దేవుడు కూడా ‘బాబు’ను కాపాడలేడు

28 Dec, 2016 00:45 IST|Sakshi
దేవుడు కూడా ‘బాబు’ను కాపాడలేడు

మనసులో మాట
కొమ్మినేని శ్రీనివాసరావుతో వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి


జగన్‌ని కాంగ్రెస్‌ పార్టీ వారెంత దారుణమైన హింసకు గురిచేశారు? వాళ్ల నాన్నే తాము అధికారంలోకి రావడానికి కారణం అనే విషయాన్ని పక్కన బెట్టి.. అకారణంగా, అక్రమంగా తనపై ఆరోపణలు చేసి, ఒకరోజైనా కనీసం సచివాలయానికి రాని, ఏ ఒక్క ఐఏఎస్‌ అధికారితో కూడా మాట్లాడి ఉండని వ్యక్తిపై, కనీసం హైదరాబాద్‌కు కూడా అతి తక్కువసార్లు మాత్రమే వచ్చిన వ్యక్తిపైన అవినీతిపరుడని ముద్ర వేసి జైలుకు పంపించడం దారుణం.

సర్వేల పేరుతో 80 శాతం మంది ప్రజల మద్దతు ఉందని చెప్పుకుంటున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో దేవుడు కూడా కాపాడలేడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, టీటీడీ ట్రస్ట్‌ బోర్డు మాజీ చైర్మన్, ఉమ్మడి రాష్ట్ర శాసనసభ మాజీ సభ్యుడు భూమన కరుణాకర్‌రెడ్డి చెబుతున్నారు. తిరుపతి సభలో మోదీ సమక్షంలో 15 ఏళ్లపాటు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్‌ చేసి, ఎన్నికలు ముగిసిన 3నెలల్లోపే హోదా వల్ల వచ్చే మేలు ఏదీ లేదని మాట మార్చిన మొదటి వ్యక్తి చంద్రబాబు అని భూమన దుయ్యబట్టారు. ఏపీకి ఎక్కడో అన్యాయం జరుగుతోందని పసిగట్టి, హోదాపై  తీవ్రంగా అధ్యయనం చేసి ప్రజలను చైతన్య పరిచిన మొదటి వ్యక్తి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని, ఆయన కృషి వల్లే ప్రత్యేక హోదా నేడు ప్రజల డిమాండుగా మారిందన్నారు. ఐదేళ్ల పాలనలో స్వర్ణయుగాన్ని తలపించిన వైఎస్సార్‌ పాలన మళ్లీ రావాలంటే జగన్‌ని ఆశీర్వదించి, మద్దతు తెలపాలంటూ భూమన కరుణాకర్‌రెడ్డి ‘మనసులో మాట’లో చెప్పిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...

మీ రాజకీయ జీవితం ఎలా ప్రారంభమైంది?
నేను 11 ఏళ్ల ప్రాయంలోనే ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ ఉద్యమంలో పాల్గొని, పట్టాలమీద రాసిన గుర్తులు ఇంకా నా మనస్సులో ఉన్నాయి. అంత చిన్న వయసులోనే అలాంటి చైతన్యం నాలో ఉన్నందుకు నా కుటుంబ రాజకీయ నేపథ్యమే కారణం. మా అన్న భూమన్‌ నాకు ప్రేరణ. తర్వాత 1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నాను. చిన్న వయసులోనే నన్ను 3 రోజులపాటు పోలీసు స్టేషన్‌లో నిర్బంధించారు కూడా.

తర్వాతి రోజుల్లో వైఎస్‌ రాజారెడ్డితో సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి?
1975లో ఎమర్జెన్సీ కాలంలో భారతదేశంలోనే అతి చిన్న వయసులో నిర్బంధంలోకి తీసుకున్న వ్యక్తిని నేనే. అతి పెద్దవాడు మొరార్జీ దేశాయ్‌ అనుకోండి. ఎమర్జెన్సీ ప్రారంభం నుంచి ముగిసే వరకు నేను జైల్లోనే ఉన్నాను. రాజారెడ్డి, జార్జిరెడ్డి కూడా మాతోపాటు అప్పట్లో జైల్లో ఉండేవారు. ఆవిధంగా ఆ కుటుంబంతో నాకు సంబంధం ఏర్పడింది. తర్వాత 1982లో విప్లవ రాజకీయాల నుంచి బయటికి వచ్చాను. రాజారెడ్డితో పూర్వ సంబంధాలు తర్వాత పెద్ద ఎత్తున బలపడుతూ వచ్చాయి. రాజశేఖరరెడ్డితో సంబంధం కూడా ఆయన తండ్రి ద్వారానే ఏర్పడింది.

వచ్చే ఎన్నికలపై మీ అంచనా ఏది?
చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. రేపు జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాను. నూటికి నూరు శాతం వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడాన్ని ఎవరూ ఆపలేరు.

మీ పార్టీకి బలమైన శత్రువు రూపంలో బాబు ఉన్నారు కదా, ఎలా ఎదుర్కొంటారు?
ఆ బలమైన శత్రువు అనేక తప్పుడు ప్రమాణాలు చేసి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా జగన్‌కి ఆయనకు మధ్య తేడా కేవలం రెండు శాతం కూడా లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ రెండున్నరేళ్ల పాలనా కాలంలో చంద్రబాబు అధికారంలో ఉండి దిగని మెట్టు అంటూ లేదు. ఎన్ని రకాల ప్రమాణాలు తాను చేశాడో వాటిలో ఒక్కటి కూడా అమలు చేయలేకపోయాడు. పైగా జగన్‌మీద ఎన్ని ఆరోపణలు చేయాలో అన్నీ చేసేశారు. ఇన్ని ఆరోపణలు చేసినా, ఇంతమందితో లాలూచీ పడినా వారికీ మాకూ మధ్య వచ్చిన తేడా అతి స్వల్పం.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఐదేళ్ల పాలనపై మీ అభిప్రాయం చెప్పండి?
బహుశా భారత రాజకీయాల్లో రాజశేఖరరెడ్డి ఐదేళ్ల పాలనను స్వర్ణయుగం అని చెప్పొచ్చు. ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, మరోవైపున అభివృద్ధి కార్యక్రమాలు రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ప్రజల్లో ఒక చిరస్మరణీయమైన మహానుభావుడుగా మిగిలిపోవడానికి అవి ఆయన కోరుకుని చేసినవి కావు. ప్రజలకు ఏదో చెయ్యాలనే తపనే తప్ప అధికారం కోసమని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదాయన. చంద్రబాబు నిరంతరం అధికారం కోసమనే తపనపడేటటువంటి వ్యక్తి.

జగన్‌కు 145 మంది ఎమ్మెల్యేల మద్దతున్నా అధిష్టానం ఎందుకు పరిగణంచలేదు?
కాంగ్రెస్‌ పార్టీ ఒక నియంతృత్వ పోకడలతో నడిచే పార్టీ. ఏకస్వామ్యం మీద నడిచే వ్యక్తి. నియంతృత్వపు ఆలోచనల గొడుగు కింద వెలుగుతున్న పార్టీ. ఇతరులను నాయకులుగా వారు అంగీకరించే పరిస్థితి లేదు. వారికి కట్టుబానిసలుగా ఉండాలని కోరుకుంటారు. కట్టుబానిసగా ఉండటానికి అంగీకరించే స్వభావం ఈయనది కాదు. కనుక వాళ్లు ఆయనను అంగీకరించలేదు. జగన్‌ టెన్‌ జన్‌పథ్‌ అధికారానికి లొంగడు అని వాళ్లు గుర్తించారు. అలా లొంగేటటువంటి స్వభావం జగన్‌ది కాదు.

టీడీపీవాళ్లు జగన్‌ మీద చేస్తున్న వ్యక్తిగత విమర్శలు ఎంతవరకు వాస్తవం?
అవి పచ్చి అబద్ధాలు. జగన్‌ వ్యక్తిత్వాన్ని తట్టుకోలేక చేస్తున్న అతి నీచపు ఆరోపణలవి. జగన్‌ని నేను చిన్నతనం నుంచే చూశాను. పెద్దల పట్ల చాలా గౌరవం ఉన్న వ్యక్తి. చాలా సంస్కారం ఉన్న మనిషి. డ్రైవర్‌ని కూడా అన్నా అని సంబోధించగలిగేతత్వం ఉన్న మనిషి. తనవద్ద పనిచేసేవాళ్లను, తనకంటే పెద్దవాళ్లను అన్నా అని సంబోధించడం తన అలవాటు.

చంద్రబాబు బీజేపీకి ఇంకా దగ్గరవుతాడా దూరమవుతాడా?
బీజేపీతో ఉన్నా మరెవరితో ఉన్నా చంద్రబాబును దేవుడు కూడా ఇక కాపాడలేడు.

పెద్దనోట్ల రద్దు తర్వాత ఏపీలో ఎలాంటి వాతావరణం ఉంది?
ఏపీలోనే కాదు. మొత్తం దేశంలోనే ఒక అల్లకల్లోలం ఏర్పడింది. ఎమర్జెన్సీ కాలంలో ప్రజలు ఏరకంగా ఫీలయ్యారో, అలాగే ఈరోజు పెద్ద నోట్ల రద్దు వల్ల కింది స్థాయిలో మారుమూల పల్లెటూరు ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ప్రజలు నిరంతరం బాధపడుతూంటే, వారు సంతోషంగా ఉన్నా... ప్రతి పక్షాలే ఊరికే గొడవ చేస్తున్నాయంటున్న బీజేపీ వాళ్లకు నిజంగానే జోహార్‌.

ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఏపీకి ఎంతవరకు మేలు చేస్తాయి?
అధికారంలోకి రాగానే పదేళ్లపాటు ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని మోదీ భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్పిన చోటు తిరుపతి. పదేళ్లు ఏమూలకూ సరిపోవు. 15ఏళ్లపాటు హోదా ఇవ్వాలి అని అదే సభలోనే బాబు మోదీని గట్టిగా నిలదీశారు. ప్రత్యేక హోదా ఇస్తే ఇన్ని ప్రయోజనాలు వస్తాయని కూడా ఆ సభలోనే మాట్లాడారు. కాని 3నెలల లోపే ప్రత్యేక హోదా వల్ల వచ్చే ప్రయోజనం ఏదీ లేదని మాట మార్చిన మొదటి వ్యక్తి బాబు. దాన్ని జాగ్రత్తగా గమనించిన తొలి వ్యక్తి వైఎస్‌ జగన్‌. ఏపీకి ఎక్కడో అన్యాయం జరగబోతోందని పసిగట్టి హోదాపై తీవ్రంగా అధ్యయనం చేసి ఎన్నో అంశాలు తెలుసుకుని ప్రజలను చైతన్యపరిచారాయన. ప్రత్యేక హోదా మా ఆకాంక్ష అని ప్రజలు చాటేలా చేసింది వైఎస్‌ జగన్‌. ఆ డిమాండ్‌ ఇప్పుడు మా పార్టీది కాదు. ప్రజల డిమాండ్‌గా మారిపోయింది.

ఏపీ జనాభాలో 80 శాతం మంది మమ్మల్నే బలపరుస్తున్నారని బాబు చెప్పారు కదా?
కేవలం 8 శాతం మంది మాత్రమే బలపరుస్తున్నారు అని చెప్పబోయి పొరపాటున 80 శాతం మంది అని బాబు అన్నట్లున్నారు. వాస్తవానికి ఆ 8 శాతం మంది బాబు పాలన పట్ల చాలా సానుకూలంగా ఉంటారు.

ఏపీ ప్రజలకు మీరిచ్చే సందేశం?
సందేశం ఇచ్చేంత పెద్దవాడిని కాదు కానీ, రాజకీయాల్లో విలువలు పతనమవుతున్న దశలో ప్రజలకు మేలు చేయాలని తపనపడుతున్న వైఎస్‌ జగన్‌కు మీరు అనుకూలంగా, సానుకూలంగా మద్దతిస్తే వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలన మళ్లీ మనం చూసే అవకాశం వస్తుంది. దానికోసం ఎదురుచూడండి, మాకు మద్దతివ్వండి అని ప్రజలకు విన్నవించుకుంటున్నాను.