తెలంగాణవాదానికి పునరంకితం

6 Aug, 2017 00:37 IST|Sakshi
తెలంగాణవాదానికి పునరంకితం

సందర్భం
జయంతులు, వర్ధంతుల అవసరం లేనివాళ్లలో కొత్తపల్లి జయశంకర్‌ ఒకరు. పుట్టగానే ‘కొత్త’పల్లి ఇంటిపేరైంది. మరణించే నాటికే కొత్త తెలంగాణ ఖాయం అయిపోయింది. అతని పుట్టుక, చావుల మధ్య తెలంగాణ నిత్యాగ్నిగుండమే. మరణ సమయం నాటికి తెలంగాణని సమర తెలంగాణ చేయడంలో అతని పాత్ర అమోఘం. తెలంగాణ సిద్ధాంత కర్త అన్నా, పితామహుడు అన్నా అతనికే చెల్లు. 1952 నుంచి, అంటే 18 ఏళ్ల వయసు నుంచి వివిధ దశలలో తెలంగాణ అస్తి త్వంతోనే అతని జీవితం ముడివడి ఉంది. 60వ దశకంలో తెలం గాణకి జరిగిన, జరుగుతున్న అన్యాయాలను పసిగట్టి, వసపిట్టలా లోకానికి తెలియజేశాడు. 1969 ప్రత్యేక ఉద్యమానికి అతను అందించిన నైతిక మద్దతు ఎంతో విలువైనది.

ఆర్జించిన విద్యని మూడో కన్నుగా చేసుకుని తన దృష్టినంతా కేంద్రీకరించాడు. తన మిత్రులను తెలంగాణ కోసం సామాజిక సైనికుల్లా తయారు చేయడంలోనే అతని కృషి చెప్పరానిది. ఆచార్య శ్రీధరస్వామి, ఆచార్య పర్మాజి, ఆచార్య రావాడ్‌ సత్యనారాయణ, ఆచార్య తోట ఆనందరావు వంటి వారి బృందం విద్యా రంగంలోంచి రాజకీయాలను శాసించే రీతిలో పూర్తి కాలం పని చేసింది. వీరిలో అత్యధికులు తాము మరణించే క్షణం వరకు తెలంగాణనే వారి శ్వాస. వీరు పేరు ప్రఖ్యాతుల కోసం ఆశించ లేదు. పదవుల కోసం ప్రణాళికలు రచించలేదు. ఉద్యోగాలు చేస్తూ సొంత డబ్బు ఖర్చు చేసి తెలంగాణ దీపాన్ని ఆరకుండా చేశారు. అందుకే అంతగా పాతుకు పోయింది తెలంగాణ భావన.

జయశంకర్‌ ఆచార్యుడిగా పనిచేసినా, విశ్వవిద్యాలయ రిజి స్ట్రార్‌గా బాధ్యతలు మోసినా, వైస్‌చాన్స్‌లర్‌గా బిజీగా ఉన్నా తెలంగాణనే మొదటి ప్రాధాన్యత. జీవించేదాకా స్నేహబృందం లోని సభ్యులతోనే బతికీ, మరణించి కూడా ఊరూరా అలాంటి బృందాలను, ఆలోచనలను నిద్రలేపిపోయాడు. తప్పో రైటో తెలి యదుగానీ, భౌగోళిక స్వేచ్ఛ సాధన మొదటి దశ అని ఆయన అనుకోవలసి వచ్చింది. తెలంగాణలో ప్రజల బతుకు కోసం తరువాత పోరాడవచ్చు అని ఎప్పుడూ అనేవాడు. బతికి ఉంటే ఆ పనికి తప్పక నడుం కట్టేవాడు. కానీ క్యాన్సర్‌ అతని కడుపులో చిచ్చురేపింది. ‘కొత్త’ తెలంగాణ చేతిలో పడలేదు. కానీ ఆ స్వప్నం అతని ముందు సాక్షాత్కారమవుతున్న సమయాన్ని చూసి అనా రోగ్య క్షణాలను పక్కన పడేశాడు. తృప్తితో తన ఊపిరిని తెలం గాణ జన హృదయంలో కలిపి దూర తీరం పోయాడు.

తెలంగాణ ప్రజల పక్షాన చివరకంటా నిలిచిన జయశంకర్‌ జీవితం మాత్రం ఒక సాఫల్య యాత్ర. ఆగుతుందని అని పించిన ఉద్యమ క్షణాన ఎందరినో తన బృందంగా మార్చుకున్న ఉక్కు సంక ల్పం. 1969 నుంచి జాతీయ, ప్రాంతీయ, రాజకీయ శక్తు  లన్నీ తెలంగాణని దగా చేశా యని గుర్తించాడు. భారతదేశంలో జాతుల పోరాటాన్ని గౌరవిస్తూనే తెలంగాణ ప్రాంతీయ ఉద్య మాన్ని జాతీయ అంతర్జాతీయ రంగం ఎక్కించిన శ్రమజీవి. తెలం గాణ డెవలప్‌మెంట్‌ ఫోరం అధ్యక్షునిగా విదేశాలలో ఎన్నో సభ లలో తమకు జరిగే అన్యాయాన్ని నొక్కి చెప్పిన వక్త. అతను తెలం గాణ సిద్ధాంత కర్త. చిన్న రాష్ట్రాల ఉద్యమాలలో చెరగని ఆలోచన.

ఇవాళ తమలో తాము కీచులాడుకునే వారితో తెలంగాణ కిక్కిరిసి పోతున్నది. దేశంలో చిన్న రాష్ట్రాల ఉద్యమాలు ఈ పరి స్థితిని గమనిస్తున్నాయి. నిజానికి తెలంగాణలో ఈ శక్తుల మధ్య గల వైరం, వైరుధ్యాలు నిజంగా ఉన్నాయా? లేక కల్పితమా? రాజకీయ, తాత్విక, ఆర్థిక కారణాలు ఏవీ లేకుండా తెలంగాణ ప్రజలు ఎందుకు చీలిపోవాలి? జయశంకర్‌ లేని లోటువల్ల ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనాయా? వీటిని ఒక గంటలో చర్చించి నివారించుకునేవే అని ప్రజల నమ్మకం. మరి ఎవరు పెడుతున్న కీచులాటలివి. తెలంగాణ అమ్మ కంటనీరు ఒలకడం చూసి జయశంకర్‌ ఆత్మ ఎంతో తల్లడిల్లుతున్నది.

తెలంగాణ వాదుల మధ్య నిర్దిష్ట కారణాలు లేకున్నా రగు లుతున్న వరస వ్యథలు ఏమిటి? ఒక్కసారి మన కిరీటాలు వదిలి ఆలోచిద్దాం. వ్యక్తిగత అస్తిత్వాలు మరిచి తెలంగాణ అస్తిత్వం కోసం ఒక బల్లముందు కూచుందాం. ఉద్యమ కాలపు నాటి ఒక సాయంకాలమందు రేపటి ప్రణాళికను చర్చించు కున్నట్లు ఇవ్వాళ జమగూడుదాం. ఆనాటి సంయమనం ఇవ్వాళ పాటించలేమా? ఒక్కసారి ఈ జయంతినాడు జయశంకర్‌కి కొత్త జన్మనిద్దాం. ఇక్కడ వైరుధ్యాలు తప్ప శత్రుపూరిత యుద్ధాలు లేవని, అందరం ఒక్కటే అని నినదిద్దాం. మూడేళ్ల కాలంలో తెలియకుండా బిగుసు కున్న ముళ్లను విప్పుకుందాం. బలమైన ఉమ్మడి శక్తుల బంధనా లను ఒక్కటై తెంచుకున్న తెలంగాణవాదంలోంచి, ఆత్మలోంచి కర చాలనాల కోసం అడుగులు వేద్దాం. మరణించి కూడా మన ఆలోచన లలో జీవించిన జయశంకర్‌ యాది సాక్షిగా ఓసారి మాట్లాడు కుందాం. అదే అతని జయంతికి తెలంగాణ ఇచ్చే కానుక.

కానుకలు అపురూపం. పుట్టుకలు కూడా. కొత్తగా కలుసుకునే కలయికలో కూడా. అధినేత తన కోటరీ రక్షణ వలయాలలోంచి అలా వచ్చి జయశంకర్‌ సార్‌ మిత్రులతో ఓసారి తేనీరు సేవించాలని కోరుతూ...(జయశంకర్‌ జయంతి అయిన ఈ రోజున తెలంగాణ వాదానికి అందరం పునరంకితమవుదాం)

వ్యాసకర్త అధ్యక్షులు, తెలంగాణ రచయితల వేదిక
మొబైల్‌ : 99519 42242
జయధీర్‌ తిరుమలరావు

మరిన్ని వార్తలు