డల్లాస్‌లో ఘనంగా కరుణశ్రీ జయంతి వేడుకలు

4 Sep, 2017 19:17 IST|Sakshi

సాక్షి, డల్లాస్‌: కరుణశ్రీ డా. జంధ్యాల పాపయ్య శాస్త్రి 105వ జయంతి ఉత్సవాలని కరుణశ్రీ అభిమాన సంఘం, డల్లాస్‌లో ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలకు కరుణశ్రీ పెద్ద కుమారుడు జంధ్యాల జయకృష్ణ బాపూజీ, ప్రముఖ ప్రవాస భారతీయ నాయకుడు ప్రసాద్ తోటకూర ముఖ్య అతిథులుగా హాజరై  జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ముందు గా చిన్నారులు కరుణశ్రీ పద్యాలను శ్రావ్యంగా ఆలపించి అందరినీ  ఆకట్టుకున్నారు. కరుణశ్రీ మనువడు శ్రీనాథ్ జంధ్యాల కరుణశ్రీ రాసిన “కవితా వైజయంతి” అన్న పద్యమాలికను సభకు తెలియజేశారు.


ఈసందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కరుణశ్రీ పెద్ద కుమారుడు జంధ్యాల జయకృష్ణ బాపూజీ మాట్లాడుతూ కరుణశ్రీతో ఉన్న విడదీయరాని అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కరుణశ్రీ, ఉదయశ్రీ, విజయశ్రీ, తెలుగు బాల, పాకి పిల్ల, అమర ఖయ్యాం లోని పద్యాలను ఆయన ఆలపించారు. ప్రముఖ సాహితీవేత్తలైన విశ్వనాథ సత్య నారాయణ, దేవులపల్లి కృష్ణ శాస్త్రి, సి. నారాయణ రెడ్డి, శ్రీ శ్రీ లాంటి వారితో కరుణశ్రీకున్న సాహిత్యానుభందాన్ని తెలియచేశారు. అమర గాయకుడు ఘంటసాలతో కరుణశ్రీకి మంచి స్నేహం ఉండేదని, వాలిద్దరూ తరచూ కలుసుకొనేవారని చెప్పారు. ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో కరుణశ్రీ తెలుగు అథ్యాపకుడిగా పని చేస్తున్నపుడు కొంగర జగ్గయ్య ఆయన దగ్గర చదువుకోవడాన్ని, ఆ తర్వాత జగ్గయ్య మంచి నటుడి గానే గాక, గొప్ప సాహితీపిపాసకుడుగా ఎదిగిన వైనాన్ని గుర్తు చేశారు.


అనంతరం ప్రత్యేక అతిధిగా హాజరైన డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ కరుణశ్రీతో ఉన్న అనుబంధాన్నిఆయన గుర్తుచేసుకున్నారు. కరుణశ్రీ సాహిత్యం అన్ని రకాల ప్రజలను ఆకర్షించేవి అన్నారు. కరుణశ్రీ వాస్తవిక సంఘటనలు నేపథ్యంగా అద్భుతమైన కావ్యాలు సృష్టించారని పేర్కొన్నారు, కరుణశ్రీ లాంటి తెలుగు సాహితీవేత్తల చరిత్రను భావితరాలకు తెలియజేయాలంటే ప్రభుత్వం అధికార భవనాలు, విజ్ఞాన కేంద్రాలకు, విశ్వవిద్యాలయాల్లో భాషా పరిశోధనా కేంద్రాలకు వీరి పేర్లు పెట్టాలని డా. ప్రసాద్ తోటకూర సూచించారు. తెలుగు కు ప్రాచీన భాషా హోదా లభించినప్పటికీ కేంద్రం నుంచి ఏటా వచ్చే 10-15 కోట్ల రూపాయలను తెచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం జాగు చేస్తోందని, తెలుగు భాషను, విధిగా ఒకటి నుంచి పదవ తరగతి వరకు భోదించాలనే ప్రభుత్వ ఉత్తర్వు ఉన్నప్పటికీ, అమలు పరచిన దాఖలాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు.


కార్యక్రమంలో మద్దుకూరి చంద్రహాస్, సురేష్ కాజాలు కరుణశ్రీ  సాహిత్యా విశేషాలను పంచుకున్నారు. కరుణశ్రీ చిత్రపటానికి సాహిత్యాభిమానులు పుష్పాంజలి ఘటించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కరుణశ్రీ అభిమాన సంఘం తరపున  బుయ్యనప్రగడ  శ్రీనివాస రావు (బీఎస్‌ఆర్‌) వ్యాఖ్యాతగా వ్యహరించారు.

>
మరిన్ని వార్తలు