న్యాయసాధకుడు పీపీ రావు

15 Sep, 2017 00:57 IST|Sakshi
న్యాయసాధకుడు పీపీ రావు

విశ్లేషణ
మన రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని తీర్చిదిద్దిన కీలకమైన సుప్రీంకోర్టు తీర్పుల వెనుక పీపీ రావు మేధస్సు అదృశ్యశక్తి. ఉదాత్తమైన న్యాయవాదన, ఉన్నతమైన సంవిధాన సంవాదన, వాటికి మించిన ఉన్నత వ్యక్తిత్వం ఆయన ఆస్తిపాస్తులు.

పీపీ రావుగా సుప్రసిద్ధుడైన పవని పరమేశ్వరరావు ఢిల్లీ సమీపాన నోయిడా భవనంలో నిర్జీవ పేటికలో నిద్రిస్తున్నాడు. వెనుక తైలవర్ణ చిత్రంలో హాయిగా నవ్వుతున్నాడు. ప్రకాశం జిల్లా మొగిలిచర్లలో 1933లో మొదలై ఎగుడు దిగుడు పరిస్థితులతో 84 ఏళ్ల సుదీర్ఘ జీవన పోరాటం ముగించిన ప్రశాంతత ఆయనది, సంవిధాన నిపుణుడిని కోల్పోయిన విషాదం అందరిది. ఉదాత్తమైన న్యాయవాదన, ఉన్నతమైన సంవిధాన సంవాదన, వాటికి మించిన ఉన్నత వ్యక్తిత్వం, నిరాడంబరత, నీతి నిజాయితీ ఆయన ఆస్తిపాస్తులు.

‘‘నేను బీఏ పూర్తి చేసేనాటికి కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఏమీ బాగాలేవు. పంటలు చేతికి రాకపోవడం, చెల్లెళ్ల పెళ్లిళ్లకు పొలాలు కరిగిపోవడం, అప్పులు మిగిలి పోవడంతో పైచదువులు సాగలేదు. చిత్తూరుకు ఉపాధికోసం బయలుదేరాను. చిన్న బడిపంతులుగా పనిచేశాను. అన్నయ్య సర్వేశ్వరరావు సాయంకళాశాలలో లా చదవమని ప్రోత్సహించాడు. 1957లో లా పూర్తయినా నేను ప్రాక్టీసు ప్రారంభించలేదు. కారణం ఆర్థిక సమస్యలు. ఎల్‌ఎల్‌ఎంలో చేరాను. ఇంతలో ఢిల్లీ యూనివర్సిటీలో ఖాళీలున్నాయని ప్రకటన వచ్చింది. డాక్టర్‌ నాగేంద్రసింగ్‌ నేతృత్వంలోని కమిటీ నన్ను సెలెక్ట్‌ చేసింది.

నన్ను గొప్ప దార్శనికుడైన ప్రొఫెసర్‌ ఎల్‌ఆర్‌ సుబ్రమణ్యన్‌కు పరిశోధనా సహాయకుడిగా నియమించారు. వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ సీడీ దేశ్‌ముఖ్‌ నన్ను పూర్తి స్థాయి అధ్యాపకుడిగా నియమించారు. న్యాయబోధన చేస్తూనే సీనియర్‌ అడ్వొకేట్‌ ఎన్‌సీ చటర్జీ (సోమనాథ్‌ చటర్జీ తండ్రి) దగ్గర రాజ్యాంగపరమైన కేసుల్లో పరిశోధించి కీలకమైన లా పాయింట్లు ఇచ్చేవాడిని. ఎన్‌సీ చటర్జీ న్యాయబోధన ఇక చాలు, న్యాయసాధనకు రమ్మన్నారు.  నెలకు 800 రూపాయలిచ్చే ఢిల్లీ యూనివర్సిటీ ఉద్యోగం ఎవరైనా వదులుకుంటారా, ఈ ప్రాక్టీసు మనను బతికిస్తుందా అని కన్నీళ్లతో అడిగే భార్యా, చిన్న కొడుకు’’ అని ఓ సందర్భంలో పీపీ రావు వివరించారు.

ఆనాడు 50 ఏళ్ల కిందట ఆయన ధైర్యంతో వేసిన ఒక్క ముందడుగు న్యాయరంగంలో సంవిధాన నిపుణుడిని చేసింది. పద్మభూషణ్‌గా నిలబెట్టింది. దేశం గర్వించే అయిదారుగురు న్యాయవేత్తలు రాంజెఠ్మలాని (94), ఫాలి ఎస్‌ నారిమన్‌ (88), సోలీ జె సోరాబ్జి (87) కేకే వేణుగోపాల్‌ (86) సరసన పీపీ రావు (84) పేరు నిలబడింది. లాయర్‌గా నమోదైన తొమ్మిదేళ్లలో సీని యర్‌ సుప్రీంకోర్తు న్యాయవాది అయ్యారు. సంవిధాన సూత్రాలకు సౌమ్యంగానే దృఢమైన అన్వయం చేసే పీపీ రావుకు పద్మభూషణ్‌తో ప్రభుత్వం సరిపెట్టు కుంది. న్యాయనిర్ణయ చరిత్రలో మైలురాళ్లను రచించేది న్యాయమూర్తులే అయినా వాటి వెనుక సృజనాత్మకమైన న్యాయ సిద్ధాంతీకరణలు, సూత్రాలను నిర్మించే సమర్థ న్యాయవాదులు ఎందరో ఉంటారు. అటు వంటి ప్రతిభావంతులలో ఒకరు పీపీ రావు. మన రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని తీర్చిదిద్దిన కీలకమైన సుప్రీంకోర్టు తీర్పుల వెనుక పీపీ రావు మేధస్సు అదృశ్యశక్తి.

యూపీ అసెంబ్లీ నిర్బంధించిన కేశవసింగ్‌కు బెయిల్‌ ఇచ్చినందుకు హైకోర్టు జడ్జీలను, రిట్‌ వేసిన అడ్వొకేట్‌ను అరెస్ట్‌ చేయాలని స్పీకర్‌ ఆదేశించారు. ఇది శాసన, న్యాయవ్యవస్థల మధ్య తీవ్ర ఘర్షణగా పెరిగి పోతూ ఉంటే ఆనాటి ప్రధాని నెహ్రూ, రాష్ట్రపతి ద్వారా సుప్రీంకోర్టు సలహా కోరాలని నిర్ణయించారు. వారంట్‌ వచ్చిన ఒక హైకోర్టు జడ్జి తరఫున చటర్జీ వాదించారు. అద్భుతమైన తీర్పు రావడానికి చటర్జీ వాదనా పటిమ, వారి వెనుక పీపీ రావు ప్రతిభ ఉన్నాయి. ఓట్లు కోరే రాజకీయ నాయకులు తమ చదువులు, పాల్పడిన నేరాలు, పేర్చుకున్న సంపదల గురించి తెలియజేయాల్సిన బాధ్యత ఉందని సుప్రీంకోర్టును మెప్పించి, ఒప్పించి అత్యంత కీలకమైన ఓటర్ల సమాచార హక్కును సాధించిన న్యాయవాదులలో పీపీ రావు ప్రముఖుడు.

కేంద్రం ఇష్టం వచ్చిన రీతిలో రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వాలను రద్దు చేయడానికి వీల్లేదని సోలీ సోరాబ్జి, రాం జెఠ్మలాని, శాంతి భూషణ్‌ వంటి ప్రముఖ న్యాయవాదులు ఆయా రాష్ట్రాల పక్షాన సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అందులో బాబ్రీ మసీదు విధ్వంసం తరువాత ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రల్లోని బీజేపీ రాష్ట్రప్రభుత్వాలను రద్దుచేసిన పీవీ ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా వీరు ప్రశ్నిం చారు. సెక్యులరిజం భారత సంవిధానపు మౌలిక లక్షణమని, నాలుగు బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం కరసేవకులను అయోధ్యకు పంపి ఈ మౌలిక లక్షణానికి భంగకరంగా వ్యవహరించినప్పుడు ఆ స్వరూపాన్ని రక్షించడం కోసం ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని రద్దు చేయక తప్పదని పీపీ రావు చేసిన వాదాన్ని సుప్రీం కోర్టు అంగీకరించింది. ఎస్‌ఆర్‌ బొమ్మయ్‌ తీర్పుగా ఈ కేసు ప్రసిద్ధి చెందింది.

కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వ రద్దు విషయాన్ని తప్పుబట్టింది. కేంద్రపాలన విధించాలన్న రాష్ట్రపతి ఉత్తర్వును న్యాయస్థానాలు పరిశీలించడానికి వీల్లేదన్న వాదనను అంగీకరిస్తూనే, ఆ ఉత్తర్వుకు ఆధారమైన గవర్నర్‌ నివేదికను ఇతర లేఖలను, సిఫార్సులను పరిశీలించి, రాజ్యాంగబద్ధమైన పాలనాయంత్రాంగం కుప్పగూలిందో లేదో నిర్ణయించే న్యాయసమీక్షాధికారం రాజ్యాంగ న్యాయస్థానాలకు ఉందని బొమ్మయ్‌ కేసులో ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య పరిరక్షణలో ఒక కీలక ఘట్టం. విద్యను వ్యాపారంగా మార్చే క్యాపిటేషన్‌ ఫీజుకు వ్యతిరేకంగా జేపీ ఉన్నికృష్ణన్‌ కేసులో పీపీ రావు చేసిన న్యాయవిశ్లేషణ మరో చరిత్రాత్మకమైన తీర్పును 1993లో సృష్టించింది. ఇష్టం వచ్చినట్టు విద్యార్థులను వేధించే ప్రైవేటు విద్యావ్యాపారాన్ని నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉందని పీపీ రావు వాదనే టీఎంఏ పాయ్‌ (2002) ఇస్లామిక్‌ అకాడమీ (2003) పీఏ ఇనాందార్‌ (2005) తీర్పులకు ఆధారమైంది.

వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌
మాడభూషి శ్రీధర్‌
professorsridhar@gmail.com

మరిన్ని వార్తలు