అంబేడ్కర్‌ చూపిన బాటలో..

14 Apr, 2017 02:12 IST|Sakshi
అంబేడ్కర్‌ చూపిన బాటలో..

సందర్భం
తను ప్రత్యక్షంగా అనుభవించిన సామాజిక అంటరానితనాన్ని భావితరాలు అనుభవించరాదన్న భావనతో వ్యవస్థీకృత పరిష్కారం కోసం ఆలోచించారే తప్ప, అంబేడ్కర్‌ ఏనాడూ ఎవ్వరినీ నొప్పించలేదు. అదే ఆయనను దార్శనికుడిని చేసింది.

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన అనంతరం భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విజయోత్సవ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘న్యూ ఇండియా – న్యూ థింకింగ్‌’ అనే నినాదాన్ని ఇచ్చారు. అంబేడ్కర్‌ ఆలోచనా విధానాన్ని అభివృద్ధితో మేళ వించి ఆచరణలో పెట్టేందుకే చేసిన నినాదం అది. ప్రాంతీయ పార్టీలు, కుల–మత రాజకీయాల ప్రాబల్యం పెరగిన నేపథ్యంలో హేమాహేమీల్లాంటి నాయకుల్ని మట్టికరిపిస్తూ నరేంద్రమోదీ సాధించిన విజయం చిత్తశుద్ధితో, నిజాయితీతో ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తామన్న నమ్మకాన్ని ప్రజలకు కల్పించడం వల్లే సాధ్యమైంది. సువి శాల జాతీయ దృక్పథంతో నూతన భారతావనిని ఆవిష్కరించాలన్న అంబేడ్కర్‌ ఆలోచనలనుంచి పుట్టుకొచ్చిన సామాజిక భారత నిర్మాణం వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. అంబేడ్కర్‌ ఆలోచనల్ని ఆచరణలో చూపిస్తున్నం దువల్లే బీజేపీ దేశవ్యాప్తంగా అధికారాన్ని చేపడుతోంది.

రాజ్యాంగ అసెంబ్లీని ఉద్దేశించి 1949 నవంబర్‌ 25న అంబేడ్కర్‌ చారిత్రాత్మక ప్రసంగం చేశారు. మోదీ న్యూ ఇండియా నినాదానికి ఆ ప్రసంగమే స్ఫూర్తి. భారత దేశానికి రాజకీయ స్వాతంత్య్రం వచ్చింది కానీ సామాజిక స్వాతంత్య్రం ఇంకా రాలేదు. సమాజంలో కుల–మతాలకు అతీతంగా మానవాళి మనుగడ సాధించినప్పుడే అంటరానితనం, అçస్పృశ్యత లాంటి సామాజిక దురాచారాలు రూపుమాపినప్పుడే నిజమైన సామాజిక స్వాతంత్య్రం వచ్చినట్లు. నిచ్చెనమెట్ల కులవ్యవస్థే ఈ దేశం జాతిగా నిర్మాణం అయ్యేందుకు ఆటంకం అవుతుందన్నది సత్యం అంటూ అంబేడ్కర్‌ భావోద్వేగపూరితమైన  ప్రసంగం చేశారు. బాబాసాహెబ్‌ కలలుగన్న కుల, మత రహిత ప్రభుత్వం ఇన్నాళ్లకు భారత్‌లో మోదీ నాయకత్వంలో ఆవిష్కృతమవుతోంది.

భారతదేశంలో గర్వించదగిన నాయకులలో దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ ఒకరు. ఈ దేశంలోని అట్టడుగున ఉన్న ప్రతి మనిషికి అభివృద్ధి ఫలాలు అందాలనేది ఆయన ప్రవచించిన అంత్యోదయ సిద్ధాంతం. గ్రామీణ భారతంలో ప్రతి పేదవాడు ఆకలిని అధిగమించి, పేదరికం నుంచి బయటపడాలన్నదే అంత్యోదయ సిద్ధాంతం. అంత్యో దయ వాదాన్ని, అంబేడ్కర్‌ ప్రతిపాదించిన సామాజిక, సమానత్వాన్ని, సమపాళ్లలో మేళవించి న్యూ ఇండియా నినాదంతో మోదీ అభివృద్ధికి బాటలు పరుస్తున్నారు.

ఈ దేశకాలమాన పరిస్థితులను అవగతం చేసుకుని భవిష్యత్తుపై దూరదృష్టి కలిగిన వ్యక్తిగా, ఇప్పటికీ, ఎప్పటికీ దేశ అవసరాలకు సరిపోయే విధంగా బలమైన రాజ్యాంగాన్ని రూపొందించి దేశంలో అందరి మన్ననలను పొందారు అంబేడ్కర్‌. ఇప్పుడు దేశంలో అమలవుతున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా సగటు మని షిని చేరేలా రాజ్యాంగం దారి చూపింది. అంబేడ్కర్‌ ఆలోచనలనుంచి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది కేంద్రప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు, వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు అనేక రాయితీలు ప్రకటించి ఆర్థిక స్వావలబన కల్పించేం దుకు కృషి చేస్తోంది.

మొదటి నుంచీ అంబేడ్కర్‌ ఆలోచనలు ఈ దేశ భవిష్యత్తుతో ముడిపడి ఉన్నాయి. ‘కుల ప్రయోజనాలకు, జాతీయ ప్రయోజనాలకు మధ్య వైరుధ్యాలు ఏర్పడితే, నేను జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తాను. అదే సమయంలో వ్యక్తిగత ప్రయోజనాలకు, కుల ప్రయోజనాలకు మధ్య వైరుధ్యాలు ఏర్పడితే, నేను కుల ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తాను’ అన్న అంబేడ్కర్‌ మాటలు ఈ దేశంపట్ల ఆయనకున్న ప్రేమాభిమానాలను తేటతెల్లం చేస్తాయి. వ్యక్తికంటే దేశం గొప్పదన్న ఆయన మాటలు ఎల్లప్పుడూ ఆచరణీయం. ఈ దేశంలో ఉన్న సామాజిక దురాచారాలను ఏ విధంగా రూపు మాపాలన్న ఆశయంతో నిత్యం పరితపించాడు. తను ప్రత్యక్షంగా అనుభవించిన సామాజిక అంటరానితనం, భావితరాలు అనుభవించరాదన్న భావనతో వ్యవస్థీకృత పరిష్కారం కోసం ఆలోచించాడే తప్ప, ఏనాడూ ఎవ్వరినీ నొప్పించలేదు. అందుకే ఈ సామాజిక దురాచారాల్ని చట్టబద్ధంగా అణచడం ద్వారా శాశ్వత విజయాన్ని సాధించి తరతరాలకు ఆదర్శప్రాయుడయ్యాడు.

‘కులం పునాదులపై ఒక జాతినిగానీ, ఒక సంస్కృతినిగానీ నిర్మించలేము’ అని చెప్పిన ఆయన.. కులాన్ని కూకటివేళ్లతో పెకలించడం ద్వారానే నిజమైన జాతిని, నీతిని నిర్మించగలమని నిరూపించాడు. కులం లేని, మతంలేని ప్రభుత్వంగా మోదీ ప్రభుత్వం అడుగడుగునా ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తోంది. జాతీయవాద నినాదంతో దేశ ప్రజలందరినీ ఒక జాతిగా నిలిపి ఉంచుతూనే కటిక పేదరికాన్ని ఈ దేశం నుండి పారదోలేందుకు దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ వంటి వారు అంత్యోదయ సిద్ధాంతాన్ని జాతీయవాదానికి అన్వయించడం ఓ గొప్ప దిగ్దర్శనం. ఆ పరంపరను కొనసాగిస్తూ ఆధునిక భారతదేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ వారిని అనుసరిస్తున్నారు నరేంద్ర మోదీ. అందుకే అంబేడ్కర్‌ ఏ ఒక్క కులానికో, మతానికో, వర్గానికో ప్రతినిధి కాదు.

కుల, మతాలు ఆపాదించడమంటే ఆయన ఖ్యాతిని తగ్గించడమే అవుతుంది. అంబేడ్కర్‌ ఈ దేశానికి ప్రతినిధి. ఆయన సిద్ధాం తాలు ఈ దేశ వారసత్వ సంపద. ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప మేధావి అంబేడ్కర్‌. అందుకు దేశ ప్రజ లుగా మనందరం గర్వపడాలి. ఆ మహనీయుడు చూపిన సర్వమానవ సౌభ్రాతృత్వం గతానికీ, వర్తమానానికీ, భవి ష్యత్తుకీ కూడా ఆదర్శప్రాయం, ఆచరణీయం.
(నేడు బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ 126వ జయంతి)


డాక్టర్‌ కే లక్ష్మణ్‌
వ్యాసకర్త ఎమ్మెల్యే, అధ్యక్షులు
భారతీయ జనతాపార్టీ, తెలంగాణ

మరిన్ని వార్తలు