పట్టాలపై నెత్తుటి చారిక

22 Nov, 2016 00:32 IST|Sakshi
పట్టాలపై నెత్తుటి చారిక

ఈ మధ్య నోరెత్తితే సంస్కరణలు, బుల్లెట్‌ రైళ్ల కబుర్లే చెబుతున్న రైల్వే శాఖ... ఎప్పటిమాదిరే ప్రయాణికుల భద్రతను పూర్తిగా మరచిందని ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ సమీపంలో ఆదివారం వేకువజామున జరిగిన ఘోర రైలు ప్రమాదం నిరూపించింది. ఇండోర్‌–పట్నా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 14 బోగీలు పట్టాలు తప్పి 146 నిండు ప్రాణాలు బలికాగా, దాదాపు 200మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ విషాద ఉదంతంపై యథాప్రకారం సంతాప ప్రకటనలు, ఎక్స్‌గ్రేషియో హామీలు, విచారణ ఆదేశాలు పూర్తయ్యాయి. మళ్లీ మరో ప్రమాదం జరిగే వరకూ అంతా సవ్యంగా ఉన్నదన్న భ్రమలో అన్నీ సజావుగా సాగిపోతుంటాయి. నిజా నికిది ప్రమాదం కాదు... ఆ నిర్వచనంలో ఇమిడేది కాదు. జాతీయ క్రైం రికార్డుల బ్యూరో ఏటా విడుదల చేస్తున్న గణాంకాల్లో రైలు ప్రమాదాల మృతుల సంఖ్య ఎవరినైనా బేజారెత్తిస్తుంది.

2009–10 మొదలుకొని 2014–15 వరకూ మొత్తంగా 803 ప్రమాదాలు జరగ్గా 640మంది మరణించారు. మరో 1,855మంది గాయ పడ్డారు. వీటిల్లో అధిక భాగం పట్టాలు తప్పడం వల్ల జరిగినవే. ఈ ఏడాది ఇంతవరకూ జరిగిన ప్రమాదాల్లో 67 శాతం ఆ చిట్టాలోనే ఉన్నాయి. ఆదివారం నాటి రైలు ప్రమాదానికి పట్టాలు విరిగిపోవడమే కారణమని రైల్వే శాఖ ప్రాథ మికంగా నిర్ధారణకొచ్చింది. విచారణ కూడా మొదలుపెట్టబోతున్నారు. అయితే ఈ మాదిరి విచారణ పరంపరలు చివరకు తేలుస్తున్న అంశాల విశ్వసనీయతపై అను మానాలుంటున్నాయి. ఈ ఉదంతంలో సైతం రైల్వే శాఖ చేస్తున్న ప్రాథమిక నిర్ధా రణకూ, ఆ రైల్లోనే ప్రయాణించి అంతకుముందు దిగిపోవడం వల్ల బతికిపోయిన వ్యక్తి చెబుతున్న వివరాలకూ పొంతన లేదు. ప్రమాదంలో నుజ్జయిన ఎస్‌–2 బోగీలో ఆయన ఉజ్జయిని వరకూ ప్రయాణించాడు. రైలు చక్రాల శబ్దం తేడాగా ఉన్న సంగతిని ప్రయాణిస్తున్న సమయంలోనే బోగీలో ఉన్న అధికారికి చెప్పానని, ఆయన పట్టించుకోలేదని ఆ ప్రయాణికుడి కథనం. తరచు రైళ్లలో ప్రయాణిస్తున్న వారికి ఇలాంటివి అనుభవాలు తప్పడం లేదు.

పట్టాలపై ఒక రైలు పరుగులు తీయడానికి ముందు ఎన్నో స్థాయిల్లో తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. ఉన్న బోగీలన్నిటితోపాటు ఇంజిన్‌ సైతం అన్నివిధాలా సక్రమంగా ఉన్నదని నిర్ధారణయ్యాకే ప్రయాణానికి అనుమతించాలి. ఇవిగాక ప్రస్తుతం ట్రాక్‌మెన్‌గా పేరుమారిన గ్యాంగ్‌మెన్‌ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ట్రాక్‌లను తనిఖీ చేస్తుండాలి. వారి పనితీరును చూస్తూ అవసరమైన సూచనలిచ్చేం దుకు ట్రాక్‌ ఇన్‌స్పెక్టర్‌లుంటారు. ఇంతమంది ఇన్నివిధాల నిత్యం జాగ్రత్తలు తీసు కుంటున్నప్పుడు ప్రమాదాలకు ఆస్కారమే ఉండకూడదు. కానీ ఇవన్నీ తూతూ మంత్రంగా సాగుతున్నాయని అందరికీ తెలుసు. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాముఖ్యతనిస్తున్నామని పదేపదే చెబుతున్నచోట ఇంత నిర్లక్ష్యం రాజ్యమేలు తున్నా ఎవరికీ పట్టడం లేదు. రైల్వేలకు సంబంధించి అమెరికా, రష్యా, చైనా తర్వాత మనది నాలుగో స్థానం. మొత్తంగా లక్షా 15 వేల కిలోమీటర్ల ట్రాక్‌పై నిత్యం వందలాది రైళ్లు నడుపుతున్న ఆ శాఖలో నిర్వహణ అత్యంత ఘోరంగా ఉంటున్నది.

పగటి ఉష్ణోగ్రతలకూ, రాత్రి ఉష్ణోగ్రతలకూ మధ్య గణనీయమైన వ్యత్యాసమున్నప్పుడు పట్టాల్లో బీటలు ఏర్పడతాయి. ఇంతమంది ఇన్నివిధాల తనిఖీలు చేస్తుంటే ఇలాంటివి గమనించి సరిచేయడం కష్టం కాకూడదు. కానీ జరుగుతున్నది వేరు. ఒకసారి బీటలువారాక దానిపై రోజుల తరబడి రైళ్లు వస్తూ పోతూ ఉంటే పట్టాలు క్రమేపీ మరింతగా పాడై ప్రమాదాలు ఏర్పడతాయి. శీతా కాలం కావడంవల్ల మంచు అధికంగా కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోయి ఈ ప్రమాదం చోటు చేసుకున్నదని చెప్పడం రైల్వే శాఖ ఉద్దేశం కావొచ్చుగానీ... అనేక రోజులుగా తనిఖీ లేనప్పుడే ఇలాంటి స్థితి ఏర్పడుతుంది. పైగా చక్రాల నుంచి వింత ధ్వనులొచ్చాయని ఒక ప్రయాణికుడు చెబుతున్నాడు. ఇవన్నీ రైల్వే శాఖనే దోషిగా మారుస్తున్నాయి.

 దాదాపు 2 లక్షలమంది ట్రాక్‌మెన్‌ ఒక్కొక్కరు రోజూ దాదాపు 15 కిలోల బరువుండే పరికరాలను మోసుకెళ్తూ అయిదేసి కిలోమీటర్ల నిడివిలోని పట్టాలను నిశితంగా పరిశీలిస్తారు. లోపాలను సరిచేస్తారు. ఈ క్రమంలో రైలు రాకను జాగ్ర త్తగా గమనించుకోనట్టయితే ప్రాణాలు గాల్లో కలుస్తాయి. ఇలాంటి ప్రమాదాల్లో ఏటా 300 మంది ట్రాక్‌మెన్‌ మరణిస్తున్నారు. వారి పని సామర్థ్యాన్ని మెరుగుపరిచే తక్కువ బరువు గల పరికరాలు, రైలు రాకపై అప్రమత్తం చేసే పరికరాలు అంది స్తామని చెప్పడమే తప్ప నెరవేర్చింది లేదు. దీనికితోడు రైళ్ల భద్రతకు అవసరమైన స్థాయిలో సిబ్బంది ఉండటం లేదు. ప్రస్తుతం లక్షమందికిపైగా ట్రాక్‌మెన్‌ల కొరత ఉన్నదని చెబుతున్నారు. పైగా అన్ని శాఖల్లాగే రైల్వేలకు కూడా ఔట్‌సోర్సింగ్‌ రోగం అంటుకుంది. ఏ విభాగంలోనూ చాలినంత సంఖ్యలో సిబ్బంది ఉండటం లేదని సిబ్బంది సంఘాలు చాన్నాళ్లుగా చెబుతున్నాయి.

పరిశోధనల పర్యవసానంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆధునిక పరికరాలు, వ్యవస్థలూ అందుబాటులోకొస్తున్నా మన దగ్గర మాత్రం కాలదోషం పట్టినవాటితోనే కానిచ్చేస్తున్నారు. వాస్తవం ఇలా వుంటే పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టే లెక్కలపైనా, చార్జీల సమీక్షకు రెగ్యులేటర్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడంపైనా, ప్రతి రైల్లోనూ కొన్ని బోగీల నిర్వహణను ప్రైవేటు రంగానికి అప్పగించడంపైనా దృష్టి కేంద్రీకరించాలని నీతి ఆయోగ్‌కు చెందిన ఉన్నత స్థాయి కమిటీ నిరుడు సిఫార్సు చేసింది. బుల్లెట్‌ రైలును పట్టా లెక్కించడానికి సంబంధించిన పనులూ చురుకందుకున్నాయి. సమగ్ర రవాణా విధానం కోసమంటూ వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి రైల్వేలకు విడిగా బడ్జెట్‌ ఉండే విధానానికి స్వస్తి పలుకుతున్నారు. రద్దీ సమయాల్లో టికెట్‌ ధరలు పెంచడం లాంటివి చేస్తున్నారు. ఒక్కమాటలో ప్రయాణికుల భద్రత మినహా మిగిలినవన్నీ రైల్వేలకు ప్రధానం అయినట్టు కనబడుతోంది. తమని పెంచి పోషిస్తున్న ప్రయా ణికుల గురించి కూడా పట్టించుకోవడం ముఖ్యమని ఆ శాఖ తక్షణం గుర్తించాలి. ఈ ప్రమాదాల పరంపరకు ముగింపు పలకాలి.

మరిన్ని వార్తలు