ఏసీఆర్ రహస్యాల రద్దు..!

9 Dec, 2016 01:13 IST|Sakshi
ఏసీఆర్ రహస్యాల రద్దు..!

విశ్లేషణ
మిలిటరీ సర్వీసులో తప్ప మరే ఇతర సర్వీసులోనైనా ఏసీఆర్ వ్యాఖ్యలను ఆ ఉద్యోగికి తెలపాల్సిందే. అలాంటి అభిప్రాయాలు రాయడంలో ఉద్దేశం ఉద్యోగికి తన పనితీరు గురించి తెలియజేసి మార్చుకునే అవకాశం కలిగించడమే.
 
బ్రిటిష్ పాలనలో కింది ఉద్యోగులపైన ఆధిపత్యం కోసం అధికారుల చేతికి ఇచ్చిన అంకుశమే ఏసీఆర్. ఇవి రహస్య నివేది కలు. ప్రతి ఏడాది ఈ నివేదిక ఆధారంగా ఉద్యోగులకు పదోన్నతి ఇస్తారు లేదా ఇవ్వరు. ఉద్యోగి ప్రగతిని ఈ నివేదికలే నిర్దేశిస్తాయి. పై అధికారి తన ఇష్టం వచ్చిన విధంగా వ్యాఖ్యానాలు రాయవచ్చు. అది రహస్యం. ఎవరి గురించి రాసారో వారికి చెప్పరు. 1940 లలో ఆరంభించిన ఈ అక్రమ విధానాన్ని స్వతంత్ర భారతంలో 2008 దాకా కొనసాగించారు.
 
దీన్ని కూకటి వేళ్లతో తొలగించిన శక్తి ఎవరిదంటే ఆర్టీఐది. సమాచార హక్కు చట్టం వచ్చిన తరువాత వందలాది మంది ఏసీఆర్‌లు వెల్లడి చేయాలని కోరారు. కాని అది రహస్యమనీ, ఇవ్వబోమని తిరస్కరించారు. దురదృష్టవశాత్తూ చాలా సమాచార కమిషనర్లు కూడా ఇవ్వరాదని తీర్మానించారు. ఇదివరకు ఉన్నతాధికారులే కమిషనర్లు కావడం, ఏసీఆర్‌లే ఉద్యోగులను బాధ్యతాయుతంగా పనిచేసేట్టు చేసే సాధనాలని నమ్మడం ముఖ్య కారణం. 1988  (సప్లిమెంట్) ఎస్సీసీ 674  విజయ్ కుమార్ వర్సెస్ మహారాష్ట్ర కేసులో సుప్రీం కోర్టు.. ఉద్యోగికి తెలియజేయని ఏసీఆర్ ద్వారా అతని ప్రయోజనాలను దెబ్బతీయకూడదని తీర్పు చెప్పింది. గుజరాత్ వర్సెస్ సూర్యకాంత్ చునిలాల్ షా 1999(1) ఎస్సీసీ 529 కేసులో వ్యతిరేక వ్యాఖ్యలు తెలియజేయకపోతే ఉద్యోగి తనను ఏ విధంగా సవరించుకుంటాడు? కనుక వ్యతిరేక వాఖ్యలు ఏమిటో చెప్పాలి, వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పించాలని వివరించింది.
 
దేవదత్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2008(8) ఎస్సీసీ 725 కేసులోనూ సుప్రీంకోర్టు ఏసీఆర్‌లో ఈ న్యాయాన్ని పునరుద్ఘాటించింది. జస్టిస్ మార్కండేయ కట్జూ ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం పక్షాన తీర్పు ప్రకటిస్తూ ఒక ఆఫీసు మెమొరాండం ద్వారా ఆర్టికల్ 14ను భంగపరచడం చెల్లదని స్పష్టం చేశారు. ఏసీఆర్‌లో అభిప్రాయాలు రాయడం ఏకపక్షంగా పై అధికారి నిర్ణయించడమే అవుతుంది. మిలిటరీ సర్వీసులో తప్ప మరే ఇతర సర్వీసులోనైనా ఏసీఆర్ వ్యాఖ్యలను ఆ ఉద్యోగికి తెలియజేయాల్సిందే. అసలు ఆ విధంగా అభిప్రాయాలు రాయడంలో ఉద్దేశం ఉద్యోగికి తన పనితీరు గురించి తెలియజేసి మార్చుకునే అవకాశం కలిగించడమే అయితే అతనికి తెలియజేయనపుడు ఆ లక్ష్యం ఏ విధంగా నెరవేరుతుంది? ఏసీఆర్‌ను ఉద్యోగికి ఇవ్వకపోవడం ఏకపక్షనిర్ణయం అవుతుందని, అది ఆర్టికల్ 14కు విరుద్ధమని సుప్రీంకోర్టు వివరించింది. అనుకూలమో ప్రతి కూలమో ప్రతి ఏసీఆర్‌నూ వివరించాల్సిందే.

గుడ్, ఫెయిర్, యావరేజ్ అనే వ్యాఖ్యలు వెరీగుడ్, అవుట్ స్టాండింగ్‌లతో పోల్చితే తక్కువ కనుక ప్రతికూలమే. తనకు గుడ్ ఎందుకిచ్చారు వెరీగుడ్ ఎందుకు ఇవ్వలేదు అని తెలుసుకునే అవకాశం ఉద్యోగికి ఉండాలి. ముఖ్యంగా ఏసీఆర్ వల్ల ప్రయోజనాలు ఉన్నపుడు మంచి చెడుతో సంబంధం లేకుండా ఏసీఆర్‌ల గురించి తెలియజేయవలసిందే అని సుప్రీంకోర్టు నిర్ధారించింది. తెలియజేయడం, ప్రతికూల వ్యాఖ్యలను వ్యతి రేకంగా వాదించే అవకాశం కల్పించడం సహజ న్యాయసూత్రాలు కనుక అందుకు అవకాశం ఇవ్వని ఏ రూల్ అయినా ఆఫీసు మెమొరాండం ఓఎం అయినా ఆర్టికల్ 14 ప్రకారం చెల్లబోవని న్యాయమూర్తి వివరించారు. కొందరు సమాచార కమిషనర్లు, ఏసీఆర్‌లు రహస్యం కాదని, ఇచ్చి తీరాలని తీర్పులు చెప్పారు. రహస్యాన్ని సమర్థించే రూల్స్ ఆఫీసు మెమొరాండంలు ఆర్టీఐ వచ్చిన తరువాత సెక్షన్ 22 ప్రకారం చెల్లబోవని, సమాచార హక్కుతో విభేదించే రహస్య చట్టం నియమాలు కూడా చెల్లవని కమిషన్ తీర్పులను సుప్రీంకోర్టు తీర్పు బలపరిచింది.  
 
కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అని పిలుస్తున్న ఈ రహస్య నివేదికలు రద్దయినాయి. వాటి స్థానంలో వార్షిక పని తీరు పరిశీలనా నివేదికలు యాన్యువల్ పర్ఫార్మెన్‌‌స అప్రయిజల్ రిపోర్‌‌ట్స (ఏపీఏఆర్)లను ప్రవేశ పెట్టారు. వాటిని ఉద్యోగికి ఇవ్వాలని, వారు నివేదికలో మార్పులను కోరుతూ వాదించే అవకాశం, నివేదికలను అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఇవ్వాలని ఉద్యోగులు, శిక్షణ పింఛన్ల మంత్రిత్వ శాఖ నిబంధనలను తయారుచేసింది. వారి వెబ్‌సైట్:http://persmin.gov.inలో వివరాలు ఉంచింది. ఇప్పుడు ఆర్టీఐ దరఖాస్తులు, పిల్‌లు వేయనవసరం లేకుండానే సహజంగా ఏపీఏఆర్‌ను సంబంధిత ఉద్యోగికి ఇవ్వవలసిందే.
 
బ్రిటిష్ కాలంనుంచి మొదలై స్వతంత్ర భారతంలో కూడా కొనసాగిన ఈ దుర్మార్గం ఆర్టీఐ దాడితో, సుప్రీంకోర్టు తీర్పుతో అంతమైంది. ఇది పరిష్కారం లేని అన్యాయం. పై అధికారులకు కింది ఉద్యోగులను బానిసలుగా మార్చే దుర్మార్గం. అధికార రహస్యం. రహస్యాల వల్ల కలిగే అన్యాయాలను గురించి ప్రశ్నించే అవకాశమే లేకపోవడం అసలైన అన్యాయం. బ్రిటిష్ చట్టాలు నియమాల అన్యాయాల గురించి మాట్లాడడమేగాని వాటిని తొలగించే ప్రయత్నాలు చేయకపోవడం, అధికారులు బ్రిటిష్ చట్టాల నుంచి ప్రయోజనాలు ఆశించి వాటిని వాడుకోవడం ఒక దౌర్భాగ్యం. ఆర్టీఐ సాధించిన ఒక ఘన విజయం ఎసిఆర్‌ల రద్దు అనవచ్చు. పాత ఏసీఆర్‌లలో ప్రతికూల వ్యాఖ్యలను ప్రశ్నించే అవకాశం ఇప్పటికీ లేదు. ఈ అన్యాయాన్ని కూడా పరిశీలించే అవసరం ఉంది.  వెకై మల్ వర్సెస్ కెవిఎస్ CIC/C-C-/A-/2015/002083 SA కేసులో కమిషన్ 1.1.2016లో ఇచ్చిన తీర్పు ఆధారంగా)
 
మాడభూషి శ్రీధర్
 వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
 professorsridhar@gmail.com

మరిన్ని వార్తలు