ఇరాన్ ఓటర్ల వివేకం!

1 Mar, 2016 23:23 IST|Sakshi

అటో, ఇటో తేల్చుకోవాల్సిన పరిస్థితులు ఎదురైతే ఏ దేశ పౌరులైనా ఏం చేస్తారో ఇరాన్ పౌరులు కూడా అదే చేశారు. గత నెల 26న ఆ దేశ పార్లమెంటు మజ్లిస్‌కూ, నిపుణుల అసెంబ్లీకీ జరిగిన ఎన్నికల్లో ఛాందసవాద, అతివాద అభ్యర్థులను ఓడించి మితవాదులు, సంస్కరణవాదుల కూటమికి పట్టంగట్టారు. ప్రస్తుత దేశాధ్యక్షుడు హసన్ రౌహానీపై గత కొన్నేళ్లుగా ఛాందసవాదులు, అతివాదులు కారాలు మిరియాలు నూరుతున్నారు. దేశ సార్వభౌమత్వాన్ని పాశ్చాత్య దేశాలకు ఆయన తాకట్టు పెట్టారన్నది వారి ప్రధాన ఆరోపణ. మూడున్నర దశాబ్దాలుగా ఇరాన్‌పై అమలవుతున్న కఠోరమైన ఆంక్షలు తాత్కాలికంగా నిలిచిపోవడానికి వీలుకల్పించిన అణు ఒప్పందానికి అంగీకరించడమే వారి దృష్టిలో పెద్ద నేరం.

దేశాన్ని శక్తిమంతంగా, శత్రు దుర్భేద్యంగా మార్చడానికి దోహదపడే అణ్వస్త్రాల బాటలో పోకుండా పాశ్చాత్య దేశాల షరతులకు రౌహానీ తలొగ్గాడన్నది వారి వాదన. తమవద్ద అణ్వాయుధాలు ఉంచుకుని...వాటిని కనీసం తగ్గించుకునే ప్రయ త్నం కూడా చేయని అగ్రరాజ్యాలు మరే దేశమూ కొత్తగా ఆ దోవన పోకూడదని హుకుం జారీ చేయడంలో అప్రజాస్వామికత ఉన్న సంగతి వాస్తవమే. తమకు అను కూలంగా ఉండేవారూ, తమ మిత్రులుగా ఉండేవారూ ఎంతటి ప్రమాదకారులైనా పట్టించుకోని తత్వం ఆ దేశాలది. అలాంటి అప్రజాస్వామిక ధోరణితోనే ఇరాన్‌ను ఆంక్షల చట్రంలో బిగించి ఆ దేశ ప్రజానీకాన్ని ఇబ్బందుల్లోకి నెట్టారు.
 

 ఇరాక్, లిబియా, సిరియా,యెమెన్ తదితర దేశాల్లో ఎదురవుతున్న పరా జయాల అనంతరం పశ్చిమాసియాలో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలోపడ్డాక పాశ్చాత్య దేశాలు ఇరాన్ విషయంలో తమ వైఖరిని సడలించుకున్నాయి. అసలు ఇరాన్‌లో ఏ తరహా అణు కార్యక్రమమైనా కొనసాగడానికి వీల్లేదన్న అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు కొన్ని పరిమితులతో దాన్ని ఉపయోగించుకోవచ్చునని మెట్టు దిగాయి. ఆ విషయంలో ఇరాన్ ఆచరణ చూశాకే ఆంక్షలు దశలవారీగా ఎత్తే స్తామని బేరం పెట్టాయి. ఇరాన్ ఇందుకు అంగీకరించలేదు. పరస్పరం విశ్వాసం కలిగి ఉండే పక్షాలమధ్య మాత్రమే చర్చలు ఫలిస్తాయని, అలాంటి విశ్వాసం ఏర్ప డాలంటే ఆంక్షలు ఎత్తేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది. అందువల్లే ఆయుధాలు, క్షిపణులపై ఉండే ఆంక్షలు మినహా మిగిలినవాటిని పాశ్చాత్య దేశాలు సడలించక తప్పలేదు. మొన్న జనవరిలో ఇరాన్‌పై ఆంక్షలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

 ఈ నేపథ్యంలోనే ఇరాన్ ఎన్నికలపై ప్రపంచం మొత్తం ఆసక్తి కనబరిచింది. ఛాందసవాదుల దూకుడుతో రౌహానీ రాజకీయ భవితవ్యం ఏమవుతుందన్న సందే హాలు సైతం వ్యక్తమయ్యాయి. పాశ్చాత్య దేశాలతో చర్చించడంద్వారా ఇరాన్‌ను ఘర్షణాత్మక పంథానుంచి తప్పిస్తానని, ఆంక్షలు సడలేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చి మూడేళ్లక్రితం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రౌహానీ విజయం సాధించారు. అయితే మజ్లిస్‌లోనూ, నిపుణుల అసెంబ్లీలోనూ ఆయనకు ఎన్నో అవరోధాలు ఏర్పడ్డాయి. ప్రస్తుత విజయం ఆ అవరోధాలను గణనీయంగా తగ్గించింది. ఆయనకు బలాన్ని చేకూర్చింది. 290మంది ఉన్న మజ్లిస్‌లో ఛాందసవాదులు, అతివాదులకు 103 స్థానాలు లభించగా మితవాదులకూ, సంస్కరణవాదులకూ 95 సీట్లు వచ్చాయి. 14మంది స్వతంత్రులు కూడా ఎన్నికయ్యారు. విజేతకు అవస రమైన కనీస మెజారిటీ ఎవరికీ లభించనందువల్ల 69 స్థానాల్లో వచ్చే ఏప్రిల్‌లో మరోసారి ఎన్నికలు నిర్వహిస్తారు.

మత గురువుల ఆధిపత్యం ఉండే 88మంది సభ్యుల నిపుణుల అసెంబ్లీలో అత్యధిక స్థానాలు రౌహానీ నేతృత్వంలోని కూటమి గెల్చుకుంది. రౌహానీకి ఈ గెలుపు సునాయాసంగా ఏమీ లభించలేదు. సంస్కరణ వాదులు, మితవాదులు నిలిచి గెలిచే పరిస్థితులు లేనివిధంగా రాజ్యాంగ నిబంధ నలు రూపొందాయి. గిట్టనివారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడానికే అవన్నీ. మీడి యాను అడ్డం పెట్టుకుని, మతాన్ని ఆలంబన చేసుకుని సవాలక్ష కారణాలు చూపి అనేకుల్ని పోటీకి అనర్హుల్ని చేశారు. రౌహానీకి నగరాల్లో పట్టున్నదని గ్రహించి, అక్కడినుంచి తక్కువమందికి ప్రాతినిధ్యం ఉండేలా నియోజకవర్గాలను రూపొం దించారు. ఇన్ని పరిమితుల్లో నగరాలను రౌహానీ గెల్చుకున్నారు. గ్రామాలు, చిన్న పట్టణాల్లో మాత్రం ఇప్పటికీ ఛాందసవాదుల హవాయే కొనసాగింది.

 పార్లమెంటులో ఇతరులను కలుపుకొని మెజారిటీ సాధించడం రౌహానీకి కష్టమేమీ కాదు. నిపుణుల అసెంబ్లీలో ఎటూ ఆయనకు తగినంత బలం ఉంది. అయితే అంతమాత్రాన పాలన సజావుగా సాగుతుందని చెప్పడానికి లేదు. ఇప్పటికీ అధికార యంత్రాంగంలో ఛాందసవాదుల పట్టు బలంగా ఉంది. సైన్యంలో వారిదే ప్రాబల్యం.  దేశానికి సుప్రీం నేతగా ఉన్న అలీ ఖమేనీ మొగ్గు సైతం వారివైపే ఉంటుంది. అమెరికాతో కుదిరిన అణు ఒప్పందాన్ని సైన్యం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఆంక్షలు సడలిన అనంతరం అభివృద్ధిపై దృష్టి పెడదామని రౌహానీ అనుకున్న సమయానికి అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పడిపోయాయి. చమురు ఉత్పత్తిపైన ప్రధానంగా ఆధారపడే ఇరాన్‌కు ఇది పెద్ద దెబ్బ. మరోపక్క ఇరాన్ సమాజంపై మతం పేరిట ఛాందసవాదులు విధించిన ఎన్నో ఆంక్షలు మహిళల పురోగతికి, మానవహక్కుల అమలుకు ఆటంకంగా మారాయి.

ఆధునికత అంటే పాశ్చాత్య దేశాలను అనుకరిస్తూ నైతికంగా దిగజారడమేనని ఛాందసవాదులు ప్రచారం చేస్తున్నారు. ఇందుకు భిన్నంగా అందరికీ సమాన హక్కులు, మానవహక్కులుండే సమాజాన్ని సాధించడమే ఆధునికతగా సంస్కరణవాదులు చెబుతున్నారు. తమ దేశంపై అమలవుతున్న ఆంక్షలు పోవాలని... పేదరికం, నిరుద్యోగంవంటివి రూపుమాసిపోయేందుకు వీలుగా దేశ పునర్నిర్మాణం జరగాలని సగటు ఇరాన్ పౌరులు కోరుకున్నారు. అందుకనే వారు సంస్కరణవాదులు, మితవాదుల కూటమికి పట్టంగట్టారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు రౌహానీ మెరుగైన పాలన అందించి జనం ఆకాంక్షలను నెరవేర్చగలరని ఆశించాలి.

మరిన్ని వార్తలు