రుణమాఫీతో అంత ప్రమాదమా?

22 Apr, 2017 01:07 IST|Sakshi
రుణమాఫీతో అంత ప్రమాదమా?

విశ్లేషణ
దేశీయ పేదరైతులకు ఆర్థిక ప్రయోజనాలు కలిగించే ఏ ప్రయత్నాన్ని అయినా భారతీయ ఆర్థిక విధాన పండితులు శోకన్నాలు పెడుతూ అడ్డుకుంటారు. అదే సమయంలో పరిశ్రమలకు ప్రభుత్వం కల్పించే భారీ ప్రయోజనాల పట్ల వీరు కిమ్మనకుండా ఉంటారు.

అమెరికన్‌ అంతర్యుద్ధం 1865లో ముగిసిపోయినప్పుడు, అమెరికా పత్తి ఉత్పత్తి పునరుద్ధరణ జరిగి భారతీయ పత్తికి డిమాండ్‌ పడిపోయింది. బాంబే ప్రెసిడెన్సీలో రైతులు పత్తి పండించడం తగ్గిపోయింది. రైతులకు రుణం ఇవ్వడానికి వడ్డీ వ్యాపారులు తిరస్కరించేవారు లేదా అధిక వడ్డీరేట్లను విధించేవారు. దీంతో సెటిల్మెంట్‌ డిమాండ్లు పెరిగిపోయాయి. దీని ఫలితంగా పుణే సమీపంలోని సుపా గ్రామంలో 1875లో దక్కన్‌ తిరుగుబాటు జరిగింది. దాని ప్రేరణగా దీంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఆగ్రహోదగ్రులైన రైతులు, వడ్డీవ్యాపారులపై దాడులు చేసి వారి ఇళ్లు తగులబెట్టారు. ఈ తిరుగుబాటు 30 గ్రామాలను ప్రభావితం చేసింది. గ్రామాల్లోని పోలీసు గస్తీ కేంద్రాలు త్వరలోనే రైతులను లొంగదీసుకున్నాయి కానీ గ్రామీణ ప్రాంతంలో నెలల తరబడి తిరుగుబాటు కొనసాగింది.

దీంతో బాంబే ప్రెసిడెన్సీ 1878లో దక్కన్‌ రయట్స్‌ కమిషన్‌ని నెలకొల్పింది. ప్రభుత్వం అంచనా ప్రకారం ఆహారం కోసం, విత్తనాలు, ఎద్దులు వంటి ఇతర అవసరాలకోసం రైతులు కొద్ది మొత్తంలో తీసుకునే రుణాలు ఎప్పుడో ఒకసారి చేసే వెళ్లి ఖర్చుల కంటే ఎక్కువగా వారిని అధిక రుణగ్రస్తులను చేస్తున్నాయని కమిషన్‌ తన నివేదికలో పేర్కొంది. రైతుల రుణ భారాన్ని తగ్గించాలంటే, రుణాలు చెల్లించనివారిపై నిర్బం ధాన్ని నిషేధించాలని, రుణ బకాయి వసూలు కోసం రైతుల నివాస గృహాలను అమ్మకానికి పెట్టడం నుంచి మినహాయించాలని, రుణగ్రస్తుల నుంచి భారీ మొత్తాలను లాగేందుకు న్యాయస్థానాల్లో జరుగుతున్న విచారణ ప్రక్రియలను నిలిపివేయాలని కమిషన్‌ తన నివేదికలో పేర్కొంది. భారత్‌లో రైతు దురవస్థ ఇప్పటికీ మారలేదనిపిస్తోంది.

స్వాతంత్య్రానంతర భారతదేశంలో, రైతు అనుకూల విధానాలు కొత్తవేమీ కావు. 1989లో జనతాదళ్‌ ప్రభుత్వం ఒక్కో రైతుకు పదివేల రూపాయల వరకు రుణాల రద్దుకు అవకాశమిస్తూ వ్యవసాయ రుణాల మాఫీ పథకం ప్రవేశపెట్టింది. 1992లో ఇది 4.4 కోట్లమంది రైతులకు 6 వేల కోట్ల మేరకు రుణ మాఫీ చేసింది. 2008లో వ్యవసాయ రుణ మాఫీ, రుణ ఉపశమన పథకం ప్రవేశపెట్టగా 5 కోట్ల 97 లక్షల మంది పెద్ద రైతులతోపాటు 3 కోట్ల 69 లక్షలమంది సన్నకారు రైతులు 71,600 కోట్ల రూపాయల మేరకు ప్రయోజనం పొందారు.

రాష్ట్ర స్థాయిల్లో కూడా ఇదేవిధమైన చర్యలు చేపట్టారు. ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం సన్నకారు, చిన్నకారు రైతులకు రుణమాఫీ చేసింది. ఉత్తరప్రదేశ్‌లో ఈమధ్యే దిగిపోయిన ప్రభుత్వం రాష్ట్ర సహకార బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న 50 వేల కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేసింది. తరువాత అవసరమైన రైతులకు మాత్రమే రుణాలను మాఫీ చేయాలని యూపీ నూతన ప్రభుత్వం నిర్ణయించడం స్వాగతించాలి. అయితే ఇది సరిపోదు. ఇలాంటి రుణమాఫీలను దేశవ్యాప్తంగా సన్నకారు, చిన్నకారు రైతులందరికీ వర్తింపచేయాల్సి ఉంది.

భారత్‌లోని 12.1 కోట్ల వ్యవసాయ భూముల్లో 9.9 కోట్ల భూములు సన్నకారు రైతులవే అయి ఉంటున్నాయి. బహుళ పంటల విధానం ద్వారా ఇలాంటి రైతులు దేశంలో పండే కూరగాయల్లో 70 శాతం, తృణధాన్యాల్లో 52 శాతం పండిస్తున్నారు. నాణ్యమైన విత్తనాల అవసరం పెరగడంతో రైతులు విత్తన ధరల పెరుగుదల భారాన్ని మోయవలసివస్తోంది. అన్ని విత్తనాల ధరలు భారీగా పెరిగిపోయాయి. పాతకాలంలో మాదిరిగా రైతులు విత్తనాలను కులధనం లాగా తమ కుమారులకు వారసత్వంగా ఇచ్చే పరిస్థితి పోయింది.
 
దీనికి తోడు ఎరువుల ధరలూ పెరిగాయి. వ్యవసాయ మెషినరీకి ప్రత్యామ్నాయంగా ఉండే కూలీలకయ్యే ఖర్చు కూడా తదనుగుణంగా పెరిగింది. పశువుల వాడకం ఖర్చు కూడా బాగా పెరిగింది. ఇక పురుగుమందుల ద్వారా పంట రక్షణ ఖర్చు చుక్కలనంటింది. మన రైతులు తమ పంటలకు మార్కెట్‌ విలువను గుర్తించడంలో విఫలమవుతున్నారు. 1972లో కలకత్తాలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ఒక కమలాపండును మార్కెట్లో వినియోగదారు కొనుగోలు చేసే ధరలో కేవలం 2 శాతం మాత్రమే దాన్ని పండించిన రైతుకు అందుతోందని తెలిసింది. పంటవిలువలో అధిక భాగాన్ని మండీలు, మార్కెట్లే మింగేస్తున్నాయి.

 మోదీ ప్రకటించిన మేక్‌ ఇన్‌ ఇండియా, ఇంతవరకు దిగుమతి చేసుకుంటున్న వ్యవసాయ సామగ్రి, పరికరాలను దేశంలోనే తయారు చేయడంపై దృష్టి పెట్టింది కాబట్టి భారత వ్యవసాయ సామగ్రి విధానాన్ని కూడా పూర్తిగా మార్చవలసి ఉంది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి మన వ్యవసాయ సామగ్రి, పరికరాలను ప్రామాణీకరించాల్సి ఉంది. మన వ్యవసాయ పాలసీ తెగుళ్లను, పురుగులను ఎదుర్కోవడానికి  జీవ, రసాయన, యాంత్రిక, భౌతిక విధానాలను మిళితం చేయడంపై దృష్టి సారించాలి. పురుగుమందుల వాడకాన్ని తొలగిం చడం లేక గణనీయంగా తగ్గించడంపై దీర్ఘకాలిక దృష్టితో వ్యవహరించి తగు చర్యలు తీసుకోవాలి.

భారతీయ ఆర్థిక విధాన పండితులు దేశీయ పేదరైతులకు ఆర్థిక ప్రయోజనాలు కలిగించే ఏ ప్రయత్నాన్నయినా శోకన్నాలు పెడుతూ అడ్డుకుంటారు. అదే పరిశ్రమలకు ప్రభుత్వం కల్పించే ప్రయోజనాల పట్ల వీరు కిమ్మనకుండా మౌనంగా ఉంటారు. వాస్తవాలను పరిశీలి ద్దాం. ఆర్బీఐ ప్రకారం 2000– 2013 కాలంలో దేశంలో లక్షకోట్ల రూపాయల విలువైన కార్పొరేట్‌ సంస్థల రుణాలను మాఫీ చేశారు. వీటిలో 95 శాతం రుణాలు బడా సంస్థల రుణాలే మరి. దీంతో పోలిస్తే ఎస్బీఐ ఇటీవల ట్రాక్టర్, వ్యవసాయ సామగ్రిపై రుణాలమీద 40 శాతం తగ్గింపుతో ఒక సెటిల్మెంట్‌ స్కీమ్‌ను తీసుకొచ్చింది. 25 లక్షలవరకు రుణం తీసుకున్నవారికి 6 వేల కోట్ల రూపాయల వరకు లబ్ధి చేకూరుస్తూ రుణాలను తగ్గించారు.

రైతులలో రుణ చెల్లింపు సంస్కృతి లేక పోవడం వల్ల భారత్‌లో మొండిబకాయిలు పేరుకోవడం లేదు. మొండి బకాయిల్లో 50 శాతం వరకు మధ్య, భారీ పరిశ్రమలకు ఇచ్చినవే. పిండదశలోని రుణ చెల్లింపు సంస్కృతిని ధ్వంసం చేస్తున్నారని ఆరోపించే ముందు విమర్శకులు వ్యవసాయ రుణాల చరిత్రను గుర్తిస్తే బాగుంటుంది. దేశంలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు, ఉబ్బిన కడుపులు, అనాధ పిల్లల రూపంలో దోపిడీ పరిణామాలు నాలో చాలా కాలం క్రితమే బలమైన ముద్రవేశాయి. దిద్దుబాటు చర్యలు లేకుంటే మన రైతుల విధి అనిశ్చితంగానే ఉంటుంది.



వరుణ్‌ గాంధీ
వ్యాసకర్త, బీజేపీ పార్లమెంటు సభ్యులు

ఈ–మెయిల్‌ : fvg001@gmail.com

మరిన్ని వార్తలు