేతిక నైపుణ్యాన్ని మరింతగా మెరుగు పరచాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు